వివేకా హత్య కేసులో ముసుగు తొలగింది
రాజకీయ కుట్రతోనే సునీతతో మీడియా సమావేశం పెట్టించిన బాబు
నాడు వివేకాను ఓడించిన వ్యక్తులకే నేడు కృజ్ఞతలు చెబుతున్న సునీత
వివేకా హత్యలో సునీత కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉందన్న అనుమానాలున్నాయి
సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్‌లే అందుకు ఆధారం
దాన్నుంచి తప్పించుకోడానికి దొంగే దొంగా దొంగా అన్నట్లు సునీత మాట్లాడుతున్నారేమో!
తండ్రిని కిరాతకంగా చంపిన వాడుసునీతకు మంచోడెలా అయ్యాడో?
పవన్ 24 సీట్లు తీసుకుని..240 సీట్లు అనుకుంటే ఎలా?
తాడేపల్లిగూడెం సభ చూశాక బాబు, పవన్ కథ ముగిసిందన్నది స్పష్టమైంది
వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల
సాక్షి, అమరావతి: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కూతురు సునీత ఇన్నాళ్లూ ఎవరి ప్రతినిధిగా మాట్లాడుతున్నారో, తప్పుడు కేసును ఎలా అల్లుతున్నారో బట్టబయలైందని, ముసుగు తొలగిపోయిందని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఢిల్లీలో శుక్రవారం మీడియా సమావేశంలో సునీత మాట్లాడిన మాటలే ఇందుకు నిదర్శనమన్నారు. ఆమె మాట్లాడినవన్నీ చంద్రబాబు పలికించినవే అనడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఏమీ ఉండదన్నారు. రాజకీయ కుట్రతోనే సునీతతో చంద్రబాబు మీడియా సమావేశం పెట్టించారని తెలిపారు. సజ్జల రామకృష్ణారెడ్డి శుక్రవారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘వైఎస్ వివేకా ఎమ్మెల్సీగా ఓడిపోవడానికి మేమే కారణమని ఆరోపించడం విడ్డూరం.
కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 2017లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ భారీ మెజార్టీతో గెలవడానికి టీడీపీకంటే వైఎస్సార్‌సీపీకి 160 ఓట్లు ఎక్కువ ఉన్నాయి. అందువల్లే తన చిన్నాన్న వైఎస్ వివేకాను పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ అభ్యర్థిగా నిలబెట్టారు. చంద్రబాబులా ఓడిపోయే సీటుకు పోటీ పెట్టలేదు. వైఎస్ చనిపోయిన తర్వాత వివేకా కాంగ్రెస్‌లోకి వెళ్లి జగన్‌ను రాజకీయంగా అంతుచూడాలని భావించారు. వైఎస్ విజయమ్మపై పులివెందుల శాసన సభ స్థానం నుంచి పోటీకి దిగారు. అయినా వివేకాను జగన్ దగ్గరకు తీసుకున్నారు. వివేకా అడగకుండానే ఆయన్ని ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిగా పెట్టారు.
వివేకా సునాయసంగా గెలవాల్సింది. కానీ.. బలం లేకపోయినా ఆయనపై బీటెక్ రవిని చంద్రబాబు పోటీకి దింపి, అప్పట్లో మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డితో కలిసి కుట్ర చేసి ఓడించారు. బీటెక్ రవి, ఆదినారాయణపై వివేకాకు కోపం ఉంది. అందుకే 2019 ఎన్నికల్లో వైఎస్ అవినాష్‌రెడ్డి తరఫున వివేకా అవిశ్రాంతంగా ప్రచారం చేశారు. ఆనాడు తండ్రి వివేకాను కుట్రపూరితంగా ఓడించిన బీటెక్ రవికి సునీత ఇప్పుడు కృజ్ఞతలు చెబుతున్నారు. వివేకాను ఏదన్నా చేయాలంటే బీటెక్ రవి, ఆదినారాయణరెడ్డికే ఎక్కువ అవకాశం ఉంది. వివేకా హత్యకు కారకులైన వాళ్లను కాదని.. ఏడాది తర్వాత ఇంట్లో వాళ్లే హత్య చేశారని సునీత మాటమార్చారు. తండ్రి హత్యకు కారకులైన వారితో జట్టుకట్టి వాళ్లకే కృజ్ఞతలు చెబుతున్నారు’ అని సజ్జల మండిపడ్డారు.
ఎన్నికల వేళ చంద్రబాబు రాజకీయ కుట్ర
‘సునీత చెప్పినట్లే హత్య కేసు సాధారణంగా వారం రోజుల్లో తేలిపోయేట్లయితే, అప్పట్లో అధికారంలో ఉన్న ఆమె మిత్రుడైన చంద్రబాబు ఆలోగా విచారణ పూర్తి చేసి ఎందుకు కేసు తేల్చలేదు? ఎన్నికలు దగ్గరవుతున్నందున చంద్రబాబు ఉసిగొల్పి ఆరోపణలు చేయించి తన అస్త్రాలను వాడుతున్నాడనటానికి ఇదొక ఉదాహరణ. రాజకీయ కోణంలోనే ఆమె బయటకు వచ్చింది. ప్రజా కోర్టులో తేలాలని అమె కూడా అంటోంది కదా.. అదే తేలుతుంది. కేసులకు, ప్రజలకు సంబంధం ఏముంది? సీఎం జగన్ ప్రజలకు ఏం చేస్తామని చెప్పారో దాని ప్రకారం ప్రజల్లోకి వెళ్తున్నారు.
ఆమెకు అన్యాయం జరిగిందని తప్పుడు ఆరోపణ చేసి, మీరు జగన్‌ను శిక్షించండి అని సునీత కోరడం విచిత్రం. ప్రజలంటే వీరికి ఎంత అలుసు? వివేకా హత్యలో సునీత కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉందేమోననే అనుమానం చాలా మందికి ఉంది. సీబీఐకి ఇచ్చిన కొన్ని వాంగ్మూలాలను లోతుగా చూస్తే అది కనిపిస్తోంది. దాన్ని తప్పించుకోడానికి దొంగే దొంగ దొంగ అన్నట్లుగా ఆమె తిప్పికొడుతున్నారేమో! విచారణ వాటి మీదా జరగాలి. ఆమె తండ్రిని ఎలా కిరాతకంగా గొడ్డలితో నరికి చంపాడో చెప్పిన హంతకుడినే సోదరుడి కింద చూస్తున్న సునీతను ఏమనాలి?’ అని సజ్జల ధ్వజమెత్తారు.
చంద్రబాబు అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీ జనసేన
‘వైఎస్సార్‌సీపీ నుంచి బయటకు వెళ్లిన వాళ్లను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్లంతా స్మగ్లర్లు, గూండాలు కాకుండా పోయారా? బీజేపీ వాళ్లు ఏమనుకుంటున్నారో మాకు తెలియదు కానీ చంద్రబాబు మాత్రం బీజేపీతో కలిసిపోయినట్లే ఫీల్ అవుతున్నాడు. వాళ్ల అండతో ఏదో ఒక రకంగా అర్జంటుగా కుర్చీ ఎక్కాలని బాబు తాపత్రయపడుతున్నట్లు స్పష్టమైపోయింది.
పవన్ 24 సీట్లు తీసుకుని 240 సీట్లు అనుకుంటే ఎలా? జనసేనకు 30 వేల ఓట్లకు పైగా వచ్చిన 15 నియోజకవర్గాల్లో ఏడింటిని టీడీపీకి ఇచ్చాడు. మిగిలినవాటిలో ఓడిపోయేవన్నీ పవన్‌కు చంద్రబాబు ఇచ్చాడు. చంద్రబాబుకు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ పెట్టుకుని నేను వామనావతారం, పాతాళానికి తొక్కుతా అని పవన్ అంటే ప్రజలు నవ్వుతారు. తాడేపల్లిగూడెం సభ చూశాక బాబు, పవన్ కథ ముగిసిందన్నది అర్ధమైపోతోంది’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment