మొబైల్ బాటలో బీమా కంపెనీలు
చెన్నై: స్మార్ట్‌ఫోన్స్ రాకతో మొబైల్స్ ద్వారా జరిగే వ్యాపార లావాదేవీలు (ఎం-కామర్స్) భారీగా పెరుగుతున్నాయి. దీంతో ఇప్పటిదాకా కార్యాలయాలకు మాత్రమే పరిమితమైన కంపెనీలు ఆదాయాలు పెంచుకునేందుకు ఇప్పుడు ఈ విభాగంపై కూడా దృష్టి సారిస్తున్నాయి. ఇదే కోవలో బీమా సంస్థలు కూడా పాలసీల విక్రయం, రెన్యువల్ వంటి లావాదేవీల కోసం మొబైల్ యాప్స్‌ని ప్రవేశపెడుతున్నాయి.
దేశీయంగా మొబైల్ యూజర్లలో 65 శాతం మంది తమ మొబైల్ ఫోన్లలో ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నట్లు పరిశ్రమ వర్గాల అంచనా. ఇందులో 40 శాతం మంది విరివిగా ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఈ విభాగంలో వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు బీమా కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి. న్యూ ఇండియా అష్యూరెన్స్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు, చోళమండలం ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్ వంటి ప్రైవేట్ రంగ సంస్థలు ప్రవేశపెట్టగా.. మిగతా సంస్థలు కూడా అదే బాట పడుతున్నాయి. న్యూ ఇండియా అష్యూరెన్స్ తమ కస్టమర్ల కోసం, ఏజంట్ల కోసం విడివిడిగా రెండు యాప్స్‌ని ప్రవేశపెట్టింది. ఇవి బ్లాక్‌బెర్రీ, ఆండ్రాయిడ్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ల ఆధారిత ఫోన్లలో పనిచేస్తాయి. ‘పైలట్ ప్రాజెక్టు కింద రెండు వారాల క్రితం వీటిని ఆవిష్కరించాం. వీటి ద్వారా కస్టమర్లు కొత్త పాలసీలు కొనుక్కోవచ్చు లేదా ఉన్న వాటిని రెన్యువల్ చేసుకోవచ్చు’ అని సంస్థ డిప్యుటీ జీఎం. కె. రవిశంకర్ తెలిపారు.
ఈ యాప్స్‌కి మంచి స్పందన వస్తోందని, ఇప్పటిదాకా 20,000 పైగా డౌన్‌లోడ్స్ నమోదయ్యాయని ఆయన వివరించారు. అలాగే, బీమా పాలసీలపై అవగాహన పెంచేందుకు, కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ వ్యాన్స్ ద్వారా సర్వీసులనూ అందిస్తోంది న్యూ ఇండియా అష్యూరెన్స్. ప్రస్తుతం తమ వ్యాపారంలో సింహభాగం పెద్ద నగరాలు, పట్టణాల నుంచి వస్తోండగా.. నాలుగో శ్రేణి పట్టణాల్లో వారికీ పాలసీలను విక్రయించాలన్నది తమ లక్ష్యమని కంపెనీ సీఎండీ జి. శ్రీనివాసన్ పేర్కొన్నారు. మారుమూల ప్రాంతాలకూ తమ వ్యాన్లు వెళ్తాయని, సర్వీసులు అందిస్తాయని చెప్పారు. భవిష్యత్‌లో గ్రామీణ ప్రాంతాలు.. లఘు, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల నుంచే జనరల్ ఇన్సూరెన్స్ వ్యాపారం అత్యధికంగా ఉండగలదని పేర్కొన్నారు.
చోళ ఎంఎస్ వెల్‌నెస్ ...
జపాన్‌కి చెందిన మిత్సుయి సుమిటోమో గ్రూప్‌తో కలసి చోళమండలం ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్ ఇటీవలే మొబైల్ యాప్స్ విభాగంలోకి అడుగుపెట్టింది. కస్టమర్లు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు కొనుగోలు చేసేందుకు, రెన్యువల్ చేసుకునేందుకు ఉపయోగపడే యాప్‌ని ఆవిష్కరించింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ‘చోళ ఎంఎస్ వెల్‌నెస్’ అప్లికేషన్‌ని ప్రవేశపెట్టింది. దీన్ని త్వరలోనే ఇతర ఆపరేటింగ్ సిస్టమ్స్‌పై పనిచేసే ఫోన్ల కోసం కూడా ప్రవేశపెట్టనుంది. దీన్ని ఫిబ్రవరిలో ప్రవేశపెట్టగా 235 పైచిలుకు డౌన్‌లోడ్స్ నమోదైనట్లు కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్(ఐటీఆపరేషన్స్) వి. సుందర్ పేర్కొన్నారు. ఈ యాప్ విభాగం కోసం ప్రత్యేక ఏజెన్సీని నియమించుకున్నట్లు చోళమండళం ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ ఎస్‌ఎస్ గోపాలరత్నం తెలిపారు. హెల్త్, ట్రావెల్, మోటార్ తదితర బీమా పాలసీలను విక్రయించే ఈ సంస్థ తో ప్రస్తుతానికి మొబైల్ యాప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను మాత్రమే అందిస్తోంది.