ఏపీ ఎన్నికల వేళ తెరపైకి వివేకా కేసు | KSR Comment On Viveka Case CBN Mind Game | Sakshi
Sakshi News home page

ఏపీ ఎన్నికల వేళ తెరపైకి వివేకా కేసు

Published Thu, Mar 14 2024 9:23 AM | Last Updated on Thu, Mar 14 2024 11:49 AM

KSR Comment On Viveka Case CBN Mind Game - Sakshi

తన తండ్రి హత్య జరిగిన తర్వాత సునీత మాట్లాడిన మాటలకు, ఇప్పుడు చెబుతున్న అంశాలకు పొంతన లేదు. పైగా ఉన్నపళంగా ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించాలని నిర్ణయించుకోవడంతో..  ఆమె ఏ దురుద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై మాట్లాడుతుందో స్పష్టమవుతోంది. ఇక వివేకా హత్య కేసు ఇప్పటికే తెలంగాణలోని సీబీఐ కోర్టులో విచారణలో ఉంది. దీనిలో ఏపీ ప్రభుత్వం జోక్యం చేసుకునే పరిస్థితి ఉండదు. ఇక జరగవలసింది కోర్టు విచారణ మాత్రమే. అలాంటప్పుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఏమి సంబంధం ఉంది?.. సంబంధం అంటగడుతూ ఈనాడు ఎందుకు కథనాలు ఇవ్వాలి?

‘మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఆ మధ్య ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టి మాట్లాడిన తీరు, ఆ సందర్భంగా తెలుగుదేశం పార్టీలోని వారికి, చివరికి పార్టీ ఆఫీస్ అటెండర్ స్థాయి ఉండే  నేతలకు సైతం ఆమె ధన్యవాదాలు తెలియచేసిన వైనం, అలాగే ఆ మీడియా సమావేశానికి హాజరైన ప్రతినిధులు కేవలం టీడీపీకి ఉపయోగపడే ప్రశ్నలు వేసిన పద్ధతి.. ఇవన్నీ గమనిస్తే ఒక విషయం అర్థం అవుతుంది. సునీత కేవలం తన తండ్రి హత్య కేసు గురించి కన్నా, తెలుగుదేశం పార్టీకి ఏ రకంగా ఉపయోగపడాలన్న లక్ష్యంతోనే మాట్లాడారని తేలిపోతుంది.  అదే సమయంలో.. ఈనాడు పత్రికలో సునీత మీడియా సమావేశం వార్తను ఒకటిన్నర పేజీలు ప్రచురించడం వెనుక ఆంతర్యం ఏంటసలు?.. 


సునీత ఢిల్లీలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఈనాడు, ఆంధ్రజ్యోతిలాంటి టీడీపీ అనుకూల మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నలు కొన్ని.. 
 

  • మీ నాన్న హత్య కేసులో నిందితులను రక్షించడానికే వైఎస్‌ జగన్‌ పరిమితం అయ్యారు. ఇందులో ఆయన పాత్ర కూడా ఉందని అనుమానిస్తున్నారా?
  • అవినాష్‌కు హైకోర్టు ఇచ్చిన బెయిల్‌పై సీబీఐ సుప్రింకోర్టుకు ఎందుకు వెళ్లలేదు?
  • హత్యకు ఏ ఆయుధం ఉపయోగించింది? జగనే ఎలా చెప్పగలిగారని అనుకుంటున్నారు?
  • అవినాశ్ రెడ్డిని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎందుకు కాపాడుతున్నారు?

సునీత నుంచి సమాధానాలేవీ?
ఎవరైనా ఒక మాట చెబితే అందులో విశ్వసనీయత ఉండాలి. ఒక చిత్తశుద్ది ఉండాలి. కానీ సునీత మాత్రం ఎందుకో తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు కొందరు చూపుతున్న ప్రలోభాలకు లొంగి, వారు మాట్లాడమన్నట్లు మాట్లాడుతూ, వారు చెప్పినట్లు చేస్తున్నారన్న అభిప్రాయం కలుగుతోంది. ఈ మొత్తం వ్యవహారం చూస్తే ఆమెకు తన తండ్రి ప్రతిష్ట కన్నా, తనకు, తన భర్తకు ఏదో రాజకీయ పదవి కోసం పాకులాడుతున్నారన్న సందేహం వస్తుంది. అంతేకాక వివేకా హత్య కేసులో రెండో కోణంగా ఉన్న ఆయన వ్యక్తిగత జీవిత రహస్యాలను బహిర్గతం అవుతున్నా ఆమె ఫీల్ అవుతున్నట్లు కనిపించడం లేదు! తన తండ్రితో ఐదేళ్లుగా అంతగా సునీతకు సత్సంబంధాలు లేవని చెబుతున్నారు. అది నిజమా? కాదా? తండ్రి మరో మహిళను రెండో వివాహం చేసుకున్నారన్నది వాస్తవమా? కాదా? వారికి పుట్టిన బిడ్డకు ఆస్తి ఇవ్వకుండా సునీత అడ్డుపడే యత్నం చేశారన్నది కరెక్టా? కాదా?.. 

ఆ దుర్బుద్ధి బయటపడిందిలా..
వివేకా హత్య జరిగినప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబు ప్రభుత్వమే కదా! ఆ రోజుల్లో ఏ మాత్రం ఆధారం దొరికినా ఎంపీ అవినాష్‌ రెడ్డిపైన కేసు పెట్టేవారు కదా! అప్పుడు ఎందుకు అలా చేయలేకపోయారో చంద్రబాబును సునీత ఎందుకు ప్రశ్నించలేదు? ఆనాడు టీడీపీ నేతలు ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవిలపై ఆరోపణలు చేసిన ఆమె ఎందుకు వారితో రాజీపడిపోయారు? అసలు వివేకాను తానే హత్య చేశానని చెబుతున్న దస్తగిరిని మాత్రం సునీత ఎందుకు రక్షిస్తున్నారు? అతనికి బెయిల్ వచ్చేందుకు ఎందుకు సహకరిస్తున్నారు? వివేకాను చంపినవారినే తన వద్ద పెట్టుకుని, ఇంకెవరిపైనో ఆరోపణలు చేయడం రాజకీయం కాకుండా ఉంటుందా? ఆమె తండ్రిపట్ల ఏ మాత్రం అభిమానం ఉన్నా ఇలా చేయగలుగుతారా? తన తండ్రి హత్య జరిగి ఐదేళ్లయినా విచారణ ఎందుకు పూర్తి కాలేదని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలోనే ఆమె దుర్బుద్ధి కనబడుతోంది.


ఇదీ చదవండి: వివేకా వర్థంతిన సునీత రాజకీయం!

 ఆ లేఖ దాచింది నర్రెడ్డి దంపతులు కాదా?
ఆమె కేంద్రాన్ని, భారతీయ జనతా పార్టీని లేదా సీబీఐని కదా అడగాల్సింది? లేదా హత్య జరిగిన సమయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబును విచారణ ఎందుకు పూర్తి కాలేదని అడగాలి కదా! హంతకులు పాలకులుగా ఉండరాదని ఆమె అంటున్నారు. అది నిజమే. అందుకే చంద్రబాబు ప్రభుత్వాన్ని అప్పట్లో ప్రజలు ఓడించారని అనుకోవాలి కదా! పార్టీలకు అతీతంగా మద్దతు ఇవ్వాలని కోరుతూ తన అన్నకు ఓటు వేయవద్దని అంటున్నారంటేనే ఆమె ఎజెండా తెలిసిపోతుంది! వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నుంచి ఆమె గానీ, ఆమె కుటుంబం కానీ ఏదో ఆశించి ఉండాలి. అది నెరవేర్చడానికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధపడి ఉండకపోవచ్చు. ఆ కోపంతో టీడీపీ రాజకీయ ట్రాప్‌లోకి వెళ్లి, ఆ పార్టీ వారు సమకూర్చిన లాయర్ల సహకారంతో రకరకాల పిటిషన్‌లు వేసి ఇన్నాళ్లు సునీత కథ నడిపించారనిపిస్తుంది. వివేకా రాసిన లేఖను సునీత, ఆమె భర్త ఎందుకు దాచి ఉంచారు? బయటపెట్టొద్దని ముందే ఎందుకు హెచ్చరించారు.? ఈ విషయాలను కూడా సునీత ఎప్పుడూ బయటపెట్టలేదు.

పెద్ద మనుషుల ముసుగులో కుట్ర
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన స్కీములు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఆయుధాలుగా మార్చుకుని ప్రజల మద్దతుతో ఎన్నికల యుద్ధంలో పాల్గొంటుంటే, చంద్రబాబు మాత్రం తన ఆయుధాలుగా పవన్ కల్యాణ్, రఘురామకృష్ణరాజు, వివేకా కేసులో షర్మిల, సునీత, లాంటి వాళ్లను మార్చుకుని ఎన్నికలకు వెళ్తున్నారుఘ ఈ క్రమంలోనే సీఎం జగన్‌పై జరుగుతున్న కుట్రలో భాగంగా తెరపైకి వచ్చిందే.. వివేకా హత్య కేసు. ఈ కుట్రలో ఈనాడు అధినేత రామోజీరావు కూడా భాగమే అయ్యారు. ‘‘వివేకా హత్య జరిగి రేపటికి అయిదేళ్లు.. అయినా కొలిక్కిరాని దర్యాప్తు.. కారణం జగనే!.. నిందితుల్ని కాపాడేందుకు సర్వశక్తుల ప్రయోగం’’ అంటూ అడ్డగోలు రాతలతో తాజాగా ఈనాడు ఇచ్చిన కథనమే ఇందుకు నిదర్శనం.

ఈ కేసులో తెలుగుదేశం ఏ ఆరోపణలు చేస్తుందో.. అవే నర్రెడ్డి సునీత నుంచి మొదటి నుంచి చేస్తోంది. పైగా ఆమె స్టేట్‌మెంట్‌ను టీడీపీ అనుకూల మీడియా సంస్థలు హైలైట్‌ చేస్తూ వస్తున్నాయి. అందునా ఈమధ్య చంద్రబాబుకి, టీడీపీ అండ్‌ మిత్రపక్ష నేతలకు ఆమె ఢిల్లీ ప్రెస్‌ మీట్‌లో కృతజ్ఞతలు చెప్పారు. అయితే.. సీఎం జగన్‌ను  టార్గెట్‌ చేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యల్నే ప్రముఖంగా ప్రస్తావించిన రామోజీ మీడియా.. బాబు అండ్‌ కోకి ఆమె చెప్పిన కృతజ్ఞతల్ని పట్టించుకోలేదు. వీటన్నంటికి తోడు.. వివేకా వర్థంతి నాడే ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ప్రకటన చేయాలని ఆమె నిర్ణయించుకోవడం, టీడీపీ తరఫునే బరిలోకి దిగాలని ఆమె ప్రయత్నిస్తుండడం..  ఇవన్నీ చూశాక ఇదంతా చంద్రబాబు డైరెక్షన్‌లో జరిగింది కాదంటే ఎవరైనా నమ్మగలరా?.

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement