Selains
-
త్రీమంకీస్ -73
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 73 - మల్లాది వెంకటకృష్ణమూర్తి 21 మర్కట్ బాబాయ్ ఇంటి ముందు ఆటో దిగిన వానర్ తలుపు మీద తట్టాడు. మర్కట్ కంఠం వినిపించింది. ‘‘ఎవరది? పోలీసా? .. ఇంత త్వరగా ఎలా కనుక్కున్నారు?’’ మర్కట్ గొంతు తగ్గించి భయంగా కపీష్‌ని అడిగాడు. ‘‘వానర్ని. తలుపు తెరవండి.’’ తలుపు తెరవగానే వానర్ లోపలకి వెళ్ళాడు. టివిలో ఆ ఉదంతమే వార్తగా ప్రసారం అవుతోంది. ముఖాన సాక్స్‌తో పరిగెత్తే వానర్ టివిలో కనపడ్డాడు. ‘‘నాకోసం ఆగకుండా కారులో ఎందుకు వచ్చేశారు?’’ వానర్ చిరుకోపంగా అడిగాడు. ‘‘నువ్వు తిరిగి ప్రాణాలతో వస్తావనుకోలేదు. ఏం జరిగింది?’’ ‘‘కొద్దిసేపు ఆగితే టివినే చెప్తుంది. నాకో కోక్ కేన్ ఇవ్వు.’’ అది ఓపెన్ చేసి ఓ గుక్క తాగి సోఫాలో పడుకుని నిస్సహాయంగా చెప్పాడు - ‘‘నా గుండె ఎన్నిసార్లు ఆగి, మళ్ళీ ఎన్నిసార్లు తిరిగి పని చేసిందో? ఈసారి కూడా ముగ్గురం విఫలం అయ్యాం. మనకి దొంగతనం చేతకాదు.’’ కపీష్ నవ్వుతూ లేచి వెళ్ళి కిచెన్‌లోని బియ్యం బస్తాలని అందుకుని నేల మీద కుమ్మరించాడు. అందులోంచి బయటకి వచ్చిన నోట్ల కట్టలని చూసి వానర్ నిర్ఘాంతపోయి, లేచి కూర్చుని, మళ్ళీ లేచి నమ్మలేనట్లుగా అడిగాడు. ‘‘ఇంత డబ్బు ఎక్కడిది?’’ ‘‘బేంక్ నించి దోచి తెచ్చిన సొమ్ము’’ మర్కట్ నవ్వుతూ చెప్పాడు. ‘‘ఇదెలా సాధ్యం?’’ ‘‘మనిద్దరిలోకీ కపీష్ తెలివిగలవాడు’’ మర్కట్ కపీష్ భుజాన్ని ఆప్యాయంగా తడుతూ చెప్పాడు. ‘‘ఇది నిజం డబ్బేనా?’’ ‘‘అవును.’’ ‘‘ఇది ఎలా దొంగిలించారు?’’ ‘‘నిన్ను ఆ దొంగలు తీసుకెళ్ళాక కపీష్ అక్కడి ఉద్యోగస్థులందరితో, బేంక్ సొమ్ము దొంగలు దోచుకోకుండా కాపాడాలని, దాన్ని సొరంగంలోంచి బయటకి తీసుకెళ్దామని చెప్పాడు. తను బేంక్ డబ్బుని కాపాడాడనే పేరు తెచ్చుకోవాలని మేనేజర్ ఆశపడ్డాడు. ఓ తాళం చెవి బేంక్ ఆఫీసర్ దగ్గర, మరొకటి హెడ్ కేషియర్ దగ్గర ఉన్నాయి. బేంక్ మేనేజర్ సూచన మేరకు వాళ్ళిద్దరూ తాళం చెవులని ఉపయోగించి బేంక్ డబ్బు దాచిన సేఫ్ లాకర్ని తెరిచారు. ఆ డబ్బుని బేంకు సిబ్బందే ఈ గోనె సంచుల్లో నీట్‌గా సర్దారు. వాటితో అంతా సొరంగంలోంచి బయటపడ్డాం. కారు దగ్గరకి తీసుకెళ్ళి అది సిఐడి కారు కాబట్టి దాని మీద పోలీస్ కారు అనే గుర్తులు ఏమీ ఉండవని చెప్తే, ఆ డబ్బుని బేంక్ ఉద్యోగస్థులే డిక్కీలో ఉంచారు. దాన్ని సమీప పోలీస్ స్ట్టేషన్కి తీసుకెళ్ళి భద్రపరుస్తామని, వారు ఇంటికి వెళ్ళి తమ వారికి కనపడి, సాయంత్రం ఐదున్నరకి పోలీస్ స్టేషన్‌కి వచ్చి స్టేట్మెంట్ని ఇవ్వమని, టివి వాళ్ళు ఉంటారు కాబట్టి మంచి బట్టలు వేసుకుని రమ్మని చెప్తే నమ్మి వెళ్ళిపోయారు. అప్పటికే వారు మానసికంగా అలసిపోవడంతో సరిగ్గా ఆలోచించలేని స్థితిలో ఉన్నారు. వాళ్ళంతా ఇప్పుడు తమ ఇళ్ళల్లోని తమ వాళ్ళ ముందు హీరోలుగా ఫీలవుతూ సాయంత్రం వేసుకురావాల్సిన బట్టలని ఇస్త్రీ చేయించుకుంటూండి ఉంటారు’’ ‘‘దట్స్ గుడ్’’వానర్ పకపక నవ్వాడు. తర్వాత ఒంగి ఓ కట్టని అందుకుని దాని వంక చూశాడు. వెంటనే అతని మొహం పాలిపోయింది. ‘‘గురూ! ఇవన్నీ దొంగ నోట్లు. వందకి ఒకటి పక్కన రెండు సున్నాలు ఉండాలిగా? వీటికి మూడు సున్నాలు ఉన్నాయి.’’ ‘‘నువ్వు ఇంతదాకా వెయ్యి రూపాయల నోట్‌ని చూడలేదా?’’ మర్కట్ నవ్వుతూ అడిగాడు. ‘‘లేదు. వెయ్యి రూపాయల నోట్లు కూడా ఉన్నాయా?.’’ ‘‘వెయ్యి నోట్‌నే ఇంతదాకా నువ్వు చూడలేదంటే తెలంగాణా ఆహార భద్రతా పథకానికి కార్డు ఉన్నా, లేకపోయినా నువ్వు అర్హుడివి’’ కపీష్ నవ్వుతూ చెప్పాడు. అంత డబ్బుని ఎన్నడూ చూడని ఆ ముగ్గురూ ఆనందాన్ని పట్టలేక గట్టిగా అరుస్తూ ఆ నోట్ల కట్టలని ఒకరి మీదకి మరొకరు వేసి కొట్టుకుంటూ, గాల్లోకి ఎగరేసి పట్టుకుంటూ పగలబడి నవ్వసాగారు. ఆనందం తీరాక ఆ కట్టలన్నిటినీ మూడు భాగాలుగా విభజించారు. ముగ్గురూ విడివిడిగా లెక్క పెట్టుకున్నాక మర్కట్ ఆనందంగా చెప్పాడు. ‘‘వావ్! మనం కోటీశ్వరులం అయ్యాం.’’ డబ్బు కట్టల పక్కన నిలబడి ఒకొక్కరూ ఫొటోలు తీసుకున్నారు. ‘‘రండి. ముగ్గురం కలిని తీసుకుందాం’’ వానర్ మిత్రులు ఇద్దర్నీ ఉత్సాహంగా పిలిచాడు. ‘‘దీన్ని నీ ఎఫ్‌బిలో పోస్ట్ చేయక’’ మర్కట్ వానర్‌కి హెచ్చరికగా చెప్పాడు. ‘‘రేపు మన ఫొటోలు పేపర్లో ఫ్రంట్ పేజీలో వస్తాయి’’ కపీష్ నవ్వుతూ చెప్పాడు. - మళ్లీ రేపు ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 3monkies.sakshi@gmail.com పాఠకులకు ఆహ్వానం! ‘ఈ కాలమ్ మీదే’ అనే కొత్త చర్చావేదికను సాక్షి ‘ఫ్యామిలీ’ త్వరలో ప్రారంభించబోతోంది. చర్చనీయాంశం మీ ఇష్టం. ఏ సామాజిక అంశాన్ననైనా, ఆలోచననైనా మీరు చర్చకు పెట్టొచ్చు. మీ వాదనను వినిపించవచ్చు. దానిని ఫ్యామిలీ ప్రచురిస్తుంది. దానిపై మిగతా పాఠకులనూ చర్చకు ఆహ్వానిస్తుంది. వెంటనే రాసి పంపండి. చర్చలో పాల్పంచుకోండి. మీ చర్చనీయాంశం పంపవలసిన చిరునామా: ‘ఈ కాలమ్ మీదే’ సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 ఇ-మెయిల్:sakshireaders@gmail.com -
త్రీమంకీస్ -72
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 72 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘సరే. కాల్చక... వాళ్ళు నన్ను లోపలకి రమ్మంటున్నారు. నైస్ మీటింగ్ యు ఆల్ పోలీస్ అండ్ సిటిజన్స్ అండ్ టివి ఆడియెన్స్. మళ్ళీ కలుద్దాం’’ చెప్పి వానర్ అటూ ఇటూ చూశాడు. ‘‘నీ బస్ ఆలోచన మాకు అవసరం లేద వార్. త్వరగా రా’’ నాయకుడు కోరాడు. ‘‘ఎందుకని? మీకు ఇంకో దారి లేదుగా?’’ ‘‘ఎందుకంటే బందీలుగా తీసుకుందామనుకున్న ఉద్యోగస్థులంతా పారిపోయారు.’’ ‘‘ఓ! సొరంగం లోంచా?’’ వానర్ అనాలోచితంగా చెప్పాడు. ఆ మాటని వినగానే ఆ ఆరుగురు దొంగలు ముందు ఒకరి మొహాల వంక మరొకరు చూసుకున్నారు. తర్వాత వానర్ వంక లేడిని చూసే సింహాల్లా చూశారు. ‘‘సొరంగం? దాని గురించి నీకు ముందే తెలుసా?’’ ‘‘కొద్దిగా. దాన్ని తవ్విన వాళ్ళు నాకు తెలుసు. దాంట్లో వచ్చిన వారికన్నా కొద్దిగా ముందుగా మీరు వచ్చారు’’ వానర్ చెప్పాడు. ‘‘కాని దాని గురించి నువ్వు మాట మాత్రంగానైనా చెప్పలేదే?’’ ‘‘నేను అడక్కుండా ఎవరికీ ఏదీ చెప్పను. మీరు అడగాల్సింది.’’ ‘‘ఇప్పుడు నాకు అర్థమైంది. దాన్ని తవ్వింది నువ్వే. నువ్వు దాంట్లోంచే లోపలకి వచ్చావు. అవునా?’’ ‘‘అవును.’’ ‘‘సరే.’’ దొంగల నాయకుడు తన రెండు తుపాకులని వానర్‌కి గురి పెట్టాడు. ‘‘కాల్చకు. ఇతనొక్కడే మన బందీ. అతన్నీ లేకుండా చేయకు. తర్వాత చంపుదాం’’ ఓ దొంగ అరిచాడు. ‘‘సరే. ఇతను మనకి చేసింది నేను మర్చిపోను. ఇతనితో పనయ్యాక మీరూ మర్చిపోకూడదు.’’ దొంగలు తమలో తాము మాట్లాడుకుంటూంటే వానర్‌కి తను వారికి మామూలు బందీ కాదని, బేంక్‌లోంచి తప్పించుకున్నాక వారి గుళ్ళకి తను బలవుతానని అనిపించింది. తనని వాళ్ళు లోపలకి పిలిచాక ఆ సొరంగంలోంచి బయటకి వెళ్ళబోయే ముందు కాల్చి చంపి వెళ్తారు. పోలీసులు తనూ బందీ అనుకుని వెంటనే బేంక్‌లోకి రారు. ఈ దొంగలు కాపలా లేని జైలు గేటులోంచి కూడా బయటకి వెళ్ళలేని మూర్ఖులు, తను వీళ్ళతో ఉంటే అన్ని విధాల ప్రమాదం అనుకున్నాడు. ‘‘ముందుగా మనం చేయాల్సింది...’’ వానర్ ఆగాడు. ‘‘మనం? ఎప్పట్నించి నువ్వు మాలో ఒకడివి అయ్యావు?’’ నాయకుడు ప్రశ్నించాడు. ‘‘మీరు నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేసినప్పటి నించి. ముందుగా మనం చేయాల్సింది...’’ ‘‘ఆగు. మేమేం చేయాలో నువ్వు మాకు చెప్పకు. అది మాకు తెలుసు’’ నాయకుడు అది అవమానంగా భావించి అరిచాడు. ‘‘నేను ఒక్కడ్నే మీ బందీని. నేనూ లేకుండా చేసుకోకండి. ఇంతదాకా మిమ్మల్ని గమనించాను కాబట్టి మీరు తప్పించుకోడానికి నేనొక్కడ్నే మీ ఆశ. ముందుగా స్ట్రాంగ్ రూం తలుపుని మూసేయండి.’’ ‘‘అందులోని వారంతా తప్పించుకున్నాకా?’’ ‘‘అది టు వే టన్నెల్ అని మర్చిపోకండి.’’ ‘‘టు వే టన్నెల్?’’ ‘‘అవును. లోపల నించి బయటకి వెళ్ళచ్చు బయటి నించి లోపలకి రావచ్చు కూడా. దాని గురించి పోలీసులకి ఇంకా తెలీదు. తలుపు మూసేస్తే స్ట్రాంగ్ రూంలోకి వచ్చినా అందులోంచి మీ దగ్గరకి రాలేరు. ఈలోగా మీరు తప్పించుకోవచ్చు.’’ వారంతా అతను చెప్పేది ఆలోచనగా విన్నారు. అర్థం కాగానే అకస్మాత్తుగా అంతా లాకర్ రూం వైపు పరిగెత్తారు. అంతా. నాయకుడు మాత్రం వానర్ వైపు తుపాకీని కాల్చసాగాడు. చేతులు దింపి వానర్ రోడ్డు మధ్యకి ఒంగొని పరిగెత్తాడు. అతని చుట్టుపక్కల నేల మీద గుళ్ళు తాకిన గుర్తుగా దుమ్ము లేస్తోంది. ‘‘నువ్వు మా వైపు రా’’ స్పీకర్లోంచి వినిపించింది. సగం దూరం వెళ్ళాక వీధి చివరికి పరిగెత్తుతూ అరిచాడు - ‘‘బేంక్‌లోని బాధితులు సొరంగంలోంచి తప్పించుకున్నారు. రైట్ టైం వాచీల షాపులోంచి వాళ్ళు బయటకి వస్తారు. బేంక్‌లో కేవలం దొంగలే మిగిలారు. వెళ్ళండి. ఉస్కో.’’ పోలీసులకి అతని మాటలు కొద్ది క్షణాలు అర్థం కాకపోయినా కొందరు తుపాకులతో బేంక్‌లోకి, మరికొందరు ఆ వాచీ షాపు వైపు పరిగెత్తారు. లోపల నించి కాల్పులు లేవు. తెల్ల కోటులోని ఓ డాక్టర్ అంబులెన్స్ పక్క నించి వెళ్ళే వానర్‌తో చెప్పాడు - ‘‘అంబులెన్స్ లోకి రా. నీ బీపీని చెక్ చేస్తాను.’’ వానర్ ఆగలేదు. ముఖానికి ఉన్న సాక్స్‌ని తొలగించి గుంపులుగా చేరి చూస్తున్న మనుషుల్లో కలిసిపోయాడు. మూసేసిన రైట్ టైం గడియారాల షాపు పక్క నించి కారు పార్క్ చేసిన చోటికి బాణం నించి వదిలిన విల్లులా పరిగెత్తాడు. అక్కడ అది లేదు. కొద్ది దూరం వెళ్ళాక ఓ బోర్డ్, ఓ ఆటో కనిపించాయి. బోర్డ్ మీద ఇలా రాసి ఉంది - ‘రెస్ట్రిక్టెడ్ ఏరియా డెడ్ బాడీస్ నాట్ టు బి టేకెన్ ఆన్ దిస్ రోడ్ ఎయిదర్ ఆన్ ఫుట్ ఆర్ ఇన్ అంబులెన్స్’ ‘‘పోనీ’’ ఆటోలోకి ఎక్కి వానర్ చెప్పాడు. ‘‘అరవై రూపాయలు అవుద్ది’’ వాడు ఎక్కడికో తెలుసుకోకుండానే అలవాటుగా చెప్పాడు. ‘‘అలాగే పోనీ’’ చెప్పి వానర్ సీట్లో వెనక్కి వాలి తన అరచేతిని గుండెకి ఆనించి అది కొట్టుకుంటోందో లేదో చెక్ చేసుకున్నాడు. - మళ్లీ రేపు ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 3monkies.sakshi@gmail.com లెటర్స్ డిసెంబర్ 26 సీరియల్‌కి వేసిన బొమ్మ బాపు బొమ్మని గుర్తుకు తెచ్చింది. సీత, రమ్య, స్వచ్ఛ, రుధిర, వైతరణి, మూలిక విలక్షణమైన ఈతరం పాత్రలు. త్రీ మంకీస్ నేటి తరానికి నచ్చే విలక్షణమైన హాస్య సీరియల్ అనడంలో సందేహం లేదు. - రాధేశ్యాం, చినగంజాం పాఠకులకు ఆహ్వానం! ‘ఈ కాలమ్ మీదే’ అనే కొత్త చర్చావేదికను సాక్షి ‘ఫ్యామిలీ’ త్వరలో ప్రారంభించబోతోంది. చర్చనీయాంశం మీ ఇష్టం. ఏ సామాజిక అంశాన్ననైనా, ఆలోచననైనా మీరు చర్చకు పెట్టొచ్చు. మీ వాదనను వినిపించవచ్చు. దానిని ఫ్యామిలీ ప్రచురిస్తుంది. దానిపై మిగతా పాఠకులనూ చర్చకు ఆహ్వానిస్తుంది. వెంటనే రాసి పంపండి. చర్చలో పాల్పంచుకోండి. మీ చర్చనీయాంశం పంపవలసిన చిరునామా: ‘ఈ కాలమ్ మీదే’ సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 ఇ-మెయిల్: sakshireaders@gmail.com -
త్రీమంకీస్ -71
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 71 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘కాదు. ఇప్పుడు నీకు కుడి వైపు’’ లోపల నించి నాయకుడి కంఠం అసహనంగా వినిపించింది. ‘‘నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఇటు వైపేగా?’’ వానర్ వెనక్కి తిరిగి కుడి చేతిని చూపిస్తూ అడిగాడు. ‘‘కాదు. వెనక్కి తిరిగితే చంపేస్తాం. నీ ఎడమ చేతి వైపు’’ నాయకుడు గొంతు చించుకుని అరిచాడు. ‘‘ఎటు వైపు? మేం కన్ఫ్యూజ్ అవుతున్నాం. కుడి వైపా? ఎడమ వైపా?’’ స్పీకర్లోంచి వినిపించింది. వెంటనే నాయకుడు వానర్ని కాల్చడానికి తుపాకీని గురి పెట్టాడు. ఇంకో దొంగ అతన్ని వారిస్తూ చెప్పాడు - ‘‘వాడు మూర్ఖుడు. వాడ్నేం చేయకు. రెండువైపులా అని చెప్పు. వీధికి రెండువైపులా ఉన్న పోలీస్ వేన్‌లని తీయమని చెప్పు.’’ ‘‘రెండు వైపులా అని చెప్పు’’ రెండో దొంగ సూచించాడు. అది విన్నాక పోలీస్ మళ్ళీ అడిగాడు. ‘‘ఇంకేమిటి?’’ ‘‘ఇంకేమిటి?’’ వానర్ వెనక్కి తిరగకుండా అడిగాడు. ‘‘నాకు స్పీకర్లోంచి అన్ని మాటలు వినిపిస్తున్నాయి వార్. నువ్వు నాకు మళ్ళీ చెప్పక్కర్లేదు.’’ ‘‘అర్థమైంది. నేను రిపీట్ చేయకూడదు. నేను ఇంక లోపలకి రావచ్చా?’’ వానర్ అడిగాడు. ‘‘అప్పుడే కాదు. మాకో వేన్ కావాలి. లెవెన్ సీటర్. మా వెంట ముగ్గురు ఉద్యోగస్థుల్ని బందీలుగా తీసుకెళ్తాం. మా బండిని ఎవరూ అనుసరించకూడదని చెప్పు.’’ ‘‘లెవెన్ సీటరా? ష్యూరా?’’ వానర్ అడిగాడు. ‘‘ష్యూరా ఏమిటి?’’ వానర్ గొంతు తగ్గించి చెప్పాడు - ‘‘వాళ్ళేం చేస్తారో తెలుసా? ఇలాంటి సందర్భాల్లో వాహనం కింద ఓ చిన్న రేడియో ట్రాన్స్మిటర్ని అమరుస్తారు. అందువల్ల వారు భౌతికంగా మిమ్మల్ని అనుసరించకపోయినా మీరు ఎక్కడ ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది.’’ ‘‘ఐతే వాళ్ళకి నువ్వు అదే చెప్పు. ట్రాన్స్మిటర్స్ని అమర్చకూడదు. లేదా బందీలని చంపేస్తాం.’’ ‘‘ఐనా...’’ వానర్ అనుమానంగా ఆగాడు. ‘‘ఏమిటి నీ అనుమానం? నువ్వు వార్తాహరుడివి మాత్రమే. నా పని నాకన్నా నీకు బాగా తెలుసని అనుకుంటున్నావా?’’ నాయకుడు కోపంగా అడిగాడు. ‘మీకన్నా నాకు బాగా తెలుసు’ వానర్ వాళ్ళకి వినపడకుండా గొణిగాడు. ‘‘ఎలాంటి హింసా లేకుండా అంతా మృదువుగా సాగాలన్నదే నా కోరిక. రక్తపాతం కూడదనుకుంటే ఇంకో ఆలోచన చెప్పనా?’’ వానర్ అడిగాడు. ‘‘సరే వార్. నువ్వే తెలివి గలవాడివి. అదేమిటో ఏడు’’ నాయకుడు అసహనంగా చెప్పాడు. ‘‘మీరు ఎలా పారిపోవాలో నిజంగా చెప్పమంటారా?’’ వానర్ అడిగాడు. ‘‘చెప్పు.’’ ‘‘నన్ను మీ స్థానంలో ఊహించుకుని ఆలోచిస్తే మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని అనిపిస్తోంది.’’ ‘‘అది మాకూ తెలుసు.’’ ‘‘మీరేం చేయాలో చెప్తాను. అక్కడ ఆగి ఉన్న బస్ని ఇవ్వమని కోరండి. దాన్ని వాళ్ళు మీకు వెంటనే ఇవ్వాల్సి ఉంటుంది. అందువల్ల దాంట్లో ఎలక్ట్రానిక్ పరికరాన్ని కాని, టైం రిలీజ్ టియర్ గేస్ గ్రనేడ్ కాని...’’ ‘‘ఆగాగు. ఏమిటది?’’ ‘‘టైం రిలీజ్ టియర్ గేస్ గ్రనేడ్. మీరు బయల్దేరిన కొద్దిసేపటికి ఆ గ్రనేడ్ పేలి లెవెన్ సీటర్ నిండా టియర్ గేస్ అలుముకుంటుంది. మీరు తప్పక దిగాలి. దిగిన మిమ్మల్ని కాల్చి చంపుతారు. లేదా పట్టుకుంటారు.’’ ‘‘ఓ మై గాడ్! నీకు ఇదంతా ఎలా తెలుసు?’’ నాయకుడు నివ్వెరపోయాడు. ‘‘దొంగతనం చేయబోయే ముందు మీరు గూగుల్‌లో ప్రికాషన్స్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే మీకూ తెలుస్తుంది. ఆ బస్‌లోకి బందీలని ఎక్కించుకున్నాక మీలోని ఒకరు దాన్ని డ్రైవ్ చేస్తూ బాగా రద్దీగా ఉన్న ప్రాంతానికి చేరుకోండి. ఏ ఆధార్ కార్డ్ జారీ కేంద్రానికి కాని, ఎరువులు అమ్మే దుకాణం ముందుకి కాని వెళ్తే చాలు. అక్కడ బస్ని ఆపి దిగి అంతా తలో దిక్కూ పారిపోండి.’’ ‘‘అందువల్ల ఏమిటి లాభం?’’ నాయకుడు అడిగాడు. ‘‘మీరు మొహం మీది తొడుగుల్ని తొలగించి ఆయుధాలని బస్‌లోనే వదిలి పారిపోతే, మీరూ బందీలని అంతా అనుకుంటారు. ఆ రద్దీలో కలిసిపోతే ఇక మిమ్మల్ని ఎవరూ పట్టుకోలేరు.’’ ‘‘ఇది బావుంది. నువ్వు మూర్ఖుడివి కావు. తెలివి గలవాడివే. తర్వాత?’’ ‘‘తర్వాత?’’ ‘‘ఆ తర్వాత ఏమిటి?’’ ‘‘ఓ! ఆ తర్వాత స్వేచ్ఛ. మరో దొంగతనం. ఈసారి మరింత పటిష్టంగా పథకం వేసుకోవాలి. నా మిత్రుడు కష్ కొంత రుసుముకి మీకు సహాయం చేస్తాడు.’’ ‘‘నీతో పనైంది. ఇంక లోపలకి రా’’ నాయకుడు ఆజ్ఞాపించాడు. ‘‘కాని నేను లోపలకి వస్తే మీరు నన్ను...’’ ‘‘... ముందు వెంటనే లోపలకి రా’’ నాయకుడు ఆజ్ఞాపించాడు. ‘‘నేను లోపలకి రావడానికి పోలీసుల అనుమతి తీసుకోవాలి అనుకుంటా. దాన్ని మీరు అడిగినట్లుగా అడగనా? లేక నా అంతట నేనే అడిగినట్లు అడగనా?’’ ‘‘ఈ క్షణమే రా. నా మూడ్ సరిగ్గా లేదు. కాల్చేస్తాను’’ నాయకుడు కఠినంగా చెప్పాడు. ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 3monkies.sakshi@gmail.com పాఠకులకు ఆహ్వానం! ‘ఈ కాలమ్ మీదే’ అనే కొత్త చర్చావేదికను సాక్షి ‘ఫ్యామిలీ’ త్వరలో ప్రారంభించబోతోంది. చర్చనీయాంశం మీ ఇష్టం. ఏ సామాజిక అంశాన్నైనా, ఆలోచననైనా మీరు చర్చకు పెట్టొచ్చు. మీ వాదనను వినిపించవచ్చు. దానిని ఫ్యామిలీ ప్రచురిస్తుంది. దానిపై మిగతా పాఠకులనూ చర్చకు ఆహ్వానిస్తుంది. వెంటనే రాసి పంపండి. చర్చలో పాలు పంచుకోండి. మీ చర్చనీయాంశం పంపవలసిన చిరునామా: ‘ఈ కాలమ్ మీదే’ సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 ఇ-మెయిల్: sakshireaders@gmail.com -
త్రీమంకీస్ -70
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 70 మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘సెలైన్స్. నాకున్నది ఒకే చెవి. నేను దొంగలు మాట్లాడేది విననా? పోలీసులు మాట్లాడేది విననా? లేక మీ కంఠాలు విననా? పోనీ మీలో ఒకరు ఇక్కడికి రండి. నేను మీ బదులు అక్కడ నించుని అరుస్తాను’’ వానర్ కోపంగా అరిచాడు. తర్వాత దొంగల వైపు తిరిగి అడిగాడు - ‘‘నేను లోపలకి రావచ్చా?’’ ‘‘మా డిమాండ్స్‌ని నీ ద్వారా పోలీసులకి చెప్పాక.’’ ‘‘సంతోషం. కాని నా ముందు, వెనకా కూడా తుపాకులు నాకు గురిపెట్టబడి ఉన్నాయి. నేను అర్జెంట్‌గా బాత్రూంకి వెళ్ళాలి. దీర్ఘశంక... టాయ్‌లెట్.’’ ‘‘ఖాళీ లేదు. మా వాడూ అదే పనిలో ఉన్నాడు. ఒకరి తర్వాత ఒకరం వెళ్తున్నాం. అసలు పని పూర్తయ్యేదాకా కదలక’’ నాయకుడు అరిచాడు. ‘‘కాని సినిమాల్లో ఇలాంటివి ఫోన్ ద్వారా చర్చించడం చూశాను.’’ ‘‘మాకే పాఠాలు చెప్తున్నావా? మేమో పొరపాటు చేశాం. ఇందాక మేం భయంతో తుపాకీని కాల్చినప్పుడు గుళ్ళు తగిలి లేండ్ లైన్ ఫోన్ పాడైంది. సెల్ నించి కుదరదు. బేంక్‌కి సెల్ ఫోన్స్ ఉండవు కాబట్టి ఆ ఫోన్ మా నించే అనే గేరంటీ వాళ్ళకి ఉండదుగా.’’ ‘‘మీ నంబర్ చెప్తే దానికి చేయమని వాళ్ళకి చెప్తాను.’’ ‘‘మమ్మల్ని ఇంకా ఇరికించడానికా? ముందు చేతులు పెకైత్తు.’’ ‘‘మర్చిపోయాను. సారీ. కాని రోడ్డుకి అవతల రెండు వందల మందికి పైనే గుమిగూడి ఉన్నారు. వాళ్ళందరి ముందూ అపరాధిలా చేతులు ఎత్తడం నాకు సిగ్గుగా ఉంది. దింపుతాను.’’ దొంగలు మళ్ళీ కొద్దిసేపు చర్చించుకున్నాక అడిగారు - ‘‘టివి వాళ్ళు వచ్చారా?’’ ‘‘తెలుగు, ఇంగ్లీష్, హిందీ... అన్ని ఛానల్స్ వాళ్ళూ వచ్చారు.’’ ‘‘సరే. మేం చెప్పిన మాట వినకపోతే నీ పేంట్, షర్ట్, ఉంటే అండర్‌వేర్‌ని నువ్వు విప్పాల్సి ఉంటుంది జాగ్రత్త.’’ ‘‘ఒద్దొద్దు. దాని బదులు కాల్చండి.’’ ‘‘వార్! నువ్వు నిప్పుతో చెలగాటమాడుతున్నావు అని తెలీక ఆటలాడుతున్నావు. వాళ్ళకి మా డిమాండ్స్ చెప్పు.’’ ‘‘సరే.’’ వానర్ మళ్ళీ వెనక్కి తిరిగి గట్టిగా చెప్పాడు - ‘‘వాళ్ళు తమ డిమాండ్స్‌ని చెప్పమంటున్నారు. అంటే వాళ్ళ డిమాండ్స్‌ని నేను చెప్తున్నాను. అంటే నా ద్వారా చెప్తున్నారు తప్ప నా డిమాండ్స్ కావు.’’ ‘‘మేము వినడానికి సిద్ధం వార్. కాని లోపల ఎవరికీ హాని జరక్కపోతేనే ఆలోచిస్తాం అని చెప్పు’’ లౌడ్ స్పీకర్లోంచి వినిపించింది. ‘‘గుడ్. అది సమంజసం. తెలివైన నిర్ణయం. మీరు చెప్పేది నాకు నచ్చింది’’ వానర్ బదులు చెప్పాడు. ‘‘షటప్! షటప్!’’ లోపల నించి నాయకుడి కంఠం వినిపించింది. ‘‘కాల్చక! నా అభిప్రాయం చెప్పానంతే.’’ ‘‘మా డిమాండ్స్ తప్ప నీ అభిప్రాయాల్ని చెప్పక. ముందు చుట్టుపక్కల మేడల మీది షార్ప్ షూటర్స్‌ని తొలగించాలని కోరుతున్నాం అని చెప్పు’’ నాయకుడు ఆజ్ఞాపించాడు. ‘‘తప్పకుండా. మంచి ఆలోచన... మేడల మీది గన్‌మెన్‌ని వెంటనే తొలగించాలన్నది మొదటి డిమాండ్. ఇది చెప్పేది నేను కాదు... నేనే కాని నేను కాదు... అంటే నా ద్వారా అని! అర్థమైందా?’’ ‘‘అయింది. ఇంకా?’’ వానర్ బేంక్ తలుపు వైపు చూస్తూ అడిగాడు. ‘‘ఇంకా?’’ ‘‘వెంటనే వాళ్ళు బేంక్‌కి కుడివైపు వీధి చివర ఆపిన పోలీస్ వేన్‌లని తొలగించాలి.’’ వానర్ ఆలోచించి అడిగాడు - ‘‘నా కుడివైపా?’’ ‘‘కాదు. మా కుడి వైపు.’’ ‘‘సరే.’’ వెనక్కి తిరిగి చెప్పాడు. ‘‘దొంగలు తమ కుడివైపు వీధి చివర ఆగి ఉన్న పోలీస్ వేన్‌లని వెంటనే తొలగించమని డిమాండ్ చేస్తున్నారు.’’ ‘‘వాళ్ళు మాకు కనపడటం లేదు. వారి కుడి చేతిని చూపించమనండి.’’ ‘‘వాళ్ళని బయటకి రమ్మననా?’’ కపీష్ అడిగాడు. ‘‘రమ్మను.’’ వానర్ మళ్ళీ వెనక్కి తిరగ్గానే లోపల నించి నాయకుడి కంఠం కోపంగా ఉపయోగించింది - ‘‘మేము రాం. మేం అడిగింది తప్ప ఇంకోసారి ఎక్స్ట్రా మాట్లాడితే కాల్చేస్తాం. నీ కుడి వైపు అని చెప్పు.’’ ‘‘ఇటు వైపా?’’ కుడి చేతిని చాపి అడిగాడు. ‘‘అవును.’’ వానర్ మళ్ళీ వెనక్కి తిరిగి చెప్పాడు. ‘‘క్షమించాలి. వాళ్ళు బయటకి రారట. ఇటువైపు వాహనాలని వెంటనే తొలగించమని డిమాండ్’’ తన కుడి చేతిని చాపి చూపిస్తూ చెప్పాడు. నాయకుడు తల పట్టుకుని చెప్పాడు. ‘‘ఇప్పుడు నీకు ఎడం వైపు అని చెప్పు.’’ ‘‘నా ఎడం వైపు’’ వానర్ తన ఎడమ చేతిని కూడా చాపి చెప్పాడు. ‘‘అంటే రెండు వైపులానా?’’ స్పీకర్లోంచి వినిపించింది. ‘‘కాదు. ఒక వైపు. ఇప్పుడు నాకు ఎడం వైపు. కదా?’’ వెనక్కి తిరిగి అడిగాడు.