
రోదిస్తున్న తల్లి, కుటుంబ సభ్యులు (ఇన్‌సెట్) తాటి రాజు(ఫైల్)
స్టేషన్‌ఘన్‌పూర్: ఆరునెలల క్రితం భార్య చనిపోగా కుటుంబసభ్యుల ఒత్తిడి మేరకు రెండో వివాహం చేసుకున్నాడు కానీ మొదటి భార్య జ్ఞాపకాలను మరిచిపోలేక ఆమెను సమాధి చేసిన వద్దనే పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో సోమవారం రాత్రి జరగగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. రైల్వేకాలనీకి చెందిన తాటి రాజు(40) భార్య జ్యోతి అనారోగ్యంతో 6 నెలల క్రితం చనిపోయింది.
వీరికి 17 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఇరవై ఏళ్ల కాపురంలో ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. భార్య మృతిని తట్టుకోలేక తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. అతని పరిస్థితిని గమనించిన కుటుంబ సభ్యులు తోడు కావాలని నచ్చజెప్పి రెండు నెలల క్రితం గుంటూరుపల్లికి చెందిన యశోదతో వివాహం చేశారు. ఈ మధ్య తరచూ మొదటి భార్య గుర్తుకు వస్తోందంటూ తల్లి రాజ్యలక్ష్మికి చెప్పుకుని బాధ పడ్డాడు.
ఈ క్రమంలో సోమవారం రాత్రి ఘన్‌పూర్‌లోని శ్మశానవాటికలో భార్యను ఖననం చేసిన వద్దకు చేరుకుని క్రిమిసంహార మందు తాగి బర్నింగ్ ప్లాట్‌ఫారంపై పడిపోయాడు. సోమవారం బయటకు వెళ్లిన రాజు మంగళవారం ఉదయం వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అన్ని చోట్లా వెతికారు. అనుమానంతో శ్మశానవాటిక వద్దకు వెళ్లి చూసేసరికి అక్కడ నిర్జీవంగా పడి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాఘవేందర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment