త్రీమంకీస్ - 79 | malladi special story | Sakshi
Sakshi News home page

త్రీమంకీస్ - 79

Published Mon, Jan 5 2015 11:11 PM | Last Updated on Sat, Sep 2 2017 7:15 PM

త్రీమంకీస్ - 79

త్రీమంకీస్ - 79

డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 79
 మల్లాది వెంకటకృష్ణమూర్తి
 
 ‘‘మన ఎయిర్ బేగ్స్‌ని కూడా తెరిచి చూస్తారంటావా?’’ మర్కట్ సందేహంగా అడిగాడు.
 ‘‘మనం విఐపీలం కాము కాబట్టి తప్పకుండా తెరిచి చూస్తారు. చూడనీ’’ బాత్ రూం నించి తిరిగి వచ్చిన వానర్ చెప్పాడు.
 ‘‘అప్పుడు మనం అంత డబ్బుని ఏ బేంక్ నించి డ్రా చేశామో, లేదా మనకి ఎలా వచ్చిందో ప్రూఫ్ చూపించమంటారు. మనం సరైన వివరణ ఇవ్వకపోతే అంతే సంగతులు. అరెస్ట్ చేస్తారు’’ కపీష్ చెప్పాడు.
 ‘‘అదే నా భయం. ఇప్పుడు మనం ఏం చేయాలి?’’ మర్కట్ ఆందోళనగా అడిగాడు.
 ‘‘మనం ఆ డబ్బుకి నీళ్ళు ఒదలాలా? మనం పడ్డ కష్టమంతా వృథాయేనా?’’ వానర్ ఏడుపు గొంతుతో అడిగాడు.
 ‘‘ఇప్పుడు ఛాయిస్ మనది. డబ్బు ఎటూ మనకి ఇవ్వరు. ఇటు స్వతంత్రం కోల్పోయి ఒన్... టు... త్రి... ఫోర్ అంటూ సెవెన్ దాకా జైలు ఊచలు లెక్కపెట్టాలి. లేదా పారిపోవాలి. నేను అసలా ఊచలనే చూడాలనుకోవడం లేదు. బయకి వెళ్తున్నాను. తర్వాత మీ ఇష్టం’’ కపీష్ చెప్పాడు.
 ‘‘కపీష్ చేసేది తెలివైన పని. పద’’ మర్కట్ సలహా ఇచ్చాడు.
 ‘‘ప్లీజ్ వెయిట్. ఐ ఏమ్ అవుటాఫ్ మైండ్. ఐ విల్ బి బేక్ ఇన్ ఫైవ్ మినిట్స్’’ వానర్ చెప్పాడు.
 వానర్‌ని రెక్క పట్టుకుని ఇద్దరూ లాక్కెళ్ళారు. ముగ్గురూ ఏర్‌లైన్స్ కౌంటర్‌కి వెళ్ళి రిఫండ్ కూపన్స్ తీసుకుని బాధగా బయటకి నడిచారు. వానర్ ఏరో బ్రిడ్జి తలుపు వైపు బాధగా చూశాడు.
 ‘‘ముంబై బౌండ్ పేసెంజర్స్. యువర్ అటెన్షన్ ప్లీజ్... మిస్టర్ కపీష్, మిస్టర్ మర్కట్ అండ్ మిస్టర్ వానర్. దయచేసి వచ్చి మీ తోపు రంగు ఏర్ బేగ్స్‌ని ఐడెంటిఫై చేయ ప్రార్థన’’ ప్రకటన వినిపించింది.
 ‘‘కనుక్కున్నారు. మనం పారిపోవాలి’’ కపీష్ ఆదుర్దాగా చెప్పాడు.
 విమానాశ్రయం బిల్డింగ్‌లోంచి బయటకి వచ్చే దాకా పోలీసులు తమని ఆపి ‘ఇది మీ లగేజేనా?’ అని తమ ఎయిర్ బేగ్స్‌ని చూపిస్తారని ముగ్గురి గుండెలూ దడదడలాడుతూనే ఉన్నాయి. రిఫండ్ కూపన్స్‌ని చూసి కాని సెక్యూరిటీ పోలీసులు వాళ్లని బయటికి పంపలేదు.
 ఆ విమానంలో బాంబ్ ఉందని ఫోన్ చేయడానికి ఉపయోగించిన సెల్ ఫోన్‌లో మాట్లాడే ఇరవై రెండేళ్ళ యువకుడ్ని పోలీసులు నిర్బంధంలోకి తీసుకోవడం వాళ్ళు గమనించారు. వాళ్ళ ప్రశ్నకి ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త కొడుకైన అతను చెప్పిన జవాబు విన్నారు.
 ‘‘ఇందాక ఎవరో అమ్మాయి తన సెల్‌ఫోన్ బేటరీ అయిపోయిందని, నా సెల్‌ఫోన్‌లోంచి ఓ కాల్ చేసుకుంటానంటే ఇచ్చాను. చివరలో నా నంబర్ అడిగి ముంజేతి మీద రాసుకుంది కూడా.’’
 ముగ్గురూ బయటకి వచ్చారు. వానర్ మొహం ఆముదం తాగినట్లుగా ఉంటే, మర్కట్ మొహం పది లంఖణాలు చేసిన వాడిలా ఉంది. కపీష్ మొహం ఎలా ఉందంటే...
 ‘‘ఎక్స్‌క్యూజ్ మీ! ఇంకాసేపట్లో ప్రపంచం అంతం అవుతుందని మీకు ఎవరు చెప్పారు?’’ అనేకమంది అతన్ని ఆపి అడిగారు.
 మూడు ఎయిర్ బేగ్స్‌తో కోటీశ్వరులుగా లోపలకి వెళ్ళిన ఆ ముగ్గురూ ఉత్త చేతులతో బికారులుగా బయటకి వచ్చారు.
   
 ‘‘ఎక్స్‌క్యూజ్ మీ! మీ సెల్‌ఫోన్‌ని ఓసారి ఉపయోగించుకోవచ్చా? నాది బేటరీ డౌన్ అయింది. ఐ మీన్ నాది కాదు. నా సెల్ ఫోన్‌ది. నాది బానే ఉంది’’ మినీ స్కర్ట్, టాప్‌లోని ఓ ఇరవై రెండేళ్ళ అమ్మాయి డిపార్చర్ గేట్ లోపలకి వెళ్తున్న ఓ యువకుడ్ని అడిగింది.
 ఒంటి మీంచి మస్క్ పెర్‌ఫ్యూమ్ వాసన వచ్చే అతని టీ షర్ట్ మీద ‘బ్యూటీ లైన్ ఇన్ ది హేండ్స్ ఆఫ్ బీర్ లవర్’ అనే మాటలు ముద్రించి ఉన్నాయి.
 ‘‘తప్పకుండా. మీకుందో లేదో కాని నాకు నోమో ఫోబియా ఉంది.’’
 ‘‘అంటే?’’
 ‘‘సెల్‌ఫోన్ లేకుండా ఉండటం లేదా సిగ్నల్ ఉండదనే భయం. నాకూ అప్పుడప్పుడూ అలా జరుగుతూంటుంది. అతను చిరునవ్వుతో తన స్మార్ట్ ఫోన్‌ని జేబులోంచి తీసి ఇచ్చాడు.
 ‘‘ఐనా డౌన్ అవడానికి మీ ఒంట్లో బేటరీ లేదుగా. మీ సెల్‌ఫోన్ గురించి కదా మీరు చెప్పింది. ఏమ్ ఐ రైట్?’’ ఆమె నవ్వుతూ అడిగింది.
 ‘‘ఎస్ అఫ్‌కోర్స్. యు హేవ్ లాట్స్ ఆఫ్ సెన్సాఫ్ హ్యూమర్.’’
 ‘‘పాస్‌వర్డ్?’’
 అతను ఇంగ్లీష్‌లో ఓ అంకె, ఓ బూతు మాట, స్టార్ సైన్‌ని చెప్పాడు. ఆమె ఎడం చేతి ముంజేతి మీద రాసుకున్న ఓ నంబర్ని డయల్ చేసింది. అది నాలుగైదుసార్లు మోగాక అవతల నించి ఓ మగ కంఠం వినిపించింది. ఆమె అతనితో ‘ఎక్స్‌క్యూజ్ మీ’ అని పక్కకి వెళ్ళి చెప్పింది.
 ‘‘హలో. ఇందాక మీకు ఫోన్ చేసి ముంబై ఫ్లైట్‌లో బాంబ్ ఉందని చెప్పింది నేనే. అందులో అస్సలు బాంబ్ లేదు. తమాషాకి అలా ఫోన్ చేశానంతే. పాపం. ఆ విమాన ప్రయాణీకులకి నేను సారీ చెప్పానని చెప్పండి. విమానానికి రైట్ చెప్పండి. మళ్ళీ ఎప్పుడైనా ఇలాగే ఫోన్ చేస్తూంటాలెండి.’’
 ‘‘మీ పేరు?’’
 (ఏమని చెప్పి ఉంటుంది?)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement