ఆన్‌లైన్‌లో మొబైల్స్ హవా.. | Increased selling of mobiles in online | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో మొబైల్స్ హవా..

Published Tue, Sep 22 2015 2:08 AM | Last Updated on Sun, Sep 3 2017 9:44 AM

ఆన్‌లైన్‌లో మొబైల్స్ హవా..

ఆన్‌లైన్‌లో మొబైల్స్ హవా..

- 30 శాతం అమ్మకాలు ఈ-కామర్స్ రూట్‌లోనే..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:
ఆన్‌లైన్ స్మార్ట్‌ఫోన్ల విపణి వేగంగా విస్తరిస్తోంది. కంపెనీలు వ్యూహాలు మార్చుకుంటూ కేవలం ఇ-కామర్స్ కోసమే మోడళ్లను తెస్తుండగా... కొన్ని ఒకడుగు ముందుకేసి ఈ-కామర్స్‌కోసమే కంపెనీలను కూడా పుట్టిస్తున్నాయి. వీటన్నిటి టార్గెట్... ఆన్‌లైన్‌లో యాక్టివ్‌గా ఉన్న 15-25 ఏళ్ల యువతే. వినూత్న ఫీచర్లతో అందుబాటు ధరలో మోడళ్లను తీసుకురావడంతో వీటి అమ్మకాలూ బాగానే ఉంటున్నాయి. లక్షలాది రిటైల్ దుకాణాలు దేశవ్యాప్తంగా విస్తరించినా... ఆన్‌లైన్ విభాగం తనదైన శైలిలో కస్టమర్లను ఆకట్టుకోవడానికి ప్రధాన కారణమిదే. మొత్తం స్మార్ట్‌ఫోన్ల విక్రయాల్లో ఆన్‌లైన్ వాటా 30 శాతానికి చేరిందంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
 
ఒకదాని వెంట ఒకటి..
ఇ-కామర్స్ జోరును అందిపుచ్చుకోవడానికి తయారీ కంపెనీలన్నీ ఆన్‌లైన్ బాట పట్టాయి. కొన్ని సొంతంగా వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసుకుంటే మరికొన్ని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ వంటి కంపెనీలతో చేతులు కలుపుతున్నాయి. ఆఫ్‌లైన్‌కే పరిమితమైన జియోనీ మొబైల్స్ అక్టోబర్ నుంచి ఆన్‌లైన్‌లోనూ అధికారికంగా దర్శనమీయనున్నాయి. ఇ-కామర్స్ కంపెనీలతో నేరుగా ఒప్పం దం లేకపోయినా కొన్ని కంపెనీల పంపిణీదారులు సెల్లర్లుగా పలు ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారు. మొబైల్ ఫోన్ రిటైల్ చైన్లు సైతం ఆన్‌లైన్‌లోకి ప్రవేశిస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తై కేవలం ఆన్‌లైన్ ద్వారానే ఉత్పత్తులను విక్రయించే మొబైల్ కంపెనీలు ఒకదాని వెంట ఒకటి పుట్టుకొస్తున్నాయి. మోటరోల, షావొమీ, వన్ ప్లస్, యూ తదితరాలన్నీ ఈ కోవలోనివే.
 
రెండింతలు కానున్న 4జీ మొబైల్స్ విక్రయాలు...
భారత్‌లో వినియోగదారుల వద్ద 70 కోట్ల ఫోన్లున్నాయి. ఇందులో స్మార్ట్‌ఫోన్లు 16 కోట్లు. స్మార్ట్‌ఫోన్ల విక్రయాల్లో ప్రస్తుతం ఆన్‌లైన్ వాటా 30 శాతం. మార్చికల్లా ఇది 35 శాతానికి చేరుకుంటుందని యూ టెలివెంచర్స్ చెబుతోంది. భారత్‌లో ఏటా 9 కోట్ల స్మార్ట్‌ఫోన్లు కస్టమర్ల చేతుల్లోకి వస్తున్నాయి. 2015-16లో 13 కోట్ల స్మార్ట్‌ఫోన్లు అమ్ముడవుతాయన్న అంచనాలున్నట్లు యూ టెలివెంచర్స్ సీవోవో అమరీందర్ ఎస్ ధాలివాల్ ‘సాక్షి’ బిజినెస్ బ్యూరోకు తెలిపారు. స్మార్ట్‌ఫోన్ల విక్రయాల్లో 4జీ మోడళ్ల వాటా ప్రస్తుతం 11 శాతం ఉండగా, మార్చికల్లా ఇది రెండింతలు దాటుతుందనే అంచనాలున్నాయి. ‘‘టెల్కోల నెట్‌వర్క్ దేశంలో విస్తృతం అయింది. సామాజిక వెబ్‌సైట్ల హవా నడుస్తోంది. నెట్లో వీడియోలను విరివిగా చూస్తున్నారు. వెరసి కస్టమర్లు ఆన్‌లైన్‌కు అలవాటు పడుతున్నారు. ఆన్‌లైన్‌లో స్మార్ట్‌ఫోన్ విక్రయాలకు ఇవన్నీ దోహదం చేస్తున్నాయి’’ అని ధలివాల్ చెప్పారు. 2జీ నుంచి 3జీకి మళ్లినదాని కంటే వేగంగా 3జీ నుంచి 4జీకి కస్టమర్లు వస్తారని సామ్‌సంగ్ ఐటీ, మొబైల్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ ఆసిమ్ వార్సి తెలియజేశారు.
 
13 శాతం మంది వద్దే..
దేశంలో 13% మంది వద్ద మాత్రమే స్మార్ట్‌ఫోన్లున్నాయి. ఇక్కడ విస్తరించడానికి భారీ అవకాశాలున్నాయన్నారు ఆసిమ్ వార్సి. జనాభా వారీగా చూస్తే చైనాలో 42 శాతం, రష్యాలో 41 శాతం, బ్రెజిల్‌లో 24 శాతం మంది వద్ద స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. ఇక భారత్‌లో 30 కోట్ల మంది ఇంటర్నెట్‌ను వాడుతున్నారు. వీరిలో మొబైల్ ద్వారా నెట్‌ను ఎంజాయ్ చేసే వారి సంఖ్య 25 కోట్లుంది. ఈ 25 కోట్లలో 17 కోట్ల మంది 3జీ స్మార్ట్‌ఫోన్లను వినియోగిస్తున్నారు. దేశంలో విక్రయమవుతున్న స్మార్ట్‌ఫోన్లలో రూ.6,000 ధరలోపు ఉన్న మోడళ్ల వాటా అత్యధికంగా 50 శాతం ఉంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement