త్రీమంకీస్ - 80 | malladi special story | Sakshi
Sakshi News home page

త్రీమంకీస్ - 80

Published Tue, Jan 6 2015 11:21 PM | Last Updated on Sat, Sep 2 2017 7:19 PM

త్రీమంకీస్ - 80

త్రీమంకీస్ - 80

డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 80
మల్లాది వెంకటకృష్ణమూర్తి
 
 ‘‘మీకే పేరు ఇష్టమైతే అదే నా పేరు. బై.’’
 ఆమె సెల్‌ఫోన్ లైన్ కట్ చేసి ఆ యువకుడికి ఇచ్చి చెప్పింది - ‘‘సమయానికి మీరు సహృదయంతో ఈ సహాయం చేయకపోతే ఓ విమానం గాల్లోకి లేచేది కాదు. థౌజండ్ అండ్ ఒన్ థాంక్స్.’’
 ‘‘నో ప్రాబ్లం. థౌజండ్ సరే. ఒన్ దేనికి?’’ అతను అడిగాడు.
 ‘‘ఒన్ ఫోన్‌ని ఇచ్చినందుకు. థౌజండ్ మీ అమ్మకి. ఇంత అందమైన అబ్బాయిని ప్రపంచానికి ఇచ్చినందుకు. సేఫ్ లేండింగ్.’’
 ‘‘మీ సెల్ నంబర్?’’ అతను మురిసిపోతూ అడిగాడు.
 కుడి ముంజేతి మీద రాసుకున్న ఫోన్ నంబర్ని చెప్పింది. అది ఇందాక బాంబు ఉందని చెప్పడానికి ఆమె ఓ ప్రయాణీకుడి నించి తీసుకున్న మొబైల్ నంబర్.
 అతను లోపలకి వెళ్ళగానే చాటునించి చూసే మరో ఇద్దరు అమ్మాయిలు ఆమె దగ్గరకి వచ్చారు. వాళ్ళవంక చూసి మినీ స్కర్ట్ అమ్మాయి థంప్స్ అప్ సైన్‌ని చూపించింది.
   
