త్రీమంకీస్ -77 | malladi special story | Sakshi
Sakshi News home page

త్రీమంకీస్ -77

Published Sun, Jan 4 2015 12:07 AM | Last Updated on Sat, Sep 2 2017 7:10 PM

త్రీమంకీస్ -77

త్రీమంకీస్ -77

డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 77
 మల్లాది వెంకటకృష్ణమూర్తి
 
 ‘‘ఇక నుంచి నేను రోజుకో టూత్ బ్రష్‌ని వాడదలచుకున్నాను. డ్రాయర్, బనీన్లని కూడా. మిగిలిన డబ్బుతో మినరల్ వాటర్ బాటిల్స్‌ని కొని ఇక ఆ నీళ్ళతోనే స్నానం, తాగడం అన్నీనూ. ఇంట్లోని లైట్లని మాటిమాటికీ వేసి ఆర్పను. వాటన్నిటినీ ఎప్పుడూ వేేన  ఉంచుతాను’’ వానర్ చెప్పాడు.
 ‘‘ఇది వింటే స్వచ్ఛ వీడిని ప్రేమించేది. నువ్వు?’’ కపీష్ ప్రశ్నించాడు.
 ‘‘ఇక నేను దేనికీ బేరం ఆడను. ఏపిల్స్ కొన్నా, ఇల్లు కొన్నా సరే. సగం జీవిత కాలం బేరాలకే సరిపోయింది. చెప్పిన ధరకి కొనేస్తాను. నీ సంగతేమిటి?’’ మర్కట్ అడిగాడు.
 ‘‘నేను మీలా కాదు. గోల్డ్ కంచంలో తిని, గోల్డ్ గ్లాసుతో తాగి, అన్నంలో గోల్డ్ రేకులని వేసుకుని తిని, ఆఖరికి టాయిలెట్ పేపర్ని కూడా గోల్డ్‌తో తయారు చేయించి దాన్నే వాడతాను’’ కపీష్ చెప్పాడు.
 వానర్ తనతో తెచ్చుకున్న దినపత్రికలోని ఓ వార్తని చదివి తర్వాత మిత్రులు ఇద్దరికీ ఆశ్చర్యంగా చెప్పాడు.
 ‘‘బేంక్‌కి సొరంగం తవ్వింది దుర్యోధన్. ఆ సంగతి తెలీక వాడి అన్న రావణ్ అదే బేంక్‌లోకి సమయానికి ఆయుధాలతో, తన అనుచరులతో ప్రవేశించాడట.’’
 ‘‘అంటే మనం బేంక్‌లోకి వెళ్ళిన సమయంలో అక్కడ ఉన్నది రావణ్ అన్న మాట!’’
 ‘‘అవును. సిసి కెమేరా ఫుటేజ్‌ని చూసి అతని నడకని బట్టి, ఒడ్డూ పొడుగుని బట్టి పోలీసులు అతన్ని గుర్తించి అరెస్ట్ చేశారట’’ వానర్ చెప్పాడు.
 ‘‘అంటే దుర్యోధన్‌ని పోలీసులు పట్టుకోకపోతే వాడు ఆ సొరంగంలోంచి మన బదులు తన అనుచరులతో వెళ్ళి ఉండేవాడు. వాడు వెళ్తే మనం వెళ్ళలేంగా. అప్పుడు అన్నదమ్ములు ఇద్దరూ బేంక్ సొత్తుని పంచుకునే వారు. అవునా?’’ కపీష్ అడిగాడు.
 ‘‘కాదు. వాళ్ళ మధ్య రక్తపాతం జరిగేదిట. వాళ్ళు ఆజన్మ శత్రువులట’’ వానర్ చెప్పాడు.
 ‘‘దేనికి?’’
  ‘‘వాళ్ళ తండ్రి ఒకరే కాని తల్లులు వేరట. దాయాదులన్నమాట. అందుకని.’’
 ‘‘అంటే పోలీసులు దుర్యోధనుడ్ని పట్టుకుని అన్నదమ్ముల ఇద్దరి ప్రాణాలని కాపాడారన్నమాట!’’ మర్కట్ చెప్పాడు.
 ‘‘అనే ఇందులో రాశారు. అంతేకాదు. బేంక్ సొమ్ము మోసం చేసి దోచుకుపోయిన మనం ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారట. సాక్షులతో మన ఊహాచిత్రాలని గీయించి తెలుసుకుంటారుట’’ వానర్ గొంతు తగ్గించి చెప్పాడు.
 ‘‘తెలుసుకోమను. ఆ సరికి మనం ఇక్కడ ఉండం.’’
 మర్కట్ ఆ పేపర్ అందుకుని ఆ వార్తని చదివి చెప్పాడు.
 ‘‘పోలీసులు ఆ అన్నదమ్ములు ఇద్దర్నీ చెరో జైల్లో పెట్టారుట.’’
 పైలట్ గ్రైప్ షీట్‌ని అందుకుని చదివాడు. అంతకు మునుపు ఆ విమానాన్ని నడిపిన పెలైట్ తను అందులో గమనించిన లోపాలని రాసే షీటే గ్రైప్ షీట్. గ్రౌండ్ స్టాఫ్ దాన్ని చదివి ఆ లోపాలని సవరించాలి. తర్వాత తను హాజరైన లోపాల సర్దుబాటు మీద కామెంట్స్ రాయాలి. పైలట్ అలా రాసిన వాటిని చదివాడు.
 పైలట్: ఆటో లేండింగ్ గేర్ సరిగ్గా పడటం లేదు.
 గ్రౌండ్ మెయిన్‌టెనెన్స్: ఈ విమానంలో ఆటో లేండింగ్ గేర్ లేదు.
 పైలట్: కాక్‌పిట్‌లో ఎలుక ఉంది.
 గ్రౌండ్ మెయిన్‌టెనెన్స్: కాక్‌పిట్‌లో పిల్లిని ఇన్‌స్టాల్ చేశాం.
 పైలట్: విండ్ స్క్రీన్‌లో పగులు ఉన్నట్లు అనుమానంగా ఉంది.
 గ్రౌండ్ మెయిన్‌టెనెన్స్: మీ అనుమానం నిజమే.
 పైలట్: కాక్‌పిట్‌లో ఏదో లూజ్‌గా ఉంది.
 గ్రౌండ్ మెయిన్‌టెనెన్స్: కాక్‌పిట్‌లో ఏదో బిగించాం.
 పైలట్: విండ్‌షీల్డ్ మీద చచ్చిన పురుగులు ఉన్నాయి.
 గ్రౌండ్ మెయిన్‌టెనెన్స్: విండ్‌షీల్డ్ మీదకి బతికున్న పురుగులని ఆర్డర్ చేశాం.
 పైలట్: రేడియో స్విచ్‌లు అంటుకుంటున్నాయి.
 గ్రౌండ్ మెయిన్‌టెనెన్స్: కాక్‌పిట్‌లో ఇక మీదట జామ్ సర్వ్ చేయబడదు.
 పైలట్: కాక్‌పిట్‌లో వింత వాసన.
 గ్రౌండ్ మెయిన్‌టెనెన్స్: మీ పెర్‌ఫ్యూమ్‌ని మార్చండి.
 పైలట్: ఏర్ కండిషన్డ్ మెషీన్ నా భార్యలా అరుస్తోంది.
 గ్రౌండ్ మెయిన్‌టెనెన్స్: విడాకులు రికమెండ్ చేస్తున్నాం.
 పైలట్: ఫ్రిక్షన్ బ్రేక్స్‌ని త్రాటిల్ లివర్ పట్టుకుంటోంది.
 గ్రౌండ్ మెయిన్‌టెనెన్స్: త్రాటిల్ లివర్ చేసే పని అదే.
 పైలట్: రైట్ మెయిన్ లేండింగ్ గేర్‌లో ఏదో కారే సాక్ష్యం ఉంది.
 గ్రౌండ్ మెయిన్‌టెనెన్స్: రైట్ మెయిన్ లేండింగ్ గేర్‌లో ఏదో కారే సాక్ష్యం తొలగించబడింది.
 పైలట్ దాని మీద తన ఇనీషియల్ వేసి సంతకం చేసి విమానం ఇంజన్లని స్టార్ట్ చేయసాగాడు. అకస్మాత్తుగా అతనికి కంట్రోల్ టవర్ నించి వైర్‌లెస్‌లో ఓ ముఖ్యమైన సమాచారం అందింది.
 (దాని పర్యవసానంగా ఏం జరిగింది?)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement