
సాక్షి, జనగాం: సెల్‌ఫోన్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు.. నర్మెట్ట మండలం హన్మంతపూర్ గ్రామానికి చెందిన పోతాని ప్రశాంత్ డిగ్రి పూర్తి చేశాడు. ప్రస్తుతం ఇంటి దగ్గరే ఉండి వ్యవసాయం చేస్తున్నాడు. ఈ క్రమంలో సెల్‌ఫోన్ కొనివ్వాల్సిందిగా తండ్రిని కోరాడు. అందుకు తండ్రి అంగీకరించకపోవడంతో మనస్థాపానికి గురైన ప్రశాంత్ శుక్రవారం అర్ధరాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అపస్మారక స్థితిలో ఉన్న ప్రశాంత్‌ను గమనించిన తల్లిదండ్రులు వెంటనే అతన్ని స్థానిక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రశాంత్ మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.