 ‘‘దుర్మార్గులు! ఎవరా ఫోన్ చేశారో?’’ కపీష్ వానర్‌తో ఆక్రోశంగా అన్నాడు.
 ‘‘వాళ్ళకి మూడు కానుపుల్లో ట్రిప్‌లెట్స్ పుట్టాలి అని నా శాపం’’ వానర్ కోపంగా చెప్పాడు.
 ‘‘మేమే.’’
 ముగ్గురూ ఆ ఆడకంఠం వినపడ్డ వైపు వెనక్కి తిరిగి చూశారు. స్తంభం పక్కనించి మూడు తలలు ఒకదాని తర్వాత మరొకటి బయటకి వచ్చి వీరి వంక చిరునవ్వుతో తొంగి చూడసాగాయి.
 ‘‘అరె! మీరా?’’ మర్కట్ నివ్వెరపోయాడు.
 ‘‘మేమే. మాకు ఎందుకు చెప్పలేదు?’’ డాక్టర్ మూలిక ప్రశ్నించింది.
 ఆమె ధరించిన టి షర్ట్ మీద ఐ ఏమ్ ఏ సెక్స్ ఇన్‌స్ట్రక్టర్. ఫస్ట్ లెసన్ ఫ్రీ అని రాసి ఉంది.
 ‘‘ఓ ఆడదాని చెవిలో చెప్పింది వంద మైళ్ళ దూరంలో కూడా వినిపిస్తుందని.’’
 ‘‘ముగ్గురు ట్రిప్‌లెట్స్ పుట్టడం ఏమిటి? నీ శాపం మాకు అర్థం కాలేదు’’ డాక్టర్ మూలిక మళ్ళీ ప్రశ్నించింది.
 ‘‘అదా? మూడు కానుపుల్లో ముగ్గురు చొప్పున పుడితే ప్రతీ కానుపు తర్వాత వారానికి నూట డబ్బై ఐదు నేపీలు మార్చాలి. ప్రతి రాత్రి తలకో బాటిల్ చొప్పున వారానికి ఇరవై బాటిల్స్ పాలు కలపాలి. ప్రతి కానుపు తర్వాత వాళ్ళు ఇలా కష్టపడాలి... మీరేంటి? అసలు ఇక్కడ ఎందుకు ఉన్నారు?’’
 ‘‘మాకు చెయ్యిచ్చి పారిపోతూంటే ఆపడానికి వచ్చాం’’ రుధిర కోపంగా చెప్పింది.
 ‘‘అసలు మేమీ విమానంలో వెళ్తున్నామని నీకు ఎవరు చెప్పారు?’’ కపీష్ నిర్ఘాంతపోయాడు.
 ‘‘నేనే కనుక్కున్నాను. ఆటోలోంచి దిగి ఏ బేంక్‌లోకి వెళ్ళి వచ్చారో అదే బేంక్ దోచుకోబడుతోందని టీవీలో చూడగానే మాకు మీ పథకం అర్థమైంది. రావణ్ మిమ్మల్ని చంపి పారేస్తాడు కాబట్టి మీరు పారిపోతారని ఊహించాను. డబ్బుంది కాబట్టి విమానంలోనే పారిపోతారన్న వైతరణి ఊహ కరెక్ట్ అయింది. ఇక్కడ ఉదయం నుంచి మీ కోసం మాటేశాం. ఆడది ఈ ప్రపంచంలో అత్యంత సెల్ఫ్ కంట్రోల్డ్, వెల్ మేనర్డ్, అన్‌డిస్టర్బ్‌డ్, నాన్ వయోలెంట్ హ్యూమన్ బీయింగ్- ఆమె నెయిల్ పాలిష్ ఆరే దాకా. నా నెయిల్ పాలిష్ ఆరగానే వీళ్ళకి మీరు ఎక్కిన విమానంలో బాంబుందని ఫోన్ చేసి మిమ్మల్ని ఆపేశాను’’ రుధిర చెప్పింది.
 ముగ్గురు మిత్రుల మొహాలు వెంటనే పాలిపోయాయి.
 ‘‘అంతేకాదు, ఏ డబ్బు మీద ప్రేమతో మా ప్రేమని కాదని మమ్మల్ని విడిచి వెళ్ళిపోవాలని అనుకున్నారో ఆ డబ్బుని మీకు కాకుండా చేశాం’’ వైతరణి చెప్పింది.
 ఆమె ధరించిన టీ షర్ట్ మీద ఓనర్స్ ప్రైడ్. నైబర్స్ ఎనిమీ అని రాసి ఉంది.
 ‘‘బదులుకి బదులు. ఇక మీకూ, మాకూ రాం రాం’’ డాక్టర్ మూలిక చెప్పింది.
 ‘‘ఇంక మీ జీవితం వైన్ అండ్ విమెన్ నించి వాటర్ అండ్ వైఫ్ స్థాయికి పడిపోయింది’’ వైతరణి చెప్పింది.
 ‘‘ఎందుకిలా చేసారు? మాతో మీ ఇమోషనల్ అటాచ్‌మెంట్ ఏమైంది?’’ డాక్టర్ మూలిక దుఃఖంగా ప్రశ్నించింది.
 ‘‘ఎటాచ్‌మెంటా? అదేమిటో నీకు అసలు అర్ధం తెలిేన మాట్లాడుతున్నావా? ఇద్దరూ ఒకర్నొకరు చూసుకోకుండా ఉండలేకపోవటం అటాచ్‌మెంటా? కాదు. ఇద్దరూ ఒకరి సమీపంలో మరొకరు లేకుండా ఉంటే ఊపిరి ఆడకపోయినట్లు ఉండటం అటాచ్‌మెంటా? కాదు. ఇద్దరు పెళ్ళవకుండా సెక్స్‌లో పాల్గొనడం అటాచ్‌మెంటా? కాదు. ఎన్నటికీ కానే కాదు. ఎవరైనా నీకో ఫైల్‌ని ఈమెయిల్ చేస్తే ఉత్తరంతో పాటు వచ్చే ఆ ఫైల్‌ని అటాచ్‌మెంట్ అంటారు’’ వానర్ చెప్పాడు.
 ‘‘మీరు చేసింది అన్యాయం’’ కపీష్ ఆక్రోశించాడు.
 ‘‘డోంట్ బ్రేక్ మై హార్ట్ అని ఎప్పుడో నిన్ను వారించాను కప్. నా గుండెని బద్దలు కొట్టినందుకు బదులుగా నీకున్న రెండు వందల ఆరు ఎముకల్లో ఒకదాన్నైనా బ్రేక్ చేసే ఏర్పాటు చేయనందుకు సంతోషించు’’ రుధిర క్రోధంగా చెప్పింది.
 ‘‘రేపు దినపత్రికలో బేంక్ సొమ్ము పట్టుబడిందన్న వార్త వస్తుందని పందెం’’ వైతరణి నవ్వుతూ చెప్పింది.
 ‘‘అంటే మా డబ్బుని పట్టించడానికేనా బాంబ్ ఉందనే అబద్ధపు ఫోన్ కాల్ చేసింది?’’ వానర్ అడిగాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement