బాబు చేతిలో కీలుబొమ్మ సునీత  | Sunita couples closeness with Vivekas killers | Sakshi
Sakshi News home page

బాబు చేతిలో కీలుబొమ్మ సునీత 

Published Sun, Apr 7 2024 3:30 AM | Last Updated on Sun, Apr 7 2024 12:59 PM

Sunita couples closeness with Vivekas killers - Sakshi

2019లో కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్‌ అవినాశ్‌ను ఖరారు చేసిన వైఎస్‌ జగన్‌      

అవినాశ్‌ గెలుపు కోసం చివరి వరకూ కృషి చేసిన వివేకా.. అయినా సునీత దుష్ప్రచారం 

తాజాగా పులివెందుల ఉప ఎన్నికల అభ్యర్థిత్వంపై అవాస్తవాలు.. హేతుబద్ధ ప్రశ్నలు సంధిస్తే సమాధానం కరువు 

వివేకా రెండో వివాహంతోనే ఆ కుటుంబంలో విభేదాలు.. ఆస్తి, రాజకీయ వారసత్వం కోసం పంతంపట్టిన సునీత దంపతులు 

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకాను కుట్రతో ఓడించింది చంద్రబాబు ముఠానే.. 2019లో భౌతికంగా అంతం చేసిందీ ఎల్లో గ్యాంగే 

తండ్రి హంతకులు, కుట్రదారులతో సఖ్యతగా ఉంటున్న సునీత దంపతులు  

సాక్షి, అమరావతి: పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ లోకం అంతా కళ్లు మూసుకుందని అనుకున్నట్టుగా ఉంది నర్రెడ్డి సునీత తీరు. ఆమె చంద్రబాబు నాయుడు చేతిలో కీలుబొమ్మగా మారి, బాబు కుట్రలో భాగస్వామిగా మారి ఆమె తండ్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యపై అవాస్తవాలు ప్రచారం చేస్తూ.. రాష్ట్ర ప్రజలంతా నమ్మేస్తారని భ్రమపడుతున్నారు. ఇదే భావనతో హైదరాబాద్‌లో శనివారం మీడియా సమావేశం నిర్వహించి మరీ చంద్రబాబు స్క్రిప్‌్టను వినిపించారు. ఇన్నాళ్లూ బాధితురాలిగా వేసుకున్న ముసుగును తొలగించి పూర్తిగా టీడీపీ మనిషినేనని బయటపడ్డారు.

ఓ వైపు ఆమె తండ్రి వైఎస్‌ వివేకా హత్య వెనుక ఎవరున్నారో నిగ్గు తేల్చాలని డిమాండ్‌ చేస్తూనే, మరోవైపు వివేకా హంతకులతో జట్టు కడుతుండటం ఆమెకే చెల్లింది. వివేకానందరెడ్డి రెండో వివాహంతో కుటుంబంలో తలెత్తిన విభేదాలను మరుగున పెట్టి, తన తండ్రి హత్య వెనుక ఆస్తి వివాదాలు లేవని నమ్మిచేందుకు విఫలయత్నం చేస్తున్నారు. ఇన్నాళ్లూ కడప ఎంపీ అభ్యర్థిత్వంపై అవాస్తవాలు ప్రచారం చేసిన సునీత.. తాజాగా పులివెందుల ఉప ఎన్నికల్లో అభ్యర్థిత్వంపైనా అబద్ధాలు చెబుతున్నారు.

ఆమె తండ్రి రాసిన లేఖను వారే దాచిపెట్టిన నిజం, గుండెపోటు కథను వారే ప్రచారంలోకి తెచ్చిన వాస్తవం బయటపడకుండా చూడటమే ధ్యేయమన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్‌ వివేకాను కుట్రతో ఓడించింది చంద్రబాబు ముఠాయేనని, 2019 ఎన్నికల్లో వివేకాను టీడీపీకి అడ్డుగా లేకుండా చేసిందీ ఎల్లో  గ్యాంగేనన్నది బహిరంగ రహస్యం. అందుకే ఆమె అబద్ధాలను ప్రజలు నమ్మడంలేదు. అసత్య ప్రచారాన్ని పూర్తి ఆధారాలతో సహా, హేతుబద్ధమైన ప్రశ్నలతో ప్రజానీకం తిప్పికొడుతోంది. 

విజయమ్మకు వ్యతిరేకంగా వివేకా ఎందుకు పోటీ చేశారు? 
వైఎస్‌ రాజశేఖర రెడ్డి హఠాన్మరణం తర్వాత వైఎస్‌ కుటుంబంలో పరిణామాలను సునీత వక్రీకరించారు. పులివెందుల ఉప ఎన్నికల్లో వైఎస్‌ భాస్కర్‌రెడ్డి పోటీ చేయాలని భావించగా వివేకానందరెడ్డి  వ్యతిరేకించారని, వైఎస్‌ విజయమ్మే పోటీ చేయాలని పట్టుబట్టారన్నారు. సునీత ఎంత పచ్చిగా అబద్ధాలు చెబుతున్నారో ఇదే నిదర్శనం. పులివెందులలో విజయమ్మ పోటీ చేయాలని చెప్పిన వివేకా.. ఆమెకు వ్యతిరేకంగా పోటీ చేశారనే విషయాన్ని సునీత ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే ఆ ఎన్నికల్లో భాస్కర్‌రెడ్డి పోటీ విషయం చర్చకే రాలేదు.

విజయమ్మనే పోటీ చేయించాలని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భావించారు. ఆమే పోటీ చేశారు కూడా. కానీ వైఎస్‌ వివేకానందరెడ్డి తన సతీమణి సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఒత్తిడికి లొంగి కిరణ్‌ కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా చేరారు. వారి ఒత్తిడితోనే పులివెందులలో విజయమ్మ­పై పోటీ చేశారు. ప్రజలు మాత్రం సీఎం జగన్‌, వైఎస్‌ విజయమ్మ వెన్నంటి నిలి­చారు. ఆ ఉప ఎన్నికల్లో కడప ఎంపీగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యేగా వైఎస్‌ విజయమ్మ భారీ మెజార్టీతో గెలిచారు. దీన్ని వక్రీకరించి ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిపై దు్రష్పచారం చేసేందుకు సునీత యత్నించడం విడ్డూరంగా ఉంది. 

కడప ఎంపీ అభ్యర్థిత్వంపైనా అవాస్తవాలే? 
2014లో కడప ఎంపీగా వైఎస్‌ షర్మిల పోటీ చేయా­లని వివేకా భావించారని సునీత చెప్పుకొచ్చారు. అసలు కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్‌ అవినాశ్‌ రెడ్డిని వైఎస్సార్‌సీపీ ఏకాభిప్రాయంతో ఎంపిక చేసింది. వివేకా కూడా ఏకీభవించారు. 2019 ఎన్నికల్లో కూ­డా అప్పటికే సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న అవినాశ్‌ రెడ్డినే మరోసారి పోటీ చేయించాలని వైఎస్‌ జగన్‌ నిర్ణయించారు. ఆ ఎన్నికల ఇన్‌చార్జిగా వివేకానందరెడ్డినే నియమించారు.

వివేకా చివరివరకూ అవినా­శ్‌ రెడ్డి విజయం కోసం శ్రమించారు. హత్యకు గురికావడానికి ముందు రోజు కూడా ప్రొద్దుటూరు నియో­జకవర్గంలో పర్యటించి ఎంపీగా అవినాశ్‌ రెడ్డిని, ఎమ్మెల్యేగా రఘురామిరెడ్డిని గెలిపించాలని ప్రచా­రం చేశారు. పార్టీ నేతలతో చర్చించి వచ్చారు. వివేకానందరెడ్డి చివరివరకూ అవినాశ్‌ విజయం కోసం పనిచేశారని సునీతే 2019 మార్చి 21న హైదరాబాద్‌లోనే  మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ విషయం బాబు చేతిలో కీలుబొమ్మగా మారిన ఆమె మర్చిపోయిందేమో కానీ, ప్రజలందరికీ గుర్తుంది. 

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకాను ఓడించింది చంద్రబాబు ముఠానే 
2017 వైఎస్సార్‌ జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో సునీత ఆరోపణలూ అసత్యాలే. ఆ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా వివేకానందరెడ్డినే వైఎజ్‌ జగన్‌ ఎంపిక చేశారు. జిల్లాలో మెజార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు వైఎస్సార్‌సీపీకి చెందినవారే కావడంతో వివేకా విజ­యం సులువేనని అంతా భావించారు.

వివేకా ఎమ్మెల్సీగా ఎన్నికైతే జిల్లాలో టీడీపీ ఉనికికే ప్రమాదమని చంద్రబాబు భావించారు. అందుకే వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను ప్రలోభాలకు గురి చేసి,  కుట్రపూరితంగా వివేకాను ఓడించారు. ఈ వ్యవహారంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రి ఆదినారాయణరెడ్డి కీలకపాత్ర పోషించారు. వాస్తవాలిలా ఉంటే.. సునీత మాత్రం వివేకాను ఎంపీ అవినాశ్‌ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి ఓడించా­రని పదే పదే అసత్యాలు చెప్పడం విడ్డూరంగా ఉంది.  

టీడీపీ ప్రభుత్వ హయాంలోనే వివేకా హత్య.. అది ఎల్లో గ్యాంగ్‌ కుట్రే 
తన తండ్రి హంతకులను శిక్షించడం కోసమే పోరాడుతున్నా అని చెబుతున్న సునీత ఉద్దేశపూర్వకంగా ఓ విషయాన్ని మర్చిపోతున్నారు. వివేకా హత్యకు గురైంది చంద్రబాబు ప్రభుత్వ హయంలోనే. 2019 ఎన్నికల్లో కడప లోక్‌సభ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ విజయం కోసం వివేకా ఎన్నికల వ్యూహాలు పన్నుతూ అందర్నీ కలుపుకొంటూ దూసుకుపోతున్నారు. దాంతో అప్పటి సీఎం చంద్రబాబు, మంత్రి ఆదినారాయణ రెడ్డి బెంబేలెత్తారు. వివేకా జీవించి ఉంటే వారితో పాటు బీటెక్‌ రవికీ రాజకీయంగా ప్రతిబంధకంగా మారుతారు. ఈ నేపథ్యంలోనే వివేకా హత్యకు గురయ్యారు.

వివేకా భౌతికంగా లేకపోవడం రాజకీయంగా ప్రయోజనం కలిగిస్తుందని టీడీపీ పెద్దలు భావించారన్నది సుస్పష్టం. వివేకా హత్యకు ముందు టీడీపీ నేతలు  కొందరితో రహస్య సమావేశాలు, హత్య తరువాత ఆ నేతలు వ్యవహరించిన తీరే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. వివేకాతో ఆర్థిక విభేదాలు తలెత్తిన కొమ్మారెడ్డి పరమేశ్వరెడ్డితో బీటెక్‌ రవి సాన్నిహిత్యం పెంచుకున్నారు. హత్యకు ముందు రోజు అంటే 2019 మార్చి 14 సాయంత్రం టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవితో హరిత హోటల్‌లో రెండుసార్లు సమావేశమయ్యారు.

ఈ భేటీలో పాల్గొన్న శ్రీనివాసరెడ్డి తర్వాత కొద్ది రోజులకే అనుమానాస్పద రీతిలో మృతి చెందడం గమనార్హం. సిట్‌ దర్యాప్తులో నార్కో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించినా పరమేశ్వరరెడ్డి తిరస్కరించడం సందేహాలకు తావిస్తోంది. అంటే వివే­కా హత్య వెనుక ఎల్లో గ్యాంగ్‌ ఉందన్నది స్పష్టమవుతోంది. సునీత మాత్రం చంద్రబాబు, ఆది నారాయణరెడ్డి, బీటెక్‌ రవిల పేర్లనే ప్రస్తావించడం లేదు. 

హడావుడిగా ఆస్తుల బదిలీ ఎందుకో.. 
వివేకానందరెడ్డి హత్య వెనుక కుటుంబ ఆస్తి వివాదాలు లేవని నమ్మిచేందుకు సునీత యత్నించారు. అసలు తన తండ్రి వివేకానందరెడ్డి పేరిట ఆస్తులేవీ లేవని చెప్పుకొచ్చారు. మరి ఆస్తులు ఏవీ లేకపోతే కుటుంబ కంపెనీల్లో ఆయన చెక్‌ పవర్‌ను ఆమె తల్లితో కలిసి ఎందుకు రద్దు చేశారు? వివేకా హత్య తరువాత పులివెందులలో ఉన్న భూములను హడావుడిగా తన పేరిట సునీత మార్చుకున్నారని రెవెన్యూ రికార్డులు వెల్లడిస్తున్నాయి కదా. ఆస్తుల బదిలీలో ఈ హడావుడి ఎందుకు? 

అంటే దస్తగిరి వాంగ్మూలం తప్పేకదా  
అంతేకాదు దస్తగిరి అప్రూవర్‌గా ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పిన బెంగళూరు భూ సెటిల్‌మెంట్‌ వివాదం అన్నది లేనేలేదని సీబీఐ చెప్పిందని సునీత గుర్తుచేస్తున్నారు. అంటే అప్రూవర్‌గా మారుతూ దస్తగిరి చెప్పిన విషయాలు అవాస్తవాలేనని సునీత అంగీకరించినట్టే కదా.

అలా అయితే దస్తగిరి ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డిపై చేస్తున్న ఆరోపణలన్నీ కూడా అవాస్తవమే అవుతాయి కదా. వైఎస్‌ వివేకా హత్యతో వారికి సంబంధం లేనట్టే అవుతుంది. ఆ విషయాన్ని సునీత ఎందుకు అంగీకరించడంలేదు? అవినాశ్‌ రెడ్డిపై అసత్య ఆరోపణలను ఎందుకు కొనసాగిస్తున్నారు? అంటే.. కేవలం చంద్రబాబు స్క్రిప్ట్‌ ప్రకారమే ఆమె వ్యవహరిస్తున్నారన్నది స్పష్టమవుతోంది. 

చంద్రబాబు చేతిలో కీలుబొమ్మే 
తన వెనుక ఏ పార్టీ లేదని సునీత ఎంతగా నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, చంద్రబాబు చేతి­లో ఆమె కీలుబొమ్మగా మారారన్నది ఆమె వ్యవహా­ర శైలే చెబుతోంది. టీడీపీకి రాజకీయంగా ప్రయోజనం కలిగించేందుకే వైఎస్సార్‌సీపీకి ఓటేయకూడదని అంటున్నారు. బాబు ఐదేళ్లుగా చేస్తు­న్న అస­త్య ఆరోపణలనే ఆమె పదే పదే వల్లిస్తున్నారు.  

వివేకా హంతకులతో సునీత దంపతుల సాన్నిహిత్యం 
వివేకానందరెడ్డి హత్యకు గురైన సమయంలో ఆయన నివాసంలో ఉన్న ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరి, సునీల్‌యాదవ్, ఉమాశంకర్‌రెడ్డితో సునీత దంపతులకే దశాబ్దాలుగా సాన్నిహిత్యం ఉంది. ఆ నలుగురితో వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి సాన్నిహిత్యం లేదు. ఇక వివేకాను గొడ్డలితో నరికి చంపానని అంగీకరించిన హంతకుడు దస్తగిరితో సునీత దంపతులు ఇప్పటికీ ఎందుకు సఖ్యతతో ఉంటున్నారన్నది మరో కీలకాంశం. టీడీపీ ప్రభుత్వంలో నియమించిన సిట్, తర్వాత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్, సీబీఐ కూడా వివేకానందరెడ్డిని దస్తగిరితో సహా నలుగురు హత్య చేశారని నిర్ధారించాయి.

వివేకాను గొడ్డలితో స్వయంగా నరికాను అని చెప్పిన దస్తగిరి అప్రూవర్‌గా మారడంతోనే ఈ కేసు దర్యాప్తు దారితప్పింది. సునీత, ఆమె భర్త దస్తగిరితో పలుసార్లు భేటీ అవుతున్నారు. టీడీపీ నేతలు ఆదినారాయణ రెడ్డి, బీటెక్‌ రవితోనూ సన్నిహితంగా ఉంటున్నారు. అంటే వివేకా కుటుంబం, టీడీపీ నేతల పన్నాగంలో భాగంగానే దస్తగిరి అప్రూవర్‌గా మారారన్నది సుస్పష్టం. వివేకా హంతకుడితో, రాజకీయ ప్రత్యర్థులతోనూ ఆ కుటుంబం సన్నిహితంగా ఉండటం ఈ హత్య కుట్రలో వారి సామూహిక భాగస్వామ్యాన్ని బహిర్గతం చేస్తోంది. 

వివేకా రెండో వివాహం, కుటుంబ వివాదాల సంగతేమిటి? 
వివేకానందరెడ్డి రెండో వివాహాన్ని సునీత ఉద్దేశపూర్వకంగా మరుగున పరుస్తున్నారు. షమీమ్‌ అనే మహిళను వివేకా రెండో వివాహం చేసుకున్నారు. వారికి ఓ కుమారుడు ఉన్నారని, దాంతోనే కుటుంబంలో ఆస్తి, రాజకీయ వారసత్వ విభేదాలు తలెత్తాయనే వాస్తవాన్ని కప్పిపుచ్చుతున్నారు. ఎందుకంటే వివేకా హత్య వెనుక కుటుంబంలో విభేదాలు కీలక పాత్ర పోషించాయి. ఆయన మరణిస్తే ఎవరికి ప్రయోజనం, ఆయనతో వ్యక్తిగతంగా, ఆస్తిపరంగా, రాజకీయంగా ఎవరికి విభేదాలు ఉన్నాయన్నది ఈ కేసు దర్యాప్తులో అత్యంత కీలకం. రెండో భార్య షమీమ్‌కు పుట్టిన కుమారునికి ఆస్తిలో భాగం ఇవ్వాలని వివేకా భావించారు.

రాజకీయ వారసునిగా చేస్తానని కూడా ప్రకటించారు. దాంతో ఆ కుటుంబంలో ఆస్తి, రాజకీయ వారసత్వ వివాదాలు తీవ్రస్థాయిలో తలెత్తాయి. వివేకా మొదటి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఆయనతో తీవ్రంగా గొడవపడి, ఆయన్ని విడిచిపెట్టి హైదరాబాద్‌లో ఉంటున్నారు. కుటుంబానికి చెందిన కంపెనీల్లో వివేకాకు ఉన్న చెక్‌ పవర్‌ను రద్దు చేశారు. సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి, బావ శివప్రకాశ్‌రెడ్డి షమీమ్‌ ఇంటికి వెళ్లి ఘర్షణ పడ్డారు. వివేకానందరెడ్డి అప్పటికే ఆమెకు ఇచ్చిన ఓ ఇంటి పత్రాలను బలవంతంగా తీసుకున్నారు.

షమీమ్, సునీత దూషించుకుంటూ చేసుకున్న వాట్సాప్‌ చాటింగ్‌ను కూడా అప్పట్లోనే సిట్‌ బృందం వెలికితీసింది. షమీమ్‌కు ఓ ఇల్లు ఇవ్వాలని, ఆమె కుమారుడిని హైదరాబాద్‌లోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో చదివించాలని అనుకుంటున్నప్పటికీ అవడంలేదని వివేకా సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు కూడా. షమీమ్‌ కూడా సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో ఇవన్నీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో వివేకానందరెడ్డి జీవించి లేకపోతే ఆయన కుమార్తె, అల్లుడు, పెద్ద బావమరిదికే ఎక్కువ ప్రయోజనమన్నది స్పష్టమవుతోంది.

వివేకాను హత్య చేసిన తరువాత ఆయన నివాసంలో కొన్ని ఆస్తి పత్రాలు, రౌండ్‌ సీల్‌ కోసం హంతకులు వెదికారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అంటే వివేకా తన రెండో భార్యకు రాసిచ్చిన ఆస్తి పత్రాలను ఆ ఇంటి నుంచి తీసుకువెళ్లారన్నది సుస్పష్టం. వివేకా లేకపోతే ఆస్తి మొ­త్తం దక్కడంతోపాటు రాజకీయ వారసత్వం కూడా తమకే వస్తుందన్న ఉద్దేశం ఆయన బావమరిది, అల్లుడికి ఉందన్నది స్పష్టమైంది. 

లేఖను దాచిందీ మీరే.. గుండెపోటు ప్రచారం చేసిందీ మీరే 
ఇన్ని విషయాలు రెండేళ్లుగా మాట్లాడుతున్న సునీత.. వైఎస్‌ వివేకా గుండె పోటుతో మరణించారనే ప్రచారం ఎలా వచ్చిందో మాత్రం చెప్పరు. ఎందుకంటే ఆయన గుండెపోటుతో చనిపోయారన్న ప్రచారం వెనుక సునీత, నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డే ఉన్నారు. వివేకా రాసిన లేఖను కూడా దాచిపెట్టి ఆ ప్రచారాన్ని వ్యాప్తిలోకి తెచ్చారు. శివప్రకాశ్‌ రెడ్డే మొదటగా ఆదినారాయణరెడ్డికి ఫోన్‌ చేసి వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని చెప్పారు. అదే విషయాన్ని ఆదినారాయణ రెడ్డి మీడియాకు వెల్లడించారు. దాంతో వివేకా గుండెపోటుతో మరణించారనే అసత్య సమాచారం బయటకు వచ్చింది.

టీవీ చానళ్లలో ప్రసారమైంది. ఆ ప్రచారాన్ని కొనసాగించేందుకు వివేకా రాసిన లేఖను కుమార్తె, అల్లుడు రహస్యంగా ఉంచారు. ఆ లేఖను మొదటగా ఆరోజు ఉదయం 6.10 గంటలలోపే చూసిన ఆయన పీఏ కృష్ణారెడ్డి ఆ విషయాన్ని సునీత భర్త రాజశేఖరరెడ్డికి చెప్పారు. తాము వచ్చే వరకు ఆ లేఖ, వివేకా సెల్‌ఫోన్‌ను ఎవరికి ఇవ్వకుండా దాచి ఉంచాలని రాజశేఖరరెడ్డి ఆయనతో చెప్పారు. ఆ లేఖను వెంటనే పోలీసులకు అప్పగించమని వారు చెప్పి ఉంటే వివేకాని హత్య చేశారన్న విషయం వెంటనే అందరికీ తెలిసిపోయేది. కానీ  లేఖను ఉద్దేశపూర్వకంగానే గోప్యంగా ఉంచారు.

ఆరోజు మధ్యాహ్నం 12 గంటల  సమయంలో పులివెందుల చేరుకున్న సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డికి ఆ లేఖను, సెల్‌ఫోన్‌ను కృష్ణారెడ్డి ఇచ్చారు. వారు ఆ లేఖను చదివిన వెంటనే అయినా దాన్ని పోలీసులకు ఇచ్చారా అంటే అదీ లేదు. సునీత ఆదేశాలతో సాయంత్రం 5 గంటలకు కృష్ణారెడ్డి ఆ లేఖ, సెల్‌ఫోన్‌ను పోలీసులకు ఇచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement