సంసారంలో సెల్‌ఫోన్ చిచ్చు
- భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య
-తల్లి లేని వారైన నలుగురు పిల్లలు
వీపనగండ్ల: భార్య సెల్‌ఫోన్‌లో మాట్లాడుతుండడాన్ని గమనించిన భర్త ఎవరితో మాట్లాడుతున్నావంటూ గొడవకు దిగడం.. గతంలో కూడా ఇదే మాదిరిగా వేధించడాన్ని తట్టుకోలేకపోయిన ఆమె ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంతో ఆ మహిళ కాలి బూడిదై పోగా.. వారి నలుగురు పిల్లలు తల్లి లేని వారుగా మిగిలారు. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం బొల్లారం గ్రామానికి చెందిన వంక ఈదన్న వివాహం ఇదే గ్రామానికి చెందిన రామేశ్వరమ్మతో 11 ఏళ్ల క్రితం జరిగింది. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు.
వీరు పూరిగుడిసెలో నివాసముంటూ కూలి పనిచేసుకుని జీవిస్తున్నారు. మంగళవారం ఆ గ్రామంలో బోనాల పండుగ, బుధవారం కర్రీ పండుగ జరుపుకొన్నారు. నిన్న ఉదయం గుర్తు తెలియని ఓ వ్యక్తి నుంచి రామేశ్వరమ్మకు ఫోన్ రావడంతో ఆమె మాట్లాడుతుండగా అదే సమయంలో భర్త ఈదన్న ఇంటికి వచ్చాడు. ఆమె నుంచి ఫోన్ లాక్కుని అవతలి వ్యక్తి మాటలు విన్న ఈదన్న ఆయనతో అక్రమ సంబంధం నెపంతో అనుమానించాడు. గతంలో కూడా ఒకటి, రెండుసార్లు ఆమె సెల్‌ఫోన్లో మాట్లాడుతుండడం గమనించిన ఈదన్న.. తన భార్య రామేశ్వరమ్మపై అనుమానం వ్యక్తంచేస్తూ వేధించాడు.
నిన్న కూడా ఇదే పునరావృతం కావడంతో మనస్తాపానికి గురైన ఆమె.. ఈదన్న బయటకు వెళ్లగానే పిల్లలకు రూ. 20 ఇచ్చి ఏమైనా కొనుక్కోవాలని వారిని పంపించింది. ఆ తర్వాత వారు నివసించే గుడిసెపైనే కాకుండా తన ఒంటిపై కూడా కిరోసిన్ చల్లుకుని గుడిసెకు గడియ వేసి నిప్పంటించుకుంది.
గుడిసె తగలబడుతుం డడంతో భర్త వచ్చి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించాడు. స్థానికులు కూడా వచ్చి నీళ్లు చల్లినా గుడిసెతోపాటు రామేశ్వరమ్మ కూడా అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో ఆమె శరీరం పూర్తిగా కాలిపోయి బూడిదే మిగిలింది. ఈ విషయమై రామేశ్వరమ్మ తల్లి ఫిర్యాదు మేరకు వీపనగండ్ల పోలీసులు కేసు నమోదు చేశారు.