
సెల్ చార్జింగ్‌తో జర భద్రం
శ్రీనివాస్ ఒక సేల్స్ ఎక్సిక్యూటివ్. ఉద్యోగంలో భాగంగా సెల్‌ఫోన్‌లో నిరంతరాయంగా మాట్లాడుతూనే ఉంటాడు.
నాణ్యమైన చార్జర్లను వాడండి
పిల్లలకు అందుబాటులో ఉంచకండి
శ్రీనివాస్ ఒక సేల్స్ ఎక్సిక్యూటివ్. ఉద్యోగంలో భాగంగా సెల్‌ఫోన్‌లో నిరంతరాయంగా మాట్లాడుతూనే ఉంటాడు. ఒక రోజు శ్రీనివాస్ సెల్ ఛార్జింగ్‌లో పెట్టి స్నానానికని వెళ్లాడు. స్నానం చేస్తుండగా సెల్ మోగింది. దీంతో అతను తడితోనే బయటకు వచ్చి చార్జింగ్‌లో ఉన్న సెల్‌ను పట్టుకుని మాట్లాడేందుకు ప్రయత్నించాడు. ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. దీంతో కుటుంబసభ్యులు తక్షణం హాస్పటల్‌కు తీసుకువెళ్లారు. అప్పటికే జరగకూడనిది జరిగిపోయింది. ప్రాణాలు పోయాయని డాక్టర్లు చెప్పారు. ఇలాంటి ఘటనలు ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. కానీ తగు జాగ్రత్తలు పాటించాలనే స్ప ృహ చాలా మందిలో ఉండదు.
అల్లిపురం : సెల్‌ఫోన్ లేనిదే నేడు ఎవరికీ రోజు గడవదు. 24 గంటలు సెల్‌ఫోన్‌ను అంటిపెట్టుకుని ఉంటున్నారనడంలో అతిశయోక్తి లేదు. ఒక్క కాలకృత్యాల సమయంలో తప్ప మిగతా అన్ని సమయాల్లో సెల్ చేతిలో ఉండాల్సిందే. దీంతో సెల్ ఛార్జింగ్ కూడా త్వరగా అయిపోతుంది. ఛార్జింగ్ పెట్టుకోవడానికి సమయం కూడా కేటాయించలేక పోతున్నారు. దీంతో సెల్ ఛార్జింగ్‌లో ఉండగానే మాట్లాడుతుంటారు...ప్రమాదాలకు గురవుతున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది?
నకిలీల వల్లే ప్రమాదాలు..
నకిలీ చార్జర్ల వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల నుంచి బయటపడేందుకు గానూ నకిలీ, నాణ్యత లేని వస్తువులు కొనకపోవడమే మంచిదని, కాస్త ఖరీదైన బ్రాండెడ్ వస్తువులు కొనడం వల్ల సురక్షితంగా ఉండవచ్చని సూచిస్తున్నారు. సెల్‌ఫోను, ల్యాప్‌టాప్, ట్యాబ్‌ల వంటి గాడ్జెట్స్‌ను అతి సున్నితమైన పరికరాలతో తయారు చేస్తారు. వీటిలో వివిధ రకాల మెటల్స్‌తో కలగలిపి ఉంటాయి. వాటి చార్జింగ్‌కు 5 ఓల్టులు విద్యుత్ సరిపోతుందని ఆ పరికరాల చార్జర్లు, గాడ్జెట్‌లపై సంబంధిత కంపెనీలు ముద్రించి ఉంచుతాయి. సాధారణంగా ఇళ్ళలోను, కార్యాలయాల్లోను 220 ఓల్టులు వస్తుంటుంది. మన ఇళ్ళలో ప్లగ్‌ల నుంచి వచ్చే 220 ఓల్టులు విద్యుత్‌ను చార్జర్లు 5 ఓల్టులుకు తగ్గించి పంపుతాయి. దీంతో గాడ్జెట్‌లు చార్జింగ్ అవుతుంటాయి. ఒక్కోసారి చార్జర్‌లో సాంకేతిక లోపాలు కలిగినపుడు 5 ఓల్టులకు బదులు 220 ఓల్టులు విద్యుత్ గాడ్జెట్‌లకు సరఫరా అవుతుంది. దీంతో ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. తడి కాళ్ళు, చేతులతో వాటిని ముట్టుకుంటే ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
►గాడ్జెట్లకు సంబంధించిన కంపెనీ చార్జర్లు పోయినపుడు నాణ్యమైన విడి చార్జర్లు మాత్రమే కొనుక్కోవాలి.
►చార్జరు వైర్లు తెగిన సమయంలో షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకని తెగిన చోట ఇన్సులేషన్ టేపుతో అతికించాలి. లేదా నాణ్యమైన చార్జర్ కొనుక్కోవడం మంచిది.
►సెల్‌ఫోను చార్జర్‌ల నుంచి ఎటువంటి ద్రవాలు, పౌడర్లు వంటివి బయటకు పొక్కినట్లు కనిపిస్తే వాటిని విడిచిపెట్టడం ఉత్తమం.
►ఇంట్లో పాకే పిల్లలు ఉన్నట్లయితే చార్జర్లు వారికి దూరంగా ఉంచడంగాని, వారికి అందనంత ఎత్తులో ఉంచడం మంచిది. లేకుంటే వారు పాక్కుంటూ వెళ్లి చార్జర్ నోట్లో పెట్టుకుంటే ప్రమాదాలు సంభవించే వీలుంది.
►ఛార్జింగ్‌లో ఉన్న సెల్‌ఫోన్లు పిల్లల చేతికి అందకుండా ఉంచాలి. పెద్దలు కూడా ఛార్జింగ్‌లో ఉన్న గాడ్జెట్స్‌ను తాకకుండా ఉండడమే ఉత్తమం.
►నాణ్యత లేని చార్జర్‌లు వినియోగించడం వల్ల ఒక్కోసారి అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది. లేదా షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది.
►ముఖ్యంగా రాత్రి పూట పడుకునే సమయంలో సెల్‌ఫోన్లు చార్జింగ్‌లో పెట్టి తలకింద పెట్టుకునే అలవాటు చాలామందికి ఉంటుంది. దీనివల్ల నిద్రలో వాటిపై ఒత్తిడి పెరిగి ఛార్జర్, చార్జర్ పిన్ విరిగిపోవడంతో షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. బ్యాటరీ వేడెక్కి పోయి పేలిపోయే ప్రమాదం ఉన్నందున రాత్రి సమయాల్లో చార్జింగ్‌లో పెట్టుకోకపోవడమే మంచిది. పడుకునే వరకు చార్జింగ్‌లో ఉంచి పడుకున్న తరువాత వాటిని ఆఫ్ చేసి పెట్టుకోవడం ఉత్తమం.