త్రీమకీస్ -69 | malladi special | Sakshi
Sakshi News home page

త్రీమకీస్ -69

Published Fri, Dec 26 2014 11:27 PM | Last Updated on Sat, Sep 2 2017 6:47 PM

త్రీమకీస్ -69

త్రీమకీస్ -69

డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 69
 - మల్లాది వెంకటకృష్ణమూర్తి
 
 ‘‘అర్థమైందా?’’ నాయకుడు అడిగాడు.
 ‘‘అయింది.’’
 వానర్ ఓసారి కాలర్ సర్దుకుని తలుపు వైపు నడిచాడు.
 ‘‘మేము గమనిస్తూనే ఉంటాం. జాగ్రత్త’’ నాయకుడు హెచ్చరించాడు.
 వానర్ బయటకి నడిచి చేతులు పెకైత్తి గట్టిగా అరిచాడు - ‘‘కాల్చకండి. నేను దొంగల్లో ఒకర్ని కాదు.’’
 చుట్టూ చూశాడు. ఆ వీధిలో కొన్ని పోలీస్‌వేన్‌లు, ఓ బస్ అటు, ఇటు నిలబడి ఆ రోడ్‌ని రెండుపక్కలా మూసేశాయి. నాలుగైదు పోలీస్‌కార్లు ఎదురుగా ఆగి ఉన్నాయి. వాటి వెనక దాక్కున్న పోలీసుల చేతుల్లోని తుపాకీ గొట్టాలు వానర్ వైపు గురిపెట్టి ఉన్నాయి. అంతా తన వంకే చూస్తున్నారని వానర్ గ్రహించాడు. చుట్టుపక్కల మేడల మీద టెలిస్కోప్స్ అమర్చిన గన్స్‌తో పోలీసులు ఉన్నారని కూడా గ్రహించాడు. రెండు అంబులెన్స్‌లు, పక్కనే తెల్ల కోట్లు ధరించిన వైద్యులు కనిపించారు. ఓ పోలీస్ అధికారి అతన్నే జాగ్రత్తగా గమనిస్తున్నాడు.
 వానర్ బేంక్‌లోని దొంగలతో చెప్పాడు - ‘‘మీరూ కాల్చకండి. మీ డిమాండ్స్ గురించి మాట్లాడాలిగా!’’
 ‘‘నువ్వెవరు?’’ లౌడ్ స్పీకర్లోంచి పోలీస్ అధికారి కంఠం వినిపించింది.
 ‘‘నేను మనిషిని.’’
 ‘‘కన్‌ఫ్యూజ్ అవక. భయపడక. నేనడిగింది నువ్వు బేంక్ కస్టమర్‌వా లేక ఉద్యోగివా అని’’ మళ్ళీ వినపడింది.
 ‘‘ఆ రెండూ కాదనుకుంటా.’’
 ‘‘సరే. నీ పేరు?’’
 ‘‘వార్. ఆంగ్లో ఇండియన్‌ని.’’
 కొద్దిసేపు నిశ్శబ్దం. తర్వాత అదే కంఠం స్పీకర్లోంచి వినిపించింది - ‘‘లోపల ఎలా ఉంది?’’
 ‘‘అంతా బావుంది. తుపాకీ గుళ్ళతో లోపల రంధ్రాలు పడి కొన్ని పెచ్చులు నేల మీద పడ్డాయి. తర్వాత స్వచ్ఛభారత్ వాలంటీర్లని పిలిపించండి.’’
 ‘‘ఎవరికైనా హాని జరిగిందా?’’
 ‘‘లేదు. వీళ్ళు అహింసా సిద్ధాంతం గల దొంగలు.’’
 ‘‘కాదని చెప్పు’’ లోపల నించి అతనికి వినిపించింది.
 ‘‘ముందు అందరి మానసిక వత్తిడిని తగ్గించాలని, అది ముఖ్యం అని అలా చెప్పాను. ఇంత దాకా మీరు ఎవరికీ హాని చేయలేదని వాళ్ళకి తెలిస్తే మీ మీద గౌరవం కలుగుతుంది’’ వానర్ చెప్పాడు.
 దొంగలు ఒకరితో మరొకరు చర్చించుకున్నాక నాయకుడు కసిరాడు - ‘‘పెరగాల్సింది గౌరవం కాదు. భయం’’ అని!
 ‘‘లోపల అసలేం జరిగింది?’’ పోలీస్ ఆఫీసర్ అడిగాడు.
 ‘‘నేను ఇప్పుడే లోపలకి వచ్చాను. కాబట్టి నాకు తెలీదు.’’
 ‘‘ఇప్పుడే వచ్చావా వార్? బేంకులోకి దొంగలు ప్రవేశించిన రెండున్నర గంటల నించి నువ్వు అక్కడ ఉన్నావు.’’
 ‘‘అవునవును. రెండున్నర గంటలూ రెండున్నర నిమిషాల్లా గడిచిపోయాయని చెప్పదలచుకున్నాను’’ వానర్ చెప్పాడు.
 ‘‘చేతులు దించి మా వైపు రా. మేం కాల్చం.’’
 వానర్ చేతులు దింపి చెప్పాడు.
 ‘‘నొప్పిగా ఉంటే దింపా తప్ప మీరు దింపమన్నందుకు కాదు. నేను పేవ్‌మెంట్ దిగితే దొంగలు నన్ను కాల్చేస్తారు. వీరు అహింసావాదులు కారు. హింసావాదులు అని చెప్పమన్నారు.’’
 ‘‘ఇక్కడ బేంక్ ఉద్యోగస్థులు, కస్టమర్ల బంధుమిత్రులు ఆదుర్దాగా ఉన్నారు. లోపల ఏం జరిగిందో తెలుసుకోవాలి. కాబట్టి వారి అనుమతి తీసుకుని ఇక్కడికి రా. మళ్ళీ వెనక్కి వెళ్ళచ్చు.’’
 దొంగలు మళ్ళీ ఒకళ్ళని మరొకరు సంప్రదించుకున్నారు
 ‘‘వార్! వార్!’’ లోపల నించి వినిపించింది.
 ‘‘ఏమిటి?’’ వెనక్కి తిరిగి అడిగాడు.
 ‘‘వాళ్ళెవరు - చేతులు దింపమనడానికి? చేతులు పెకైత్తే ఉంచు. లేదా...’’
 వెంటనే వానర్ చేతులు పెకైత్తి చెప్పాడు - ‘‘ఎత్తకపోతే దొంగలు కాల్చేస్తామంటున్నారు. వాళ్ళు హింసావాదులు.’’
 ‘‘నీకు చెవుడా, ఇందాకటి నించి పిలుస్తూంటే? ఇంకోసారి మేం చెప్పింది నీకు వినపడకపోతే నీ కాళ్ళ మీద కాలుస్తాం. నువ్వు రోడ్డు మీద పడిపోయి రక్తం కారుతూ మా డిమాండ్స్ చెప్తావో లేక నించుని చెప్తావో నీ ఇష్టం’’ లోపల నించి నాయకుడు అరిచాడు.
 వెంటనే వెనక్కి తిరిగి తలుపు వైపు అడుగులు వేసి చెప్పాడు.
 ‘‘సారీ! వినపడలేదు. మీరు కూడా ఇక్కడికి వచ్చి నిలబడితే నా పరిస్థితి అర్థం అవుతుంది. వాళ్ళలా లౌడ్ స్పీకర్‌లో చెప్తారా? అది మీ డిమాండ్ అని అడగనా?’’
 ‘‘ముందు చేతులు పెకైత్తు.’’
 ‘‘ఓ! సారీ. మరిచాను.’’
 వెంటనే రోడ్డు అవతల గుమిగూడిన వారి నించి ప్రశ్నలు గట్టిగా వినపడ్డాయి - ‘‘మా వారెలా ఉన్నారు?... మా కూతురు ఎలా ఉంది?... ఎర్ర షర్ట్‌లోని బట్టతలాయనకి ఇంకా ఏం కాలేదుగా?’’
 
 (దొంగలు పెట్టిన డిమాండ్స్...?)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement