త్రీమంకీస్ - 83 | malladi special story | Sakshi
Sakshi News home page

త్రీమంకీస్ - 83

Published Fri, Jan 9 2015 11:15 PM | Last Updated on Sat, Sep 2 2017 7:27 PM

త్రీమంకీస్ - 83

త్రీమంకీస్ - 83

డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 83
మల్లాది వెంకటకృష్ణమూర్తి
 
 ‘‘దేవుడంటే ప్రేమ. ప్రేమ గుడ్డిది. మా తాతయ్య గుడ్డివాడు. కాబట్టి ఆయనే దేవుడు. నీకో సత్యం చెప్తా. ఎవరికీ చెప్పక. దేవుడు లేకపోతే నాస్తికుడే ఉండడు.’’
 ‘‘అది సరే. ఈ రోజు నా జీవితంలో చాలా చెడ్డరోజు. మీరు కొద్దిగా...’’
 ‘‘పిచ్చివాడా! చెడ్డ రోజనేదే నీ జీవితంలో ఇంతదాకా రాలేదు. అది వచ్చిన రోజు నువ్వుండవు. ఎందుకంటే నువ్వుండటం ఆగిన రోజే నీకు చెడ్డ రోజు.’’
 ‘‘ఇప్పుడు నాకో సమస్య ఉంది. మీరు కొద్దిగా సహాయం చేేన్త...’’ మర్కట్ అర్థించాడు.
 ‘‘... దేవుడితో నీకో సమస్య ఉందని చెప్పక. సమస్యకి నీకో దేవుడు ఉన్నాడని చెప్పు చాలు. నీకో ఆఖరి సందేశం. జననం - మరణం ఆనందకరమైనవి. ఆ మధ్యదే బాధాకరం. అందువల్ల హరిః ఓం’’ చెప్పి ఆయన వెళ్ళిపోయాడు.
 ‘‘జరిగినదానికి బాధపడకుండా ఆనందంగా ఉండండి’’ వానర్ కన్నీళ్ళని చూసి చెప్పాడు కపీష్.
 ‘‘పోయింది. ఆరు కోట్లు. అదెలా సాధ్యం బ్రదరూ? ఎవరి దగ్గరైనా చాక్లెట్ ఉందా?’’
 ‘‘ఏం?’’
 ‘‘అది తింటే ఆనందంగా ఉంటారని కేడ్‌బనీస్ ప్రకటనలో చూశాను’’ కన్నీళ్ళని తుడుచుకుంటూ వానర్ అడిగాడు.
 ‘‘వెనకటికి ఒకడికి లేండ్ ఫోన్ లేదు. స్మార్ట్ ఫోన్ కొంటానన్నాట్ట’’ కపీష్ విసుక్కున్నాడు.
 ‘‘నీకూ, నీళ్ళకి ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్లుంది. భయం వేస్తే నీకు నీళ్ళు కింద నించి, దుఃఖం వేస్తే పైనించి వస్తాయన్నమాట’’ మర్కట్ విసుక్కున్నాడు.
 ‘‘నాకు అర్జెంట్‌గా ‘హాఫ్ సర్కిల్ ఒన్ సర్కిల్ హాఫ్ సర్కిల్ ఏ. హాఫ్ సర్కిల్ ఒన్ సర్కిల్ రెక్టాంగిల్ ఏ’ తాగాలని ఉంది. అంతే కాదు. మన ముగ్గురి జీవితాలని ఎడిట్ చేయాలనిపిస్తోంది. ఒకడి ప్రియురాలు కుక్క ప్రేమికురాలు. ఇంకొకడి ప్రియురాలు మగరాయుడు. మరో వెధవకి ఆకులు, అలాలు మాత్రమే ఒండి పెట్టే ప్రియురాలు. నాకు మన జీవితాలు నచ్చడం లేదు. వాటిని వెంటనే ఫోటోషాప్‌లో ఎడిట్ చేసి తీరాలి. మార్ఫింగ్ చేసి తీరాలి’’ వానర్ ఆవేదనగా చెప్పాడు.
 ‘‘ఆనందంగా ఉండేవారు ఆనందంగా ఉండటానికి కారణం వారి జీవితంలో అంతా సరిగ్గా ఉందని కాదు. వారి దృక్పథం సరిగ్గా ఉండటమే కారణం. బానిసత్వం మానవ నిర్మితం తప్ప పేదరికం కాదు. దాన్ని ఎవరికి వారు ప్రయత్నంతో బద్దలు కొట్టాలి. మనం బాధపడటానికి కాని, ఆనందంగా ఉండటానికి కాని పట్టే సమయం, వెచ్చించే పని ఒకటే. ఇండిగో కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఓచర్‌ని కేష్ చేస్తే ఎంత వస్తుందో చూడు. కోకోకోలాని తాగుదాం’’ కపీష్ ధైర్యం చెప్పాడు.
 జేబులోంచి దాన్ని తీసి చూసి ‘థూ’ అంటూ వానర్ దాన్ని చింపి డస్ట్‌బిన్‌లో పడేశాడు.
 ‘‘ఏ?’’ వానర్ అడిగాడు.
 ‘‘అది తర్వాతి ఫ్ల్లైట్‌కి ఓచర్ తప్ప కేష్ వాపస్ ఇచ్చే ఓచర్ కాదు.
 ‘‘సినిమా టిక్కెట్ ఐతే సగం రేటుకి అమ్మేవాళ్ళం. దీనికి ఐడెంటిటీ కార్డు, బొచ్చు, భోషాణం... ఎన్ని రూల్సో’’ మర్కట్ తన ఓచర్‌ని నలిపి చెత్త బుట్టలో పడేశాడు. తర్వాత అందులో పడ్డ ఓ బోర్డింగ్ పాస్‌ని, దాని మీది వేమన పేరుని చూసి తలెత్తి ఆశ్చర్యంగా వేమనని అడిగాడు.
 ‘‘మీ విమానానికి కూడా బాంబ్ బెదిరింపు వచ్చిందా?’’
 ‘‘ఊహు. హిందూ సేవా సంఘం వారు నన్ను విమానం ఎక్కకుండా ఆపేశారు’’ ఆయన చెప్పాడు.
 ‘‘అదేం?’’
 ‘‘క్రితంసారి నా ప్రవచనం విన్న నూట డెబ్బై ఏడు మంది వేరే మతం పుచ్చుకున్నారుట. అందుకనిట. వెన్ ఐ వజ్ ఎట్ బాంబే రైల్వేస్టేషన్, ఐ గాట్ ది ఇన్‌ఫర్‌మేషన్ దట్ ది మెట్రిక్యులేషన్ ఎగ్జామినేషన్ వజ్ ది గ్రేట్ బాదరేషన్ ఫర్ ది యూత్ జనరేషన్ ఆఫ్ ది ఇండియన్ నేషన్ హూన్ ఆక్యుపేషన్ వజ్ కల్టివేషన్’’ చెప్తూ ఆయన వారి జీవితాల్లోంచి శాశ్వతంగా నిష్ర్కమించాడు.
 ‘‘మన జాతకాలు బాలేవు’’ మర్కట్ బాధగా చెప్పాడు.
 ‘‘జాతకాలు, శకునాల మీద నాకు నమ్మకం లేదు. అవన్నీ ఉత్తి మూఢనమ్మకాలు. మైక్రోస్కోప్, టెలిస్కోప్‌లలో పరీక్షించినా హరోస్కోప్ ఉందనే స్కోపే కనిపించదు. పైగా నాది తులా రాశి. మా రాశి రెండో పాదం వాళ్ళు జాతకాలని, జ్యోతిష్యాన్ని నమ్మరని రాశిఫలాల్లో రాశారు కూడా’’ వానర్ చెప్పాడు.
 రెండడుగులు వేశాక కపీష్ అకస్మాత్తుగా ఆగాడు. మిగిలిన ఇద్దరూ కూడా ఆగి అడిగారు.
 ‘‘ఏమైంది? నీ మొహం చూస్తూంటే రేపు ప్రపంచం అంతం కాదని అనిపిస్తోంది’’ కపీష్ చిరునవ్వుని చూసి మర్కట్ అడిగాడు.
 ‘‘బానిసత్వంలా మనిషి సృష్టించుకునేది కాదు. కాని పేదరికం మానవ నిర్మితం’’ కపీష్ స్థిరంగా చెప్పాడు.
 ‘‘మన ముగ్గురిలో ఉండుండి సీరియస్ డైలాగ్స్ వేసేది నువ్వొక్కడివే గురూ.’’
 ‘‘అవును. వేమన వెళ్ళబోతూ ఏమన్నాడో గుర్తుందా? దేవుడితో నీకో సమస్య ఉందని చెప్పక. సమస్యకి నీకో దేవుడు ఉన్నాడని చెప్పు చాలు. నేను దేవుడ్ని నమ్మను కాబట్టి నా మెదడుకి ఓ సమస్య ఉందని చెప్పాను. మన సమస్యా పరిష్కారానికి నాకో అద్భుతమైన ఆలోచన వచ్చింది’’ కపీష్ చెప్పాడు.
 ‘‘ఏమిటది?’’
 ‘‘మనం పట్టుబడకుండా మళ్ళీ ఆ డబ్బుని వెంటనే ఎలా స్వాధీనం చేసుకోవచ్చంటే...’’
 మిగిలిన ఇద్దరూ అతను చెప్పేది శ్రద్ధగా విన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement