చంద్రబాబు డైరెక్షన్‌.. నర్రెడ్డి సునీత యాక్షన్‌ | KSR Reaction On Sunita Sensational Comments | Sakshi
Sakshi News home page

చంద్రబాబు డైరెక్షన్‌.. నర్రెడ్డి సునీత యాక్షన్‌

Published Mon, Mar 4 2024 12:02 PM | Last Updated on Mon, Mar 4 2024 4:03 PM

KSR Reaction On Sunita Sensational Comments - Sakshi

ఎన్నికల వేళ.. తెరపైకి వివేకా కేసు

చంద్రబాబు డైరెక్షన్‌లో జరుగుతోన్న మైండ్‌గేమ్‌

పావులుగా సునీత, షర్మిల

'మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టి మాట్లాడిన తీరు, ఆ సందర్భంగా తెలుగుదేశం పార్టీలోని వారికి, చివరికి పార్టీ ఆఫీస్ అటెండర్ స్థాయి ఉండే  నేతలకు సైతం ఆమె ధన్యవాదాలు తెలియచేసిన వైనం, అలాగే ఆ మీడియా సమావేశానికి హాజరైన ప్రతినిధులు కేవలం టీడీపీకి ఉపయోగపడే ప్రశ్నలు వేసిన పద్ధతి.. ఇవన్నీ గమనిస్తే ఒక విషయం అర్థం అవుతుంది. సునీత కేవలం తన తండ్రి హత్య కేసు గురించి కన్నా, తెలుగుదేశం పార్టీకి ఏ రకంగా ఉపయోగపడాలన్న లక్ష్యంతోనే మాట్లాడారని తేలిపోతుంది. ఈనాడు పత్రికలో సునీత మీడియా సమావేశం వార్తను ఒక పేజీన్నర ప్రచురించారు. ఆ మొత్తం చదివితే ఆమె తెలివితక్కువగా చేసిన ప్రకటనలను ఎడిట్ చేసి పాఠకులను మోసం చేశారన్న సంగతి  అర్ధం చేసుకోవచ్చు.'

తన తండ్రి హత్య జరిగిన తర్వాత సునీత మాట్లాడిన మాటలకు, ఇప్పుడు చెబుతున్న అంశాలకు మధ్య ఎంతో తేడాను మనం గమనించవచ్చు. సునీత ఒక రాజకీయ దురుద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై మాట్లాడుతున్నట్టు వినగానే మనకు అర్థమవుతుంది. వివేకా హత్య కేసు ఇప్పటికే తెలంగాణలోని సీబీఐ కోర్టులో విచారణలో ఉంది. దీనిలో ఏపీ ప్రభుత్వం జోక్యం చేసుకునే పరిస్థితి ఉండదు. కడప ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రితో పాటు మరికొందరు జైలులో ఉన్నారు. సీబీఐ చార్జీషీట్ కూడా దాఖలు చేసింది. ఇక జరగవలసింది కోర్టు విచారణ మాత్రమే. దీనికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఏమి సంబంధం ఉంది? తనవద్ద ఆధారాలు లేవంటూ చెబుతూనే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విచారణ జరపాలని కోరడం వింత విడ్డూరంగా కనిపిస్తోంది.

ఎవరైనా ఒక మాట చెబితే అందులో విశ్వసనీయత ఉండాలి. ఒక చిత్తశుద్ది ఉండాలి. కానీ సునీత మాత్రం ఎందుకో తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు కొందరు చూపుతున్న ప్రలోభాలకు లొంగి, వారు మాట్లాడమన్నట్లు మాట్లాడుతూ, వారు చెప్పినట్లు చేస్తున్నారన్న అభిప్రాయం కలుగుతోంది. ఈ మొత్తం వ్యవహారం చూస్తే ఆమెకు తన తండ్రి ప్రతిష్ట కన్నా, తనకు, తన భర్తకు ఏదో రాజకీయ పదవి కోసం పాకులాడుతున్నారన్న సందేహం వస్తుంది. అంతేకాక వివేకా హత్య కేసులో రెండో కోణంగా ఉన్న ఆయన వ్యక్తిగత జీవిత రహస్యాలను బహిర్గతం అవుతున్నా ఆమె ఫీల్ అవుతున్నట్లు కనిపించడం లేదు! తన తండ్రితో ఐదేళ్లుగా అంతగా సునీతకు సత్సంబంధాలు లేవని చెబుతున్నారు. అది నిజమా? కాదా? తండ్రి మరో మహిళను రెండో వివాహం చేసుకున్నారన్నది వాస్తవమా? కాదా? వారికి పుట్టిన బిడ్డకు ఆస్తి ఇవ్వకుండా సునీత అడ్డుపడే యత్నం చేశారన్నది కరెక్టా? కాదా?

వివేకా హత్య జరిగినప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబు ప్రభుత్వమే కదా! ఆ రోజుల్లో ఏ మాత్రం ఆధారం దొరికినా ఎంపీ అవినాశ్ రెడ్డిపైన కేసు పెట్టేవారు కదా! అప్పుడు ఎందుకు అలా చేయలేకపోయారో చంద్రబాబును సునీత ఎందుకు ప్రశ్నించలేదు? ఆనాడు టీడీపీ నేతలు ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవిలపై ఆరోపణలు చేసిన ఆమె ఎందుకు వారితో రాజీపడిపోయారు? అసలు వివేకాను తానే హత్య చేశానని చెబుతున్న దస్తగిరిని మాత్రం సునీత ఎందుకు రక్షిస్తున్నారు? అతనికి బెయిల్ వచ్చేందుకు ఎందుకు సహకరిస్తున్నారు? వివేకాను చంపినవారినే తన వద్ద పెట్టుకుని, ఇంకెవరిపైనో ఆరోపణలు చేయడం రాజకీయం కాకుండా ఉంటుందా? ఆమె తండ్రిపట్ల ఏ మాత్రం అభిమానం ఉన్నా ఇలా చేయగలుగుతారా? తన తండ్రి హత్య జరిగి ఐదేళ్లయినా విచారణ ఎందుకు పూర్తి కాలేదని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలోనే ఆమె దుర్బుద్ధి కనబడుతోంది.

ఆమె కేంద్రాన్ని, భారతీయ జనతా పార్టీని లేదా సీబీఐని కదా అడగాల్సింది? లేదా హత్య జరిగిన సమయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబును విచారణ ఎందుకు పూర్తి కాలేదని అడగాలి కదా! హంతకులు పాలకులుగా ఉండరాదని ఆమె అంటున్నారు. అది నిజమే. అందుకే చంద్రబాబు ప్రభుత్వాన్ని అప్పట్లో ప్రజలు ఓడించారని అనుకోవాలి కదా! పార్టీలకు అతీతంగా మద్దతు ఇవ్వాలని కోరుతూ తన అన్నకు ఓటు వేయవద్దని అంటున్నారంటేనే ఆమె ఎజెండా తెలిసిపోతుంది! వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నుంచి ఆమె గానీ, ఆమె కుటుంబం కానీ ఏదో ఆశించి ఉండాలి. అది నెరవేర్చడానికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధపడి ఉండకపోవచ్చు. ఆ కోపంతో టీడీపీ రాజకీయ ట్రాప్‌లోకి వెళ్లి, ఆ పార్టీ వారు సమకూర్చిన లాయర్ల సహకారంతో రకరకాల పిటిషన్‌లు వేసి ఇన్నాళ్లు సునీత కథ నడిపించారనిపిస్తుంది. వివేకా రాసిన లేఖను సునీత, ఆమె భర్త ఎందుకు దాచి ఉంచారు? బయటపెట్టొద్దని ముందే ఎందుకు హెచ్చరించారు.? ఈ విషయాలను కూడా సునీత ఎప్పుడూ బయటపెట్టలేదు.

ఈమె మాదిరే సొంత చెల్లెలు షర్మిల కుటుంబం కూడా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నుంచి ఏదో ఆశించిందని, కానీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అంగీకరించలేదని, తత్ఫలితంగానే ఆమె కూడా ఇదే రీతిలో రోడ్డెక్కి రాజకీయం చేస్తున్నారని తెలంగాణ వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపించారు. ఇక్కడ ఒక విషయం అంగీకరించాలి. తన చెల్లెళ్లను వదలుకోవడానికి అయినా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధపడ్డారు తప్ప, ప్రజా ధనాన్ని, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయడానికి ఒప్పుకోలేదన్న విషయం స్పష్టంగా బోధపడుతుంది. ఇక ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి టీడీపీ మీడియా ప్రతినిధులు హాజరై వారికి కావాల్సిన ప్రశ్నలు వేసినట్లు ఇట్టే కనిపెట్టేయవచ్చు. వాటిలో కొన్నింటిని గమనించండి..

  • మీ నాన్న హత్య కేసులో నిందితులను రక్షించడానికే వైఎస్‌ జగన్‌ పరిమితం అయ్యారు. ఇందులో ఆయన పాత్ర కూడా ఉందని అనుమానిస్తున్నారా?
  • అవినాశ్‌కు హైకోర్టు ఇచ్చిన బెయిల్‌పై సీబీఐ సుప్రింకోర్టుకు ఎందుకు వెళ్లలేదు?
  • హత్యకు ఏ ఆయుధం ఉపయోగించింది? జగనే ఎలా చెప్పగలిగారని అనుకుంటున్నారు?
  • అవినాశ్ రెడ్డిని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎందుకు కాపాడుతున్నారు?

తెలుగుదేశం ఏ ఆరోపణలు చేస్తుంటుందో వాటినే  ప్రశ్నలుగా మలిచి ఈ మీడియా ప్రతినిధులు వేశారంటేనే వీరందరి రాజకీయ లక్ష్యం తెలుసుకోవచ్చు.

అదే కాదు, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, రఘురామకృష్ణరాజుతో సహా పలువురు చోటా, మోటా టీడీపీ లీడర్లకు సైతం సునీత  కృతజ్ఞతలు చెబితే, దానిని మాత్రం ఈనాడులో ఎడిట్ చేశారు. ఆ పాయింట్ వల్ల టీడీపీకి నష్టం కలుగుతుందని ఈనాడు రామోజీరావు భావించడమే అని వేరే చెప్పనవసరం లేదు. ఏతావాతా వీటన్నిటిని గమనిస్తే ఒక విషయం బోధపడుతుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన స్కీములు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఆయుధాలుగా మార్చుకుని ప్రజల మద్దతుతో ఎన్నికల యుద్ధంలో పాల్గొంటుంటే, చంద్రబాబు మాత్రం తన ఆయుధాలుగా పవన్ కళ్యాణ్, షర్మిల, సునీత, రఘురామకృష్ణరాజు, లాయర్లను మార్చుకుని కోర్టుల ద్వారా యుద్ధం చేయాలని భావిస్తున్నారు. ఆ ప్రక్రియలో సునీత కూడా ఒక భాగమే అని తేలడం లేదూ!.


– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement