త్రీమంకీస్ -72 | malladi special story | Sakshi
Sakshi News home page

త్రీమంకీస్ -72

Published Tue, Dec 30 2014 12:37 AM | Last Updated on Sat, Sep 2 2017 6:55 PM

త్రీమంకీస్ -72

త్రీమంకీస్ -72

డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 72
 - మల్లాది వెంకటకృష్ణమూర్తి

‘‘సరే. కాల్చక... వాళ్ళు నన్ను లోపలకి రమ్మంటున్నారు. నైస్ మీటింగ్ యు ఆల్ పోలీస్ అండ్ సిటిజన్స్ అండ్ టివి ఆడియెన్స్. మళ్ళీ కలుద్దాం’’ చెప్పి వానర్ అటూ ఇటూ చూశాడు.
 ‘‘నీ బస్ ఆలోచన మాకు అవసరం లేద వార్. త్వరగా రా’’ నాయకుడు కోరాడు.
 ‘‘ఎందుకని? మీకు ఇంకో దారి లేదుగా?’’
 ‘‘ఎందుకంటే బందీలుగా తీసుకుందామనుకున్న ఉద్యోగస్థులంతా పారిపోయారు.’’
 ‘‘ఓ! సొరంగం లోంచా?’’ వానర్ అనాలోచితంగా చెప్పాడు.
 ఆ మాటని వినగానే ఆ ఆరుగురు దొంగలు ముందు ఒకరి మొహాల వంక మరొకరు చూసుకున్నారు. తర్వాత వానర్ వంక లేడిని చూసే సింహాల్లా చూశారు.
 ‘‘సొరంగం? దాని గురించి నీకు ముందే తెలుసా?’’
 ‘‘కొద్దిగా. దాన్ని తవ్విన వాళ్ళు నాకు తెలుసు. దాంట్లో వచ్చిన వారికన్నా కొద్దిగా ముందుగా మీరు వచ్చారు’’ వానర్ చెప్పాడు.
 ‘‘కాని దాని గురించి నువ్వు మాట మాత్రంగానైనా చెప్పలేదే?’’
 ‘‘నేను అడక్కుండా ఎవరికీ ఏదీ చెప్పను. మీరు అడగాల్సింది.’’
 ‘‘ఇప్పుడు నాకు అర్థమైంది. దాన్ని తవ్వింది నువ్వే. నువ్వు దాంట్లోంచే లోపలకి వచ్చావు. అవునా?’’
 ‘‘అవును.’’
 ‘‘సరే.’’
 దొంగల నాయకుడు తన రెండు తుపాకులని వానర్‌కి గురి పెట్టాడు.
 ‘‘కాల్చకు. ఇతనొక్కడే మన బందీ. అతన్నీ లేకుండా చేయకు. తర్వాత చంపుదాం’’ ఓ దొంగ అరిచాడు.
 ‘‘సరే. ఇతను మనకి చేసింది నేను మర్చిపోను. ఇతనితో పనయ్యాక మీరూ మర్చిపోకూడదు.’’
 దొంగలు తమలో తాము మాట్లాడుకుంటూంటే వానర్‌కి తను వారికి మామూలు బందీ కాదని, బేంక్‌లోంచి తప్పించుకున్నాక వారి గుళ్ళకి తను బలవుతానని అనిపించింది. తనని వాళ్ళు లోపలకి పిలిచాక ఆ సొరంగంలోంచి బయటకి వెళ్ళబోయే ముందు కాల్చి చంపి వెళ్తారు. పోలీసులు తనూ బందీ అనుకుని వెంటనే బేంక్‌లోకి రారు. ఈ దొంగలు కాపలా లేని జైలు గేటులోంచి కూడా బయటకి వెళ్ళలేని మూర్ఖులు, తను వీళ్ళతో ఉంటే అన్ని విధాల ప్రమాదం అనుకున్నాడు.
 ‘‘ముందుగా మనం చేయాల్సింది...’’ వానర్ ఆగాడు.
 ‘‘మనం? ఎప్పట్నించి నువ్వు మాలో ఒకడివి అయ్యావు?’’ నాయకుడు ప్రశ్నించాడు.
 ‘‘మీరు నన్ను ఇందులో ఇన్‌వాల్వ్ చేసినప్పటి నించి. ముందుగా మనం చేయాల్సింది...’’
 ‘‘ఆగు. మేమేం చేయాలో నువ్వు మాకు చెప్పకు. అది మాకు తెలుసు’’ నాయకుడు అది అవమానంగా భావించి అరిచాడు.
 ‘‘నేను ఒక్కడ్నే మీ బందీని. నేనూ లేకుండా చేసుకోకండి. ఇంతదాకా మిమ్మల్ని గమనించాను కాబట్టి మీరు తప్పించుకోడానికి నేనొక్కడ్నే మీ ఆశ. ముందుగా స్ట్రాంగ్ రూం తలుపుని మూసేయండి.’’
 ‘‘అందులోని వారంతా తప్పించుకున్నాకా?’’
 ‘‘అది టు వే టన్నెల్ అని మర్చిపోకండి.’’
 ‘‘టు వే టన్నెల్?’’
 ‘‘అవును. లోపల నించి బయటకి వెళ్ళచ్చు బయటి నించి లోపలకి రావచ్చు కూడా. దాని గురించి పోలీసులకి ఇంకా తెలీదు. తలుపు మూసేస్తే స్ట్రాంగ్ రూంలోకి వచ్చినా అందులోంచి మీ దగ్గరకి రాలేరు. ఈలోగా మీరు తప్పించుకోవచ్చు.’’
 వారంతా అతను చెప్పేది ఆలోచనగా విన్నారు. అర్థం కాగానే అకస్మాత్తుగా అంతా లాకర్ రూం వైపు పరిగెత్తారు. అంతా. నాయకుడు మాత్రం వానర్ వైపు తుపాకీని కాల్చసాగాడు. చేతులు దింపి వానర్ రోడ్డు మధ్యకి ఒంగొని పరిగెత్తాడు. అతని చుట్టుపక్కల నేల మీద గుళ్ళు తాకిన గుర్తుగా దుమ్ము లేస్తోంది.
 ‘‘నువ్వు మా వైపు రా’’ స్పీకర్‌లోంచి వినిపించింది.
 సగం దూరం వెళ్ళాక వీధి చివరికి పరిగెత్తుతూ అరిచాడు - ‘‘బేంక్‌లోని బాధితులు సొరంగంలోంచి తప్పించుకున్నారు. రైట్ టైం వాచీల షాపులోంచి వాళ్ళు బయటకి వస్తారు. బేంక్‌లో కేవలం దొంగలే మిగిలారు. వెళ్ళండి. ఉస్కో.’’
 పోలీసులకి అతని మాటలు కొద్ది క్షణాలు అర్థం కాకపోయినా కొందరు తుపాకులతో బేంక్‌లోకి, మరికొందరు ఆ వాచీ షాపు వైపు పరిగెత్తారు. లోపల నించి కాల్పులు లేవు. తెల్ల కోటులోని ఓ డాక్టర్ అంబులెన్స్ పక్క నించి వెళ్ళే వానర్‌తో చెప్పాడు - ‘‘అంబులెన్స్ లోకి రా. నీ బీపీని చెక్ చేస్తాను.’’
 వానర్ ఆగలేదు. ముఖానికి ఉన్న సాక్స్‌ని తొలగించి గుంపులుగా చేరి చూస్తున్న మనుషుల్లో కలిసిపోయాడు. మూసేసిన రైట్ టైం గడియారాల షాపు పక్క నించి కారు పార్క్ చేసిన చోటికి బాణం నించి వదిలిన విల్లులా పరిగెత్తాడు. అక్కడ అది లేదు. కొద్ది దూరం వెళ్ళాక ఓ బోర్డ్, ఓ ఆటో కనిపించాయి. బోర్డ్ మీద ఇలా రాసి ఉంది -
 ‘రెస్ట్రిక్టెడ్ ఏరియా
 డెడ్ బాడీస్ నాట్ టు బి టేకెన్ ఆన్ దిస్ రోడ్ ఎయిదర్ ఆన్ ఫుట్ ఆర్ ఇన్ అంబులెన్స్’
 ‘‘పోనీ’’ ఆటోలోకి ఎక్కి వానర్ చెప్పాడు.
 ‘‘అరవై రూపాయలు అవుద్ది’’ వాడు ఎక్కడికో తెలుసుకోకుండానే అలవాటుగా చెప్పాడు.
 ‘‘అలాగే పోనీ’’ చెప్పి వానర్ సీట్‌లో వెనక్కి వాలి తన అరచేతిని గుండెకి ఆనించి అది కొట్టుకుంటోందో లేదో చెక్ చేసుకున్నాడు.
 
- మళ్లీ  రేపు
 
ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి  టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 3monkies.sakshi@gmail.com
 
లెటర్స్
డిసెంబర్ 26 సీరియల్‌కి వేసిన బొమ్మ బాపు బొమ్మని గుర్తుకు తెచ్చింది. సీత, రమ్య, స్వచ్ఛ, రుధిర, వైతరణి, మూలిక విలక్షణమైన ఈతరం పాత్రలు. త్రీ మంకీస్ నేటి తరానికి నచ్చే విలక్షణమైన హాస్య సీరియల్ అనడంలో సందేహం లేదు.
 - రాధేశ్యాం, చినగంజాం
 
పాఠకులకు ఆహ్వానం!
‘ఈ కాలమ్ మీదే’ అనే కొత్త చర్చావేదికను సాక్షి ‘ఫ్యామిలీ’ త్వరలో ప్రారంభించబోతోంది. చర్చనీయాంశం మీ ఇష్టం. ఏ సామాజిక అంశాన్ననైనా, ఆలోచననైనా మీరు చర్చకు పెట్టొచ్చు. మీ వాదనను వినిపించవచ్చు. దానిని ఫ్యామిలీ ప్రచురిస్తుంది. దానిపై మిగతా పాఠకులనూ చర్చకు ఆహ్వానిస్తుంది. వెంటనే రాసి పంపండి. చర్చలో పాల్పంచుకోండి.  మీ చర్చనీయాంశం పంపవలసిన చిరునామా:  ‘ఈ కాలమ్ మీదే’ సాక్షి ఫ్యామిలీ, సాక్షి  టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34  ఇ-మెయిల్: sakshireaders@gmail.com
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement