త్రీమంకీస్ -70 | malladi special story | Sakshi
Sakshi News home page

త్రీమంకీస్ -70

Published Sat, Dec 27 2014 10:31 PM | Last Updated on Sat, Sep 2 2017 6:50 PM

త్రీమంకీస్ -70

త్రీమంకీస్ -70

డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 70
 మల్లాది వెంకటకృష్ణమూర్తి
 
 ‘‘సెలైన్స్. నాకున్నది ఒకే చెవి. నేను దొంగలు మాట్లాడేది విననా? పోలీసులు మాట్లాడేది విననా? లేక మీ కంఠాలు విననా? పోనీ మీలో ఒకరు ఇక్కడికి రండి. నేను మీ బదులు అక్కడ నించుని అరుస్తాను’’ వానర్ కోపంగా అరిచాడు.
 తర్వాత దొంగల వైపు తిరిగి అడిగాడు - ‘‘నేను లోపలకి రావచ్చా?’’
 ‘‘మా డిమాండ్స్‌ని నీ ద్వారా పోలీసులకి చెప్పాక.’’
 ‘‘సంతోషం. కాని నా ముందు, వెనకా కూడా తుపాకులు నాకు గురిపెట్టబడి ఉన్నాయి. నేను అర్జెంట్‌గా బాత్‌రూంకి వెళ్ళాలి. దీర్ఘశంక... టాయ్‌లెట్.’’
 ‘‘ఖాళీ లేదు. మా వాడూ అదే పనిలో ఉన్నాడు. ఒకరి తర్వాత ఒకరం వెళ్తున్నాం. అసలు పని పూర్తయ్యేదాకా కదలక’’ నాయకుడు అరిచాడు.
 ‘‘కాని సినిమాల్లో ఇలాంటివి ఫోన్ ద్వారా చర్చించడం చూశాను.’’
 ‘‘మాకే పాఠాలు చెప్తున్నావా? మేమో పొరపాటు చేశాం. ఇందాక మేం భయంతో తుపాకీని కాల్చినప్పుడు గుళ్ళు తగిలి లేండ్ లైన్ ఫోన్ పాడైంది. సెల్ నించి కుదరదు. బేంక్‌కి సెల్ ఫోన్స్ ఉండవు కాబట్టి ఆ ఫోన్ మా నించే అనే గేరంటీ వాళ్ళకి ఉండదుగా.’’
 ‘‘మీ నంబర్ చెప్తే దానికి చేయమని వాళ్ళకి చెప్తాను.’’
 ‘‘మమ్మల్ని ఇంకా ఇరికించడానికా? ముందు చేతులు పెకైత్తు.’’
 ‘‘మర్చిపోయాను. సారీ. కాని రోడ్డుకి అవతల రెండు వందల మందికి పైనే గుమిగూడి ఉన్నారు. వాళ్ళందరి ముందూ అపరాధిలా చేతులు ఎత్తడం నాకు సిగ్గుగా ఉంది. దింపుతాను.’’
 దొంగలు మళ్ళీ కొద్దిసేపు చర్చించుకున్నాక అడిగారు - ‘‘టివి వాళ్ళు వచ్చారా?’’
 ‘‘తెలుగు, ఇంగ్లీష్, హిందీ... అన్ని ఛానల్స్ వాళ్ళూ వచ్చారు.’’
 ‘‘సరే. మేం చెప్పిన మాట వినకపోతే నీ పేంట్, షర్ట్, ఉంటే అండర్‌వేర్‌ని నువ్వు విప్పాల్సి ఉంటుంది జాగ్రత్త.’’
 ‘‘ఒద్దొద్దు. దాని బదులు కాల్చండి.’’
 ‘‘వార్! నువ్వు నిప్పుతో చెలగాటమాడుతున్నావు అని తెలీక ఆటలాడుతున్నావు. వాళ్ళకి మా డిమాండ్స్ చెప్పు.’’
 ‘‘సరే.’’
 వానర్ మళ్ళీ వెనక్కి తిరిగి గట్టిగా చెప్పాడు - ‘‘వాళ్ళు తమ డిమాండ్స్‌ని చెప్పమంటున్నారు. అంటే వాళ్ళ డిమాండ్స్‌ని నేను చెప్తున్నాను. అంటే నా ద్వారా చెప్తున్నారు తప్ప నా డిమాండ్స్ కావు.’’
 ‘‘మేము వినడానికి సిద్ధం వార్. కాని లోపల ఎవరికీ హాని జరక్కపోతేనే ఆలోచిస్తాం అని చెప్పు’’ లౌడ్ స్పీకర్‌లోంచి వినిపించింది.
 ‘‘గుడ్. అది సమంజసం. తెలివైన నిర్ణయం. మీరు చెప్పేది నాకు నచ్చింది’’ వానర్ బదులు చెప్పాడు.
 ‘‘షటప్! షటప్!’’ లోపల నించి నాయకుడి కంఠం వినిపించింది.
 ‘‘కాల్చక! నా అభిప్రాయం చెప్పానంతే.’’
 ‘‘మా డిమాండ్స్ తప్ప నీ అభిప్రాయాల్ని చెప్పక. ముందు చుట్టుపక్కల మేడల మీది షార్ప్ షూటర్స్‌ని తొలగించాలని కోరుతున్నాం అని చెప్పు’’ నాయకుడు ఆజ్ఞాపించాడు.
 ‘‘తప్పకుండా. మంచి ఆలోచన... మేడల మీది గన్‌మెన్‌ని వెంటనే తొలగించాలన్నది మొదటి డిమాండ్. ఇది చెప్పేది నేను కాదు... నేనే కాని నేను కాదు... అంటే నా ద్వారా అని! అర్థమైందా?’’
 ‘‘అయింది. ఇంకా?’’
 వానర్ బేంక్ తలుపు వైపు చూస్తూ అడిగాడు.
 ‘‘ఇంకా?’’
 ‘‘వెంటనే వాళ్ళు బేంక్‌కి కుడివైపు వీధి చివర ఆపిన పోలీస్ వేన్‌లని తొలగించాలి.’’
 వానర్ ఆలోచించి అడిగాడు - ‘‘నా కుడివైపా?’’
 ‘‘కాదు. మా కుడి వైపు.’’
 ‘‘సరే.’’
 వెనక్కి తిరిగి చెప్పాడు.
 ‘‘దొంగలు తమ కుడివైపు వీధి చివర ఆగి ఉన్న పోలీస్ వేన్‌లని వెంటనే తొలగించమని డిమాండ్ చేస్తున్నారు.’’
 ‘‘వాళ్ళు మాకు కనపడటం లేదు. వారి కుడి చేతిని చూపించమనండి.’’
 ‘‘వాళ్ళని బయటకి రమ్మననా?’’ కపీష్ అడిగాడు.
 ‘‘రమ్మను.’’
 వానర్ మళ్ళీ వెనక్కి తిరగ్గానే లోపల నించి నాయకుడి కంఠం కోపంగా ఉపయోగించింది - ‘‘మేము రాం. మేం అడిగింది తప్ప ఇంకోసారి ఎక్స్‌ట్రా మాట్లాడితే కాల్చేస్తాం. నీ కుడి వైపు అని చెప్పు.’’
 ‘‘ఇటు వైపా?’’ కుడి చేతిని చాపి అడిగాడు.
 ‘‘అవును.’’
 వానర్ మళ్ళీ వెనక్కి తిరిగి చెప్పాడు.
 ‘‘క్షమించాలి. వాళ్ళు బయటకి రారట. ఇటువైపు వాహనాలని వెంటనే తొలగించమని డిమాండ్’’ తన కుడి చేతిని చాపి చూపిస్తూ చెప్పాడు.
 నాయకుడు తల పట్టుకుని చెప్పాడు.
 ‘‘ఇప్పుడు నీకు ఎడం వైపు అని చెప్పు.’’
 ‘‘నా ఎడం వైపు’’ వానర్ తన ఎడమ చేతిని కూడా చాపి చెప్పాడు.
 ‘‘అంటే రెండు వైపులానా?’’ స్పీకర్‌లోంచి వినిపించింది.
 ‘‘కాదు. ఒక వైపు. ఇప్పుడు నాకు ఎడం వైపు. కదా?’’ వెనక్కి తిరిగి అడిగాడు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement