త్రీమంకీస్ -71 | malladi special story | Sakshi
Sakshi News home page

త్రీమంకీస్ -71

Published Sun, Dec 28 2014 11:22 PM | Last Updated on Sat, Sep 2 2017 6:53 PM

త్రీమంకీస్ -71

త్రీమంకీస్ -71

డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 71
 - మల్లాది వెంకటకృష్ణమూర్తి


 ‘‘కాదు. ఇప్పుడు నీకు కుడి వైపు’’ లోపల నించి నాయకుడి కంఠం అసహనంగా వినిపించింది.
 ‘‘నేను కన్‌ఫ్యూజ్ అవుతున్నాను. ఇటు వైపేగా?’’ వానర్ వెనక్కి తిరిగి కుడి చేతిని చూపిస్తూ అడిగాడు.
 ‘‘కాదు. వెనక్కి తిరిగితే చంపేస్తాం. నీ ఎడమ చేతి వైపు’’ నాయకుడు గొంతు చించుకుని అరిచాడు.
 ‘‘ఎటు వైపు? మేం కన్‌ఫ్యూజ్ అవుతున్నాం. కుడి వైపా? ఎడమ వైపా?’’ స్పీకర్లోంచి వినిపించింది.
 వెంటనే నాయకుడు వానర్‌ని కాల్చడానికి తుపాకీని గురి పెట్టాడు. ఇంకో దొంగ అతన్ని వారిస్తూ చెప్పాడు - ‘‘వాడు మూర్ఖుడు. వాడ్నేం చేయకు. రెండువైపులా అని చెప్పు. వీధికి రెండువైపులా ఉన్న పోలీస్ వేన్‌లని తీయమని చెప్పు.’’
 ‘‘రెండు వైపులా అని చెప్పు’’ రెండో దొంగ సూచించాడు.
 అది విన్నాక పోలీస్ మళ్ళీ అడిగాడు.
 ‘‘ఇంకేమిటి?’’
 ‘‘ఇంకేమిటి?’’ వానర్ వెనక్కి తిరగకుండా అడిగాడు.
 ‘‘నాకు స్పీకర్లోంచి అన్ని మాటలు వినిపిస్తున్నాయి వార్. నువ్వు నాకు మళ్ళీ చెప్పక్కర్లేదు.’’
 ‘‘అర్థమైంది. నేను రిపీట్ చేయకూడదు. నేను ఇంక లోపలకి రావచ్చా?’’ వానర్ అడిగాడు.
 ‘‘అప్పుడే కాదు. మాకో వేన్ కావాలి. లెవెన్ సీటర్. మా వెంట ముగ్గురు ఉద్యోగస్థుల్ని బందీలుగా తీసుకెళ్తాం. మా బండిని ఎవరూ అనుసరించకూడదని చెప్పు.’’
 ‘‘లెవెన్ సీటరా? ష్యూరా?’’ వానర్ అడిగాడు.
 ‘‘ష్యూరా ఏమిటి?’’
 వానర్ గొంతు తగ్గించి చెప్పాడు - ‘‘వాళ్ళేం చేస్తారో తెలుసా? ఇలాంటి సందర్భాల్లో వాహనం కింద ఓ చిన్న రేడియో ట్రాన్స్‌మిటర్‌ని అమరుస్తారు. అందువల్ల వారు భౌతికంగా మిమ్మల్ని అనుసరించకపోయినా మీరు ఎక్కడ ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది.’’
 ‘‘ఐతే వాళ్ళకి నువ్వు అదే చెప్పు. ట్రాన్స్‌మిటర్స్‌ని అమర్చకూడదు. లేదా బందీలని చంపేస్తాం.’’
 ‘‘ఐనా...’’ వానర్ అనుమానంగా ఆగాడు.
 ‘‘ఏమిటి నీ అనుమానం? నువ్వు వార్తాహరుడివి మాత్రమే. నా పని నాకన్నా నీకు బాగా తెలుసని అనుకుంటున్నావా?’’ నాయకుడు కోపంగా అడిగాడు.
 ‘మీకన్నా నాకు బాగా తెలుసు’ వానర్ వాళ్ళకి వినపడకుండా గొణిగాడు.
 ‘‘ఎలాంటి హింసా లేకుండా అంతా మృదువుగా సాగాలన్నదే నా కోరిక. రక్తపాతం కూడదనుకుంటే ఇంకో ఆలోచన చెప్పనా?’’ వానర్ అడిగాడు.
 ‘‘సరే వార్. నువ్వే తెలివి గలవాడివి. అదేమిటో ఏడు’’ నాయకుడు అసహనంగా చెప్పాడు.
 ‘‘మీరు ఎలా పారిపోవాలో నిజంగా చెప్పమంటారా?’’ వానర్ అడిగాడు.
 ‘‘చెప్పు.’’
 ‘‘నన్ను మీ స్థానంలో ఊహించుకుని ఆలోచిస్తే మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని అనిపిస్తోంది.’’
 ‘‘అది మాకూ తెలుసు.’’
 ‘‘మీరేం చేయాలో చెప్తాను. అక్కడ ఆగి ఉన్న బస్‌ని ఇవ్వమని కోరండి. దాన్ని వాళ్ళు మీకు వెంటనే ఇవ్వాల్సి ఉంటుంది. అందువల్ల దాంట్లో ఎలక్ట్రానిక్ పరికరాన్ని కాని, టైం రిలీజ్ టియర్ గేస్ గ్రనేడ్ కాని...’’
 ‘‘ఆగాగు. ఏమిటది?’’
 ‘‘టైం రిలీజ్ టియర్ గేస్ గ్రనేడ్. మీరు బయల్దేరిన కొద్దిసేపటికి ఆ గ్రనేడ్ పేలి లెవెన్ సీటర్ నిండా టియర్ గేస్ అలుముకుంటుంది. మీరు తప్పక దిగాలి. దిగిన మిమ్మల్ని కాల్చి చంపుతారు. లేదా పట్టుకుంటారు.’’
 ‘‘ఓ మై గాడ్! నీకు ఇదంతా ఎలా తెలుసు?’’ నాయకుడు నివ్వెరపోయాడు.
 ‘‘దొంగతనం చేయబోయే ముందు మీరు గూగుల్‌లో ప్రికాషన్స్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే మీకూ తెలుస్తుంది. ఆ బస్‌లోకి బందీలని ఎక్కించుకున్నాక మీలోని ఒకరు దాన్ని డ్రైవ్ చేస్తూ బాగా రద్దీగా ఉన్న ప్రాంతానికి చేరుకోండి. ఏ ఆధార్ కార్డ్ జారీ కేంద్రానికి కాని, ఎరువులు అమ్మే దుకాణం ముందుకి కాని వెళ్తే చాలు. అక్కడ బస్‌ని ఆపి దిగి అంతా తలో దిక్కూ పారిపోండి.’’
 ‘‘అందువల్ల ఏమిటి లాభం?’’ నాయకుడు అడిగాడు.
 ‘‘మీరు మొహం మీది తొడుగుల్ని తొలగించి ఆయుధాలని బస్‌లోనే వదిలి పారిపోతే, మీరూ బందీలని అంతా అనుకుంటారు. ఆ రద్దీలో కలిసిపోతే ఇక మిమ్మల్ని ఎవరూ పట్టుకోలేరు.’’
 ‘‘ఇది బావుంది. నువ్వు మూర్ఖుడివి కావు. తెలివి గలవాడివే. తర్వాత?’’
 ‘‘తర్వాత?’’
 ‘‘ఆ తర్వాత ఏమిటి?’’
 ‘‘ఓ! ఆ తర్వాత స్వేచ్ఛ. మరో దొంగతనం. ఈసారి మరింత పటిష్టంగా పథకం వేసుకోవాలి. నా మిత్రుడు కష్ కొంత రుసుముకి మీకు సహాయం చేస్తాడు.’’
 ‘‘నీతో పనైంది. ఇంక లోపలకి రా’’ నాయకుడు ఆజ్ఞాపించాడు.
 ‘‘కాని నేను లోపలకి వస్తే మీరు నన్ను...’’
 ‘‘... ముందు వెంటనే లోపలకి రా’’ నాయకుడు ఆజ్ఞాపించాడు.
 ‘‘నేను లోపలకి రావడానికి పోలీసుల అనుమతి తీసుకోవాలి అనుకుంటా. దాన్ని మీరు అడిగినట్లుగా అడగనా? లేక నా అంతట నేనే అడిగినట్లు అడగనా?’’
 ‘‘ఈ క్షణమే రా. నా మూడ్ సరిగ్గా లేదు. కాల్చేస్తాను’’ నాయకుడు కఠినంగా చెప్పాడు.
 
ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 3monkies.sakshi@gmail.com
 

పాఠకులకు ఆహ్వానం!
‘ఈ కాలమ్ మీదే’ అనే కొత్త చర్చావేదికను సాక్షి ‘ఫ్యామిలీ’ త్వరలో ప్రారంభించబోతోంది. చర్చనీయాంశం మీ ఇష్టం. ఏ సామాజిక అంశాన్నైనా, ఆలోచననైనా మీరు చర్చకు పెట్టొచ్చు. మీ వాదనను వినిపించవచ్చు. దానిని ఫ్యామిలీ ప్రచురిస్తుంది. దానిపై మిగతా పాఠకులనూ చర్చకు ఆహ్వానిస్తుంది. వెంటనే రాసి పంపండి. చర్చలో పాలు పంచుకోండి.  మీ చర్చనీయాంశం పంపవలసిన చిరునామా:  ‘ఈ కాలమ్ మీదే’ సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34  ఇ-మెయిల్: sakshireaders@gmail.com

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement