కీలక ‘లేఖ’పై కిమ్మనరెందుకు? | Why Ramoji does nott write the real facts in Vivekas murder case | Sakshi
Sakshi News home page

కీలక ‘లేఖ’పై కిమ్మనరెందుకు?

Published Sun, Apr 16 2023 2:33 AM | Last Updated on Sun, Apr 16 2023 5:20 PM

Why Ramoji does nott write the real facts in Vivekas murder case - Sakshi

సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు సంస్థను తప్పుదోవ పట్టించడమే లక్ష్యంగా ఈనాడు రామోజీ కంకణం కట్టుకున్నారు. ఘటనా స్థలంలో దొరికిన అత్యంత కీలకమైనవిగా భావిస్తున్న లేఖ, సెల్‌ఫోన్‌ను వెంటనే ఎందుకు పోలీసులకు స్వాధీనం చేయలేదనే అంశాన్ని ఏనాడైనా రాశారా రామోజీ? ఈ కేసులో తొలి నుంచీ ప్రతి విషయంలో మీ వక్రీకరణ కని­పిస్తూనే ఉంది. ఎప్పుడు ఏ చిన్న విషయం తెలిసినా.. దానిని ప్రభుత్వానికి, ఎంపీ అవినాశ్‌­రెడ్డికీ ముడిపెట్టి లేనిపోని విషయాలు కలిపి చెలరేగిపోతూ వండివార్చడమే మీరు పనిగా పెట్టుకోవడం నిజం కాదా? అసలు వివేకా కేసులో ఇంత గందరగోళానికి కారణం ఏమిటని ఏనాడైనా తొంగి చూశారా? వైఎస్‌ వివేకానందరెడ్డిపై తీవ్రంగా దాడి చేసిన ఆగంతకులు ఆయనతో బలవంతంగా ఓ లేఖ రాయించారు.

తనను డ్రైవర్‌ ప్రసాద్‌ తీవ్రంగా గాయ పరచినట్టుగా ఆ లేఖలో వివేకా రాసినట్టుగా ఉంది. ఆ లేఖ ఆయన పీఏ కృష్ణారెడ్డి ఆ రోజే అంటే 2019 మార్చి 15న ఉదయమే గుర్తించారు. వివేకానందరెడ్డి మృతదేహాన్ని మొదటగా చూసింది ఆయనే. ఆ లేఖతోపాటు వివేకానందరెడ్డి సెల్‌ఫోన్‌ను కూడా ఆయన స్వాధీనం చేసుకున్నారు. వివేకానందరెడ్డి మరణించిన సమాచారాన్ని ఆయన భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది శివ ప్రకాశ్‌రెడ్డిలకు ఫోన్‌ చేసి చెప్పారు. వివేకానందరెడ్డి మృతదేహం ఫొటోలను కూడా వాట్సాప్‌ చేశారు. ఆ ఫొటోలు చూస్తే ఎవరికైనా అది హత్య అని సులువుగా తెలుస్తుంది.

ఆ లేఖను తాము వచ్చే వరకు ఎవరికీ ఇవ్వొద్దని.. ఆ విషయం బయటకు చెప్పొద్దని వివేకానందరెడ్డి కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి పీఏ కృష్ణారెడ్డితో చెప్పారు. దాంతో ఆ లేఖ విషయం ఆయన పోలీసులకుగానీ ఇతరులకుగానీ చెప్పనే లేదు. ఆ తర్వాత కాసేపటికే సమీప నివాసాల్లోని వారు, పార్టీ కార్యకర్తలువచ్చారు. అనంతరం వివేకానందరెడ్డి పెద్ద బావమరిది నర్రెడ్డి శివ ప్రకాశ్‌ రెడ్డి ఫోన్‌ చేసి చెప్పడంతో ఎంపీ అవినాశ్‌రెడ్డికి విషయం తెలిసింది. దాంతో ఎన్నికల ప్రచారానికని బయలు దేరిన ఆయన వెనుదిరిగి వివేకా నివాసానికి చేరుకున్నారు.

అప్పుడు కూడా వివేకానందరెడ్డి రాసిన లేఖ విషయాన్ని పీఏ కృష్ణారెడ్డి ఎవరికీ చెప్పనే లేదు. ఆ లేఖ విషయం అప్పుడే చెప్పి ఉంటే వివేకానందరెడ్డిది హత్య అని వెంటనే తెలిసేది. ఈ విషయం కదా తొలుత తేలాల్సింది. అది తేలితే తర్వాత కథ వేరుగా ఉండేది. ఈ విషయాలపై దర్యాప్తు సాగాలని ఏనాడైనా ఈనాడు రాసిందా? అంటే మీ ఉద్దేశం అసలు దోషులను తప్పించి.. ఇంకెవరినో ఇరికించాలనేగా! ఆ దిశగా దర్యాప్తు సాగేలా.. దర్యాప్తు సంస్థను ప్రభావితం చేసేలా తప్పుడు కథనాలు వండివార్చుతున్నది అందుకేగదా..

ఇది మీకు కనిపించలేదా?
సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివ ప్రకాశ్‌ రెడ్డి ఆ రోజు అంటే 2019 మార్చి 15న మధ్యాహ్నం 12 – ఒంటి గంట మధ్య పులివెందులకు చేరుకున్నారు. అప్పుడు పీఏ కృష్ణారెడ్డి ఆ లేఖను వారికి అందించారు. వారు దానిని సాయంత్రం 5 గంటల వరకు వారి వద్దే ఉంచుకున్నారు. ఆ తర్వాత తిరిగి వాటిని కృష్ణారెడ్డి ద్వారా పోలీసులకు అందించారు. ఆ సెల్‌ఫోన్‌లోని మెసేజ్‌లు, ఇతర డాటాను డిలీట్‌ చేసి మరీ పోలీసులకు ఇచ్చినట్టు సమాచారం.

సహజంగా ఆ లేఖ విషయాన్ని వెంటనే చెప్పకుండా గోప్యంగా ఉంచిన పీఏ కృష్ణారెడ్డిని తొలుతే ఎందుకు ప్రశ్నించలేదని, ఎవరి ఆదేశాల మేరకు ఆ లేఖ విషయాన్ని రహస్యంగా ఉంచారో ఎందుకు తెలుసుకోలేదని.. అందువల్లే ఈ కేసులో కీలకమైన చిక్కుముడి విడిపోవడం లేదని ఎందుకు మీ రాతల్లో కనిపించదు రామోజీ? విషయం అందరికీ తెలిశాక.. ఘటనా స్థలానికి చేరుకున్న వారిని లక్ష్యంగా చేసుకుని.. వారిని దోషులుగా చూపుతూ దుష్ప్రచారం చేయడం మీకే చెల్లింది.

వివేకా హత్య జరిగిన రోజు ఎన్నికల ప్రచారానికి వెళ్లడానికి అవినాశ్‌రెడ్డి ఇంటి వద్దకు వెళ్లానని ఉదయ్‌కుమార్‌రెడ్డి ఆ రోజూ చెప్పారు. ఈ రోజూ అదే చెబుతున్నారు. ఓ పని కోసం ఎంపీ ఇంటికి వెళ్లానని మాజీ ఎంపీటీసీ సభ్యురాలు శశికళ కూడా ఆరోజు, ఈ రోజు అదే చెబుతోంది. ఎంపీ ఇంటి వద్ద ఉన్నామని వాళ్లే స్వయంగా చెబుతున్నప్పుడు.. ఆ విషయం కొత్తగా కనిపెట్టినట్లు మీరు చెప్పడం ఏమిటో! 

ఉదయ్‌ను పోలీస్‌ కస్టడీకి ఇవ్వండి
వైఎస్‌ వివేకా హత్య కేసులో అరెస్టయిన గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డిని పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ హైదరాబాద్‌ సీబీఐ కోర్టులో కేంద్ర దర్యాప్తు సంస్థ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై సోమవారం సీబీఐ కోర్టు విచారణ జరిపే అవకాశం ఉంది. శుక్రవారం ఆయన్ను కడపలో అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలించిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement