త్రీమంకీస్ -78
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 78
- మల్లాది వెంకటకృష్ణమూర్తి
విమానం బయల్దేరబోతున్నట్లుగా ఎయిర్‌హోస్టెస్ ప్రకటన వినిపించింది. కొద్ది నిమిషాలకి తర్వాత విమానం స్టార్ట్ అయిన చప్పుడు వినిపించింది.
‘‘నలభై వేల అడుగుల ఎత్తున, గంటకి ఏడు వందల మైళ్ళ వేగంతో దూసుకుపోయే కోటి అరవై లక్షల డాలర్లు ఖరీదు చేసే ఈ విమానంలోని ప్రయాణీకులు ఏం తాగాలి? షాంపేన్. ఏం తినాలి? జీడిపప్పు పకోడీలు. కాని మనం ఏం సర్వ్ చేస్తాం? డైట్ పెప్సీ, సాల్టెడ్ పీనట్స్.’’ ప్రకటన ముగించాక ఓ ఏర్ హోస్టెస్ మరో ఏర్ హోస్టెస్‌కి చెప్తూండగా ఇంటర్ కం మోగింది. అవతల నించి పైలట్ కంఠం ఆదుర్దాగా వినిపించింది.
‘‘మనం కొద్దిసేపట్లో వైర్‌లెస్ అవబోతున్నాం’’ కపీష్ ఉత్సాహంగా చెప్పాడు.
‘‘నేను విమానం దిగాక ఇక ఆకాశంలో ఎగిరే పక్షుల వంక అసూయగా చూడను’’ వానర్ ఆనందంగా కిటికీలోంచి చూస్తూ చెప్పాడు.
కాని అది ముందుకి కదలకుండానే ఇంజన్లు ఆగిపోయాయి. మళ్ళీ ఎయిర్ హోస్టెస్ కంఠం ఇంగ్లీష్‌లో వినిపించింది - ‘‘లేడీస్ అండ్ జెంటిల్‌మెన్. వి ఆర్ సారీ. యాంత్రిక లోపం వల్ల షెడ్యూల్ ప్రకారం ఈ విమానం టేకాఫ్ కావడం లేదు.’’
‘‘ఛ! మొదటిసారి విమానం ఎక్కితే నాకు ఇలా అవాలా?’’ మర్కట్ చెప్పాడు.
‘‘... దయచేసి ప్రయాణీకులంతా బయటకి వచ్చి డిపార్చర్ గేట్‌లో కూర్చుని మా తర్వాతి ప్రకటన కోసం ఎదురుచూడండి. మీ కేరీ ఆన్ లగేజ్‌ని విమానంలోనే వదిలి వెళ్ళండి.’’
‘‘ఇప్పుడేం చేద్దాం?’’ వానర్ అడిగాడు.
‘‘ఇదే’’ కపీష్ లేచి చెప్పాడు.
అందరూ లేచి ఓవర్‌హెడ్ లాకర్లోని తమ లగేజ్‌ని తీసుకోబోతే ఎయిర్ హోస్టెస్‌లు వారిని వద్దని వారించారు. కపీష్ ఎయిర్ హోస్టెస్‌ని తమ ఎయిర్ బేగ్స్ ఇవ్వమని అడిగితే ఆమె చెప్పింది.
‘‘కొద్ది నిమిషాలే ఆలస్యం. మళ్ళీ ఇదే విమానంలో మీరు ముంబై వెళ్తారు. సామాను తీసుకోవడం, పెట్టడం వల్ల ఆలస్యం పెరుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో హేండ్ లగేజ్‌ని ఉంచే వెళ్ళాలి’’ ఆమె చెప్పింది.
‘‘దీసీజ్ టెరిబుల్.’’
‘‘ఐ కాంట్ బిలీవ్ ఇట్.’’
‘‘దిస్ ఆల్వేస్ హేపెన్స్ వెన్ ఐ యాం ఎబోర్డ్.’’
‘‘వై డోంట్ దే చెక్ ఎహెడ్?’’
ప్రయాణీకుల రకరకాల కామెంట్స్ మధ్య ముగ్గురు మిత్రులూ ఏరోబ్రిడ్జ్ మీదుగా మళ్ళీ డిపార్చర్ గేట్‌కి చేరుకున్నారు.
‘‘ఒకందుకు నాకు సంతోషంగా ఉంది’’ వానర్ చెప్పాడు.
‘‘ఇంత జరిగితే సంతోషమా? దేనికి?’’ మర్కట్ అడిగాడు.
‘‘నా కాళ్ళు భూమిని తాకుతున్నందుకు’’ వానర్ జవాబు చెప్పాడు.
ఆలస్యానికి కొందరు రిఫండ్ అడిగితే వారికి అక్కడి ఉద్యోగిని ఓచర్స్ ప్రింటౌట్లని ఇవ్వసాగింది. పావు గంటైంది. అరగంటైంది. ఐనా మళ్ళీ ప్రకటన లేదు.
‘‘ఇంకెంతసేపు?’’ ఒకరు గేట్ ఏజెంట్‌ని కోపంగా అడిగాడు.
‘‘మాకూ తెలీదు. చెప్పడం కష్టం.’’
‘‘ఎందుకు చెప్పలేరు? ముప్పావు గంట దాటింది. నేను బరోడాకి కనెక్టింగ్ ఫ్ల్లైట్ పట్టుకోవాలి.
అసలు సమస్య ఏమిటి?’’ అతను నిగ్గదీశాడు.
‘‘ఆలస్యం అని మీరు ఫిర్యాదు చేస్తున్నారు. ఒకప్పుడు హైద్రాబాద్ నించి బాంబేకి వెళ్ళడానికి తొంభై రోజులు పట్టేది. దారిలో ఒకరిద్దరికి కానుపులు అయ్యేవి. ఒకరిద్దరు గర్భవతులే అయ్యేవారు. అక్కడికి చేరుకునేసరికి ఒకరిద్దరు మరణించేవారు. ఇప్పుడో? ఓ సినిమాని సగం చూసే టైంలోనే విమానం దిగిపోయి ఇంటికి చేరుకుంటున్నారు. నలభై నిమిషాలు ఆలస్యం అయితే భరించలేరా?’’
‘‘ప్లీజ్. కారణం నాకు చెవిలో చెప్పండి’’ వానర్ ఆమెని అడిగాడు.
‘‘జస్ట్ మెకానికల్ ప్రాబ్లం’’ ఆమె బయటకే చెప్పింది.
పోలీస్ కుక్కతో ఇద్దరు పోలీసులు విమానంలోంచి బయటకి రావడం గమనించిన వానర్ అకస్మాత్తుగా బాత్‌రూంలోకి పరిగెత్తాడు.
‘‘అసలు సమస్య ఏమిటి? పోలీసులు ఎందుకు వచ్చారు?’’ కపీష్ ఆమెని అడిగాడు.
ఆమె ఇటు చూసి గొంతు తగ్గించి అతని చెవిలో చెప్పింది.
‘‘విమానంలో బాంబ్ ఉందని బెదిరింపు కాల్ వచ్చింది. హేండ్ లగేజ్‌లో ఉందేమోనని పోలీస్‌లు, బాంబ్ డిస్పోజల్ స్క్వేడ్ వాళ్ళు తనిఖీ చేస్తున్నారు. అది పూర్తవగానే విమానం బయలు దేరుతుంది. సాధారణంగా ఫోన్ కాల్ బెదిరింపుల్లో ఇంత దాకా ఎలాంటి బాంబ్‌లూ దొరకలేదు. ఎవరో పోకిరీ వాళ్ళు ఇలాంటి కాల్స్ చేస్తూంటారు.’’
‘‘పోకిరీ వాళ్లైతే మరి వెళ్ళచ్చుగా? దింపేశారే?’’
‘‘ఫోన్ కాల్ వచ్చినప్పుడు మేం తప్పనిసరిగా చెక్ చేయాలి. అది రికార్డ్ అవుతుంది. లగేజ్‌ని కూడా చెక్ చేస్తారు. అది సాధారణ జాగ్రత్త. చెకింగ్ పూర్తవగానే విమానం బయలు దేరుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే హేండ్ లగేజ్ అంతా తెరిచి చూడటానికి టైం పడుతుంది. అందుకే ఎక్కువమంది ఆ పని చేస్తున్నారు’’ ఆమె చెప్పింది.
కపీష్, మర్కట్‌లు వెంటనే పక్కకి వెళ్ళి చెవులు కొరుక్కున్నారు.
మళ్లీ రేపు
ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్,
సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 3ఝౌజుజ్ఛీట.ట్చజుటజిజీఃజఝ్చజీ.ఛిౌఝ
లెటర్స్
The story is awesome. The characters are awesome. Excellent selection by the editor. Thanks to MALLADI garu and SAKSHI. - vijay bhaskar (vijay.bhaskar161995@gmail.com)
పాఠకులకు ఆహ్వానం!
‘ఈ కాలమ్ మీదే’ అనే కొత్త చర్చావేదికను సాక్షి ‘ఫ్యామిలీ’ త్వరలో ప్రారంభించబోతోంది. చర్చనీయాంశం మీ ఇష్టం. ఏ సామాజిక అంశాన్నయినా, ఆలోచననైనా మీరు చర్చకు పెట్టొచ్చు. మీ వాదనను వినిపించవచ్చు. దానిని ఫ్యామిలీ ప్రచురిస్తుంది. దానిపై మిగతా పాఠకులనూ చర్చకు ఆహ్వానిస్తుంది. వెంటనే రాసి పంపండి. చర్చలో పాల్పంచుకోండి. మీ చర్చనీయాంశం పంపవలసిన చిరునామా: ‘ఈ కాలమ్ మీదే’ సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 ఇ-మెయిల్: sakshireaders@gmail.com