m-commerce
-
ఆన్లైన్లో మొబైల్స్ హవా..
- 30 శాతం అమ్మకాలు ఈ-కామర్స్ రూట్లోనే.. హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్ స్మార్ట్ఫోన్ల విపణి వేగంగా విస్తరిస్తోంది. కంపెనీలు వ్యూహాలు మార్చుకుంటూ కేవలం ఇ-కామర్స్ కోసమే మోడళ్లను తెస్తుండగా... కొన్ని ఒకడుగు ముందుకేసి ఈ-కామర్స్కోసమే కంపెనీలను కూడా పుట్టిస్తున్నాయి. వీటన్నిటి టార్గెట్... ఆన్లైన్లో యాక్టివ్‌గా ఉన్న 15-25 ఏళ్ల యువతే. వినూత్న ఫీచర్లతో అందుబాటు ధరలో మోడళ్లను తీసుకురావడంతో వీటి అమ్మకాలూ బాగానే ఉంటున్నాయి. లక్షలాది రిటైల్ దుకాణాలు దేశవ్యాప్తంగా విస్తరించినా... ఆన్లైన్ విభాగం తనదైన శైలిలో కస్టమర్లను ఆకట్టుకోవడానికి ప్రధాన కారణమిదే. మొత్తం స్మార్ట్ఫోన్ల విక్రయాల్లో ఆన్లైన్ వాటా 30 శాతానికి చేరిందంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఒకదాని వెంట ఒకటి.. ఇ-కామర్స్ జోరును అందిపుచ్చుకోవడానికి తయారీ కంపెనీలన్నీ ఆన్లైన్ బాట పట్టాయి. కొన్ని సొంతంగా వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసుకుంటే మరికొన్ని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ వంటి కంపెనీలతో చేతులు కలుపుతున్నాయి. ఆఫ్‌లైన్‌కే పరిమితమైన జియోనీ మొబైల్స్ అక్టోబర్ నుంచి ఆన్‌లైన్‌లోనూ అధికారికంగా దర్శనమీయనున్నాయి. ఇ-కామర్స్ కంపెనీలతో నేరుగా ఒప్పం దం లేకపోయినా కొన్ని కంపెనీల పంపిణీదారులు సెల్లర్లుగా పలు ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయిస్తున్నారు. మొబైల్ ఫోన్ రిటైల్ చైన్లు సైతం ఆన్‌లైన్‌లోకి ప్రవేశిస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తై కేవలం ఆన్లైన్ ద్వారానే ఉత్పత్తులను విక్రయించే మొబైల్ కంపెనీలు ఒకదాని వెంట ఒకటి పుట్టుకొస్తున్నాయి. మోటరోల, షావొమీ, వన్ ప్లస్, యూ తదితరాలన్నీ ఈ కోవలోనివే. రెండింతలు కానున్న 4జీ మొబైల్స్ విక్రయాలు... భారత్‌లో వినియోగదారుల వద్ద 70 కోట్ల ఫోన్లున్నాయి. ఇందులో స్మార్ట్ఫోన్లు 16 కోట్లు. స్మార్ట్ఫోన్ల విక్రయాల్లో ప్రస్తుతం ఆన్లైన్ వాటా 30 శాతం. మార్చికల్లా ఇది 35 శాతానికి చేరుకుంటుందని యూ టెలివెంచర్స్ చెబుతోంది. భారత్‌లో ఏటా 9 కోట్ల స్మార్ట్ఫోన్లు కస్టమర్ల చేతుల్లోకి వస్తున్నాయి. 2015-16లో 13 కోట్ల స్మార్ట్ఫోన్లు అమ్ముడవుతాయన్న అంచనాలున్నట్లు యూ టెలివెంచర్స్ సీవోవో అమరీందర్ ఎస్ ధాలివాల్ ‘సాక్షి’ బిజినెస్ బ్యూరోకు తెలిపారు. స్మార్ట్ఫోన్ల విక్రయాల్లో 4జీ మోడళ్ల వాటా ప్రస్తుతం 11 శాతం ఉండగా, మార్చికల్లా ఇది రెండింతలు దాటుతుందనే అంచనాలున్నాయి. ‘‘టెల్కోల నెట్వర్క్ దేశంలో విస్తృతం అయింది. సామాజిక వెబ్సైట్ల హవా నడుస్తోంది. నెట్లో వీడియోలను విరివిగా చూస్తున్నారు. వెరసి కస్టమర్లు ఆన్‌లైన్‌కు అలవాటు పడుతున్నారు. ఆన్లైన్లో స్మార్ట్‌ఫోన్ విక్రయాలకు ఇవన్నీ దోహదం చేస్తున్నాయి’’ అని ధలివాల్ చెప్పారు. 2జీ నుంచి 3జీకి మళ్లినదాని కంటే వేగంగా 3జీ నుంచి 4జీకి కస్టమర్లు వస్తారని సామ్సంగ్ ఐటీ, మొబైల్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ ఆసిమ్ వార్సి తెలియజేశారు. 13 శాతం మంది వద్దే.. దేశంలో 13% మంది వద్ద మాత్రమే స్మార్ట్ఫోన్లున్నాయి. ఇక్కడ విస్తరించడానికి భారీ అవకాశాలున్నాయన్నారు ఆసిమ్ వార్సి. జనాభా వారీగా చూస్తే చైనాలో 42 శాతం, రష్యాలో 41 శాతం, బ్రెజిల్లో 24 శాతం మంది వద్ద స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. ఇక భారత్‌లో 30 కోట్ల మంది ఇంటర్నెట్ను వాడుతున్నారు. వీరిలో మొబైల్ ద్వారా నెట్‌ను ఎంజాయ్ చేసే వారి సంఖ్య 25 కోట్లుంది. ఈ 25 కోట్లలో 17 కోట్ల మంది 3జీ స్మార్ట్ఫోన్లను వినియోగిస్తున్నారు. దేశంలో విక్రయమవుతున్న స్మార్ట్ఫోన్లలో రూ.6,000 ధరలోపు ఉన్న మోడళ్ల వాటా అత్యధికంగా 50 శాతం ఉంది. -
మొబైల్ స్టార్టప్స్‌లదే భవిష్యత్తు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెద్ద కంపెనీలే కాదు ఎం-కామర్స్ (మొబైల్) ఆధారంగా సేవలందించే స్టార్టప్ కంపెనీలకు భవిష్యత్తు ఉంటుందని జీఎస్ఎఫ్ యాక్సలేటర్ వ్యవస్థాపకుడు రాజేష్ చెప్పారు. ఐకెవా, జీఎస్ఎఫ్ల సంయుక్త ఆధ్వర్యంలో గురువారమిక్కడ ఎనిమిది మొబైల్ స్టార్టప్స్ ప్రదర్శన కార్యక్రమం జరిగింది. రోజురోజుకూ స్మార్ట్ఫోన్ల వాడకం పెరగటం, వీటి ధరలూ తక్కువగా ఉండటం, ఎక్కడైనా.. ఎప్పుడైనా యాప్స్‌ను వినియోగించుకునే వీలుండటం వంటివి ఇందుకు కారణాలుగా చెప్పవచ్చన్నారు. విద్యా, వైద్య రంగం, పర్యాటకం, గేమింగ్ వంటి అన్ని రంగాల్లోనూ మొబైల్ స్టార్టప్స్ సేవలందిస్తున్నాయని.. ఇది సాంకేతికాభివృద్ధికి చిహ్నమని పేర్కొన్నారు. అనంతరం జాల్జ్, న్యూస్‌బైట్స్, గేమ్జోప్, టాక్మోర్, మ్యాజిక్టాప్, పేసెల్ఫీ, రెంట్ ఆన్ గో, టౌనిస్టా వంటి 8 మొబైల్ స్టార్టప్స్ సీడ్ రౌండ్లో నిధుల సమీకరణలో పాల్గొన్నాయి. -
వ్యాపారమంతా అరచేతిలోనే!
♦ దేశంలో వేగంగా విస్తరిస్తున్న ఎం-కామర్స్ ♦ భవిష్యత్తులో వ్యాపార లావాదేవీలన్నీ సెల్ఫోన్లలోనే.. ♦ అందుకే ఈ-కామర్స్ సంస్థల సేవలు ఎం-కామర్స్‌కు బదిలీ ♦ గతంలో మింత్ర.. సెప్టెంబర్ నుంచి ఫ్లిప్‌కార్ట్ వెబ్సైట్ బంద్ ♦ 2018 నాటికి రూ.40 లక్షల కోట్లకు ఎం-కామర్స్ వ్యాపారం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : అయితే మాట్లాడటం. లేదంటే మెసేజ్‌లతో చాటింగ్ చేయటం. పదేళ్ల కిందటి వరకూ సెల్‌ఫోన్‌తో ఉపయోగమంటే ఇదే. కానీ అప్లికేషన్స్‌ను వినియోగించడానికి వీలయ్యే స్మార్ట్ ఫోన్లు వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడైతే అరచేతిలో ఇమిడిపోయే ఈ మొబైల్ ఫోన్లు ఏకంగా వ్యాపార సామ్రాజ్యాలనే శాసిస్తున్నాయి. పెద్దపెద్ద రిటైల్ దిగ్గజాలకు సైతం చెమటలు పట్టిస్తున్నాయి. పరిస్థితి ఇపుడు ఏ స్థాయికి చేరిందంటే... ఈ-కామర్స్ అగ్రగామి సంస్థలైన మింత్ర, ఫ్లిప్‌కార్ట్ వంటివి తమ ఈ-కామర్స్ వెబ్సైట్లను మూసేసి.. కేవలం ఎం-కామర్స్ (మొబైల్ కామర్స్) ద్వారానే వ్యాపారం నిర్వహించాలనుకునే స్థాయికి!!. మింత్ర ఇప్పటికే ఈ పని చేయగా... ఫ్లిప్ కార్ట్ సైతం రెండు నెలల్లో మొబైల్‌కు మాత్రమే పరిమితం కాబోతోంది. 2018 నాటికి మొబైల్ కామర్స్ పరిమాణం రూ.40 లక్షల కోట్లకు (638 బిలియన్ డాలర్లు) చేరుతుందని అసోచామ్-డెలాయిట్ నివేదిక తెలిపిందంటే వృద్ధి ఏ స్థాయి లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం దేశంలో 23.5 కోట్ల మందికిపైగా వినియోగదారులు ఇంటర్నెట్ను డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్ నుంచి కాక మొబైల్ ఫోన్ల ద్వారానే వినియోగిస్తున్నారు. ఎం-కామర్స్ వృద్ధి ఈ స్థాయిలో ఉండటం, కంపెనీలు కూడా దీనిపైనే దృష్టి పెడుతుండటం గురించి మై స్మార్ట్‌ప్రైస్ సంస్థ సీఈఓ సీతాకాంత రాయ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘‘ఎం-కామర్స్ అప్లికేషన్ల ద్వారా మెట్రోలకే కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు, గ్రామీణ ప్రాంతాలకు సైతం వ్యాపారాన్ని సులువుగా విస్తరించవచ్చు. ఏ ఉత్పత్తిని విడుదల చేసినా ఒకే రోజు అన్ని ప్రాంతాలకూ చేరుకోవచ్చు’’ అని వ్యాఖ్యానించారు. తమ మొత్తం వ్యాపారంలో 35-40% వాటా మొబైల్స్ నుంచే వస్తున్నట్లు తెలిపారు. అయితే డెస్క్‌టాప్‌తో పోల్చుకుంటే సెల్ఫోన్ల డిస్ప్లే చిన్నదిగా ఉండటంతో ఆశించిన స్థాయిలో ఎం-కామర్స్ విస్తరించటం లేదని అభిప్రాయపడ్డారు. ఎం-కామర్స్ వృద్ధికి స్మార్ట్ఫోన్లే బూస్ట్.. ప్రస్తుతం ఎవరి చేతుల్లో చూసినా ఫీచర్ ఫోన్లకు బదులు స్మార్ట్ఫోన్లే దర్శనమిస్తున్నాయి. ట్యాబ్లెట్స్, డెస్క్‌టాప్‌లతో పోల్చుకుంటే స్మార్ట్ఫోన్ల ధరలు తక్కువగా ఉండటం. మెమొరీ ఎక్కువగా ఉండటం, బ్రౌజింగ్ సులువుగా చేసే వీలుండటం వంటివి ఇందుకు కారణాలుగా చెప్పవచ్చు. సెల్ఫోన్ల ద్వారా ఎప్పుడైనా.. ఎక్కడైనా కొనుగోలు చేసే అవకాశం ఉండటమే ఎం-కామర్స్ మార్కెట్ వృద్ధికి కారణమనేది ఎవరూ కాదనలేని నిజం. దీంతో చాలా వరకు ఈ-కామర్స్, ఈ-రిటైల్ కంపెనీలు మొబైల్ యాప్, ఎస్ఎంఎస్ ద్వారా తమ వ్యాపార సేవలను అందించేందుకు ఇష్టపడుతున్నాయి. అయితే ఎం-కామర్స్ సంస్థలు వినియోగదారుల విశ్వాసం పొందడం, లావాదేవీల్లో పారదర్శకత, సమాచారాన్ని గోప్యంగా ఉంచడం, భద్రతా ప్రమాణాలు పాటించటం వంటి అంశాల్లో మాత్రం మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉందనేది నిపుణుల అభిప్రాయం. మింత్ర, ఫ్లిప్‌కార్ట్ బాటలోనే మరిన్ని కంపెనీలు! ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి కేవలం మొబైల్ యాప్ ద్వారానే సేవలు అందించనున్నట్లు దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. తన మొత్తం వ్యాపారంలో 70-75 శాతం లావాదేవీలు మొబైల్ ద్వారానే జరుగుతున్నందున మొబైల్ యాప్‌కే ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ పునిత్ సోనీ తెలిపారు. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన మింత్ర.కామ్ కేవలం మొబైల్ ఫోన్ల ద్వారానే క్రయ, విక్రయాలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ జాబితాలో ఫ్లిప్‌కార్ట్ కూడా చేరుతోంది. సమీప భవిష్యత్తులో ఈ జాబితాలోకి అమెజాన్, క్వికర్, స్నాప్‌డీల్, మైస్మార్ట్ ప్రైజ్, జబాంగ్ వంటి ఈ-కామర్స్ కంపెనీలు కూడా వచ్చి చేరుతాయన్నది పరిశ్రమ వర్గాల అంచనా. ఎందుకంటే ఆయా సంస్థల వ్యాపారంలో 60 శాతానికి పైగా మొబైల్ ఫోన్ల నుంచే వస్తోంది. ఇది చాలు ఈ-కామర్స్ స్థానాన్ని ఎం-కామర్స్ వెబ్సైట్లు, యాప్‌లు ఎలా ఆక్రమిస్తున్నాయో తెలియటానికి. రూ.12 వేల కోట్ల నుంచిరూ.40 లక్షల కోట్లకు.. దశాబ్ద కాలం నుంచి దేశంలో మొబైల్ ఫోన్ల ద్వారా కొనుగోళ్లు జరిపే వారి సంఖ్య శరవేగంగా పెరిగినట్లు అసోచామ్-డెలాయిట్ నివేదిక తెలిపింది. 2010లో దేశంలో సెల్ఫోన్ల ద్వారా జరిగిన క్రయ, విక్రయాల విలువ కేవలం రూ.12,600 కోట్లు (2 బిలియన్ డాలర్లు). అయితే 2018 నాటికిది రూ.40 లక్షల కోట్లకు (638 బిలియన్ డాలర్లు) చేరుతుందని నివేదిక అంచనా వేసింది. ప్రస్తుతం దేశంలో ఎం-కామర్స్ మార్కెట్ రూ.15 లక్షల కోట్లుగా ఉంది. వ్యాపార సంస్థల అమ్మకాలు, ఆదాయం పెరగడానికి ఈ-కామర్స్ సంస్థల మొబైల్ అప్లికేషన్లు దోహదపడుతున్నాయనేది నివేదిక సారాంశం. దీనికితోడు రోజురోజుకూ స్మార్ట్ఫోన్ల విక్రయాలు పెరుగుతుండటాన్ని ఆసరా చేసుకుని ఈ-కామర్స్ సంస్థలూ ఎం-కామర్స్ స్లెట్లు, యాప్‌ల వైపు దృష్టిసారిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. -
ఈ-కామర్స్‌ను మించనున్న ఎం-కామర్స్
పెరుగుతున్న మొబైల్ యాప్‌ల డౌన్లోడ్ వీటిల్లో అధికం షాపింగ్ యాప్‌లే కేపీఎంజీ నివేదిక వెల్లడి... ముంబై: మొబైల్ కామర్స్ జోరు అంతకంతకూ పెరిగిపోతోంది. కొన్నేళ్లలో ఈ ఎం-కామర్స్, ఈ-కామర్స్‌ను అధిగమిస్తుందని కేపీఎంజీ తాజా నివేదిక వెల్లడించింది. ఆన్లైన్ షాపింగ్ పెరుగుతుండడం, మొబైల్ యాప్‌ల వినియోగం కూడా జోరందుకోవడం దీనికి ప్రధాన కారణాలంటున్న ఈ నివేదిక వెల్లడించిన కొన్ని ముఖ్యాంశాలు... ఈ ఏడాది చివరి నాటికి భారత్‌లో మొబైల్ ఫోన్ల వినియోగదారులు 900 కోట్ల మొబైల్ యాప్‌లు డౌన్లోడ్ చేసుకుంటారని అంచనా. గతేడాది డౌన్లోడ్ చేసుకున్న యాప్‌ల కంటే ఆరు రెట్లు అధికం. డౌన్లోడ్ చేసుకుంటున్న మొబైల్ యాప్‌ల్లో అధికంగా షాపింగ్ యాప్‌లే ఉంటున్నాయి. గత రెండేళ్లలో అత్యంత వేగంగా వృద్ధి చెందిన మొబైల్ యాప్‌ల మార్కెట్‌గా భారత్ ఎదిగింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూస్తే మొబైల్ యాప్‌ల డౌన్లోడ్ విషయంలో భారత్ వాటా 7 శాతంగా ఉంది. మొబైల్ యాప్‌ల డౌన్లోడ్ విషయంలో ఇండోనే సియా, చైనా, అమెరికాల తర్వాతి స్థానం మనదే. భారత్‌లో మొబైళ్ల ద్వారా ఇంటర్నెట్ను యాక్సెస్ చేసిన వాళ్లు 2014లో 17.3 కోట్లుగా ఉన్నారు. గత ఏడాదితో పోల్చితే ఇది 33 శాతం ఎక్కువ. ఇలా మొబైళ్ల ద్వారా ఇంటర్నెట్ను యాక్సెస్ చేసే వారి సంఖ్య ప్రతీ ఏడాది 21 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని, 2019లో ఈ సంఖ్య 45.7 కోట్లకు పెరుగుతుందని అంచనా. మొబైళ్ల ద్వారా జరుగుతున్న ఈ-కామర్స్ పోర్టళ్ల షాపింగ్ లావాదేవీలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. దీంతో మొబైల్ ప్లాట్‌ఫామ్‌పైనే ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఈ-కామర్స్ పోర్టళ్లు యోచిస్తున్నాయి. -
మొబైల్ బాటలో బీమా కంపెనీలు
చెన్నై: స్మార్ట్‌ఫోన్స్ రాకతో మొబైల్స్ ద్వారా జరిగే వ్యాపార లావాదేవీలు (ఎం-కామర్స్) భారీగా పెరుగుతున్నాయి. దీంతో ఇప్పటిదాకా కార్యాలయాలకు మాత్రమే పరిమితమైన కంపెనీలు ఆదాయాలు పెంచుకునేందుకు ఇప్పుడు ఈ విభాగంపై కూడా దృష్టి సారిస్తున్నాయి. ఇదే కోవలో బీమా సంస్థలు కూడా పాలసీల విక్రయం, రెన్యువల్ వంటి లావాదేవీల కోసం మొబైల్ యాప్స్‌ని ప్రవేశపెడుతున్నాయి. దేశీయంగా మొబైల్ యూజర్లలో 65 శాతం మంది తమ మొబైల్ ఫోన్లలో ఇంటర్నెట్ను వినియోగిస్తున్నట్లు పరిశ్రమ వర్గాల అంచనా. ఇందులో 40 శాతం మంది విరివిగా ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ విభాగంలో వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు బీమా కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి. న్యూ ఇండియా అష్యూరెన్స్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు, చోళమండలం ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్ వంటి ప్రైవేట్ రంగ సంస్థలు ప్రవేశపెట్టగా.. మిగతా సంస్థలు కూడా అదే బాట పడుతున్నాయి. న్యూ ఇండియా అష్యూరెన్స్ తమ కస్టమర్ల కోసం, ఏజంట్ల కోసం విడివిడిగా రెండు యాప్స్‌ని ప్రవేశపెట్టింది. ఇవి బ్లాక్‌బెర్రీ, ఆండ్రాయిడ్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ల ఆధారిత ఫోన్లలో పనిచేస్తాయి. ‘పైలట్ ప్రాజెక్టు కింద రెండు వారాల క్రితం వీటిని ఆవిష్కరించాం. వీటి ద్వారా కస్టమర్లు కొత్త పాలసీలు కొనుక్కోవచ్చు లేదా ఉన్న వాటిని రెన్యువల్ చేసుకోవచ్చు’ అని సంస్థ డిప్యుటీ జీఎం. కె. రవిశంకర్ తెలిపారు. ఈ యాప్స్‌కి మంచి స్పందన వస్తోందని, ఇప్పటిదాకా 20,000 పైగా డౌన్లోడ్స్ నమోదయ్యాయని ఆయన వివరించారు. అలాగే, బీమా పాలసీలపై అవగాహన పెంచేందుకు, కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ వ్యాన్స్ ద్వారా సర్వీసులనూ అందిస్తోంది న్యూ ఇండియా అష్యూరెన్స్. ప్రస్తుతం తమ వ్యాపారంలో సింహభాగం పెద్ద నగరాలు, పట్టణాల నుంచి వస్తోండగా.. నాలుగో శ్రేణి పట్టణాల్లో వారికీ పాలసీలను విక్రయించాలన్నది తమ లక్ష్యమని కంపెనీ సీఎండీ జి. శ్రీనివాసన్ పేర్కొన్నారు. మారుమూల ప్రాంతాలకూ తమ వ్యాన్లు వెళ్తాయని, సర్వీసులు అందిస్తాయని చెప్పారు. భవిష్యత్‌లో గ్రామీణ ప్రాంతాలు.. లఘు, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల నుంచే జనరల్ ఇన్సూరెన్స్ వ్యాపారం అత్యధికంగా ఉండగలదని పేర్కొన్నారు. చోళ ఎంఎస్ వెల్నెస్ ... జపాన్‌కి చెందిన మిత్సుయి సుమిటోమో గ్రూప్‌తో కలసి చోళమండలం ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్ ఇటీవలే మొబైల్ యాప్స్ విభాగంలోకి అడుగుపెట్టింది. కస్టమర్లు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు కొనుగోలు చేసేందుకు, రెన్యువల్ చేసుకునేందుకు ఉపయోగపడే యాప్‌ని ఆవిష్కరించింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ‘చోళ ఎంఎస్ వెల్నెస్’ అప్లికేషన్ని ప్రవేశపెట్టింది. దీన్ని త్వరలోనే ఇతర ఆపరేటింగ్ సిస్టమ్స్‌పై పనిచేసే ఫోన్ల కోసం కూడా ప్రవేశపెట్టనుంది. దీన్ని ఫిబ్రవరిలో ప్రవేశపెట్టగా 235 పైచిలుకు డౌన్లోడ్స్ నమోదైనట్లు కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్(ఐటీఆపరేషన్స్) వి. సుందర్ పేర్కొన్నారు. ఈ యాప్ విభాగం కోసం ప్రత్యేక ఏజెన్సీని నియమించుకున్నట్లు చోళమండళం ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ ఎస్ఎస్ గోపాలరత్నం తెలిపారు. హెల్త్, ట్రావెల్, మోటార్ తదితర బీమా పాలసీలను విక్రయించే ఈ సంస్థ తో ప్రస్తుతానికి మొబైల్ యాప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను మాత్రమే అందిస్తోంది. -
మొబైళ్ల ద్వారా 30 % ఆర్డర్లు: స్నాప్‌డీల్
న్యూఢిల్లీ: ఆన్లైన్ మార్కెట్ ప్లేస్, స్నాప్‌డీల్‌కు అందే మొత్తం ఆర్డర్లలో 30 శాతం మొబైల్ ఫోన్ల ద్వారానే వస్తున్నాయి. గత ఏడాది కాలంతో పోల్చితే ఇది 10 రెట్లు ఎక్కువని స్నాప్‌డీల్ పేర్కొంది. తమ ప్లాట్‌ఫామ్‌పై ఎం-కామర్స్(మొబైల్ ఆధారిత లావాదేవీలు) పోకడలపై ఈ సంస్థ ఇటీవల ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. ఈ-కామర్స్ భవిష్యత్ లావాదేవీలు అధికంగా మొబైళ్ల ద్వారానే జరుగనున్నాయని ఈ అధ్యయనం వెల్లడిస్తోందని వివరించింది. వివరాలు.. స్నాప్‌డీల్ విజిట్స్ నెలకు సగటున 3.5-4 కోట్లుగా ఉన్నాయి. మొబైల్ కామర్స్ సైట్ విజిట్స్ నెలకు సగటున 1.2 కోట్లు ఉన్నాయి. మొబైల్ ఆధారిత లావాదేవీల్లో 75 శాతం వరకూ క్యాష్ ఆన్ డెలివరీవి కావడం విశేషం. మిగిలిన 25 శాతం ప్రి పెయిడ్ లావాదేవీలవి. మొత్తం వినియోగదారుల్లో మెజారిటీ భాగం హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కత, బెంగళూరు నగరాలకు చెందిన వారే ఉన్నారు.