త్రీమంకీస్ -73 | malladi specail story | Sakshi
Sakshi News home page

త్రీమంకీస్ -73

Published Tue, Dec 30 2014 11:27 PM | Last Updated on Sat, Sep 2 2017 6:59 PM

త్రీమంకీస్ -73

త్రీమంకీస్ -73

 డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 73
 - మల్లాది వెంకటకృష్ణమూర్తి
 
21
 మర్కట్ బాబాయ్ ఇంటి ముందు ఆటో దిగిన వానర్ తలుపు మీద తట్టాడు. మర్కట్ కంఠం వినిపించింది.
 ‘‘ఎవరది? పోలీసా? .. ఇంత త్వరగా ఎలా కనుక్కున్నారు?’’ మర్కట్ గొంతు తగ్గించి భయంగా కపీష్‌ని అడిగాడు.
 ‘‘వానర్‌ని. తలుపు తెరవండి.’’
 తలుపు తెరవగానే వానర్ లోపలకి వెళ్ళాడు. టివిలో ఆ ఉదంతమే వార్తగా ప్రసారం అవుతోంది. ముఖాన సాక్స్‌తో పరిగెత్తే వానర్ టివిలో కనపడ్డాడు.
 ‘‘నాకోసం ఆగకుండా కారులో ఎందుకు వచ్చేశారు?’’ వానర్ చిరుకోపంగా అడిగాడు.
 ‘‘నువ్వు తిరిగి ప్రాణాలతో వస్తావనుకోలేదు. ఏం జరిగింది?’’
 ‘‘కొద్దిసేపు ఆగితే టివినే చెప్తుంది. నాకో కోక్ కేన్ ఇవ్వు.’’
 అది ఓపెన్ చేసి ఓ గుక్క తాగి సోఫాలో పడుకుని నిస్సహాయంగా చెప్పాడు - ‘‘నా గుండె ఎన్నిసార్లు ఆగి, మళ్ళీ ఎన్నిసార్లు తిరిగి పని చేసిందో? ఈసారి కూడా ముగ్గురం విఫలం అయ్యాం. మనకి దొంగతనం చేతకాదు.’’
 కపీష్ నవ్వుతూ లేచి వెళ్ళి కిచెన్‌లోని బియ్యం బస్తాలని అందుకుని నేల మీద కుమ్మరించాడు. అందులోంచి బయటకి వచ్చిన నోట్ల కట్టలని చూసి వానర్ నిర్ఘాంతపోయి, లేచి కూర్చుని, మళ్ళీ లేచి నమ్మలేనట్లుగా అడిగాడు.
 ‘‘ఇంత డబ్బు ఎక్కడిది?’’
 ‘‘బేంక్ నించి దోచి తెచ్చిన సొమ్ము’’ మర్కట్ నవ్వుతూ చెప్పాడు.
 ‘‘ఇదెలా సాధ్యం?’’
 ‘‘మనిద్దరిలోకీ కపీష్ తెలివిగలవాడు’’ మర్కట్ కపీష్ భుజాన్ని ఆప్యాయంగా తడుతూ చెప్పాడు.
 ‘‘ఇది నిజం డబ్బేనా?’’
 ‘‘అవును.’’
 ‘‘ఇది ఎలా దొంగిలించారు?’’
 ‘‘నిన్ను ఆ దొంగలు తీసుకెళ్ళాక కపీష్ అక్కడి ఉద్యోగస్థులందరితో, బేంక్ సొమ్ము దొంగలు దోచుకోకుండా కాపాడాలని, దాన్ని సొరంగంలోంచి బయటకి తీసుకెళ్దామని చెప్పాడు. తను బేంక్ డబ్బుని కాపాడాడనే పేరు తెచ్చుకోవాలని మేనేజర్ ఆశపడ్డాడు. ఓ తాళం చెవి బేంక్ ఆఫీసర్ దగ్గర, మరొకటి హెడ్ కేషియర్ దగ్గర ఉన్నాయి. బేంక్ మేనేజర్ సూచన మేరకు వాళ్ళిద్దరూ తాళం చెవులని ఉపయోగించి బేంక్ డబ్బు దాచిన సేఫ్ లాకర్ని తెరిచారు. ఆ డబ్బుని బేంకు సిబ్బందే ఈ గోనె సంచుల్లో నీట్‌గా సర్దారు. వాటితో అంతా సొరంగంలోంచి బయటపడ్డాం. కారు దగ్గరకి తీసుకెళ్ళి అది సిఐడి కారు కాబట్టి దాని మీద పోలీస్ కారు అనే గుర్తులు ఏమీ ఉండవని చెప్తే, ఆ డబ్బుని బేంక్ ఉద్యోగస్థులే డిక్కీలో ఉంచారు. దాన్ని సమీప పోలీస్ స్ట్టేషన్‌కి తీసుకెళ్ళి భద్రపరుస్తామని, వారు ఇంటికి వెళ్ళి తమ వారికి కనపడి, సాయంత్రం ఐదున్నరకి పోలీస్ స్టేషన్‌కి వచ్చి స్టేట్‌మెంట్‌ని ఇవ్వమని, టివి వాళ్ళు ఉంటారు కాబట్టి మంచి బట్టలు వేసుకుని రమ్మని చెప్తే నమ్మి వెళ్ళిపోయారు. అప్పటికే వారు మానసికంగా అలసిపోవడంతో సరిగ్గా ఆలోచించలేని స్థితిలో ఉన్నారు. వాళ్ళంతా ఇప్పుడు తమ ఇళ్ళల్లోని తమ వాళ్ళ ముందు హీరోలుగా ఫీలవుతూ సాయంత్రం వేసుకురావాల్సిన బట్టలని ఇస్త్రీ చేయించుకుంటూండి ఉంటారు’’
 ‘‘దట్స్ గుడ్’’వానర్ పకపక నవ్వాడు.
 తర్వాత ఒంగి ఓ కట్టని అందుకుని దాని వంక చూశాడు. వెంటనే అతని మొహం పాలిపోయింది.
 ‘‘గురూ! ఇవన్నీ దొంగ నోట్లు. వందకి ఒకటి పక్కన రెండు సున్నాలు ఉండాలిగా? వీటికి మూడు సున్నాలు ఉన్నాయి.’’
 ‘‘నువ్వు ఇంతదాకా వెయ్యి రూపాయల నోట్‌ని చూడలేదా?’’ మర్కట్ నవ్వుతూ అడిగాడు.
 ‘‘లేదు. వెయ్యి రూపాయల నోట్లు కూడా ఉన్నాయా?.’’
 ‘‘వెయ్యి నోట్‌నే ఇంతదాకా నువ్వు చూడలేదంటే తెలంగాణా ఆహార భద్రతా పథకానికి కార్డు ఉన్నా, లేకపోయినా నువ్వు అర్హుడివి’’ కపీష్ నవ్వుతూ చెప్పాడు.
 అంత డబ్బుని ఎన్నడూ చూడని ఆ ముగ్గురూ ఆనందాన్ని పట్టలేక గట్టిగా అరుస్తూ ఆ నోట్ల కట్టలని ఒకరి మీదకి మరొకరు వేసి కొట్టుకుంటూ, గాల్లోకి ఎగరేసి పట్టుకుంటూ పగలబడి నవ్వసాగారు. ఆనందం తీరాక ఆ కట్టలన్నిటినీ మూడు భాగాలుగా విభజించారు. ముగ్గురూ విడివిడిగా లెక్క పెట్టుకున్నాక మర్కట్ ఆనందంగా చెప్పాడు.
 ‘‘వావ్! మనం కోటీశ్వరులం అయ్యాం.’’
 డబ్బు కట్టల పక్కన నిలబడి ఒకొక్కరూ ఫొటోలు తీసుకున్నారు.
 ‘‘రండి. ముగ్గురం కలిని తీసుకుందాం’’ వానర్ మిత్రులు ఇద్దర్నీ ఉత్సాహంగా పిలిచాడు.
 ‘‘దీన్ని నీ ఎఫ్‌బిలో పోస్ట్ చేయక’’ మర్కట్ వానర్‌కి హెచ్చరికగా చెప్పాడు.
 ‘‘రేపు మన ఫొటోలు పేపర్లో ఫ్రంట్ పేజీలో వస్తాయి’’ కపీష్ నవ్వుతూ చెప్పాడు.
 
- మళ్లీ  రేపు
 
ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి  టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 3monkies.sakshi@gmail.com
 
పాఠకులకు ఆహ్వానం!
‘ఈ కాలమ్ మీదే’ అనే కొత్త చర్చావేదికను సాక్షి ‘ఫ్యామిలీ’ త్వరలో ప్రారంభించబోతోంది. చర్చనీయాంశం మీ ఇష్టం. ఏ సామాజిక అంశాన్ననైనా, ఆలోచననైనా మీరు చర్చకు పెట్టొచ్చు.
 మీ వాదనను వినిపించవచ్చు. దానిని ఫ్యామిలీ ప్రచురిస్తుంది. దానిపై మిగతా పాఠకులనూ చర్చకు ఆహ్వానిస్తుంది. వెంటనే రాసి పంపండి. చర్చలో పాల్పంచుకోండి.  మీ చర్చనీయాంశం పంపవలసిన చిరునామా:  ‘ఈ కాలమ్ మీదే’ సాక్షి ఫ్యామిలీ, సాక్షి  టవర్స్,
 రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34  
 ఇ-మెయిల్:sakshireaders@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement