త్రీమంకీస్ - 56 | malladi special story | Sakshi
Sakshi News home page

త్రీమంకీస్ - 56

Published Sat, Dec 13 2014 10:11 PM | Last Updated on Sat, Sep 2 2017 6:07 PM

త్రీమంకీస్ - 56

త్రీమంకీస్ - 56

డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 56
 
- మల్లాది వెంకటకృష్ణమూర్తి
 
 రుధిర టై మీదకి రావడం చూసి ముగ్గురూ మాట మార్చారు.
 ‘‘... ఎన్నైనా చెప్పు. పాత పాటలు చెత్త’’ మర్కట్ చెప్పాడు.    
 ‘‘కాని స్లో అయినా కొన్ని అతను పాడినవి వినసొంపుగా ఉన్నాయి’’ వానర్ చెప్పాడు.
 ‘‘పీల్చుకోవడం అయిందా?’’ రుధిర అడిగింది.
 ‘‘ఆ. సరిపడా’’ కపీష్ చెప్పాడు.
 ‘‘ఐతే పదండి. పీజా వచ్చింది.’’
 ‘‘అవును. వేడిగా తింటేనే బావుంటుంది’’ మర్కట్ చెప్పాడు.
 ‘‘పదండి. నేనందుకు ఎప్పుడూ సిద్ధమే’’ వానర్ చెప్పాడు.
 ముగ్గురూ కిందకి వెళ్తూ చూస్తే మొత్తం ఆరుగురు అమ్మాయిలు సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ కనిపించడంతో మర్కట్ చెప్పాడు.
 ‘‘మన రాష్ర్టంలో ప్రేమ అభివృద్ధి చెందుతోంది.’’
 ‘‘ప్రేమ కన్నా సెల్‌ఫోన్ బిల్స్ అభివృద్ధి చెందుతున్నాయి’’ కపీష్ చెప్పాడు.
 ముందు జింజర్ బ్రడ్‌ని తిన్నాక కోక్ తాగుతూ వానర్ చెప్పాడు - ‘‘ఒన్ సర్కిల్ టు సర్కిల్ హాఫ్ సర్కిల్ ఏ. ఒన్ సర్కిల్ టు సర్కిల్ రెక్టాంగిల్ ఏ తాగుదామా?’’ వానర్ చెప్పాడు.
 ‘‘కోక్ రుచి కోక్‌దే. పెప్సీకి ఎక్కడ వస్తుంది?’’ మర్కట్ కూడా చెప్పాడు.
 ‘‘మీరు ఇప్పుడు ఏదో రైమ్‌ని పాడారు? ఏమిటది?’’ రుధిర అడిగింది.
 ‘‘ఒన్ సర్కిల్ టు సర్కిల్ హాఫ్ సర్కిల్ ఏ. ఒన్ సర్కిల్ టు సర్కిల్ రెక్టాంగిల్ అంటే కోక్ అని అర్థం. కోక్ స్పెల్లింగ్‌ని మేథ్స్ సింబల్స్‌తో చెప్పాడు’’ మర్కట్ వివరించాడు.
 రుధిర, ఆ ముగ్గురూ చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు.
 ఓ అత్తకి, అల్లుడికి ఆస్తి పంపకాల్లో తగాదా వస్తే తన అన్నయ్య ఆ వివాదం తీర్చి, ఇద్దర్నించీ చెరో ఐదు లక్షలు, ఎవరికి వాళ్ళకే న్యాయం చేస్తున్నట్లుగా నటిస్తూ ఎలా గుంజాడో లాంటి విషయాలు చెప్పింది రుధిర.
 ‘‘ఇది వినండి. దీన్ని నాకు నా ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ వాట్సాప్‌లో పంపాడు. కొన్ని సంవత్సరాలుగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఆఫీస్‌కి ఓ గాడిద వెళ్లి ఇంకా స్టుపిడ్‌గా తన పేరు ఉందా లేదా అని చెక్ చేస్తోంది. ఈ ఏడు అది లేకపోవడంతో కోపంగా అడిగింది. ‘ఈ ఏడు నా స్థానాన్ని ఎవరు అలంకరించారు?’ మీరు చెప్పండి. ఎవరు?’’
 ‘‘రాహుల్ గాంధీ?’’ కపీష్ అడిగాడు.
 ‘‘కరెక్ట్. ఇది వినండి...’’
 జోక్స్‌తో వాళ్ళకి టైమే తెలీకుండా పోయింది. ఆమెకి తెలీకుండా లేప్‌టాప్‌ని తెరవాలనుకుంటే రుధిర బాత్‌రూంకి కూడా వెళ్ళలేదు.
   
 ఎప్పట్లా తులసీరాం జైలుకి వచ్చి ములాఖత్ రిజిస్టర్‌లో సంతకం చేసి లోపలకి రాగానే అతని కోసం ఎదురు చూసే ఇద్దరు కానిస్టేబుల్స్ అతన్ని ప్రశ్నించారు.
 ‘‘కపీష్‌కి, నీకు మధ్య ఏమిటి సంబంధం? ఇంత పొద్దున్నే ఎందుకు వచ్చావు? అసలు రోజూ అతని దగ్గరకి ఎందుకు వస్తున్నావు?’’
 ‘‘నేను అప్పు ఇచ్చేవాడు. అతను తీసుకునే వాడు. అదీ సంబంధం. నా దగ్గర పది వేలు అప్పు తీసుకున్నాడు. దాని వడ్డీ కోసం వస్తున్నాను. అతని డబ్బు మీ దగ్గర ఉందట. నాకు డబ్బిమ్మని మీకు చెప్పాడా? అతనేడి?’’
 ‘‘అబద్ధం. అతను పారిపోవడానికి సహాయం చేయడానికి వచ్చావు.’’
 ‘‘లేదే? అతను పారిపోయాడా?’’
 ‘‘అవును. ఇవాళ తెల్లవారుఝామున పారిపోయాడు.’’
 ‘‘ఐతే ఇక ఫర్వాలేదు. అతన్ని బయటే కలుసుకుని వడ్డీ వసూలు చేసుకుంటాను.’’
 వెనక్కి తిరిగిన తులసీరాంని పట్టుకుని ఆపి ఓ కానిస్టేబుల్ చెప్పాడు - ‘‘నిన్ను అరెస్ట్ చేస్తున్నాం.’’
 ‘‘దేనికి? అప్పు ఇవ్వడం నేరం కాదే?’’
 ‘‘ఓ నేరస్థుడు జైలు నించి పారిపోవడానికి కుట్ర పన్నినందుకు.’’
 ‘‘రామ రామ. ఎంత మాట? నాకేం తెలీదు.’’
 ‘‘అది కోర్ట్ తేల్చాలి.’’
 అతను ఎంత మొర పెట్టుకుంటున్నా వినకుండా ఫస్ట్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్ట్ ఇంటికి లాక్కెళ్ళారు. యమధర్మరాజు కేసు విని అడిగాడు - ‘‘నువ్వు నేరం చేశావా?’’
 ‘‘లేదు మహాప్రభో. నేనే నేరం చేయలేదు. నా అప్పు తాలూకు వడ్డీ వసూలు చేసే ప్రయత్నం నేరమే అయితే అది నేను ఎప్పట్నించో చేస్తున్నాను.’’
 ‘‘పధ్నాలుగు రోజులు’’ ఆయన చెప్పాడు.
 ‘‘ఇదన్యాయం సామే.’’
 ‘‘ఈ దేశంలో న్యాయమే. ఇంగ్లీష్ కోర్ట్‌లో ఓ మనిషి అతను ఐరిష్ మేన్ అని ఋజువు కానంతవరకూ అమాయకుడిగా పరిగణించబడతాడు. అదే ఇండియన్ కోర్ట్‌లో ఓ మనిషి ఫలానా రాజకీయ నాయకుడి బావమరిది అని ఋజువు కానంతవరకూ అపరాధిగా పరిగణింపబడతాడు.’’
 తులసీరాంని పోలీసులు తీసుకెళ్ళిపోయారు.
 యమధర్మరాజు సెల్‌ఫోన్ మోగింది. కొత్తగా ఆయన పెట్టుకున్న ‘ఏమి చెప్పుదును ఒరే. ఒరే. మనకు ఎదురే లేదిక హరే హరే. ఇంటి పోరు వదిలించుకుంటిరా...’ అనే పాట రింగ్ టోన్‌గా వినిపించింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement