ఈ కాలమ్ మీదే
చర్చా వేదిక
పాఠకులకు ఆహ్వానం
‘ఈ కాలమ్ మీదే’ అనే ఈ చర్చావేదికలో పాల్గొనండి. చర్చనీయాంశం మీ ఇష్టం. ఏ సామాజిక అంశాన్నయినా, ఆలోచననైనా మీరు చర్చకు పెట్టొచ్చు.
మీ వాదనను వినిపించవచ్చు. దానిపై మిగతా పాఠకులనూ చర్చకు ఆహ్వానిస్తుంది సాక్షి ఫ్యామిలీ. వీటిని ప్రతి సోమవారం ప్రచురిస్తుంది. వెంటనే రాసి పంపండి. మీ చర్చనీయాంశం పంపవలసిన చిరునామా: ‘ఈ కాలమ్ మీదే’ సాక్షి ఫ్యామిలీ,
సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 ఇ-మెయిల్: sakshireaders@gmail.com
సెల్ ప్రపంచానికి దూరంగా...
నేటి కాలంలో సెల్‌ఫోన్ నిత్యావసరంగా మారిపోయింది. గతంలో ఒక ఇంటిలో ఒకరికి సెల్‌ఫోన్ ఉంటే ప్రస్తుతం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికీ ఉంది. మామూలు ఫోన్‌లు కూడా కాదు... స్మార్ట్, టచ్ ఫోన్‌లు. ఇంట్లో ఉన్న పిల్లలు వీటి మోజులో పడి గంటల తరబడి చాటింగ్‌లు చేస్తూ, గేమ్స్, ఫేస్‌బుక్ ఎకౌంట్ ద్వారా సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. చదువుకు దూరం అవుతున్నారు.
పిల్లలు మారాం చేస్తే చాలు... అవసరం ఉన్నా లేకపోయినా కొనిచ్చే తల్లిదండ్రుల సంఖ్య పెరిగింది. ఎప్పుడూ సెల్‌ఫోన్ చూస్తూనే గడపడం వల్లే చిన్న వయసులోనే కంటి సమస్యలు వస్తున్నాయి. హైటెక్ టెక్నాలజీ అని గొప్పగా చెప్పుకుంటున్నప్పటికీ దాని ఫలితాలు మాత్రం పిల్లల విషయంలో ప్రతికూలంగా మారుతున్నాయి. అందుకే... పిల్లలను సెల్ ప్రపంచానికి దూరంగా ఉంచాలి. పుస్తక ప్రపంచానికి దగ్గర చేసే ప్రయత్నం చేయాలి.
- కామిడి సతీష్‌రెడ్డి, ఉపాధ్యాయులు, పరకాల, వరంగల్ జిల్లా.
మన వంతు సహాయం చేద్దాం!
ఈమధ్య కాలంలో చిన్న చిన్న సమస్యలతో ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య పెరిగింది. ఇందులో యువత ఎక్కువగా ఉండడం బాధాకరం. ఈ నేపథ్యంలో నాదో సూచన. మన చుట్టుపక్కల ఎవరైనా... విషాదంలో ఉంటే కారణం తెలుసుకోండి. వారి బాధను పంచుకోండి. సమస్య పరిష్కారానికి మీవంతుగా తోడ్పడండి. ఎవరి సమస్య వారిది అనుకోవడం వల్లే, ఒంటరితనం పెరిగి, సమస్యకు పరిష్కారం దొరకక ఆత్మహత్యలు జరుగుతున్నాయి. అందుకే బాధలో ఉన్నవారితో మాట్లాడండి. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపండి. ఎందుకంటే జీవితం అనేది చాలా గొప్పది. ఆ జీవితాన్ని కష్టాలు, కన్నీళ్లతో కాకుండా సుఖసంతోషాలతో గడపడం ముఖ్యం.
- గాదెగాని గౌతం, మరిపెడ
జాగో ఇంజనీరింగ్
ఇంజనీరింగ్ అనేది సాంకేతిక విద్య, అంటే ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలకు అద్దం పట్టేది. ఇప్పుడున్న ఇంజనీరింగ్ విద్య - పైన పటారం లోన లొటారంలాగా మారిపోయింది. ఇప్పటికీ మనం పాత విద్యావిధానంలోనే కొనసాగుతున్నాం. దీనికితోడు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఇంజనీరింగ్ కాలేజీలు, అందులో అరకొర వసతులు, బోధనాపరమైన ఇబ్బందులు, ల్యాబ్స్ లేకపోవడం... ఉన్నా కూడా పని చేయకపోవడం... ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయి.
అరకొర వసతుల నడుమ విద్య అనేది విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. అరకొర వసతుల మధ్య చదువుకున్న వాళ్లు ఆ తరువాత కాలంలో ఉద్యోగాలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్ని ఇంజనీరింగ్ కళాశాలల్లో పూర్తి వసతులు ఉన్నాయని ప్రశ్నించుకుంటే పదుల సంఖ్యలో మాత్రమే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో నాణ్యమైన విద్యతో వచ్చే బతుకు భరోసా ఎక్కడ ఉంది?ఇప్పటికైనా ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఇంజనీరింగ్ విద్యాభివృద్ధికి కృషి చేయాలని ఒక ఇంజనీరింగ్ విద్యార్థిగా కోరుకుంటున్నాను.
- ఎన్. మంజునాథ్, అనంతపురం
ప్రకృతికి మొక్కలు చెల్లించుకుందాం
ప్రకృతిలో సమతౌల్యం లోపిస్తే జీవరాశులు మనుగడ సాగించలేవు. అడవులు, వివిధ రకాల చెట్లు, నదులు, చెరువులు, సరస్సులు, సముద్రాలు, పర్వతాలు, కొండలు, గుట్టలు, భూగర్భంలో ఉన్న వివిధ రకాల ఖనిజరాశులు, అలాగే భూమిపై ఉన్న సమస్త జీవరాశులూ ప్రకృతిలో భాగమే. కానీ ఆ ప్రకృతిని మనం అభివృద్ధి పేరుతో ధ్వంసం చేసుకుంటున్నాం. మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కుంటున్నాం. పర్యవసానాల గురించి ఆలోచించకపోతే, పర్యావరణ స్పృహను కలిగి ఉండకపోతే ముందు తరాలవారి బతుకులను సైతం ఎడారిపాలు చేసినవాళ్లమవుతాం. మరి కర్తవ్యం ఏమిటి? పర్యావరణాన్ని తక్షణం పరిరక్షించుకునే ప్రయత్నం చేయాలి. అందుకోసం ఇళ్లలో, ప్రభుత్వ కార్యాలయాలలో, రహదారులపై విరివిగా మొక్కలను పెంచాలి. ప్రతి ఇంట్లో మేడపైన, గోడలపైన, తొట్టెలలో, కిటికీ పైభాగాలలో కూడా వివిధ రకాల మొక్కలను పెంచాలి. ఎవరింట్లో వారు మొక్కలను పెంచడం వల్ల ఆ ఇంట్లో ఉన్న వారికే కాకుండా పర్యావరణానికి, సమాజానికి మేలు జరుగుతుంది. ఈ విషయంలో ప్రభుత్వ ఉద్యానవన, అటవీశాఖల నుంచి ఉచితంగా సలహాలు తీసుకోవచ్చు.
ఇంటి నిర్మాణంలో ఖాళీ స్థలం వదలక, ఉన్న స్థలంలోనే చిన్నచిన్న గదులను నిర్మించి... కంకర, సిమెంటు వేసి, మొక్కలకు చోటు లేకుండా చేయడం వల్ల కూడా పర్యావరణానికి, సమాజానికి హాని జరుగుతుందని మనం గ్రహించాలి. ఇందుకు ప్రాయశ్చిత్తంగా.. సమాజంలో ప్రతి ఒక్కరు ప్రతి శుభకార్యంలో గుర్తుగా మొక్కలను పెంచే, పంచే సంప్రదాయం అలవరుచుకోవడం వల్ల ప్రకృతి సమతౌల్యం మరింత దెబ్బతినకుండా ఉంటుంది. ఇక నీరులేక, నీరు నిల్వ ఉంచే పరిస్థితి లేక పక్షులు, జంతువులు అంతరించిపోతున్నాయి. వాటిని కూడా మనం కాపాడుకోవాలి. ప్రపంచ పర్యావరణ పరిరక్షణకు శాస్త్రవేత్తలు నిరంతరం కృషిచేసి ప్రజలందరికి అవగాహన కల్పించే నిమిత్తమై జీవ వైవిధ్య సదస్సులు నిర్వహించవలసి వస్తోందంటే పరిస్థితి ఎంత చేయి దాటిందో చూడండి. అందుకే ప్రపంచ దేశాలకు పెనుసవాలుగా మారిన పర్యావరణ పరిరక్షణలో మనవంతు సహకారాన్ని అందించి ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకుందాం.
- చెన్నమాధవుని అశోకరాజు, వనస్థలిపురం, హైదరాబాద్