Malladhi venkatakrsnamurthi
-
త్రీమంకీస్ - 75
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 75 మల్లాది వెంకటకృష్ణమూర్తి 22 శంషాబాద్ ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ డిపార్చర్ లాంజ్ ముందు ఆగిన ఇన్నోవా కారులోంచి ముగ్గురు దిగారు. వారి చేతుల్లో మూడు ఎయిర్బేగ్లు ఉన్నాయి. ఒంటి మీద ఖరీదైన టీ షర్ట్లు, బూట్లు. వానర్ ఆ కొత్త వాతావరణాన్ని కొద్దిగా బెరుకుగా చూస్తూంటే కపీష్, మర్కట్లు బింకంగా ఉన్నారు. ‘‘పోర్టర్ కావాలా?’’ ఒకతను వచ్చి ఇంగ్లీష్‌లో అడిగాడు. ‘‘పెట్టెకి ఎంత?’’ వానర్ అడిగాడు. ‘‘మన దగ్గర పెట్టెల్లేనప్పుడు ఎందుకా ప్రశ్న?’’ మర్కట్ కసిరాడు. ‘‘తెలుసుకుందామని.’’ ‘‘ముంబైకి వెళ్ళే విమానం ఎక్కడ ఎక్కాలి?’’ కపీష్ అతన్ని అడిగాడు. ‘‘రండి చూపిస్తాను. మీ ఎయిర్ బేగ్స్ ఇవ్వండి’’ అతను వాటిని తీసుకోబోయాడు. ‘‘పోర్టర్ అవసరం లేదు.’’ ‘‘ఆ డోర్లోంచి లోపలకి వెళ్ళండి’’ నిర్లక్ష్యంగా చేతినెత్తి చూపించి వెళ్ళిపోయాడు. ముగ్గురూ ఓ కాలి వంతెనని దాటి ఎదురుగా ఉన్న అద్దాల తలుపు వైపు నడిచారు. యూనిఫాంలోని పోలీస్ ఆపి అడిగాడు - ‘‘టిక్కెట్, ఐడెంటిటీ ప్లీజ్.’’ వాళ్ళు టిక్కెట్ ప్రింటవుట్‌ని, ఆధార్ కార్డ్‌ని చూపించారు. అతను కపీష్ది మాత్రమే చూసి ముగ్గుర్నీ లోపలకి వదిలాడు. ‘‘పబ్లిక్ టాయ్‌లెట్‌ని ఉపయోగించడానికి ఆధార్ కార్డ్‌ని తప్పనిసరి చేసి తెలంగాణా ప్రభుత్వం మంచి పని చేసింది. లేదా ఆధార్ కార్డులని మనం తీసుకునే వాళ్ళమే కాదు’’ మర్కట్ చెప్పాడు. ‘‘భలే గుర్తు చేశావ్. ఎందుకైనా మంచిది. వానర్! నువ్వు ఓసారి బాత్రూంకి వెళ్ళి బ్లాడర్‌ని ఖాళీ చేసి రా’’ కపీష్ హెచ్చరించాడు. ‘‘అవును. లేదా వాళ్ళు విమానంలోంచి మనల్ని దింపేస్తారు’’ మర్కట్ కూడా దానికి మద్దతుని తెలిపాడు. ‘జెంట్స్ రూం’లో వానర్‌కి తన ప్రిన్సిపాల్ తారసపడ్డాడు. ‘‘ఏం ఉద్యోగం చేస్తున్నావు? అమెరికాలోనా?’’ ఆయన అడిగాడు. ‘‘లేదు సార్. ఇంకా నాకు ఉద్యోగం దొరకలేదు’’ వానర్ జవాబు చెప్పాడు. పని కానిచ్చాక వానర్ బయటికి వచ్చాడు. ప్రిన్సిపాల్ కొద్ది క్షణాల తర్వాత బయటికి వచ్చి వ్యంగ్యంగా చెప్పాడు - ‘‘నువ్వు వాష్ బేసిన్లో చేతులు కడుక్కోలేదు. కాబట్టి నిరుద్యోగిగానే ఉండిపోయావు. నేను ప్రిన్సిపాల్‌ని కాబట్టి చేతులు కడుక్కుని వచ్చాను.’’ వానర్ ఏమాత్రం తొట్రుపడకుండా జవాబు చెప్పాడు. ‘‘నిరుద్యోగి చేతులు తడవకుండా ఆ పని చేస్తాడు ప్రిన్సిపాల్ గారు.’’ వాళ్ళు ఓ క్యూలో నిలబడి కౌంటర్ దగ్గరకి వెళ్ళాక టిక్కెట్‌ని చూసి కౌంటర్లోని వ్యక్తి చెప్పాడు - ‘‘ఇది స్పైస్‌జెట్ కౌంటర్. మీరు వెళ్ళాల్సింది ఇండిగో. అటు వెళ్ళండి.’’ ముగ్గురూ మళ్ళీ అక్కడికి వెళ్ళి క్యూలో నిలబడ్డారు. తమ వంతు వచ్చాక తమ టికెట్స్‌ని, తన ఐడెంటిటీ కార్డ్‌ని కపీష్ చూపించాడు. అతని టి షర్ట్ మీది ఇంగ్లీష్ మాటలని అతను చదివాడు. ష్! ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్లీపింగ్. ‘‘చెకిన్ బేగేజ్ ఉందా?’’ కౌంటర్లోని వ్యక్తి అడిగాడు. ‘‘సారీ?’’ అర్థంకాక కపీష్ అడిగాడు. అతను ఫస్ట్ ఫ్లయర్ అని గ్రహించిన కౌంటర్లోని వ్యక్తి ముగ్గురి దగ్గరా ఎయిర్ బేగ్స్ మాత్రమే ఉండటం చూసి అడిగాడు. ‘‘అవికాక ఇంకేమైనా సామాను ఉందా?’’ ‘‘లేదు.’’ మూడు టేగ్స్ ఇచ్చి చెప్పాడు. ‘‘వీటిని ఎయిర్ బేగ్స్కి కట్టండి. విమానంలోకి ఎక్కే దాకా ఇవి పడిపోకుండా చూసుకోండి... మీ ఐడెంటిటీ కార్డ్స్ చూపిస్తారా?’’ మిగిలిన ఇద్దర్నీ అడిగాడు. ‘‘గేట్ దగ్గర ఒక్కరిదే చూశారు?’’ ‘‘అతను తప్పు చేశాడు. నేనా తప్పు చేయకూడదు.’’ ఇద్దరూ తమ ఆధార్ కార్డ్‌లని చూపించారు. ముగ్గురి బోర్డింగ్ పాస్‌లని కపీష్‌కి ఇచ్చి, ఓ దాన్లోని బోర్డింగ్ టైం గేట్ నంబర్లని రౌండ్ చేసి చెప్పాడు - ‘‘మీ గేట్ నంబర్ ఇరవై ఒకటి. అటు వెళ్ళాలి. ఎంజాయ్ యువర్ ట్రిప్.’’ ‘‘థాంక్యూ.’’ ‘‘యువర్ అటెన్షన్ ప్లీజ్. ఇండిగో ఫ్ల్లైట్ నంబర్ 000 డిపార్టింగ్ టు ముంబై ఈజ్ రెడీ ఫర్ ఇమీడియెట్ డిపార్చర్.’’ ముగ్గురూ సెక్యూరిటీ చెక్లోకి వెళ్ళారు. ‘‘బూట్లు విప్పాలి’’ సెక్యూరిటీ అతను చెప్పాడు. ‘‘దేనికి? లోపల దేవుడి విగ్రహం ఉందా?’’ వానర్ అడిగాడు. ‘‘కాదు. రిచర్డ్ రెయిడ్ అనే అతను బూటులో పేలుడు పదార్థాన్ని పెట్టుకుని వెళ్ళాడు. అప్పటినించి అన్ని బూట్లని స్కానింగ్ చేస్తున్నాం’’ అతను ఓపికగా జవాబు చెప్పాడు. ‘‘ఇంకా నయం. రిచర్డ్ రెయిడ్ అండర్వేర్లో దాన్ని దాచి పెట్టుకుని వెళ్ళలేదు’’ వానర్ వెంటనే చెప్పాడు చెకింగ్ అయాక వెళ్ళి తమ గేట్‌లోని కుర్చీల్లో కూర్చున్నారు. ఓ అందమైన అమ్మాయి ఒంటరిగా కూర్చుని సెల్ఫోన్లో ఎవరితోనో ఛాటింగ్ చేస్తోంది. ఆమె దగ్గరకి వెళ్ళి వానర్ అడిగాడు - ‘‘ఎక్స్‌క్యూజ్‌మి. మీ పక్క సీట్ ఖాళీయేనా?’’ ‘‘ఖాళీయే. మీరు కూర్చుంటే నా సీట్ కూడా ఖాళీ అవుతుంది’’ చెప్పి ఆమె మళ్ళీ ఛాటింగ్‌లో మునిగిపోయింది. -
త్రీమంకీస్ -73
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 73 - మల్లాది వెంకటకృష్ణమూర్తి 21 మర్కట్ బాబాయ్ ఇంటి ముందు ఆటో దిగిన వానర్ తలుపు మీద తట్టాడు. మర్కట్ కంఠం వినిపించింది. ‘‘ఎవరది? పోలీసా? .. ఇంత త్వరగా ఎలా కనుక్కున్నారు?’’ మర్కట్ గొంతు తగ్గించి భయంగా కపీష్‌ని అడిగాడు. ‘‘వానర్ని. తలుపు తెరవండి.’’ తలుపు తెరవగానే వానర్ లోపలకి వెళ్ళాడు. టివిలో ఆ ఉదంతమే వార్తగా ప్రసారం అవుతోంది. ముఖాన సాక్స్‌తో పరిగెత్తే వానర్ టివిలో కనపడ్డాడు. ‘‘నాకోసం ఆగకుండా కారులో ఎందుకు వచ్చేశారు?’’ వానర్ చిరుకోపంగా అడిగాడు. ‘‘నువ్వు తిరిగి ప్రాణాలతో వస్తావనుకోలేదు. ఏం జరిగింది?’’ ‘‘కొద్దిసేపు ఆగితే టివినే చెప్తుంది. నాకో కోక్ కేన్ ఇవ్వు.’’ అది ఓపెన్ చేసి ఓ గుక్క తాగి సోఫాలో పడుకుని నిస్సహాయంగా చెప్పాడు - ‘‘నా గుండె ఎన్నిసార్లు ఆగి, మళ్ళీ ఎన్నిసార్లు తిరిగి పని చేసిందో? ఈసారి కూడా ముగ్గురం విఫలం అయ్యాం. మనకి దొంగతనం చేతకాదు.’’ కపీష్ నవ్వుతూ లేచి వెళ్ళి కిచెన్‌లోని బియ్యం బస్తాలని అందుకుని నేల మీద కుమ్మరించాడు. అందులోంచి బయటకి వచ్చిన నోట్ల కట్టలని చూసి వానర్ నిర్ఘాంతపోయి, లేచి కూర్చుని, మళ్ళీ లేచి నమ్మలేనట్లుగా అడిగాడు. ‘‘ఇంత డబ్బు ఎక్కడిది?’’ ‘‘బేంక్ నించి దోచి తెచ్చిన సొమ్ము’’ మర్కట్ నవ్వుతూ చెప్పాడు. ‘‘ఇదెలా సాధ్యం?’’ ‘‘మనిద్దరిలోకీ కపీష్ తెలివిగలవాడు’’ మర్కట్ కపీష్ భుజాన్ని ఆప్యాయంగా తడుతూ చెప్పాడు. ‘‘ఇది నిజం డబ్బేనా?’’ ‘‘అవును.’’ ‘‘ఇది ఎలా దొంగిలించారు?’’ ‘‘నిన్ను ఆ దొంగలు తీసుకెళ్ళాక కపీష్ అక్కడి ఉద్యోగస్థులందరితో, బేంక్ సొమ్ము దొంగలు దోచుకోకుండా కాపాడాలని, దాన్ని సొరంగంలోంచి బయటకి తీసుకెళ్దామని చెప్పాడు. తను బేంక్ డబ్బుని కాపాడాడనే పేరు తెచ్చుకోవాలని మేనేజర్ ఆశపడ్డాడు. ఓ తాళం చెవి బేంక్ ఆఫీసర్ దగ్గర, మరొకటి హెడ్ కేషియర్ దగ్గర ఉన్నాయి. బేంక్ మేనేజర్ సూచన మేరకు వాళ్ళిద్దరూ తాళం చెవులని ఉపయోగించి బేంక్ డబ్బు దాచిన సేఫ్ లాకర్ని తెరిచారు. ఆ డబ్బుని బేంకు సిబ్బందే ఈ గోనె సంచుల్లో నీట్‌గా సర్దారు. వాటితో అంతా సొరంగంలోంచి బయటపడ్డాం. కారు దగ్గరకి తీసుకెళ్ళి అది సిఐడి కారు కాబట్టి దాని మీద పోలీస్ కారు అనే గుర్తులు ఏమీ ఉండవని చెప్తే, ఆ డబ్బుని బేంక్ ఉద్యోగస్థులే డిక్కీలో ఉంచారు. దాన్ని సమీప పోలీస్ స్ట్టేషన్కి తీసుకెళ్ళి భద్రపరుస్తామని, వారు ఇంటికి వెళ్ళి తమ వారికి కనపడి, సాయంత్రం ఐదున్నరకి పోలీస్ స్టేషన్‌కి వచ్చి స్టేట్మెంట్ని ఇవ్వమని, టివి వాళ్ళు ఉంటారు కాబట్టి మంచి బట్టలు వేసుకుని రమ్మని చెప్తే నమ్మి వెళ్ళిపోయారు. అప్పటికే వారు మానసికంగా అలసిపోవడంతో సరిగ్గా ఆలోచించలేని స్థితిలో ఉన్నారు. వాళ్ళంతా ఇప్పుడు తమ ఇళ్ళల్లోని తమ వాళ్ళ ముందు హీరోలుగా ఫీలవుతూ సాయంత్రం వేసుకురావాల్సిన బట్టలని ఇస్త్రీ చేయించుకుంటూండి ఉంటారు’’ ‘‘దట్స్ గుడ్’’వానర్ పకపక నవ్వాడు. తర్వాత ఒంగి ఓ కట్టని అందుకుని దాని వంక చూశాడు. వెంటనే అతని మొహం పాలిపోయింది. ‘‘గురూ! ఇవన్నీ దొంగ నోట్లు. వందకి ఒకటి పక్కన రెండు సున్నాలు ఉండాలిగా? వీటికి మూడు సున్నాలు ఉన్నాయి.’’ ‘‘నువ్వు ఇంతదాకా వెయ్యి రూపాయల నోట్‌ని చూడలేదా?’’ మర్కట్ నవ్వుతూ అడిగాడు. ‘‘లేదు. వెయ్యి రూపాయల నోట్లు కూడా ఉన్నాయా?.’’ ‘‘వెయ్యి నోట్‌నే ఇంతదాకా నువ్వు చూడలేదంటే తెలంగాణా ఆహార భద్రతా పథకానికి కార్డు ఉన్నా, లేకపోయినా నువ్వు అర్హుడివి’’ కపీష్ నవ్వుతూ చెప్పాడు. అంత డబ్బుని ఎన్నడూ చూడని ఆ ముగ్గురూ ఆనందాన్ని పట్టలేక గట్టిగా అరుస్తూ ఆ నోట్ల కట్టలని ఒకరి మీదకి మరొకరు వేసి కొట్టుకుంటూ, గాల్లోకి ఎగరేసి పట్టుకుంటూ పగలబడి నవ్వసాగారు. ఆనందం తీరాక ఆ కట్టలన్నిటినీ మూడు భాగాలుగా విభజించారు. ముగ్గురూ విడివిడిగా లెక్క పెట్టుకున్నాక మర్కట్ ఆనందంగా చెప్పాడు. ‘‘వావ్! మనం కోటీశ్వరులం అయ్యాం.’’ డబ్బు కట్టల పక్కన నిలబడి ఒకొక్కరూ ఫొటోలు తీసుకున్నారు. ‘‘రండి. ముగ్గురం కలిని తీసుకుందాం’’ వానర్ మిత్రులు ఇద్దర్నీ ఉత్సాహంగా పిలిచాడు. ‘‘దీన్ని నీ ఎఫ్‌బిలో పోస్ట్ చేయక’’ మర్కట్ వానర్‌కి హెచ్చరికగా చెప్పాడు. ‘‘రేపు మన ఫొటోలు పేపర్లో ఫ్రంట్ పేజీలో వస్తాయి’’ కపీష్ నవ్వుతూ చెప్పాడు. - మళ్లీ రేపు ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 3monkies.sakshi@gmail.com పాఠకులకు ఆహ్వానం! ‘ఈ కాలమ్ మీదే’ అనే కొత్త చర్చావేదికను సాక్షి ‘ఫ్యామిలీ’ త్వరలో ప్రారంభించబోతోంది. చర్చనీయాంశం మీ ఇష్టం. ఏ సామాజిక అంశాన్ననైనా, ఆలోచననైనా మీరు చర్చకు పెట్టొచ్చు. మీ వాదనను వినిపించవచ్చు. దానిని ఫ్యామిలీ ప్రచురిస్తుంది. దానిపై మిగతా పాఠకులనూ చర్చకు ఆహ్వానిస్తుంది. వెంటనే రాసి పంపండి. చర్చలో పాల్పంచుకోండి. మీ చర్చనీయాంశం పంపవలసిన చిరునామా: ‘ఈ కాలమ్ మీదే’ సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 ఇ-మెయిల్:sakshireaders@gmail.com -
త్రీమంకీస్ -72
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 72 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘సరే. కాల్చక... వాళ్ళు నన్ను లోపలకి రమ్మంటున్నారు. నైస్ మీటింగ్ యు ఆల్ పోలీస్ అండ్ సిటిజన్స్ అండ్ టివి ఆడియెన్స్. మళ్ళీ కలుద్దాం’’ చెప్పి వానర్ అటూ ఇటూ చూశాడు. ‘‘నీ బస్ ఆలోచన మాకు అవసరం లేద వార్. త్వరగా రా’’ నాయకుడు కోరాడు. ‘‘ఎందుకని? మీకు ఇంకో దారి లేదుగా?’’ ‘‘ఎందుకంటే బందీలుగా తీసుకుందామనుకున్న ఉద్యోగస్థులంతా పారిపోయారు.’’ ‘‘ఓ! సొరంగం లోంచా?’’ వానర్ అనాలోచితంగా చెప్పాడు. ఆ మాటని వినగానే ఆ ఆరుగురు దొంగలు ముందు ఒకరి మొహాల వంక మరొకరు చూసుకున్నారు. తర్వాత వానర్ వంక లేడిని చూసే సింహాల్లా చూశారు. ‘‘సొరంగం? దాని గురించి నీకు ముందే తెలుసా?’’ ‘‘కొద్దిగా. దాన్ని తవ్విన వాళ్ళు నాకు తెలుసు. దాంట్లో వచ్చిన వారికన్నా కొద్దిగా ముందుగా మీరు వచ్చారు’’ వానర్ చెప్పాడు. ‘‘కాని దాని గురించి నువ్వు మాట మాత్రంగానైనా చెప్పలేదే?’’ ‘‘నేను అడక్కుండా ఎవరికీ ఏదీ చెప్పను. మీరు అడగాల్సింది.’’ ‘‘ఇప్పుడు నాకు అర్థమైంది. దాన్ని తవ్వింది నువ్వే. నువ్వు దాంట్లోంచే లోపలకి వచ్చావు. అవునా?’’ ‘‘అవును.’’ ‘‘సరే.’’ దొంగల నాయకుడు తన రెండు తుపాకులని వానర్‌కి గురి పెట్టాడు. ‘‘కాల్చకు. ఇతనొక్కడే మన బందీ. అతన్నీ లేకుండా చేయకు. తర్వాత చంపుదాం’’ ఓ దొంగ అరిచాడు. ‘‘సరే. ఇతను మనకి చేసింది నేను మర్చిపోను. ఇతనితో పనయ్యాక మీరూ మర్చిపోకూడదు.’’ దొంగలు తమలో తాము మాట్లాడుకుంటూంటే వానర్‌కి తను వారికి మామూలు బందీ కాదని, బేంక్‌లోంచి తప్పించుకున్నాక వారి గుళ్ళకి తను బలవుతానని అనిపించింది. తనని వాళ్ళు లోపలకి పిలిచాక ఆ సొరంగంలోంచి బయటకి వెళ్ళబోయే ముందు కాల్చి చంపి వెళ్తారు. పోలీసులు తనూ బందీ అనుకుని వెంటనే బేంక్‌లోకి రారు. ఈ దొంగలు కాపలా లేని జైలు గేటులోంచి కూడా బయటకి వెళ్ళలేని మూర్ఖులు, తను వీళ్ళతో ఉంటే అన్ని విధాల ప్రమాదం అనుకున్నాడు. ‘‘ముందుగా మనం చేయాల్సింది...’’ వానర్ ఆగాడు. ‘‘మనం? ఎప్పట్నించి నువ్వు మాలో ఒకడివి అయ్యావు?’’ నాయకుడు ప్రశ్నించాడు. ‘‘మీరు నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేసినప్పటి నించి. ముందుగా మనం చేయాల్సింది...’’ ‘‘ఆగు. మేమేం చేయాలో నువ్వు మాకు చెప్పకు. అది మాకు తెలుసు’’ నాయకుడు అది అవమానంగా భావించి అరిచాడు. ‘‘నేను ఒక్కడ్నే మీ బందీని. నేనూ లేకుండా చేసుకోకండి. ఇంతదాకా మిమ్మల్ని గమనించాను కాబట్టి మీరు తప్పించుకోడానికి నేనొక్కడ్నే మీ ఆశ. ముందుగా స్ట్రాంగ్ రూం తలుపుని మూసేయండి.’’ ‘‘అందులోని వారంతా తప్పించుకున్నాకా?’’ ‘‘అది టు వే టన్నెల్ అని మర్చిపోకండి.’’ ‘‘టు వే టన్నెల్?’’ ‘‘అవును. లోపల నించి బయటకి వెళ్ళచ్చు బయటి నించి లోపలకి రావచ్చు కూడా. దాని గురించి పోలీసులకి ఇంకా తెలీదు. తలుపు మూసేస్తే స్ట్రాంగ్ రూంలోకి వచ్చినా అందులోంచి మీ దగ్గరకి రాలేరు. ఈలోగా మీరు తప్పించుకోవచ్చు.’’ వారంతా అతను చెప్పేది ఆలోచనగా విన్నారు. అర్థం కాగానే అకస్మాత్తుగా అంతా లాకర్ రూం వైపు పరిగెత్తారు. అంతా. నాయకుడు మాత్రం వానర్ వైపు తుపాకీని కాల్చసాగాడు. చేతులు దింపి వానర్ రోడ్డు మధ్యకి ఒంగొని పరిగెత్తాడు. అతని చుట్టుపక్కల నేల మీద గుళ్ళు తాకిన గుర్తుగా దుమ్ము లేస్తోంది. ‘‘నువ్వు మా వైపు రా’’ స్పీకర్లోంచి వినిపించింది. సగం దూరం వెళ్ళాక వీధి చివరికి పరిగెత్తుతూ అరిచాడు - ‘‘బేంక్‌లోని బాధితులు సొరంగంలోంచి తప్పించుకున్నారు. రైట్ టైం వాచీల షాపులోంచి వాళ్ళు బయటకి వస్తారు. బేంక్‌లో కేవలం దొంగలే మిగిలారు. వెళ్ళండి. ఉస్కో.’’ పోలీసులకి అతని మాటలు కొద్ది క్షణాలు అర్థం కాకపోయినా కొందరు తుపాకులతో బేంక్‌లోకి, మరికొందరు ఆ వాచీ షాపు వైపు పరిగెత్తారు. లోపల నించి కాల్పులు లేవు. తెల్ల కోటులోని ఓ డాక్టర్ అంబులెన్స్ పక్క నించి వెళ్ళే వానర్‌తో చెప్పాడు - ‘‘అంబులెన్స్ లోకి రా. నీ బీపీని చెక్ చేస్తాను.’’ వానర్ ఆగలేదు. ముఖానికి ఉన్న సాక్స్‌ని తొలగించి గుంపులుగా చేరి చూస్తున్న మనుషుల్లో కలిసిపోయాడు. మూసేసిన రైట్ టైం గడియారాల షాపు పక్క నించి కారు పార్క్ చేసిన చోటికి బాణం నించి వదిలిన విల్లులా పరిగెత్తాడు. అక్కడ అది లేదు. కొద్ది దూరం వెళ్ళాక ఓ బోర్డ్, ఓ ఆటో కనిపించాయి. బోర్డ్ మీద ఇలా రాసి ఉంది - ‘రెస్ట్రిక్టెడ్ ఏరియా డెడ్ బాడీస్ నాట్ టు బి టేకెన్ ఆన్ దిస్ రోడ్ ఎయిదర్ ఆన్ ఫుట్ ఆర్ ఇన్ అంబులెన్స్’ ‘‘పోనీ’’ ఆటోలోకి ఎక్కి వానర్ చెప్పాడు. ‘‘అరవై రూపాయలు అవుద్ది’’ వాడు ఎక్కడికో తెలుసుకోకుండానే అలవాటుగా చెప్పాడు. ‘‘అలాగే పోనీ’’ చెప్పి వానర్ సీట్లో వెనక్కి వాలి తన అరచేతిని గుండెకి ఆనించి అది కొట్టుకుంటోందో లేదో చెక్ చేసుకున్నాడు. - మళ్లీ రేపు ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 3monkies.sakshi@gmail.com లెటర్స్ డిసెంబర్ 26 సీరియల్‌కి వేసిన బొమ్మ బాపు బొమ్మని గుర్తుకు తెచ్చింది. సీత, రమ్య, స్వచ్ఛ, రుధిర, వైతరణి, మూలిక విలక్షణమైన ఈతరం పాత్రలు. త్రీ మంకీస్ నేటి తరానికి నచ్చే విలక్షణమైన హాస్య సీరియల్ అనడంలో సందేహం లేదు. - రాధేశ్యాం, చినగంజాం పాఠకులకు ఆహ్వానం! ‘ఈ కాలమ్ మీదే’ అనే కొత్త చర్చావేదికను సాక్షి ‘ఫ్యామిలీ’ త్వరలో ప్రారంభించబోతోంది. చర్చనీయాంశం మీ ఇష్టం. ఏ సామాజిక అంశాన్ననైనా, ఆలోచననైనా మీరు చర్చకు పెట్టొచ్చు. మీ వాదనను వినిపించవచ్చు. దానిని ఫ్యామిలీ ప్రచురిస్తుంది. దానిపై మిగతా పాఠకులనూ చర్చకు ఆహ్వానిస్తుంది. వెంటనే రాసి పంపండి. చర్చలో పాల్పంచుకోండి. మీ చర్చనీయాంశం పంపవలసిన చిరునామా: ‘ఈ కాలమ్ మీదే’ సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 ఇ-మెయిల్: sakshireaders@gmail.com -
త్రీమంకీస్ -71
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 71 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘కాదు. ఇప్పుడు నీకు కుడి వైపు’’ లోపల నించి నాయకుడి కంఠం అసహనంగా వినిపించింది. ‘‘నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఇటు వైపేగా?’’ వానర్ వెనక్కి తిరిగి కుడి చేతిని చూపిస్తూ అడిగాడు. ‘‘కాదు. వెనక్కి తిరిగితే చంపేస్తాం. నీ ఎడమ చేతి వైపు’’ నాయకుడు గొంతు చించుకుని అరిచాడు. ‘‘ఎటు వైపు? మేం కన్ఫ్యూజ్ అవుతున్నాం. కుడి వైపా? ఎడమ వైపా?’’ స్పీకర్లోంచి వినిపించింది. వెంటనే నాయకుడు వానర్ని కాల్చడానికి తుపాకీని గురి పెట్టాడు. ఇంకో దొంగ అతన్ని వారిస్తూ చెప్పాడు - ‘‘వాడు మూర్ఖుడు. వాడ్నేం చేయకు. రెండువైపులా అని చెప్పు. వీధికి రెండువైపులా ఉన్న పోలీస్ వేన్‌లని తీయమని చెప్పు.’’ ‘‘రెండు వైపులా అని చెప్పు’’ రెండో దొంగ సూచించాడు. అది విన్నాక పోలీస్ మళ్ళీ అడిగాడు. ‘‘ఇంకేమిటి?’’ ‘‘ఇంకేమిటి?’’ వానర్ వెనక్కి తిరగకుండా అడిగాడు. ‘‘నాకు స్పీకర్లోంచి అన్ని మాటలు వినిపిస్తున్నాయి వార్. నువ్వు నాకు మళ్ళీ చెప్పక్కర్లేదు.’’ ‘‘అర్థమైంది. నేను రిపీట్ చేయకూడదు. నేను ఇంక లోపలకి రావచ్చా?’’ వానర్ అడిగాడు. ‘‘అప్పుడే కాదు. మాకో వేన్ కావాలి. లెవెన్ సీటర్. మా వెంట ముగ్గురు ఉద్యోగస్థుల్ని బందీలుగా తీసుకెళ్తాం. మా బండిని ఎవరూ అనుసరించకూడదని చెప్పు.’’ ‘‘లెవెన్ సీటరా? ష్యూరా?’’ వానర్ అడిగాడు. ‘‘ష్యూరా ఏమిటి?’’ వానర్ గొంతు తగ్గించి చెప్పాడు - ‘‘వాళ్ళేం చేస్తారో తెలుసా? ఇలాంటి సందర్భాల్లో వాహనం కింద ఓ చిన్న రేడియో ట్రాన్స్మిటర్ని అమరుస్తారు. అందువల్ల వారు భౌతికంగా మిమ్మల్ని అనుసరించకపోయినా మీరు ఎక్కడ ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది.’’ ‘‘ఐతే వాళ్ళకి నువ్వు అదే చెప్పు. ట్రాన్స్మిటర్స్ని అమర్చకూడదు. లేదా బందీలని చంపేస్తాం.’’ ‘‘ఐనా...’’ వానర్ అనుమానంగా ఆగాడు. ‘‘ఏమిటి నీ అనుమానం? నువ్వు వార్తాహరుడివి మాత్రమే. నా పని నాకన్నా నీకు బాగా తెలుసని అనుకుంటున్నావా?’’ నాయకుడు కోపంగా అడిగాడు. ‘మీకన్నా నాకు బాగా తెలుసు’ వానర్ వాళ్ళకి వినపడకుండా గొణిగాడు. ‘‘ఎలాంటి హింసా లేకుండా అంతా మృదువుగా సాగాలన్నదే నా కోరిక. రక్తపాతం కూడదనుకుంటే ఇంకో ఆలోచన చెప్పనా?’’ వానర్ అడిగాడు. ‘‘సరే వార్. నువ్వే తెలివి గలవాడివి. అదేమిటో ఏడు’’ నాయకుడు అసహనంగా చెప్పాడు. ‘‘మీరు ఎలా పారిపోవాలో నిజంగా చెప్పమంటారా?’’ వానర్ అడిగాడు. ‘‘చెప్పు.’’ ‘‘నన్ను మీ స్థానంలో ఊహించుకుని ఆలోచిస్తే మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని అనిపిస్తోంది.’’ ‘‘అది మాకూ తెలుసు.’’ ‘‘మీరేం చేయాలో చెప్తాను. అక్కడ ఆగి ఉన్న బస్ని ఇవ్వమని కోరండి. దాన్ని వాళ్ళు మీకు వెంటనే ఇవ్వాల్సి ఉంటుంది. అందువల్ల దాంట్లో ఎలక్ట్రానిక్ పరికరాన్ని కాని, టైం రిలీజ్ టియర్ గేస్ గ్రనేడ్ కాని...’’ ‘‘ఆగాగు. ఏమిటది?’’ ‘‘టైం రిలీజ్ టియర్ గేస్ గ్రనేడ్. మీరు బయల్దేరిన కొద్దిసేపటికి ఆ గ్రనేడ్ పేలి లెవెన్ సీటర్ నిండా టియర్ గేస్ అలుముకుంటుంది. మీరు తప్పక దిగాలి. దిగిన మిమ్మల్ని కాల్చి చంపుతారు. లేదా పట్టుకుంటారు.’’ ‘‘ఓ మై గాడ్! నీకు ఇదంతా ఎలా తెలుసు?’’ నాయకుడు నివ్వెరపోయాడు. ‘‘దొంగతనం చేయబోయే ముందు మీరు గూగుల్‌లో ప్రికాషన్స్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే మీకూ తెలుస్తుంది. ఆ బస్‌లోకి బందీలని ఎక్కించుకున్నాక మీలోని ఒకరు దాన్ని డ్రైవ్ చేస్తూ బాగా రద్దీగా ఉన్న ప్రాంతానికి చేరుకోండి. ఏ ఆధార్ కార్డ్ జారీ కేంద్రానికి కాని, ఎరువులు అమ్మే దుకాణం ముందుకి కాని వెళ్తే చాలు. అక్కడ బస్ని ఆపి దిగి అంతా తలో దిక్కూ పారిపోండి.’’ ‘‘అందువల్ల ఏమిటి లాభం?’’ నాయకుడు అడిగాడు. ‘‘మీరు మొహం మీది తొడుగుల్ని తొలగించి ఆయుధాలని బస్‌లోనే వదిలి పారిపోతే, మీరూ బందీలని అంతా అనుకుంటారు. ఆ రద్దీలో కలిసిపోతే ఇక మిమ్మల్ని ఎవరూ పట్టుకోలేరు.’’ ‘‘ఇది బావుంది. నువ్వు మూర్ఖుడివి కావు. తెలివి గలవాడివే. తర్వాత?’’ ‘‘తర్వాత?’’ ‘‘ఆ తర్వాత ఏమిటి?’’ ‘‘ఓ! ఆ తర్వాత స్వేచ్ఛ. మరో దొంగతనం. ఈసారి మరింత పటిష్టంగా పథకం వేసుకోవాలి. నా మిత్రుడు కష్ కొంత రుసుముకి మీకు సహాయం చేస్తాడు.’’ ‘‘నీతో పనైంది. ఇంక లోపలకి రా’’ నాయకుడు ఆజ్ఞాపించాడు. ‘‘కాని నేను లోపలకి వస్తే మీరు నన్ను...’’ ‘‘... ముందు వెంటనే లోపలకి రా’’ నాయకుడు ఆజ్ఞాపించాడు. ‘‘నేను లోపలకి రావడానికి పోలీసుల అనుమతి తీసుకోవాలి అనుకుంటా. దాన్ని మీరు అడిగినట్లుగా అడగనా? లేక నా అంతట నేనే అడిగినట్లు అడగనా?’’ ‘‘ఈ క్షణమే రా. నా మూడ్ సరిగ్గా లేదు. కాల్చేస్తాను’’ నాయకుడు కఠినంగా చెప్పాడు. ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 3monkies.sakshi@gmail.com పాఠకులకు ఆహ్వానం! ‘ఈ కాలమ్ మీదే’ అనే కొత్త చర్చావేదికను సాక్షి ‘ఫ్యామిలీ’ త్వరలో ప్రారంభించబోతోంది. చర్చనీయాంశం మీ ఇష్టం. ఏ సామాజిక అంశాన్నైనా, ఆలోచననైనా మీరు చర్చకు పెట్టొచ్చు. మీ వాదనను వినిపించవచ్చు. దానిని ఫ్యామిలీ ప్రచురిస్తుంది. దానిపై మిగతా పాఠకులనూ చర్చకు ఆహ్వానిస్తుంది. వెంటనే రాసి పంపండి. చర్చలో పాలు పంచుకోండి. మీ చర్చనీయాంశం పంపవలసిన చిరునామా: ‘ఈ కాలమ్ మీదే’ సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 ఇ-మెయిల్: sakshireaders@gmail.com -
త్రీమంకీస్ -70
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 70 మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘సెలైన్స్. నాకున్నది ఒకే చెవి. నేను దొంగలు మాట్లాడేది విననా? పోలీసులు మాట్లాడేది విననా? లేక మీ కంఠాలు విననా? పోనీ మీలో ఒకరు ఇక్కడికి రండి. నేను మీ బదులు అక్కడ నించుని అరుస్తాను’’ వానర్ కోపంగా అరిచాడు. తర్వాత దొంగల వైపు తిరిగి అడిగాడు - ‘‘నేను లోపలకి రావచ్చా?’’ ‘‘మా డిమాండ్స్‌ని నీ ద్వారా పోలీసులకి చెప్పాక.’’ ‘‘సంతోషం. కాని నా ముందు, వెనకా కూడా తుపాకులు నాకు గురిపెట్టబడి ఉన్నాయి. నేను అర్జెంట్‌గా బాత్రూంకి వెళ్ళాలి. దీర్ఘశంక... టాయ్‌లెట్.’’ ‘‘ఖాళీ లేదు. మా వాడూ అదే పనిలో ఉన్నాడు. ఒకరి తర్వాత ఒకరం వెళ్తున్నాం. అసలు పని పూర్తయ్యేదాకా కదలక’’ నాయకుడు అరిచాడు. ‘‘కాని సినిమాల్లో ఇలాంటివి ఫోన్ ద్వారా చర్చించడం చూశాను.’’ ‘‘మాకే పాఠాలు చెప్తున్నావా? మేమో పొరపాటు చేశాం. ఇందాక మేం భయంతో తుపాకీని కాల్చినప్పుడు గుళ్ళు తగిలి లేండ్ లైన్ ఫోన్ పాడైంది. సెల్ నించి కుదరదు. బేంక్‌కి సెల్ ఫోన్స్ ఉండవు కాబట్టి ఆ ఫోన్ మా నించే అనే గేరంటీ వాళ్ళకి ఉండదుగా.’’ ‘‘మీ నంబర్ చెప్తే దానికి చేయమని వాళ్ళకి చెప్తాను.’’ ‘‘మమ్మల్ని ఇంకా ఇరికించడానికా? ముందు చేతులు పెకైత్తు.’’ ‘‘మర్చిపోయాను. సారీ. కాని రోడ్డుకి అవతల రెండు వందల మందికి పైనే గుమిగూడి ఉన్నారు. వాళ్ళందరి ముందూ అపరాధిలా చేతులు ఎత్తడం నాకు సిగ్గుగా ఉంది. దింపుతాను.’’ దొంగలు మళ్ళీ కొద్దిసేపు చర్చించుకున్నాక అడిగారు - ‘‘టివి వాళ్ళు వచ్చారా?’’ ‘‘తెలుగు, ఇంగ్లీష్, హిందీ... అన్ని ఛానల్స్ వాళ్ళూ వచ్చారు.’’ ‘‘సరే. మేం చెప్పిన మాట వినకపోతే నీ పేంట్, షర్ట్, ఉంటే అండర్‌వేర్‌ని నువ్వు విప్పాల్సి ఉంటుంది జాగ్రత్త.’’ ‘‘ఒద్దొద్దు. దాని బదులు కాల్చండి.’’ ‘‘వార్! నువ్వు నిప్పుతో చెలగాటమాడుతున్నావు అని తెలీక ఆటలాడుతున్నావు. వాళ్ళకి మా డిమాండ్స్ చెప్పు.’’ ‘‘సరే.’’ వానర్ మళ్ళీ వెనక్కి తిరిగి గట్టిగా చెప్పాడు - ‘‘వాళ్ళు తమ డిమాండ్స్‌ని చెప్పమంటున్నారు. అంటే వాళ్ళ డిమాండ్స్‌ని నేను చెప్తున్నాను. అంటే నా ద్వారా చెప్తున్నారు తప్ప నా డిమాండ్స్ కావు.’’ ‘‘మేము వినడానికి సిద్ధం వార్. కాని లోపల ఎవరికీ హాని జరక్కపోతేనే ఆలోచిస్తాం అని చెప్పు’’ లౌడ్ స్పీకర్లోంచి వినిపించింది. ‘‘గుడ్. అది సమంజసం. తెలివైన నిర్ణయం. మీరు చెప్పేది నాకు నచ్చింది’’ వానర్ బదులు చెప్పాడు. ‘‘షటప్! షటప్!’’ లోపల నించి నాయకుడి కంఠం వినిపించింది. ‘‘కాల్చక! నా అభిప్రాయం చెప్పానంతే.’’ ‘‘మా డిమాండ్స్ తప్ప నీ అభిప్రాయాల్ని చెప్పక. ముందు చుట్టుపక్కల మేడల మీది షార్ప్ షూటర్స్‌ని తొలగించాలని కోరుతున్నాం అని చెప్పు’’ నాయకుడు ఆజ్ఞాపించాడు. ‘‘తప్పకుండా. మంచి ఆలోచన... మేడల మీది గన్‌మెన్‌ని వెంటనే తొలగించాలన్నది మొదటి డిమాండ్. ఇది చెప్పేది నేను కాదు... నేనే కాని నేను కాదు... అంటే నా ద్వారా అని! అర్థమైందా?’’ ‘‘అయింది. ఇంకా?’’ వానర్ బేంక్ తలుపు వైపు చూస్తూ అడిగాడు. ‘‘ఇంకా?’’ ‘‘వెంటనే వాళ్ళు బేంక్‌కి కుడివైపు వీధి చివర ఆపిన పోలీస్ వేన్‌లని తొలగించాలి.’’ వానర్ ఆలోచించి అడిగాడు - ‘‘నా కుడివైపా?’’ ‘‘కాదు. మా కుడి వైపు.’’ ‘‘సరే.’’ వెనక్కి తిరిగి చెప్పాడు. ‘‘దొంగలు తమ కుడివైపు వీధి చివర ఆగి ఉన్న పోలీస్ వేన్‌లని వెంటనే తొలగించమని డిమాండ్ చేస్తున్నారు.’’ ‘‘వాళ్ళు మాకు కనపడటం లేదు. వారి కుడి చేతిని చూపించమనండి.’’ ‘‘వాళ్ళని బయటకి రమ్మననా?’’ కపీష్ అడిగాడు. ‘‘రమ్మను.’’ వానర్ మళ్ళీ వెనక్కి తిరగ్గానే లోపల నించి నాయకుడి కంఠం కోపంగా ఉపయోగించింది - ‘‘మేము రాం. మేం అడిగింది తప్ప ఇంకోసారి ఎక్స్ట్రా మాట్లాడితే కాల్చేస్తాం. నీ కుడి వైపు అని చెప్పు.’’ ‘‘ఇటు వైపా?’’ కుడి చేతిని చాపి అడిగాడు. ‘‘అవును.’’ వానర్ మళ్ళీ వెనక్కి తిరిగి చెప్పాడు. ‘‘క్షమించాలి. వాళ్ళు బయటకి రారట. ఇటువైపు వాహనాలని వెంటనే తొలగించమని డిమాండ్’’ తన కుడి చేతిని చాపి చూపిస్తూ చెప్పాడు. నాయకుడు తల పట్టుకుని చెప్పాడు. ‘‘ఇప్పుడు నీకు ఎడం వైపు అని చెప్పు.’’ ‘‘నా ఎడం వైపు’’ వానర్ తన ఎడమ చేతిని కూడా చాపి చెప్పాడు. ‘‘అంటే రెండు వైపులానా?’’ స్పీకర్లోంచి వినిపించింది. ‘‘కాదు. ఒక వైపు. ఇప్పుడు నాకు ఎడం వైపు. కదా?’’ వెనక్కి తిరిగి అడిగాడు. -
త్రీమకీస్ -69
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 69 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘అర్థమైందా?’’ నాయకుడు అడిగాడు. ‘‘అయింది.’’ వానర్ ఓసారి కాలర్ సర్దుకుని తలుపు వైపు నడిచాడు. ‘‘మేము గమనిస్తూనే ఉంటాం. జాగ్రత్త’’ నాయకుడు హెచ్చరించాడు. వానర్ బయటకి నడిచి చేతులు పెకైత్తి గట్టిగా అరిచాడు - ‘‘కాల్చకండి. నేను దొంగల్లో ఒకర్ని కాదు.’’ చుట్టూ చూశాడు. ఆ వీధిలో కొన్ని పోలీస్వేన్లు, ఓ బస్ అటు, ఇటు నిలబడి ఆ రోడ్ని రెండుపక్కలా మూసేశాయి. నాలుగైదు పోలీస్కార్లు ఎదురుగా ఆగి ఉన్నాయి. వాటి వెనక దాక్కున్న పోలీసుల చేతుల్లోని తుపాకీ గొట్టాలు వానర్ వైపు గురిపెట్టి ఉన్నాయి. అంతా తన వంకే చూస్తున్నారని వానర్ గ్రహించాడు. చుట్టుపక్కల మేడల మీద టెలిస్కోప్స్ అమర్చిన గన్స్‌తో పోలీసులు ఉన్నారని కూడా గ్రహించాడు. రెండు అంబులెన్స్‌లు, పక్కనే తెల్ల కోట్లు ధరించిన వైద్యులు కనిపించారు. ఓ పోలీస్ అధికారి అతన్నే జాగ్రత్తగా గమనిస్తున్నాడు. వానర్ బేంక్‌లోని దొంగలతో చెప్పాడు - ‘‘మీరూ కాల్చకండి. మీ డిమాండ్స్ గురించి మాట్లాడాలిగా!’’ ‘‘నువ్వెవరు?’’ లౌడ్ స్పీకర్లోంచి పోలీస్ అధికారి కంఠం వినిపించింది. ‘‘నేను మనిషిని.’’ ‘‘కన్ఫ్యూజ్ అవక. భయపడక. నేనడిగింది నువ్వు బేంక్ కస్టమర్‌వా లేక ఉద్యోగివా అని’’ మళ్ళీ వినపడింది. ‘‘ఆ రెండూ కాదనుకుంటా.’’ ‘‘సరే. నీ పేరు?’’ ‘‘వార్. ఆంగ్లో ఇండియన్ని.’’ కొద్దిసేపు నిశ్శబ్దం. తర్వాత అదే కంఠం స్పీకర్లోంచి వినిపించింది - ‘‘లోపల ఎలా ఉంది?’’ ‘‘అంతా బావుంది. తుపాకీ గుళ్ళతో లోపల రంధ్రాలు పడి కొన్ని పెచ్చులు నేల మీద పడ్డాయి. తర్వాత స్వచ్ఛభారత్ వాలంటీర్లని పిలిపించండి.’’ ‘‘ఎవరికైనా హాని జరిగిందా?’’ ‘‘లేదు. వీళ్ళు అహింసా సిద్ధాంతం గల దొంగలు.’’ ‘‘కాదని చెప్పు’’ లోపల నించి అతనికి వినిపించింది. ‘‘ముందు అందరి మానసిక వత్తిడిని తగ్గించాలని, అది ముఖ్యం అని అలా చెప్పాను. ఇంత దాకా మీరు ఎవరికీ హాని చేయలేదని వాళ్ళకి తెలిస్తే మీ మీద గౌరవం కలుగుతుంది’’ వానర్ చెప్పాడు. దొంగలు ఒకరితో మరొకరు చర్చించుకున్నాక నాయకుడు కసిరాడు - ‘‘పెరగాల్సింది గౌరవం కాదు. భయం’’ అని! ‘‘లోపల అసలేం జరిగింది?’’ పోలీస్ ఆఫీసర్ అడిగాడు. ‘‘నేను ఇప్పుడే లోపలకి వచ్చాను. కాబట్టి నాకు తెలీదు.’’ ‘‘ఇప్పుడే వచ్చావా వార్? బేంకులోకి దొంగలు ప్రవేశించిన రెండున్నర గంటల నించి నువ్వు అక్కడ ఉన్నావు.’’ ‘‘అవునవును. రెండున్నర గంటలూ రెండున్నర నిమిషాల్లా గడిచిపోయాయని చెప్పదలచుకున్నాను’’ వానర్ చెప్పాడు. ‘‘చేతులు దించి మా వైపు రా. మేం కాల్చం.’’ వానర్ చేతులు దింపి చెప్పాడు. ‘‘నొప్పిగా ఉంటే దింపా తప్ప మీరు దింపమన్నందుకు కాదు. నేను పేవ్మెంట్ దిగితే దొంగలు నన్ను కాల్చేస్తారు. వీరు అహింసావాదులు కారు. హింసావాదులు అని చెప్పమన్నారు.’’ ‘‘ఇక్కడ బేంక్ ఉద్యోగస్థులు, కస్టమర్ల బంధుమిత్రులు ఆదుర్దాగా ఉన్నారు. లోపల ఏం జరిగిందో తెలుసుకోవాలి. కాబట్టి వారి అనుమతి తీసుకుని ఇక్కడికి రా. మళ్ళీ వెనక్కి వెళ్ళచ్చు.’’ దొంగలు మళ్ళీ ఒకళ్ళని మరొకరు సంప్రదించుకున్నారు ‘‘వార్! వార్!’’ లోపల నించి వినిపించింది. ‘‘ఏమిటి?’’ వెనక్కి తిరిగి అడిగాడు. ‘‘వాళ్ళెవరు - చేతులు దింపమనడానికి? చేతులు పెకైత్తే ఉంచు. లేదా...’’ వెంటనే వానర్ చేతులు పెకైత్తి చెప్పాడు - ‘‘ఎత్తకపోతే దొంగలు కాల్చేస్తామంటున్నారు. వాళ్ళు హింసావాదులు.’’ ‘‘నీకు చెవుడా, ఇందాకటి నించి పిలుస్తూంటే? ఇంకోసారి మేం చెప్పింది నీకు వినపడకపోతే నీ కాళ్ళ మీద కాలుస్తాం. నువ్వు రోడ్డు మీద పడిపోయి రక్తం కారుతూ మా డిమాండ్స్ చెప్తావో లేక నించుని చెప్తావో నీ ఇష్టం’’ లోపల నించి నాయకుడు అరిచాడు. వెంటనే వెనక్కి తిరిగి తలుపు వైపు అడుగులు వేసి చెప్పాడు. ‘‘సారీ! వినపడలేదు. మీరు కూడా ఇక్కడికి వచ్చి నిలబడితే నా పరిస్థితి అర్థం అవుతుంది. వాళ్ళలా లౌడ్ స్పీకర్లో చెప్తారా? అది మీ డిమాండ్ అని అడగనా?’’ ‘‘ముందు చేతులు పెకైత్తు.’’ ‘‘ఓ! సారీ. మరిచాను.’’ వెంటనే రోడ్డు అవతల గుమిగూడిన వారి నించి ప్రశ్నలు గట్టిగా వినపడ్డాయి - ‘‘మా వారెలా ఉన్నారు?... మా కూతురు ఎలా ఉంది?... ఎర్ర షర్ట్‌లోని బట్టతలాయనకి ఇంకా ఏం కాలేదుగా?’’ (దొంగలు పెట్టిన డిమాండ్స్...?) -
త్రీమంకీస్ - 68
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 68 - మల్లాది వెంకటకృష్ణమూర్తి కదిలితే వాళ్ళు తమని కాల్చచ్చనే భయంతో గదిలోని ప్రతి ఒక్కరూ నిశ్చలంగా నిలబడ్డారు. ఎవరూ మాట్లాడకపోయినా వారి నాయకుడు గట్టిగా అరిచాడు. ‘‘షటప్! మాట్లాడితే కాల్చేస్తాను.’’ వెంటనే బేంక్ మేనేజర్ ముక్కు మీద వేలు వేసుకున్నాడు. ‘‘బయట పోలీసులు ఉన్నారు. మేం బేంక్ దోపిడీకి వచ్చినట్లు ఎలా తెలిసింది?’’ ఎవరూ మాట్లాడక పోవడంతో టీ అమ్మే కుర్రాడు చెప్పాడు - ‘‘ఆలస్యం చేస్తే మా టీ షాప్ ఓనర్ నన్ను ఉద్యోగం లోంచి తీసేస్తాడు. నన్ను వెళ్ళనీండి.’’ ‘‘అర్థమైంది. మీ ఓనరే పోలీసులకి కబురు చేసి ఉంటాడు. పోలీసులతో ఎవరైనా మాట్లాడాలి.’’ నాయకుడు అందర్నీ పరీక్షించి చూశాడు. అతని దృష్టి వానర్ మీద నిలిచింది. ‘‘ఏమిటి మొహం నిండా ఆ దుమ్ము?’’ అడిగాడు. ‘‘భయంతో నాకు చెమటలు పడుతూంటే ఈమె హేండ్ బేగ్‌లోని పౌడర్ తీసి రాసుకున్నాను’’ వానర్ నిర్భయంగా చెప్పాడు. మానసిక ఒత్తిడిలో ఉన్న ఆ నాయకుడు దాని గురించి ప్రత్యేకంగా ఆలోచించలేదు. ‘‘నీ పేరేమిటి?’’ అడిగాడు. ‘‘వార్.’’ ‘‘అదేం పేరు?’’ ‘‘మేము ఆంగ్లో ఇండియన్స్..’’ ‘‘సరే. నాతో రా.’’ వానర్ తలుపువైపు నడుస్తూ మిగిలిన వారి వంక చూశాడు. అసిస్టెంట్ మేనేజర్ పొడవు అకస్మాత్తుగా నాలుగు అడుగులు తగ్గడం గమనించాడు. అతను అందరి వెనకా దాక్కునే ప్రయత్నంలో ఉన్నాడు. చిన్నగా లేడీ క్లర్క్‌కి కన్ను కొట్టాడు. ఓ దొంగ స్ట్రాంగ్ రూమ్ తలుపుని బయటి నించి మూసి గడియపెట్టాడు. ముందు వానర్, వెనక అతన్ని అనుసరించే ముగ్గురూ బేంక్ హాల్లోకి నడిచారు. అక్కడ మొహాలకి తొడుగులు ఉన్న ఇంకో ముగ్గురు సబ్‌మెషీన్ గన్స్‌తో కనిపించారు. నేల మీదంతా కాగితాలు చెల్లాచెదురుగా, చెత్త బుట్టలు, ఫ్లవర్ వేజ్‌లు తలకిందులుగా పడి ఉన్నాయి. గోడ మీద తుపాకీ గుళ్ళు దిగిన రంధ్రాలు ఐదారు కనిపించాయి. వాటి పెచ్చులు కింద రాలిపడ్డాయి. అదృష్టవశాత్తు నేల మీద ఎక్కడా శవాలు కనపడలేదు. గోడ గడియారం ఐదుంపావు చూపిస్తోంది. వానర్ లెక్క ప్రకారం ఆ సరికి బేంక్ మూసేసి ఇళ్ళకి వెళ్ళిపోవాలి. కాని బేంక్ దొంగలు బేంక్‌ని దోచుకోడానికి తమ ముహూర్తాన్నే ఎన్నుకుని వాళ్ళని ఆపేయడంతో తమ పథకం దెబ్బతినడం వానర్ని బాధించింది. అతని వీపుకి వెనక నించి తుపాకీ గొట్టం బలంగా గుచ్చుకుంది. ‘అవర్ స్పెషల్ గోల్డ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్స్’ అనే పోస్టర్‌కి ఆనుకుని నిలబడ్డ ఓ వ్యక్తి చెప్పాడు. ‘‘నువ్వు ఇప్పుడు బయటకి వెళ్ళాలి. పోలీసులు నిన్ను దొంగగా భావించి కాలుస్తారో లేదో చూడాలి.’’ ‘‘కాని నేను దొంగని కానుగా’’ వానర్ భయంగా చెప్పాడు. ‘‘ఆ విచక్షణ నీకుంది. వాళ్ళకి ఉందా, లేదా అని తెలుసుకోడానికే. నిన్ను కాల్చకపోతే మా తరఫున మా డిమాండ్స్‌ని నువ్వు వినిపించాలి.’’ ‘‘అప్పుడు నేను మీలో ఒకణ్ణని భావించి కాల్చచ్చుగా?’’ వానర్ రెట్టింపు భయంతో అడిగాడు. ‘‘నీ పేరేమిటి?’’ ‘‘వార్. ఆంగ్లోఇండియన్ని.’’ ‘‘మేం లోపల. పోలీసులు బయట. ఇలా ఎంతకాలం ఉండగలం? కాబట్టి మేము పారిపోయే ఏర్పాట్లు చేయడం మొదలెట్టాలి. బయటకి నడు.’’ కాళ్ళు ఒణికి పడిపోబోతున్న వానర్ని వెనక నించి ఓ దొంగ పడిపోకుండా పట్టుకున్నాడు. ‘‘మూర్ఛని ఆపుకో. లేదా నిన్ను కాల్చేస్తాం. నువ్వు స్పృహలో ఉండాల్సిన సమయం ఇది. నిజానికి నువ్వు చేయాల్సింది చాలా తేలిక. ఊ.’’ నాయకుడు తన అనుచరుడికి సౌంజ్ఞ చేశాడు. వెనక నించి అతను వానర్ ముఖానికి నల్లటి సాక్స్‌ని తొడిగాడు. ‘‘ఇప్పుడు బయటకి నడు’’ నాయకుడు చెప్పాడు. ‘‘కాని ఇలా చూస్తే వాళ్ళు నన్ను మీలో ఒకరు అనుకుంటారు కదా?’’ వానర్ సందేహంగా చెప్పాడు. ‘‘అదే మాక్కావాల్సింది. పోలీసులు నిన్ను షూట్ చేయకపోవడం కూడా మాక్కావాలి. వారు ఎలా స్పందిస్తారో తెలుసుకోడానికే నీకు ముఖానికి అలంకారం తొడిగింది.’’ ‘‘కాని గుళ్ళు దిగితే నొప్పి పుడుతుంది. కనీసం క్షమాపణ కోరి పంపచ్చుగా?’’ ‘‘ఇంకేం మాట్లాడక బయటకి నడు’’ నాయకుడు కోపంగా అరిచాడు. వానర్ కదల్లేదు. ‘‘ముందు నీ పాదాల మీద కాల్చనా? తర్వాత పాక్కుంటూ వెళ్తావా?’’ నాయకుడు తన సబ్‌మెషీన్ గన్ని వానర్ కాళ్ళకి గురి పెట్టాడు. ‘‘ఆగాగు. కాల్చకు. ఒన్, టు, త్రీ చెప్పి కాల్చు. ఇదిగో వెళ్తున్నాను. నాకు ఇష్టం లేకపోయినా వెళ్తున్నాను. నాకేమైనా అయితే బాధ్యత మీది.’’ వానర్ తలుపు వైపు నడిచాడు. ‘‘పేవ్మెంట్ దాకానే. అది దిగి రోడ్డెక్కావంటే నీ వీపులో గుళ్ళు దిగుతాయి. నడిచినా, పరిగెత్తినా సరే. అక్కడే కదలకుండా నిలబడు’’ ఓ దొంగ హెచ్చరించాడు. -
త్రీమంకీస్ - 67
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 67 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘మేము సిఐడి సీరియల్ చూస్తున్నాం. సిఐడిలకి యూనిఫారాలు ఉండవని మాకు తెలుసు. నేనీ బేంక్ మేనేజర్ని. నా పేరు హేమాంబరధరరావు’’ టై కట్టుకున్నతను చెప్పాడు. ‘‘సిఐడిలు ఎవరూ తాము సిఐడిలమని చెప్పరు. మీరు దొంగలని చెప్పడం మంచి జోక్. నేను అసిస్టెంట్ మేనేజర్ పుండరీకాక్షయ్యని. మీకు ఆహ్వానం పలకడం మాకు ఆనందంగా ఉంది.’’ ‘‘అవును. నిజానికి దొంగలు పక్క గదిలో ఉన్నారు’’ ఓ లేడీ క్లర్క్ చెప్పింది. ‘‘ఎంతమంది?’’ కపీష్ పరిస్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ అడిగాడు. ‘‘ఆరుగురు. మమ్మల్ని ఈ గదిలో బంధించారు. వాళ్ళ దగ్గర తుపాకులు ఉన్నాయి’’ పుండరీకాక్షయ్య చెప్పాడు. ‘‘తుపాకులే?’’ కపీష్ ఆశ్చర్యంగా అడిగాడు. ‘‘అవును.’’ ‘‘ఐతే పెద్ద దొంగలే అయి ఉంటారు.’’ చేతిలో కెటిల్, డిస్పోజబుల్ గ్లాసులు ఉన్న ఓ కుర్రాడు ముగ్గురికీ టీని వంచి ఇచ్చాడు. ‘‘నువ్వెక్కడి నించి వచ్చావు?’’ వానర్ అడిగాడు. ‘‘స్టాఫ్‌కి టీ ఇవ్వడానికి వచ్చాను. దొంగలు నన్ను మళ్ళీ బయటకి వెళ్ళనివ్వలేదు. చల్లారకుండా టీని అమ్ముదామని.’’ ‘‘కోక్ లేదా?’’ వానర్ అడిగాడు. ‘‘షాపులో ఛిల్లర్లో ఉంది. నన్ను బయటకి వెళ్ళనిస్తే తెస్తాను’’ వాడు చెప్పాడు. ‘‘అది కుదిరే పని కాదు. మొత్తం మీరు ఎంతమంది ఉన్నారు?’’ మేనేజర్ టీ తాగే కపీష్‌ని అడిగాడు. ‘‘ముగ్గురమే’’ మర్కట్ చెప్పాడు. ‘‘ఇక్కడ కాదు. సొరంగంలో ఇంకా ఎంతమంది ఉన్నారు అన్నది నా ప్రశ్న.’’ ‘‘సొరంగం ఖాళీ.’’ ‘‘మీ వెంట తుపాకులు తీసుకురాలేదే?’’ అసిస్టెంట్ మేనేజర్ ప్రశ్నించాడు. ‘‘దేనికి?’’ వానర్ అడిగాడు. ‘‘మా బేంక్ మీద దొంగలు దాడి చేశారనేగా మీరు మమ్మల్ని రక్షించి వారిని పట్టుకోడానికి రహస్యంగా సొరంగం తవ్వి వచ్చింది?’’ ‘‘అవును’’ కపీష్ తన మిత్రులు ఇద్దరి వంకా అర్థవంతంగా చూస్తూ చెప్పాడు. ‘‘అవునవును’’ ఇద్దరూ వత్తాసు పలికారు. ‘‘మరి వారిని పట్టుకోడానికి తుపాకులు అవసరం కదా? అసలు మీరు నిజంగా పోలీసులేనా?’’ అసిస్టెంట్ మేనేజర్ అడిగాడు. ‘‘పూర్తిగా. నేను సర్కిల్ ఇన్స్పెక్టర్ని. వీరిద్దరూ సబ్ ఇన్స్పెక్టర్లు’’ వెంటనే కపీష్ చెప్పాడు. ‘‘మీ పేరు?’’ ‘‘క... కష్. ఇతను ఎస్సై మట్. ఇతను ఎస్సై వార్.’’ ‘‘అలాంటి పేర్లు కూడా పెట్టుకుంటారా?’’ ‘‘మేము ఆంగ్లోఇండియన్ సంతతికి చెందిన నాలుగో జెనరేషన్ వాళ్ళం.’’ ‘‘నేను కలకత్తా బ్రాంచ్‌లో పని చేశాను. కాని ఆంగ్లోఇండియన్స్కి ఇలాంటి పేర్లు ఉంటాయని తెలీదు’’ అసిస్టెంట్ మేనేజర్ చెప్పాడు. ‘‘ఇప్పుడు మీకు తెలిసింది’’ వానర్ చెప్పాడు. ‘‘మీ దగ్గర కనీసం కత్తులైనా ఉన్నాయా?’’ ‘‘లేవు. మేము హోస్టేజ్ రెస్క్యూ టీంకి చెందినవాళ్ళం. అంటే బాధితుల్ని రక్షించే బృందమని అర్థం. తుపాకులు పేలడం మాకు ఇష్టం ఉండదు. అందువల్ల బాధితులకి ప్రమాదం’’ కపీష్ చెప్పాడు. ‘‘ఐతే మీది సూక్ష్మబుద్ధి కావచ్చు. కాని అవి ఉంటే రక్షించడం ఎక్కువ తేలిక అయ్యేదేమో?’’ పుండరీకాక్షయ్య అసంతృప్తిగా చెప్పాడు. ‘‘మనం ఇప్పుడు ఓ లైన్లో సొరంగం ముందు క్యూలో నిలబడి అందులోకి దిగుదాం’’ మేనేజర్ చెప్పాడు. ‘‘అవును. ముందు మిమ్మల్ని రక్షించి తీసుకెళ్తాం. తర్వాత వాళ్ళ సంగతి చూడటానికి తుపాకులతో మామూలు పోలీసులు వస్తారు. పదండి’’ కపీష్ చెప్పాడు. లేడీ క్లర్క్ కపీష్ మొహాన్ని తన చున్నీతో సిమెంట్ పోయేలా శుభ్రంగా తుడిచింది. తర్వాత అడిగింది. ‘‘మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుంది?’’ ‘‘ఇంజనీరింగ్ కాలేజీలో చూసి ఉంటారు.’’ ‘‘అక్కడ కాదు.’’ ‘‘ఐతే జైల్లో చూసి ఉంటారు’’ వానర్ చెప్పాడు. ‘‘మేం ఖైదీలని అప్పగించడానికి నిన్న జైలుకి వెళ్ళాం’’ కపీష్ వెంటనే వానర్ కాలు తొక్కుతూ చెప్పాడు. ‘‘కాదు. ఫొటో చూశాను’’ ఆమె మళ్ళీ చెప్పింది. ‘‘ఫేస్బుక్లో చూసి ఉంటారు.’’ ‘‘నాకు ఎఫ్బి లేదు. ఇంకెక్కడో చూశాను.’’ ‘‘గుర్తు తెచ్చుకోండి’’ మేనేజర్ చెప్పాడు. ‘టీవీలో’ అని అంటుందని ముగ్గురు మిత్రులూ భయపడ్డారు. కాని ఆమె ఇలా చెప్పింది. ‘‘గుర్తు రావడం లేదు. బహుశ ఇంజనీరింగ్ కాలేజీలోనే చూశానేమో?’’ ‘‘వాళ్ళొస్తున్నారు’’ అంతదాకా వారికి దూరంగా లాకర్ రూం తలుపు దగ్గర నిలబడ్డ ప్యూన్ గుసగుసలాడుతున్నట్లుగా చెప్పాడు. వెంటనే అక్కడి నలుగురు భయంగా కదిలారు. వారు సొరంగం రంధ్రం కనపడకుండా దాన్ని కాళ్ళతో కవర్ చేస్తూ నిలబడ్డారు. ముగ్గురు బలిష్టమైన వ్యక్తులు లాకర్ గదిలోకి వచ్చారు. వారందరి మొహాలకి నల్లటి సాక్స్ తొడిగి ఉన్నాయి. ఖాకీ షర్ట్లు, పేంట్లు, కేన్వాస్ బూట్లు. ప్రతి వారి చేతిలో సబ్‌మెషీన్ గన్స్ ఉన్నాయి. (ముగ్గురు మిత్రులు బేంక్ నుంచి ఎలా తప్పించుకున్నారు?) -
త్రీమంకీస్ - 66
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 66 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘పని మీద వెళ్ళేప్పుడు శవం ఎదురు రావడం మంచి శకునం అని మా నానమ్మ చెప్పేది’’ వానర్ ఉత్సాహంగా చెప్పాడు. ముందుగా ముగ్గురూ మేక్డోనాల్డ్స్ రెస్టారెంట్‌కి వెళ్ళారు. ‘‘మేక్వెజీ ట్విస్ట్ తొంభై నాలుగు రూపాయలా? కాస్ట్లీ. దీంతో చక్కటి ఉల్లి రవ్వ దోసె, ఇంకా చిల్లర వచ్చేవి’’ బిల్ చూసి వానర్ అసంతృప్తిగా చెప్పాడు. ‘‘ఇప్పుడు కాస్ట్లీ అనిపిస్తుంది. మరికొన్ని గంటల్లో మనం ధనవంతులయ్యాక తొంభై నాలుగేనా అనిపిస్తుంది. అప్పుడు కూడా డబ్బుండీ లేని వాళ్ళల్లా పిసినారిగా ఉంటే అది నీ ఖర్మ’’ కపీష్ చెప్పాడు. ‘‘ఏమాటకామాట చెప్పాలి. తొంభై నాలుగైనా రుచి బావుంది’’ వానర్ చెప్పాడు. ‘‘ఇక్కడ విందు ముగిశాక కారుని దొంగిలించాలి.’’ ‘‘చదువుకునే రోజుల్లో మనకి గది అద్దెకి ఇచ్చినాయన కారుందిగా? ఆయన దాన్ని షో కోసం కొన్నాడు. ఇంట్లోనే వదిలి ఆఫీసుకి మోటార్ సైకిల్ మీద వెళ్తూంటాడు కదా?’’ మర్కట్ గుర్తు చేశాడు. ‘‘అవును. నేనూ అదే అనుకున్నాను’’ కపీష్ చెప్పాడు. ‘‘నేను కూడా. మేథావులు ఒకేలా ఆలోచిస్తారంటే ఇదే’’ వానర్ కూడా చెప్పాడు. ‘‘ఇప్పుడు మనం ఒన్ సర్కిల్ టు సర్కిల్ హాఫ్ సర్కిల్ ఏ. ఒన్ సర్కిల్ టు సర్కిల్ రెక్టాంగిల్ ఏ తాగుదామా?’’ వానర్ చెప్పాడు. కోక్ గ్లాసులని తాకించి ముగ్గురూ ఛీర్స్ చెప్పుకున్నారు. ముగ్గురూ అనుకున్నట్లుగా ఎలాంటి ఇబ్బందీ లేకుండా తమ పాత ఇంటి యజమాని కారుని దొంగిలించాక దాంట్లో రాణిగంజ్కి వెళ్ళి నాలుగైదు దుకాణాలు తిరిగి వర్కింగ్ కండిషన్లో ఉన్న ఎలక్ట్రిక్ డ్రిల్‌ని, ఇతర పరికరాలని కొన్నారు. వారు సంపాదించిన డబ్బు బొటాబొటీగా సరిపోయింది. బయటకి వచ్చాక కపీష్ చెప్పాడు. ‘‘ఇప్పుడు మనకి కావలసింది కారులో పది లీటర్ల డీజిల్‌ని నింపడం.’’ ‘‘దానికన్నా ముందు మనకి బియ్యం సంచీలు కావాలి’’ వానర్ చెప్పాడు. ‘‘దేనికి?’’ కపీష్ ఆశ్చర్యంగా అడిగాడు. ‘‘వాటిలో డబ్బు నింపుకోడానికి.’’ ‘‘ఖాళీ సంచీలని చెప్పవే?’’ మర్కట్ విసుక్కున్నాడు. ఇంకో అరగంటలోనే వారు ఆ సొరంగంలోకి ప్రవేశించేది. 20 కారుని మర్కట్ డ్రైవ్ చేశాడు. దాన్ని ఓ చోట పార్క్ చేశాక ముగ్గురూ ఖాళీ బియ్యం సంచులతో, అందులో కావాల్సిన పరికరాలతో రైట్ టైం వాచీల దుకాణం దగ్గరకి వెళ్ళి అటు, ఇటూ చూసి కిటికీ తలుపుని తెరిచి అందులోకి దూకారు. మళ్ళీ కిటికీని మూసేశారు. లోపల ఖాళీ కౌంటర్లు బోసిపోతున్నాయి. సరాసరి కిటీకి పక్కన నేల మీద ఉన్న సొరంగం ఉందని కపీష్ నమ్మిన చోట కాలితో కింద పరచిన కార్పెట్‌ని కొద్దిగా పక్కకి తొలగించి, బూటు కాలితో కొట్టాడు. శబ్దం బోలుగా వినిపించింది. ‘‘డెప్త్ టెస్టర్ అబద్ధం ఆడలేదు’’ కపీష్ తృప్తిగా చెప్పాడు. దాని మీద ఉన్న వెట్రిఫైడ్ రాతిని తొలగించాడు. కింద కంత కనిపించింది. చీకటి. బియ్యం బస్తాలోంచి టార్చ్ లైట్‌ని తీసి లోపలకి ప్రసరింప చేసి చెప్పాడు. ‘‘ముందు నేను వెళ్తాను. వెనక మీరు రండి. ఆఖరుగా వచ్చే నువ్వు రాతిని మళ్ళీ యథాస్థానంలో ఉంచు’’ వానర్‌కి సూచించాడు. ‘‘సరే.’’ ‘‘గుడ్ లక్ టు అజ్’’ చెప్పి కపీష్ సొరంగంలోకి దిగాడు. టార్చి వెలుగులో ముందుకి పాకసాగాడు. అది జైల్లోని సొరంగం కన్నా కొద్దిగా విశాలంగా ఉంది. జైల్లో లభించిన తక్కువ పరికరాలతోనే వాళ్ళు తవ్వడం వల్ల ఆ తేడా అనుకున్నాడు. వెనకాల నించి మర్కట్, వానర్ల మాటలు అతనికి వినిపించాయి. సొరంగం చివర కపీష్ తల పెకైత్తి పరిశీలించి అప్పటికే బేంక్ స్ట్రాంగ్ రూమ్ నేల మీది కాంక్రీట్ చాలా భాగం చెక్కేసి ఉండటం గమనించాడు. కపీష్ వెనకాల సొరంగంలో బోర్లా పడుకున్న మర్కట్, వానర్లకి బేటరీతో ఆపరేట్ చేసే ఎలక్ట్రానిక్ డ్రిల్ శబ్దం వినపడసాగింది. ఆ శబ్దాన్ని వినలేక ఇద్దరూ చెవులు మూసుకున్నారు. ఆ పరికరంతో సొరంగం మీది మిగిలిన కాంక్రీట్‌ని గుండ్రంగా మనిషి పట్టేంత మేరకి చెక్కసాగాడు. అరగంటలో పైనించి సన్నటి వెలుగు రేఖ సొరంగంలోకి పడింది. దాదాపు గంట తర్వాత సిమెంట్‌తో మట్టి కొట్టుకుపోయిన కపీష్ తను చేసిన రంధ్రంలోంచి తలని పైకి తీసుకెళ్ళి చూశాడు. అనేక కాళ్ళు కనపడ్డాయి. చాలామంది దాని చుట్టూ నిలబడి ఒంగొని తన వంకే చూడటం గమనించాడు. వారిలోని ఒకరు కపీష్‌కి చేతిని అందించి పైకి లాగాడు. తర్వాత మిగిలిన ఇద్దర్నీ కూడా. కపీష్ ఎడం చేతిలోని సుత్తి, టార్చ్ లైట్‌ని ఇంకొకరు అందుకున్నారు. కపీష్ చుట్టూ చూశాడు. అది బేంక్ స్ట్రాంగ్ రూమే. ఇన్‌షర్ట్ వేసుకుని టై ధరించిన ఓ ఏభై ఏళ్ళ వ్యక్తి కపీష్‌తో కరచాలనం చేస్తూ చెప్పాడు. ‘‘ప్రుడెన్షియల్ బేంక్ మేనేజర్ వెల్కమ్స్ సిఐడి పోలీస్’’ ‘‘మేము పోలీసులం కాము’’ మర్కట్ చెప్పాడు. ‘‘నిజానికి దొంగతనానికి వచ్చిన వాళ్ళం’’ వానర్ చెప్పాడు. (ముగ్గురు మిత్రులు వచ్చిన బేంక్‌లో అప్పటికే దొంగలు ఉన్నారా?) -
త్రీమంకీస్ - 65
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 65 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘ఒబామా, బిన్ లాడెన్లు నా కోసం నక్కబొక్కలపాడులో ఎదురు చూస్తూంటారు. నేను గాడిదని ఎక్కి విమానాశ్రయానికి వెళ్ళాలి. అక్కడ విమానాన్ని లాగడానికి రోడ్డింజను సిద్ధంగా ఉందా?...’’ ‘‘మా వాడ్ని చూస్తే గుండె తరుక్కుపోతోంది. ఇన్ని రోజులు మీరు ఏమయ్యారు?’’ మర్కట్ అడిగాడు. ‘‘నాస్త్తిక మహాసభలకి వెళ్ళి ఇవ్వాళే వచ్చాను.’’ ‘‘మీ పేరు?’’ ‘‘రామదాసు’’ ఆయన చెప్పాడు. ‘‘మనం వెంటనే కవాడీగూడా స్మశానానికి వెళ్ళాలి’’ రుధిర ఇంట్లోంచి బయటకి వచ్చాక కపీష్ చెప్పాడు. ‘‘అరె పాపం? వానర్‌కి ఏమైంది? ఇంకా సర్దుకోలేదా?’’ మర్కట్ ఆందోళనగా అడిగాడు. ‘‘ఏమీ కాలేదు. పోలీసులు మన కోసం వెదకని చోటు అదే. మనం అక్కడ ఉన్నామని తెలిసినా కొద్దిసేపట్లో కాల్చేస్తారనుకుని రారు. ఎక్కడో ఓ చోట దాక్కోవాలిగా’’ కపీష్ సూచించాడు. ‘‘మనం మా బాబాయ్ ఇంటికి వెళ్ళచ్చు. ఆయన శబరిమలైకి వెళ్ళాడు. మరో పది రోజుల దాకా రాడు. ఒకటే సమస్య’’ మర్కట్ చెప్పాడు. ‘‘మీ పిన్నమ్మ వంట బావుండదా?’’ ‘‘పిన్నమ్మ ఏనాడో టపా కట్టింది. ఇంటి తాళం చెవి నా దగ్గర లేదు.’’ ‘‘పిల్లల్ని అడిగి తీసుకో.’’ ‘‘ఒకరు విజయవాడ గాంధీనగర్‌లోని మేకా వారి వీధిలో, ఇంకొకరు సత్యనారాయణపురం లోని సింహాల మేడలో ఉంటున్నారు. ఇద్దరికీ ఉప్పూ నిప్పూ. ఒకరు ఉండగా ఇంకొకరు రారు.’’ ‘‘తాళం చెవి సంగతి నాకు వదులు. రేపు రైట్ టైం షాప్ తలుపు తాళాన్ని కూడా తెరవాల్సింది నేనేగా. ఆయనుండేది ఎక్కడ?’’ కపీష్ అడిగాడు. ‘‘కొంతకాలం సైనికుడిగా పనిచేసి సైనిక్‌పురిలో ఉన్నాడు. తర్వాత ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం వస్తే అక్కడ చేరి వాయుపురిలో ఉన్నాడు. ఆ తర్వాత మళ్లీ నేవీలో ఉద్యోగం వస్తే అందులో చేరి రిటైరవబోయే ముందు పానీపురిలో ఇల్లు కొనుక్కున్నాడు.’’ మర్కట్ బాబాయ్ ఇంటి తలుపుని కపీష్ ఆట్టే శ్రమపడకుండానే తెరవగలిగాడు. ముందుగా ముగ్గురూ ఫ్రిజ్ దగ్గరకి వెళ్ళి చూస్తే అందులో వారు ఆశించిన కోక్ బాటిల్ లేదు. వెతికితే డబ్బు ఎక్కడా కనపడలేదు కాని అదృష్టవశాత్తు ఓ కార్టన్‌లో ఆరు కోక్ జీరో ఫోర్ హండ్రెడ్ మిల్లీలీటర్ల పెట్ బాటిల్స్ కనిపించాయి. వాటిని డీప్ ఫ్రీజర్‌లో ఉంచాడు కపీష్. ‘‘ఇవాళ మనకి చాలా బిజీ డే. డబ్బు కోసం ఏం అమ్ముదాం?’’ వానర్ ఇంట్లోని వస్తువులని చూస్తూ మిత్రులని సలహా అడిగాడు. ‘‘అన్నీ అమ్మినా రెండు వేలు కూడా రావు.’’ మర్కట్ విచారంగా చెప్పాడు. ‘‘ఐడియా.’’ ‘‘ఏమిటి?’’ ‘‘మేమోసారి ఏభై రూపాయలు మోసపోయాం. అదే ఇప్పుడు మనకి శ్రీరామరక్ష. మనకి కొన్ని ప్రింటవుట్స్ కావాలి’’ కపీష్ డిక్టేట్ చేస్తూంటే వానర్ దాన్ని వర్డ్‌లో టైప్ చేశాడు. గంటన్నర తర్వాత ముగ్గురూ మూడు అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌ల్లోకి వెళ్ళి డోర్ బెల్స్ నొక్కారు. తలుపు తెరిచిన మహిళల వంక చూసి నవ్వి చెప్పారు. ‘‘గుడ్ మార్నింగ్ మేడం. గాయత్రీ హోమ్ లైబ్రరీ నించి వస్తున్నాం. నెలకి అరవై రూపాయలు ఇస్తే మీకీ పుస్తకాలన్నీ ఇంటికే తెచ్చిచ్చి, మళ్ళీ తీసుకెళ్తాం.’’ వాళ్ళు ఆ కాగితం చదివారు. ఇంగ్లీష్, తెలుగు, హిందీ, అరవం పత్రికల లిస్ట్, ప్రముఖ ఆంగ్ల, తెలుగు రచయితల నవలల లిస్ట్ అందులో ఉన్నాయి. ‘‘ఉదయం మీకు సౌకర్యమా మేడం? లేక సాయంత్రమా? ఏ మేగజైన్ ఏరోజు కావాలో టిక్ చేయండి. ఇవాళ ఏం కావాలి?’’ ‘‘గృహశోభ ఉందా?’’ ‘‘ఉంది. మీరు ఏ రోజైనా బుక్ తీసుకోకపోతే రెండు ఛాయిస్‌లు. మర్నాడు రెండు తీసుకోవచ్చు. లేదా ఆ రోజు ఎమౌంట్ తర్వాతి నెల దాంట్లో కట్ చేసుకుని మిగిలింది ఇవ్వచ్చు.’’ చాలామంది మహిళలు పుస్తకాలు చదవకపోవడానికి కారణం అవి అందుబాటులో లేకనే. ఒకప్పడు రెంట్ కార్నర్స్ నించి వాటిని తీసుకుని చదివేవారు. ఇప్పుడవి నాస్తి. నలభై పైబడ్డ మహిళల్లో ప్రతీ నలుగురిలో ఒకరే రిజెక్ట్ చేశారు. మిగిలిన ముగ్గురూ అరవై చొప్పున డిపాజిట్ చెల్లించారు. ‘‘పుస్తకాల బేగ్ కింద బండిలో ఉంది. మీకు గృహశోభ కావాలన్నారా? తెచ్చిస్తాను’’ చెప్పి డబ్బు తీసుకుని వాళ్ళు ఉడాయించసాగారు. ‘‘నే చెప్పలా? నువ్వు అనవసరంగా భయపడ్డావు. ఒక్కరూ మనల్ని గుర్తు పట్టలా. ఓసారి టీవీలో ఫొటోని అలా చూపించినంత మాత్రాన గుర్తుంచుకుని పోలీసులకి మన గురించి ఇన్ఫాం చేసే మహిళలు మన తెలుగు గడ్డ మీద ఎవరున్నారు?’’ కపీష్ చెప్పాడు. ముగ్గురూ ఆ మోసంతో సంపాదించిన డబ్బుని లెక్క పెట్టారు. ఎనిమిది వేల ఆరు వందల చిల్లర. ‘‘గుడ్. మనకి అవసరమైనవి ఇక కొనచ్చు’’ వానర్ ఉత్సాహంగా చెప్పాడు. ముగ్గురూ మర్కట్ బాబాయ్ ఇంట్లోంచి బయటకి నడుస్తూంటే ఓ శవం ఎదురొచ్చింది. -
త్రీమంకీస్ - 64
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 64 మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘రేపు ఆదివారం సాయంత్రం నాలుగుకి బేంక్ మూసేస్తారు. సోమవారం శెలవు. అది ఆదివారం సగం పూట పనిచేసే బేంక్. కాబట్టి మనం నాలుగుకల్లా లోపలకి వెళ్తే మంగళవారం ఉదయం తొమ్మిదికి బేంక్ తెరిచే దాకా టైం ఉంటుంది. రేపు మనకి కొంత సామాను అవసరం ఉంటుంది. బేంక్‌లోని ఫ్లోర్‌ని సొరంగంలోంచి కట్ చేయడానికి ఎలక్ట్రిక్ డ్రిల్, సుత్తి, వర్క్ గ్లవ్స్, టార్చిలైట్లు మొదలైనవి.’’ ‘‘ఐతే ఇంక ఇక్కడ మనకేం పని? కిందకి పదండి. వాటి సంగతి గూగుల్‌లో చూద్దాం’’ వానర్ చెప్పాడు. ‘‘సరే. నేను ఆమెని బెడ్రూంలోకి తీసుకెళ్తాను. మేం బయటకి వచ్చే లోగా నువ్వు మనకి ఎలక్ట్రిక్ డ్రిల్, సుత్తి, వర్క్ గ్లవ్స్, టార్చిలైట్లు మొదలైనవి కొనడానికి ఎంత అవసరమో చూడు’’ కపీష్ సూచించాడు. ముగ్గురూ రుధిర అపార్ట్మెంట్కి చేరుకున్నారు. ‘‘టీ చేస్తున్నాను’’ ఆమె చెప్పింది. ‘‘ఎనీ కోక్ ఇన్ ఫ్రిజ్ బై ఎనీ ఛాన్స్?’’ వానర్ అడిగాడు. ‘‘సారీ. నో.’’ ‘‘కోక్2హోమ్డాట్కామ్లో అకౌంట్ పెట్టుకోండి. ఫ్రీ డెలివరీ ప్లస్ కనీసం పది శాతం డిస్కౌంట్.’’ వానర్ వాళ్ళ పథకం ప్రకారం లేప్‌టాప్‌లో గూగుల్ చేసి చూసి చెప్పాడు. ‘‘ఎలక్ట్రిక్ డ్రిల్, సుత్తి, వర్క్ గ్లవ్స్ కొనడానికి సుమారు ఎనిమిది వేలు కావాలి.’’ ‘‘గూగుల్ చేసి ఆ డబ్బు కూడా ఎలా దొరుకుతుందో చూడు’’ మర్కట్ సూచించాడు. వానర్ ఆ ప్రకారం సెర్చ్ చేసి చెప్పాడు. ‘‘అన్ని ఆర్థిక అవసరాలకి తమ దగ్గరకే రమ్మనే ప్రుడెన్షియల్ బేంక్ ప్రకటనకి తీసుకెళ్ళింది గూగుల్.’’ వానర్ సెకండ్ హేండ్ ఎలక్ట్రిక్ డ్రిల్స్ అమ్మే షాపుల వివరాల ప్రింటవుట్‌ని తీశాడు. డోర్ బెల్ వినపడగానే వానర్ వెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగా గళ్ళ లుంగీకి బెల్ట్ పెట్టుకున్న ఓ శాల్తీ. రుధిర పోలికలతో ఉన్న ఆయన ఎర్రగా కాలిపోతున్న కళ్ళతో లోపలకి వచ్చాడు. ‘‘మీరెవరు? రుధిర ఏది?’’ ఉగ్రంగా చూస్తూ అడిగాడు. రుధిరతో ఆమె బెడ్రూం లోంచి బయటకి వచ్చిన కపీష్‌ని ఎగాదిగా చూసి రుధిరని నిలదీశాడు. ‘‘ఐతే నేను విన్నది నిజమేనన్న మాట. నువ్వు మళ్ళీ ఎవర్నో చేరదీసావన్నమాట.’’ ‘‘మళ్ళీనా?’’ కపీష్ అదిరిపడ్డాడు. ‘‘మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ. నువు నాలుగో మళ్ళీవి.’’ ‘‘రుర్! ఇది నిజమా?’’ కపీష్ అడిగాడు. ‘‘మీ కబుర్లు తర్వాత. ముందు నేనేం మాట్లాడదలచుకొని వచ్చానో అది మాట్లాడనీండి. చూడు. చూడు. నిన్ను ఎంత కష్టపడి పెంచానో ఓసారి చూడు.’’ ఓ ఆల్బం అందించాడు. రుధిర ఒకో ఫొటోని చూడసాగింది. అన్నీ ఆమెకి నవ్వు తెప్పించాయి. ఆమె తండ్రి మెడ మీద కూర్చుని కాళ్ళని భుజాల మీంచి ముందు ఛాతీ మీదకి వేసింది. వీపు వైపు నుంచి తీసిన ఫొటోలో ఆయన టీ షర్ట్ ధారగా కిందకి తడిసి ఉంది. రెండో ఫొటోలో సోఫాలో కూర్చుని దినపత్రిక చదువుకునే తండ్రి జుట్టుని వెనక నించి పీకుతోంది. మూడో ఫొటోలో రెండేళ్ళ రుధిరని తండ్రి ఎత్తుకున్నాడు. అతని కుడి అరచేతిలో పసుపు పచ్చ రంగులో ఆమె వాంతి ఉంది. నాలుగో ఫొటోలో నాలుగేళ్ళ రుధిర బూజు కర్రతో కొడుతూంటే తండ్రి మంచం మీంచి నేల మీదకి దొర్లిపోయాడు. ఐదేళ్ళ రుధిర ఒంటి మీది బట్టల నిండా బురద. హాల్లో ఆమె నడిచిన మేర నేల మీద బురద పాదాల గుర్తులు కనిపిస్తున్నాయి. ఆరేళ్ళ రుధిర నిద్రపోతున్న తండ్రి వీపు మీద స్కెచ్‌పెన్‌తో పిచ్చిపిచ్చి గీతలు గీసింది. ఏడేళ్ళ రుధిర చక్కటి పెయింట్ వేసిన గోడంతా క్రేయాన్స్‌తో ఆల్ఫాబెట్‌ని, అంకెలని రాసి పాడుచేసింది. ‘‘ఇంత కష్టపడి నిన్ను పెంచాం. నా మాట ఏదీ నువ్వు వినలేదు. హాస్టల్లో చేరి చదవమంటే చేరకుండా ఇంట్లో చదివి డిమ్కీలు కొట్టావు. కుంగ్ఫు నేర్చుకోమంటే కరాటే నేర్చుకున్నావు. దొంగతనాలకి మర్డర్స్ కలపమంటే కలపనన్నావు. ఓ చిన్న మార్పు నీ జీవితాన్నే సుఖమయం చేసేస్తుందని సెక్స్ మార్పిడి ఒద్దంటే వినకుండా చేసుకున్నావు’’ ‘‘వాట్! నిజమా?’’ కపీష్ అరిచాడు. ‘‘అవును. చూడు. సెక్స్ మార్పిడికి హాస్పిటల్లోకి వెళ్ళే ముందు తీసిన ఈ ఫొటో రుధిర్ది. నా బంగారు కొండా!’’ ఓ పంతొమ్మిదేళ్ళ యువకుడి ఫొటోని ముద్దు పెట్టుకుని చూపించి చెప్పాడా గళ్ళ లుంగీ. ‘‘కూతుర్ని అయినంత మాత్రాన కొడుకుగా విన్న మాటలు మర్చిపోయాననుకున్నావా? నువ్వేగా పదేపదే పెళ్ళయ్యే దాకానే కొడుకు కొడుకు. పెళ్ళయ్యాక కూడా కూతురు కూతురే అని అంటూండేవాడివి’’ రుధిర చెప్పింది. కపీష్ తన తలని గోడకేసి బాదుకోసాగాడు. సిమెంట్ పెచ్చులు రాలి పడటంతో రుధిర తండ్రి అతన్ని ఆపబోయాడు. (ముగ్గురు మిత్రులు ఏ మోసంతో డబ్బు సంపాదించారు?) -
త్రీమంకీస్ - 63
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 63 - మల్లాది వెంకటకృష్ణమూర్తి తర్వాత రైట్ టైం షాపుకి సమాంతరంగా ఉన్న ఆ బేంక్ బిల్డింగ్ దగ్గరకి వెళ్ళాడు. ఆ బేంక్ కూడా మరో రెండు రోజుల్లో ఇంకో చిరునామాకి మారుతోందనే పెద్ద బోర్డ్ గుమ్మం పక్కనే కనిపించింది. బహుశ అందుకే దుర్యోధన్ ముఠా వాళ్ళు జైల్లోంచి సొరంగాన్ని తవ్వి బయటకి వచ్చే ప్రయత్నం చేశారని కపీష్ అర్థం చేసుకున్నాడు. బేంక్‌లోకి నడిచి చూశాడు. బేంక్ బిల్డింగ్‌లో రైట్ టైం షాపు గల బిల్డింగ్ కిటికీ వైపు బలమైన ఓ ఉక్కు తలుపు కనిపించింది. ఆ తలుపు వెనక బేంక్ స్ట్రాంగ్ రూం ఉందని ఇట్టే గ్రహించాడు. రైట్ టైం షాపులోంచి సొరంగం ఆ స్ట్రాంగ్ రూంలోకి తవ్వబడిందని కూడా ఊహించాడు. లోపలకి వెళ్ళాలనుకున్నాడు. కాని ఎలా? ఓ పాతికేళ్ళామె చేతిలో సెల్ఫోన్లో మాట్లాడుతూ ఓ బేంక్ ఆఫీసర్ వెనకే ఆ స్ట్రాంగ్ రూం వైపు వెళ్తోంది. కపీష్ సందేహించకుండా ఆమె పక్కనే నడిచాడు. ఆ ఆఫీసర్ తన తాళంతో ఆమె లాకర్ నంబర్ 220ని తాళం తీసి బయటకి వెళ్ళిపోయాడు. ఆమె తన తాళం చెవితో దాన్ని తెరిచి అందులోంచి నగలన్నీ తీసి తన హేండ్‌బేగ్‌లో వేసుకుంటూ, ఆ గదిలో పరాయి వ్యక్తి ఉన్నాడన్న స్పృహ లేకుండా సెల్ఫోన్లో మాట్లాడుతూనే ఉంది. కపీష్ సొరంగం కిటికీకి ఎదురుగా ఆ సొరంగం చివర రమారమి ఎక్కడ ఉండచ్చో అంచనా వేసి, అక్కడ నేల మీద నిలబడి జేబులోంచి ఇందాకటి ఎలక్ట్రానిక్ పరికరాన్ని తీసి, గోడకి గురిపెట్టి దాని మీటని నొక్కాడు. అది గోడని తాకి వెనక్కి వచ్చి దూరం చూపించింది. ఆరడుగులు. తర్వాత దాని ఇంకో మీట నొక్కి ఈసారి తను నించున్న చోట నేల మీద గురి చూసి మళ్ళీ మీటని నొక్కాడు. లోపల రెండడుగుల కింద గుంట ఉందని దాని డిస్ప్లేలో రీడింగ్ కనిపించింది. తన ఊహ నిజమైంది అనుకున్నాడు. ఆమె నగల సంచీతో బయటకి నడిచింది. కపీష్ ఆమెతో చెప్పాడు - ‘‘లాకర్ తలుపు తాళం వేశారు కాని తాళం చెవి మర్చిపోయారు.’’ ఆమె ‘థాంక్స్’ అని గొణిగి ఆ పని చేసి సెల్లో మాట్లాడుతూనే బయటకి నడిచింది. కపీష్ ఆ పరికరాన్ని ఉపయోగించి ఆ బేంక్‌కి, ఆ షాప్‌కి మధ్య గల దూరాన్ని కొలిచాడు. పది అడుగుల ఐదు అంగుళాలు. తనకి దొరికిన మేప్‌లో రాసిన దానికి సరిపోవడంతో ఆ మేప్‌లో సూచించిన ప్రదేశం అదే అని గ్రహించాడు. ఆగి ఉన్న ఆటో దగ్గరకి వెళ్ళి అందులో కూర్చుని డ్రైవర్‌తో చెప్పాడు - ‘‘వెళ్దాం పద.’’ ఆటో రుధిర అపార్ట్మెంట్కి చేరుకునే దాకా వాళ్ళు ఆ విషయం తప్ప ఇతర విషయాలు మాట్లాడారు. ఆటో అతనికి థాంక్స్ చెప్పి దిగాక, లిఫ్ట్‌లో సరాసరి పై అంతస్తుకి వెళ్ళి, అక్కడ నించి మెట్లెక్కి టైపైకి వెళ్ళారు. ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు ఎప్పటిలానే తూర్పు, పడమర పిట్టగోడలకి ఆనుకుని సెల్ఫోన్లో మాట్లాడుతున్నారు. ‘‘మొన్నటినించి అలానే మాట్లాడుతున్నారా?’’ వానర్ ఆశ్చర్యపోయాడు. ‘‘కావచ్చు. బాయ్ ఫ్రెండ్‌తో మాట్లాడుతూంటే ఆ వయసు వారికి కాలమే తెలీదు’’ మర్కట్ చెప్పాడు. ‘‘అదేం కాదు. వాళ్ళు డ్రెస్ ఛేంజ్ చేసుకున్నారు’’ కపీష్ కోప్పడ్డాడు. ఉత్తరం వైపు గోడ దగ్గరకి వెళ్ళాక మర్కట్ ఉత్సాహంగా అడిగాడు. ‘‘వానర్! నీ ప్రియురాలితో ఎలా గడిచింది? డబ్బేమైనా తీసుకున్నావా?’’ వానర్ తన అనుభవాలన్నిటినీ ఏకరువు పెట్టి చెప్పాడు. ‘‘నేను డాక్టర్ మూలికకి మేక్డోనాల్డ్స్కి పిలిచి బ్రేకప్ చెప్పేస్తాను.’’ ‘‘అక్కడకి దేనికి?’’ ‘‘అక్కడ బరువైన ప్లేట్స్ కాని, పదునైన కత్తులు, లేదా ఫోర్క్‌లు కాని ఉండవు. పైగా వెనక దాక్కోడానికి లావుపాటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఇంక ఆమెకీ, నాకు కటీఫ్.’’ ‘‘వెరీ సారీ. కాని నేనూ అంతే’’ మర్కట్ కూడా చెప్పాడు. ‘‘అదేం?’’ మర్కట్ కూడా తన అనుభవాలని వివరించి చెప్పాడు. ‘‘కుక్కల్ని ప్రేమించే ఆమెకీ, కుక్కలంటే భయం గల నాకూ రాంరాం.’’ ‘‘రుధిర కొద్దిగా ఇదిగా ఉంది. నేనూ ఆమెతో ఎడ్జస్ట్ కాలేను అనిపిస్తోంది’’ కపీష్ చెప్పాడు. ‘‘ఏం?’’ ‘‘ఇది అని వివరించలేను. కాని ఆమె పెక్యూలియర్ కేస్ కాబట్టి మనకి ఉండటానికి ఇంకేదైనా ప్లేస్ కావాలి. ఈలోగా రుధిర ఇంటికి వెళ్ళి ఆమె సెల్‌ఫోన్‌ని కొట్టేయాలి. దాన్ని వెంటనే అమ్మితే కొంత డబ్బు సంపాదించగలం. పైగా ఆమె లేప్టాప్ అవసరం’’ కపీష్ చెప్పాడు. ‘‘ఇంతకీ ఆ బేంక్‌లోకి సొరంగం ఉందా?’’ మర్కట్ అడిగాడు. ‘మేప్ నిజందే. మన పంట పండింది. రైట్ టైంలోంచి ప్రుడెన్షియల్ బేంక్‌లోకి నేలలో సొరంగం తవ్వారు. బేంక్‌లో స్ట్రాంగ్ రూంలో రెండు అడుగుల కాంక్రీట్ ఉంది. సొరంగం చివరకి వెళ్ళి పైన ఉన్న దాన్ని తవ్వితే మనం బేంక్‌లో ఉంటాం.’’ ‘‘వావ్! మన ప్లానేమిటి?’’ మర్కట్ ఉత్సాహంగా అడిగాడు. -
త్రీమంకీస్ - 62
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 62 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘ఇది మై టాకింగ్ టామ్ అనే ఫ్రీ ఆప్. గూగుల్ స్టోర్స్లోంచి లేదా ప్లే స్టోర్స్లోంచి దీన్ని స్మార్ట్ ఫోన్స్‌లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం ఏం మాట్లాడితే అది రిపీట్ చేస్తుంది. ఏ భాషైనా సరే. గూగుల్‌లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. అన్ని ఏప్స్లా వైఫై కనెక్షన్ ఉన్నప్పుడే దీన్ని మనం ఉపయోగించుకోగలం.’’ ‘‘ఓ! ఫ్రెండ్స్‌తో, ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మై టామ్ మంచి టైం పాన్. క్విజ్ అప్ ఏప్ గురించి నీకు తెలుసా?’’ అడిగింది. ‘‘ఊహు. తెలీదు.’’ ‘‘దీన్ని కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్పోర్ట్స్, హిస్టరీ, లిటరేచర్, బిజినెస్, ఆర్ట్, ఎడ్యుకేషనల్, జాగ్రఫీ, లైఫ్‌స్టైల్, మూవీస్ మొదలైన విషయాలలోంచి మనం ఆసక్తి గల టాపిక్‌ని ఎంచుకోవచ్చు. నీకు ఏ టాపిక్ ఫేవరేట్?’’ ‘‘హిస్టరీ.’’ ఆమె హిస్టరీ మీద టచ్ చేశాక చెప్పింది. ‘‘చూశావా? ఇందులో మళ్ళీ అనేక డివిజన్స్ ఉంటాయి. 16-17 సెంచురీ, 18-19 సెంచురీ, 20-21 సెంచురీ, 2013, ఏసియన్ హిస్టరీ, బ్రిటీష్ హిస్టరీ, గ్రీన్ హిస్టరీ, ఆస్ట్రేలియన్ హిస్టరీ, యూరోపియన్ హిస్టరీ, బ్రిటీష్ మోనార్కీ, ఇండియన్ హిస్టరీ... మనకి తెలిసింది కాబట్టి దీని మీద టచ్ చేస్తాను. పది ప్రశ్నలు వచ్చాయి. ఇండియాలో మొదటి రైల్వే బాంబే నించి ఏ నగరానికి వేయబడింది? ఆప్షన్స్ ఢిల్లీ, ఆగ్రా, థానే, అహమ్మదాబాద్...’’ ‘‘థానే’’ వానర్ చెప్పాడు. దాన్ని టచ్ చేశాక చెప్పింది. ‘‘కరెక్ట్. నీకు పద్దెనిమిది మార్కులు వచ్చాయి. దీన్ని మనం ఎఫ్బి ద్వారా లేదా జిమెయిల్ ద్వారా సైన్అప్ చేసుకోవాలి కాబట్టి దీంట్లో సైన్అప్ అయిన వాటిలోని మన కాంటాక్ట్స్ పేర్లు, వాళ్ళ స్కోర్లు కనిపిస్తాయి. వాళ్ళని మనం ఛాలెంజ్ చేసి ఆడచ్చు. వాళ్ళు ఆఫ్ లైన్ ఉన్నా తర్వాత చూసి ఆడతారు. పది క్షణాల టైంలోనే మనం ఆన్సర్ని టచ్ చేయాలి. ఇలా అనేక టాపిక్స్ మీద మనం ప్రశ్నలకి జవాబు చెప్పే గేమ్‌ని ఆడచ్చు. మన ఫ్రెండ్స్‌తో కూడా ఆడచ్చు. వాళ్ళు ఆఫ్‌లైన్‌లో ఉంటే లైన్లోకి వచ్చాక వాళ్ళకి మనం ఛాలెంజ్ చేశామని తెలుస్తుంది. ప్రతీ గేమ్ పూర్తయ్యాక స్కోర్ బోర్డ్ కూడా కనిపిస్తుంది. ఆ పర్టికులర్ గేమ్‌లో ప్రపంచవ్యాప్తంగా మన రేంక్, మనం ఏ దేశంలో సైనప్ అయితే ఆ దేశంలోని మన రేంక్, దేశంలోని మన రాష్ర్టంలోని మన రేంక్, ఇంకా మన మిత్రుల్లో ఆ ఆట అప్పటికే ఎవరైనా ఆడిన వారితో మన రేంక్ కనిపిస్తాయి.’’ ‘‘దీనివల్ల మనకి నాలెడ్జ్ పెరుగుతుంది’’ వానర్ చెప్పాడు. ‘‘నేను ఇప్పుడు ఫుడ్ గేమ్‌లు ఆడుతున్నాను’’ మూలిక చెప్పింది. ‘‘మీ ఇంట్లో స్వీట్ కాని, పళ్ళు కాని ఉన్నాయా?’’ అడిగాడు. ‘‘లేవు. ఏం?’’ ‘‘అన్నం తినగానే ఏదైనా స్వీట్ తినడం నాకు అలవాటు.’’ ‘‘ఐతే వెళ్ళి కొనుక్కురా. సందు చివరే స్వగృహ స్వీట్ షాప్ ఉంది. బందరు వాళ్ళు. బందరు మిఠాయి బావుంటుంది.’’ ‘‘అలాగే. ఓ ఫిఫ్టీ ఉంటే ఇస్తారా? వంద గ్రాములు చాలుగా?’’ ‘‘సారీ! మనీ ఫ్రీ వీక్ కాబట్టి నేను బిల్ చెల్లించడం లేదు’’ మూలిక చెప్పింది. ‘‘అదేమిటి? డబ్బు ఖర్చు చేయకుండా ఈ వారం అవసరాలు ఎలా గడుస్తాయి?’’ వానర్ అడిగాడు. ‘‘అందుకు బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారుగా.’’ ‘‘ఇక నిన్ను నేను అప్పు ఏం అడుగుతాను?’’ గొణిగాడు. ‘‘సారీ?’’ ఆమె అడిగింది. ‘‘ఏం లేదు. మంచి పాలసీ అంటున్నాను. ఆ పాలసీ ఎందుకు పెట్టుకున్నారు? ఏ టీవీ సీరియల్లో చూశారు?’’ ‘‘నా జీవితంలోని అవసరమే నాకా పాలసీని నేర్పింది’’ ఆమె చెప్పింది. మర్నాడు ఉదయం మాట ఇచ్చినట్లుగానే వైతరణి మర్కట్‌ని, మూలిక వానర్ని రుధిర ఇంటికి తీసుకువచ్చి దింపారు. గత రాత్రే కపీష్ కోరిక ప్రకారం రుధిర ఏర్పాటు చేసిన ఆటోలో ముగ్గురూ రైట్ టైం చిరునామాకి చేరుకున్నారు. ఆ ఆటో డ్రైవర్ రుధిర బాబాయే. తెల్లారుఝామున రైల్వే స్ట్టేషన్లోంచి వచ్చే ఒంటరి ఆడవాళ్ళని ఎక్కించుకుని మధ్యలో ఆపి వారిని దింపి సామానుతో, వారి హేండ్ బేగ్, నగలతో ఉడాయించే డిపార్ట్మెంట్లో అతను నిష్ణాతుడు. ఆటోలోంచి దిగకుండానే పరిశీలించి చూసి కపీష్ చెప్పాడు. ‘‘సందేహం లేదు. అదే బేంక్. ఇప్పుడే వస్తాను. ఉండండి.’’ దిగి రైట్ టైం అనే నియోన్ బోర్డున్న వాచీ షాప్‌లోకి వెళ్ళాడు. రైట్ టైం వాచ్ షాప్ ఇప్పుడు అక్కడ లేదు. ‘వి మూవ్డ్’ అన్న బోర్డు మీద కొత్త చిరునామా కనిపించింది. కిటికీలోంచి చూస్తే షాపంతా ఖాళీ. కపీష్ మూసి ఉన్న కిటికీ రెక్కని నెట్టి చూశాడు. ఒకటి తెరచుకుంది. దాన్ని మళ్ళీ మూసేశాడు. బేంక్ వైపున్న కిటికీ దగ్గరకి వెళ్ళాడు. ఆ కిటికీ వెనకనించే సొరంగం మొదలై ఉంటుందని కపీష్ అంచనా వేశాడు. అక్కడి వెట్రిఫైడ్ టైల్‌ని తొలగించి అక్కడనుంచి సొరంగాన్ని తవ్వారని అనుకున్నాడు. ఆ షాపు యజమానికి కూడా దీంట్లో భాగం ఉండచ్చని భావించాడు. కన్ఫం చేసుకోడానికి రుధిర ఇంట్లో వెదికితే దొరికిన డెప్త్ గేజర్ అనే ఎలక్ట్రానిక్ పరికరాన్ని జేబులోంచి బయటకి తీసి దాన్ని ఆ టైల్‌కి గురి చేసి మీటని నొక్కాడు. సెల్ఫోన్లా ఉన్న ఆ పరికరం కింద మూడున్నర అడుగుల గుంత ఉందని స్క్రీన్ మీద చూపించింది. (బ్యాంక్ స్ట్రాంగ్ రూం నుంచి ఉన్న సొరంగాన్ని కపీష్ ఎలా కనిపెట్టాడు) -
త్రీమంకీస్ - 61
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 61 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘తిన్నాకా? తినక మునుపా?’’ ‘‘నీ పొట్ట నీ మనసుని శాసిస్తోంది. మేక్ తోట కూర పొడి కూర. నాట్ వార్. బాణలిలోని నూనెని వేడి చేయడం తిరగమాత గింజలకి ఫోర్‌ప్లే’’ చెప్పి తలుపులు మూసింది. ‘‘అదేమిటి? తలుపులు వేస్తున్నారు?’’ వానర్ అడిగాడు. ‘‘మా ఇంటి చుట్టుపక్కల మేకలు ఎక్కువ’’ డాక్టర్ మూలిక చెప్పింది. ‘‘వేళాకోళమా? ముందుజాగ్రత్తా?’’ మూలిక ఆ ప్రశ్నలని విననట్లే జవాబు చెప్పలేదు. ‘‘ఆహా! ఎక్కడ చూసినా లాన్‌లా పచ్చదనం’’ భోజనానికి కూర్చున్న వానర్ కంచంలోకి చూసి చెప్పాడు. ‘‘పచ్చదనాన్ని చూడటం వల్ల కంటికి లాభం కూడా’’ డాక్టర్ మూలిక చెప్పింది. ‘‘మీ ఇంట్లో కోక్ ఉందా?’’ ‘‘ఉంది. టాయ్లెట్లో.’’ ‘‘ఫ్రిజ్‌లో కాదా?’’ తెల్లబోతూ అడిగాడు. ‘‘రాందేవ్ బాబా వీడియో పెట్టి చూపిస్తాను. ఏసిడ్ కన్నా అది టాయ్‌లెట్ కడగడానికి బాగా ఉపయోగిస్తుందని, దాన్ని తాగితే మన కడుపులో ఏమవుతుందో...’’ ‘‘సీడీ చూపించక్కర్లా. నమ్ముతాను. భోజనం దగ్గర ఆ మాటలు వద్దులెండి’’ ఇబ్బందిగా చెప్పాడు. కొన్నిటిలో అల్లం వాసన, మరికొన్నిటిలో ఇంగువ వాసన ఘుమాయించింది. ‘‘నా సలహా వానర్. నీ భోజనం మందు కాకపోతే, నీ మందే తర్వాత భోజనం అవుతుంది జాగ్రత్త’’ డాక్టర్ మూలిక చెప్పింది. ‘‘మీరు ఎన్నైనా చెప్పండి. ఏ మూలికా నాకు మీ మీద గల ప్రేమకి చికిత్స చేయలేదు’’ వానర్ చెప్పాడు. ‘‘చపాతీ తోటకూర కూరకి స్లీపింగ్ బేగ్’’ చపాతిలో ఆ కూర వేసి చుట్టి వానర్ కంచంలో ఉంచి ఫోటో తీస్తూ మూలిక చెప్పింది. దాన్ని విప్పి మధ్యకి మడిచి చెప్పాడు. ‘‘ఇప్పుడిది సేండ్విచ్.’’ దాన్నీ మూలిక ఫొటో తీసి తన ఫేస్బుక్లో ఉంచాక వానర్ చెప్పాడు - ‘‘ఫేస్‌బుక్‌ని సృష్టించినందుకు మనం దేవుడికి కృతజ్ఞతగా ఉండాలి. లేదా ఈ భోజనం ప్లేట్ ఫొటోని తీసి, ఫిల్మ్ కడిగించి, డెవలప్ చేసి, ప్రింట్ వేయించి ఆరు వందల అరవై రెండు మంది ఇళ్ళకి తీసుకెళ్ళి చూపించాల్సి వచ్చేది.’’ ‘‘నీకు పేరిస్ చూపించనా?’’ ఆ రాత్రి భోజనం అయ్యాక డాక్టర్ మూలిక అడిగింది. ‘‘ఎప్పుడు? నాకు పాస్‌పోర్ట్ లేదు’’ వానర్ చెప్పాడు. ‘‘ఎప్పుడో కాదు. ఇవాళే. ఇప్పటికి ఇప్పుడు పేరిస్లోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లోని ఓ గది చూపిస్తాను.’’ ‘‘చూపించండి. పేరిస్ బై నైట్ సినిమా డివిడి ఉందా?’’ ఉత్సాహంగా అడిగాడు. ‘‘కాదు. కళ్ళు మూసుకో.’’ అతను కళ్ళు మూసుకున్నాడు. ‘‘మనం ఫ్రాన్స్ వెళ్ళినప్పుడు పేరిస్‌లో బస చేసే గది సరిగ్గా ఇలాగే కనబడుతుంది. నాకు సిగ్గు’’ మూలిక చెప్పింది. ‘‘మీరూ కళ్ళు మూసుకోండి. మీకూ ఓ విచిత్రం చూపిస్తాను’’ వానర్ చెప్పాడు. ‘‘ఇప్పుడు కళ్ళు తెరవండి’’ మూడు నిమిషాల తర్వాత చెప్పాడు. ‘‘ఏమిటి విచిత్రం?’’ చుట్టూ చూస్తూ అడిగింది. ‘‘ఏమిటి విచిత్రం?’’ ఓ వింత కంఠం చెప్పింది. ‘‘అదేమిటి?’’ ఆశ్చర్యంగా అడిగింది. ‘‘అదే విచిత్రం మరి.’’ ‘‘అదేమిటి? అదే విచిత్రం మరి’’ ఇందాకటి కంఠం వినిపించింది. వాళ్ళిద్దరూ మాట్లాడే మాటలు రిపీట్ అవసాగాయి. ‘‘నీకు వెంట్రిలాక్విజం తెలుసా?’’ డాక్టర్ మూలిక అడిగింది. ‘‘నీకు వెంట్రిలాక్విజం తెలుసా?’’ ఆమె మాటలు మళ్ళీ రిపీట్ అయ్యాయి. ‘‘లేదు. ఏం?’’ వానర్ అడిగాడు. ‘‘లేదు. ఏం?’’ మళ్ళీ ఆ కంఠం రిపీట్ అయింది. ‘‘అదుగో. విన్నావా?’’ అని మూలిక అనగానే ‘అదుగో. విన్నావా?’ అని మళ్ళీ రిపీట్ అయింది. ‘‘మరి నా మాటలు కూడా ఎలా రిపీట్ అవుతున్నాయి?’’ కపీష్ ఒంగి బల్ల కింద చూస్తూ అడిగాడు. ‘‘మరి నా మాటలు కూడా ఎలా రిపీట్ అవుతున్నాయి?’’ కార్టూన్ కంఠం ధ్వనించింది. ‘‘చుట్టుపక్కల కార్టూన్ కేరక్టర్ ఏదైనా ఉందేమో?’’ కపీష్ చుట్టూ చూస్తూ చెప్పాడు. ‘‘చుట్టుపక్కల కార్టూన్ కేరక్టర్ ఏదైనా ఉందేమో?’’ డాక్టర్ మూలిక తన స్మార్ట్ ఫోన్‌ని అందుకుని స్క్రీన్ మీద కనిపించే కార్టూన్ పిల్లిని చూసింది. అది తన కుడి చేతిని కుడి చెవి దగ్గరకి తీసుకెళ్ళింది. ‘‘ఓ! ఏమిటిది?’’ నవ్వి అడిగింది. ‘‘ఓ! ఏమిటిది?’’ నవ్వి ఆ కంఠం కూడా పలికింది. -
త్రీమంకీస్ - 60
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 60 మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘ఏమిటా విండోస్?’’ గోడకి ఆనించి ఉన్న కిటికీలని చూసి మర్కట్ అడిగాడు. ‘‘అప్పుడప్పుడూ విండో షాపింగ్‌కి వెళ్ళొస్తూంటాను. కుక్క తోకని కూడా కాలు అనుకుంటే కుక్కకి ఎన్ని కాళ్ళు ఉంటాయి?’’ ‘‘ఐదు’’ బుష్‌ని చూస్తూ వేళ్ళతో లెక్కపెట్టుకుని మర్కట్ జవాబు చెప్పాడు. ‘‘తప్పు. నాలుగే. తోకని కాలని అనుకున్నంత మాత్రాన అది కాలు కాదు. ఇంకోటి అడగనా?’’ వైతరణి నవ్వుతూ అడిగింది. ‘‘ఒద్దు. ఒకే కుక్క చేత రెండుసార్లు కరిపించుకునేవాడు మూర్ఖుడు అవుతాడు.’’ వాళ్ళిద్దరూ దుప్పటి కిందకి చేరాక వైతరణి తన గౌన్ని విప్పి మంచం కింద పడేస్తూ అడిగింది. ‘‘లైట్లోనే ఇష్టం అన్నాగా? చెప్పండి. మనకి పుట్టే పిల్లల బంగారు భవిష్యత్‌కోసం ఏం చేద్దాం?’’ ‘‘టీ అమ్మే వాడిలా పెంచి మోడీని చేయచ్చు. లేదా ఐఐటిలో చదివించి కేజ్రీవాల్‌ని చేయచ్చు’’ మర్కట్ చెప్పాడు. ‘‘విదేశాల్లో మాత్రం చదివించద్దండి’’ ఆలోచించి చెప్పింది. ‘‘ఏం?’’ ‘‘రాహుల్ గాంధీలా తయారవుతాడు.’’ 19 ‘‘మీరు అసలు ఇంగ్లీష్ మందులే వాడరా?’’ వానర్ అడిగాడు. ‘‘ఊహూ. ఇంగ్లీష్ మందు తీసుకుంటే రెండుసార్లు రికవర్ అవాలి. ఓసారి జబ్బు నించి. ఇంకోసారి ఆ మందు నించి.’’ ‘‘మీకు బ్రేక్‌ఫాస్ట్ అలవాటు లేదా? అది మంచిదని డాక్టర్లు చెప్తారే?’’ వానర్ అడిగాడు. ‘‘ఏది తిని ఫాస్ట్‌ని బ్రేక్ చేస్తామో టెక్నికల్‌గా అదే బ్రేక్‌ఫాస్ట్. అందువల్ల ప్రపంచంలో బ్రేక్‌ఫాస్ట్ తినని వారే ఉండరు’’ డాక్టర్ మూలిక చెప్పింది. ‘‘ఈ రాత్రి వంట నేను చేయనా? లేక మీరు చేస్తారా?’’ వానర్ మళ్ళీ అడిగాడు. ‘‘ఇద్దరం కలిసి చేద్దాం. అప్పుడే మర్చిపోయావా? నాన్ సెక్స్‌వల్ ప్రేమలో నంబర్ నైన్, కుక్ ఏ మీల్ టుగెదర్. కలిసి వంట చేయడం కూడా ప్రేమని వ్యక్తం చేసే ఓ పద్ధతి’’ డాక్టర్ మూలిక చెప్పింది. వానర్ ఫ్రిజ్ తెరిచి కూరలు ఉంచే క్రిస్పర్ బాక్స్‌ని తెరిచి చూశాడు. ‘‘అందులో అనేక రకాల ఆకులు, కొమ్మలు, బెరళ్ళు, భస్మాలు కనిపించాయి. వాటిని చూసి చెప్పాడు. ‘‘లేవు. నేను వెళ్ళి తెస్తాను.’’ ‘‘ఏం లేవు?’’ మూలిక అడిగింది. ‘‘వంకాయలు. ఉల్లిపాయలు. ఉల్లి కారం పెట్టిన వంకాయ కూర తినాలని ఉంది.’’ ‘‘ఉల్లిపాయా! వంకాయా!’’ మూలిక పక్కలో బాంబ్ పడ్డట్లుగా అరిచింది. ‘‘ఏం?’’ ‘‘వంకాయ సర్వరోగప్రదాయిని అని వినలేదా? దాన్ని చస్తే తినకూడదు. తింటే త్వరగా చస్తాం అని ధన్వంతరి రాశాడు. ఉల్లిపాయ గాలే అసలు మనకి తగలకూడదు అని చరకుడు రాశాడు. ఈ రెండూ ఆయుర్వేదంలో నిషిద్ధం.’’ ‘‘పోనీ దొండకాయ, ఉల్లి కారం కూర?’’ ‘‘దొండ పరమ నిషిద్ధం. వెనకటికి ఒకడికి దొండ పాదు కింద స్నానం చేస్తే బుద్ధి మాంద్యం పట్టుకుందని చరకసంహితలో రాసుంది. అది మనిషిని నిస్తేజంగా మారుస్తుంది.’’ ‘‘వంకాయ, దొండకాయలకే ఉల్లి కారం వేసి వండితే బావుంటుంది. ఒక్కసారికేం కాదు.’’ ‘‘ఊహూ. అవి రెండూ వాతపిత్త దోషాలని కలిగిస్తాయి.’’ ‘‘పోనీ చామదుంపలు తెస్తాను. వేయించి ఇంత ధనియాల పొడి, ఉప్పూ, కారం చల్లి...’’ ‘‘నో. నో. నో. నో... దుంపకూరలు కూడా నిషిద్ధం. నేల అడుగున పండే వాటిలో ఒక్క వేరుశెనగ మాత్రమే శ్రేష్టం. మిగిలినవన్నీ వర్జింప తగ్గవి. అవన్నీ వాతాన్ని కలిగించేవి.’’ ‘‘కాని రాముడు అరణ్యవాసంలో కందమూలాలనే తిని జీవించాడు కదా?’’ ‘‘రాముడు దేవుడు. నువ్వు మనిషి.’’ వానర్ కొద్దిసేపు ఆలోచించి తనకి ఇష్టమైన కూరలని, వాటిని వండే విధానాలని చెప్పాడు. ఆమె వేటికి వాతపిత్తకఫ దోషాలో చెప్పి ఖండించేసింది. ‘‘బెండకాయ?’’ ‘‘అది కొంత దాకా ఓకే.’’ ‘‘సరే. బెండకాయ, వేరుశెనగపప్పు కలిపి వేపుడు చేస్తే?’’ ‘‘ఈరోజు చతుర్దశి. చతుర్దశి నాడు బెండకాయ తింటే ఆవు మాంసం తిన్నంత పాపం వస్తుంది అని ఆయుర్వేద రత్నావళిలో రాశారు.’’ ‘‘పోనీ సొరకాయలో పాలు పోసి వండుదామా?’’ వానర్ ఆశగా అడిగాడు. ‘‘రాత్రి పూట సొరకాయ నిషిద్ధం. జలుబు చేస్తుంది.’’ ‘‘సరే. ఈరోజు తిథికి, ఈ వారానికి ఏవి సూటబుల్?’’ బలహీనంగా అడిగాడు. ‘‘తోటకూర పొడికూర, బచ్చలి పులుసు, గంగబాయిల కూర పచ్చడి.’’ ‘‘అదేమిటి? ఆక్కూరతో పచ్చడా? ఎక్కడా వినలేదే?’’ ‘‘చేస్తాగా. తిని చూసి మాట్లాడు. ముందుగా ఆకుకూరలని ఇసక పోయేలా బాగా కడిగి కాడల నించి ఆకులని వేరు చేయి... నా వంటంటే అంతా పడి చస్తారు.’’ (కోక్ ఫ్రిజ్‌లో కాకుండా టాయ్లెట్లో ఎందుకు ఉంది?) -
త్రీమంకీస్ - 59
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 59 - మల్లాది వెంకటకృష్ణమూర్తి టీ పాయ్ మీద ఎక్కిన మర్కట్ వాటి వంక భయంగా చూస్తూ అడిగాడు - ‘‘డేడ్? నేనా? వాటికా?’’ ‘‘అవును. నేను వాటికి మమ్ అయినప్పుడు నువ్వు డేడ్ అవుతావు కదా?’’ వైతరణి వాటిని ప్రేమగా మందలించి, అతని భయాన్ని చూసి నవ్వి చెప్పింది. ‘‘అవి డేడీని ఏం చేయవు.’’ కాసేపటికి అవి సర్దుకున్నాయి. సోఫా మీద కూర్చుని ఆమె వాటిని కాసేపు ముద్దు చేస్తూంటే ఎదురుగా ఉన్న సోఫా మీద కాళ్ళు ముడుచుకుని కూర్చున్న మర్కట్, అవి తమ జీవితాల్లో లేకపోతే వాటి స్థానంలో తను ఉండి ఉండేవాడని అనుకున్నాడు. ‘‘క్లింటన్ తల్లికి ఆడీ కారు అలవాటు. ఇండికా లాంటివి ఎక్కదు. దీన్ని నాకు అమ్మినవాడు పవన్ కళ్యాణ్‌కి, మహేష్ బాబుకి, అనుష్కకి కూడా కుక్కల్ని అమ్మాడు. నాగార్జున పెంచే కుక్కే దీని తల్లిని క్రాస్ చేసింది. అది తమన్నా కుక్క. అంటే దీని తల్లి తమన్నా ఇంట్లో, తండ్రి నాగార్జున ఇంట్లో ఉన్నాయి. వీడి పిన్ని బాలకృష్ణతో ఏక్ట్ చేసింది. అసలు దీని ముత్తాతని ఎస్వి రంగారావు ఐర్లండ్ నించి తెప్పించాడు. కుక్కల్ని ప్రేమించే వారు చరిత్రలో ఎందరో. హిజ్ మాస్టర్స్ వాయిస్ గ్రామఫోన్ రికార్డ్ కంపెనీకి ఆ పేరు, ఆ లోగో ఎందుకు వచ్చాయో తెలుసా? దాని యజమాని పాడుతూంటే ఆ కుక్క చెవులు రిక్కించుకుని వినేది. అందుకని అలా వినే కుక్కనే లోగోగా చేశారు’’ వైతరణి వాటిని ముద్దాడుతూ చెప్పింది. ఓ కుక్క బొమ్మ, కింద ‘ఆల్ మెన్ ఆర్ ఈక్వల్ బిఫోర్ డాగ్స్’ అనే పోస్టర్ కనిపించింది. ‘‘ఈ ఫొటోలోని కుక్క మీ కుక్క కాదనుకుంటా?’’ మర్కట్ అడిగాడు. ‘‘కాదు. తోడికోడళ్ళు చూశారా?’’ ‘‘సినిమానా? లేదు.’’ ‘‘నాగచైతన్య నానమ్మ ఆ సినిమాని తీసింది. అందులో అది నటించింది. నేను దాని ఫేన్‌ని. ఈ రెండో ఫొటో టిన్ టిన్ అని హాలీవుడ్లో ముప్ఫై రెండు సినిమాల్లో నటించింది. ఇది పోయినప్పుడు అమెరికన్స్ అంతా కంటతడిపెట్టారు’’ వైతరణి చెప్పింది. ‘‘ఇది?’’ ‘‘తెలీదా? లైకా. అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి జీవి. కుక్కనే ఎందుకు పంపారంటే అది మనిషి కన్నా తెలివి గలది కాబట్టి.’’ ‘‘ఇది ఎక్స్ట్రా చేసి చెప్పడం’’ మనిషి కాబట్టి మర్కట్ అభ్యంతరం చెప్పాడు. ‘‘లేకపోతే డిటెక్టివ్లు, పోలీసులు దొంగల్ని పట్టుకోడానికి కుక్కల సహాయమే దేనికి తీసుకుంటారు? హైద్రాబాద్ డాగ్స్ క్లబ్‌కి బుష్ ప్రెసిడెంట్. దానికి హిందీ పాటలంటే ఇష్టం. ‘బెనారసివాలా’ పాటకి డేన్స్ చేస్తుంది. ఈ మధ్య రెహమాన్ వచ్చాక తెలుగు పాటలని లైక్ చేస్తోంది. ఓసారి నా ఉంగరం ఎక్కడో పడిపోతే ఇల్లంతా వెతుకుతున్నాను. క్లింటన్ కిందకి పరిగెత్తి అక్కడ నించి మొరగసాగాడు. వెళ్ళి చూద్దును కదా, వాడు నిలబడ్డ క్రోటన్ మొక్క కింద ఉంగరం కనిపించింది. వాడు మనుషుల భావాల్ని ఇట్టే పట్టేస్తాడు. కాబట్టి వాడిని కుక్క అంటే చిన్న బుచ్చుకుంటాడు.’’ ‘‘దానికి మన తెలుగు అర్థం అవుతుందన్నమాట.’’ ‘‘అది కాదు. వాడు. అవును. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ప్రతీది అర్థం అవుతుంది. కుక్కల వల్ల మనుషుల మధ్య స్నేహం ఏర్పడుతుందని తెలుసా? బుష్ వల్ల నాకో ఐపిఎస్ ఆఫీసర్ భార్య, సినిమాల్లో ఫైట్ మాస్టర్ సన్నిహితులైపోయారు.’’ ‘‘కుక్క ఫ్రెండ్స్ అన్నమాట.’’ ‘‘అవును. వాళ్ళు రోజూ కుక్కల్ని వాకింగ్‌కి తీసుకువచ్చే టైంలోనే నేనూ వెళ్తూంటాను. అలా పరిచయం.’’ గొప్ప వారి కుక్క ఏనుగు కన్నా బలమైంది అనే సామెత ఎలా వచ్చిందో మర్కట్కి బోధ పడింది. బుష్ మర్కట్‌ని చూసినప్పుడల్లా మొరుగుతూనే ఉంది. ‘‘అసలు మీకు కుక్కని పెంచుకోవాలనే ఆలోచన ఎలా కలిగింది?’’ మర్కట్ అడిగాడు. ‘‘గుర్రం, కుక్క ఉన్న సినిమాలకే నా చిన్నప్పుడు వెళ్ళేదాన్ని. గుర్రాన్ని పెంచుకోవడం కష్టం అని కుక్కని కొన్నాను. కాని కుక్కని సరైన ఎంపిక చేశానని ఇప్పుడు అర్థమైంది. ఓసారి మా బుష్ ఏం చేసిందో తెలుసా?..’’ ఆ సంభాషణ తర్వాత మర్కట్ ఆమెకి మనసులోనే గుడ్ బై చెప్పేశాడు. ఆమె క్లింటన్, బుష్లకి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుందని తెలిశాక మర్కట్ తనని తప్ప కుక్కలని ప్రేమించే భార్య లేదా ప్రియురాలు వద్దనే నిర్ణయం తీసుకున్నాడు. ‘‘ఇది ఐ ఫోన్ 9’’ బెడ్ రూంలో వైతరణి చెప్పింది. ‘‘అదేమిటి? ఐ ఫోన్ 6 మాత్రమేగా వచ్చిందిగా?’’ ‘‘దీన్ని తలకిందులుగా పట్టుకున్నానని నువ్వు గమనించలేదు. నా మొత్తం సేవింగ్స్ అంతా ఈ ఫోన్‌కి ఖర్చవగా ఇంకా క్రెడిట్ కార్డ్ కంపెనీకి నేను రేపటిలోగా పాతిక వేలు కట్టాలి.’’ ‘నా బొంద. ఇంక నిన్ను అప్పేం అడుగుతాను? ఇక మిగిలింది వానర్. వాడు సాధించచ్చు’ మర్కట్ మనసులో అనుకున్నాడు. వానర్‌కు డాక్టర్ మూలిక చెప్పిన ప్రేమను వ్యక్తం చేసే పద్ధతి ఏది? -
త్రీమంకీస్ - 58
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 58 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘నువ్వే.’’ ‘‘నా పేరు మర్కట్ అని చెప్పానే?’’ ‘‘నా ఫ్రెండ్ ‘ర్క’ని కొట్టేసింది’’ ఆమెతో వచ్చిన మూలిక నవ్వుతూ చెప్పింది. ‘ఎవరది’ అంటూ లోపల నించి అక్కడికి వచ్చిన కపీష్ వాళ్ళిద్దర్నీ చూసి ఆశ్చర్యపోలేదు. భయపడ్డాడు. లోపల నించి తన వెనకే వచ్చిన రుధిరని అడిగాడు - ‘‘వీళ్ళు మమ్మల్ని పోలీసులకి పట్టిస్తారేమో?’’ ‘‘ఆ పని ఎప్పటికీ చేయరు. నేను నిన్ను పట్టించానా?’’ ‘‘మన సంగతి వేరు. మనం మనం ప్రేమించుకుంటున్నాం.’’ ‘‘అలాగే వీళ్ళూ వీళ్ళూ ప్రేమించుకుంటున్నారు’’ రుధిర చెప్పింది. ‘‘కాబట్టి పట్టించం’’ డాక్టర్ మూలిక చెప్పింది. ‘‘నువ్వు ఇక్కడ ఉన్నావని మాటమాత్రంగానైనా చెప్పలేదే? మనింటికి పద’’ డాక్టర్ మూలిక వానర్ చేతిని పట్టుకుని లాగింది. వైతరణి కూడా మర్కట్ చేతిని పట్టుకుని లాగి చెప్పింది - ‘‘నువ్వు కూడా. నన్ను స్కర్ట్, టాప్లలో చూడాలని ఉందన్నావు కదా. చూద్దువు గాని.’’ ‘‘కాని మేం ముగ్గురం ఒకేచోట ఉండాల్సిన అవసరం ఉంది’’ వానర్ ఇబ్బందిగా కపీష్ వంక చూస్తూ చెప్పాడు. ‘‘చూడు మరి’’ డాక్టర్ మూలిక రుధిరతో ఫిర్యాదుగా చెప్పింది. ‘‘వెళ్ళండి. ఇది సింగిల్ బెడ్ రూం ఫ్లాట్ అని మీకూ తెలుసుగా? రాత్రి ఏం ఇబ్బంది పడ్డారో, ఏమిటో?’’ రుధిర చెప్పింది. ‘‘నువ్వేం మాట్లాడవే?’’ మర్కట్ కపీష్‌ని నిలదీశాడు. ‘‘మనం ముగ్గురం ఒకేచోట ఉండాల్సిన అవసరం నాకు పెద్దగా కనిపించడం లేదు. వాళ్ళని మీరు డిజప్పాయింట్ చేయడం మర్యాద కాదు’’ అతను చెప్పాడు. ‘‘ఓరి మిత్రద్రోహి!’’ వానర్ అరిచాడు. ‘‘ఫ్రెండ్షిప్ అంటే అలా ఉండాలి. సెల్ఫోన్లో ఒకరితో మరొకరు మాట్లాడుకోవచ్చు’’ రుధిర చెప్పింది. ‘‘రేపు సాయంత్రం మా ఇంట్లో కిట్టీ పార్టీ ఉంది. పిలవడానికి వచ్చాను’’ మూలిక చెప్పింది. ‘‘అలాగే వస్తాను’’ రుధిర ఒప్పుకుంది. వాళ్ళిద్దరూ రుధిరని పక్కకి తీసుకెళ్ళి ‘‘రాత్రి అతనితో అనుభవం ఎలా ఉంది?’’ అనడిగారు. ‘‘తేనె కలిపిన లోషన్‌తో అతను నాకు ఎంబామింగ్ చేసినట్లుగా అనిపించింది.’’ అంతా అక్కడే భోజనాలు చేశాక వెళ్ళబోయే ముందు మూలిక చెప్పింది - ‘‘కమాన్ వార్.’’ ‘‘నేనా?’’ వానర్ అడిగాడు. ‘‘అవును. ఇంక వీళ్ళింట్లో ఎందుకు? మనింటికి వెళ్దాం పద.’’ ‘‘కాని...’’ మర్కట్ ఏదో చెప్పబోయాడు. ‘‘నో కానీలు. నథింగ్. నువ్వు రావాల్సిందే. ఇంక తప్పించుకోలేవు’’ వైతరణి అతని చేతిని పట్టుకుని చెప్పింది. ‘‘రేపు మధ్యాహ్నం పన్నెండున్నరకి మేం ఓ చోటికి వెళ్ళే అవసరం ఉంది’’ కపీష్ చెప్పాడు. ‘‘అలాగే. భోజనం పెట్టి ఆ టైంకి పంపిస్తాం’’ మూలిక చెప్పింది. వాళ్ళిద్దరూ తాము ప్రేమించే ఇద్దరు మగాళ్ళ చేతులు పట్టుకుని లాక్కెళ్ళారు. వాళ్ళు చూడకుండా కపీష్ బొటన వేలుని, చూపుడు వేలిని ఒక దాంతో మరొకటి ముట్టుకుంటూ వాళ్ళని అప్పు అడగమని సైగ చేశాడు. 18 వైతరణి నడిపే స్కూటర్ ఆమె ఇంటి అపార్ట్మెంట్ పార్కింగ్‌లో ఆగాక వెనక కూర్చున్న మర్కట్ దిగాడు. ఇద్దరూ మెట్లెక్కి ఫస్ట్ ఫ్లోర్‌లోని ఆమె అపార్ట్మెంట్లోకి చేరుకున్నారు. ‘‘ఇదేమిటి? ‘బివేర్ ఆఫ్ మేన్’ అనే బోర్డు పెట్టారు. అంతా బివేర్ ఆఫ్ డాగ్ అనే బోర్డు పెడుతూంటారుగా?’’ దాన్ని చూసి మర్కట్ ఆశ్చర్యంగా అడిగాడు. ‘‘కుక్క కన్నా మనిషి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలనే సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వాలని ఈ బోర్డు పెట్టాను. సాక్షిలో ఇది న్యూస్ ఐటెంగా కూడా వచ్చింది. చూళ్ళేదా?’’ ‘‘చూశాను. గుర్తుంది. మోడీ ఎన్నికల ప్రచా రం హెడ్డింగ్ పక్కన వేశారు’’ ఆమెని సంతోషపెట్టడానికి అబద్ధం ఆడాడు. ‘‘ఈ రాత్రి వాతావరణ హెచ్చరిక విన్నావా?’’ ‘‘లేదే? చలిగా ఉంటుందా?’’ ‘‘చీకటిగా ఉంటుందిట. కాని నాకు లైట్లోనే ఇష్టం.’’ లోపల నించి కుక్క మొరుగు వినిపించి అడిగాడు - ‘‘మీ ఇంట్లోకి పొరపాటున కుక్క వెళ్ళినట్లుంది.’’ ‘‘ఫన్నీ! లేదు. అది మన కుక్కే.’’ ‘‘ఏమిటి? మీరు కుక్కని పెంచుతున్నారా?’’ ‘‘కుక్కల్ని. రెండు. ఓ ఆడ కుక్క, ఓ మగ కుక్క. తెల్లటి బొచ్చు కుక్కలు.’’ ‘‘నాకు కుక్కలంటే భయం.’’ ‘‘క్లింటన్, బుష్‌లు నిన్నేం చేయవు.’’ ‘‘అవి కుక్కల పేర్లా?’’ ‘‘అవును. ఇక నించి వాటిని కుక్కలు అనకు. నిన్ను మనిషి అంటే నీకు కోపం రాదూ? పేర్లతో పిలు. లేదా హి, షి అను. నాకు క్లింటన్ విమనైజింగ్ నచ్చక వాడి పేరు, బుష్ ఇరాక్ మీద దాడి చేయడం నచ్చక వాడి పేరు పెట్టాను. అఫ్కోర్స్. నేను దానికి బుష్ అనే మగ పేరు పెట్టానని, తను ఆడ కుక్కని ఆమెకి తెలీదు కదా? అందుకని అది ఏం అనుకోదు’’ వైతరణి చెప్పింది. తలుపు తీసి లోపలకి వెళ్ళగానే రెండు పమేరియన్ కుక్కలు పరిగెత్తుకుంటూ వచ్చి కొత్త వ్యక్తిని చూసి మొరగసాగాయి. ‘‘డోంట్. హి ఈజ్ యువర్ డేడ్. నో క్లింటన్ స్వీటీ. నో బుష్ డార్లింగ్...’’ -
త్రీమంకీస్ - 57
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 57 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘నాకు నిద్ర వస్తోంది’’ రాత్రి ఎనిమిదిన్నరకి వానర్ టీ తాగి ఆవులించినట్లు నటించి చెప్పాడు. ‘‘నాక్కూడా’’ మర్కట్ కూడా అదే పని చేసి చెప్పాడు. ‘‘ఉన్నది ఒకటే బెడ్రూం. కాబట్టి మర్కట్, ఇక్కడ సోఫాలో నువ్వు పడుకో. వానర్, నువ్వు పొట్టి కాబట్టి డైనింగ్ కుర్చీలని పక్కపక్కన ఉంచి వాటి మీద పడుకో. నేను, కపీష్ లోపల మంచం మీద పడుకుంటాం’’ రుధిర చెప్పింది. ‘‘అలాగే.’’ ఆ ఇద్దరూ గదిలోకి వెళ్ళి తలుపేసుకోగానే వానర్ రుధిర లేప్టేప్ని తెరిచాడు. అది పాస్‌వర్డ్‌ని అడిగింది. ఇద్దరూ అది ఏమై ఉండచ్చా అని ఆలోచించారు. ‘‘నైఫ్ అని టైప్ చేసి చూడు’’ మర్కట్ సూచించాడు. ‘‘ఊహూ. అది కాదు.’’ రివాల్వర్, పిస్టల్, స్వోర్డ్ల తర్వాత బ్లడ్ అని టైప్ చేస్తే తెరచుకుంది. గూగుల్లోకి వెళ్ళి రైట్ టైం కోసం వెదికితే చాలా కనిపించాయి. టొరంటోలోని ఓ ట్రావెల్ ఏజన్సీ పేరది. టోక్యోలోని ఓ షేర్ బ్రోకర్ సంస్థ పేరది. టెహ్రాన్‌లోని ఓ పెళ్ళిళ్ళని కుదిర్చే సంస్థ పేరది. టెల్ అవివ్‌లోని కండోమ్స్ బ్రాండ్ పేరది. హైద్రాబాద్‌లో ఓ వాచీ షాప్ పేరది. రైట్ టైం అనే వాచీ షాప్ బంజారాహిల్స్‌లో ఉంది. ఆ అడ్రస్ని రాసుకుని గూగుల్ మేప్స్కి వెళ్ళి దాన్ని టైప్ చేశాడు. ఆ గూగుల్ మేప్‌ని చూసి వానర్ ఆనందంగా చెప్పాడు. ‘‘ఇదిగో. ఈ వాచ్ షాప్ పక్కనే ప్రుడెన్షియల్ బేంక్ ఉంది.’’ ‘‘ఎస్ అదే అయి ఉంటుంది’’ చెప్పి లేచి వానర్ బెడ్రూం తలుపు తట్టాడు. చెదిరిన జుట్టుతో, నడుం నించి చుట్టుకున్న దుప్పటిలో ఉన్న కపీష్ తల మాత్రం బయటకి పెట్టి అడిగాడు. ‘‘ఏమిటి?’’ ‘‘ఆ అడ్రస్ కనుక్కున్నాం’’ వానర్ ఆనందంగా చెప్పాడు. ‘‘రేపటి మాటలు ఇవ్వాళ దేనికి? ఇవాల్టి పని ఇవాళ చేయనీ’’ కోపంగా చెప్పి కపీష్ తలుపు మూశాడు. 17 ‘‘రాత్రెలా గడిచిందేంటి?’’ మర్కట్ మర్నాడు ఉదయం ప్రశ్నించాడు. ‘‘అమ్మాయిలు బట్టల్లేకుండా కన్నా బట్టలతోనే అందంగా కనిపిస్తారని అర్థమయ్యేలా గడిచింది. పైగా నా పేరు కప్‌గా, ఆమె పేరు రుర్గా మారింది’’ కపీష్ చెప్పాడు. ‘‘ఏం మాట్లాడుకున్నారు?’’ వానర్ ఉత్సాహంగా అడిగాడు. ‘‘ఒక్క మాట కూడా మాట్లాడలేదురా మూర్ఖా. బెడ్ రూం మాటల కోసం కాదురా. అది వేరే పనికి ఉద్దేశించబడిందని తెలుసుకో’’ కపీష్ నవ్వుతూ చెప్పాడు. రుధిర స్నానానికి బాత్రూంలోకి వెళ్ళాక వాళ్ళు మళ్ళీ గుసగుసలాడారు. ‘‘మనకి సొరంగంలో ఎలక్ట్రిక్ డ్రిల్ అవసరం. అది ఎంతవుతుందో?’’ కపీష్ గుసగుసలాడాడు. ‘‘ఎలక్ట్రిక్ డ్రిల్ కొనడానికి మనకి నాలుగున్నర వేలు అవసరం’’ వానర్ గూగుల్ చేసి చూసి చెప్పాడు. ‘‘అంత డబ్బు మన దగ్గర లేదు. రుధిరని అప్పడుగు’’ మర్కట్ సూచించాడు. ‘‘అలాగే.’’ రుధిర డ్రెస్ చేసుకుని వచ్చాక మర్కట్ చెప్పాడు. ‘‘మా వాడు మీతో ఓ విషయం మాట్లాడటానికి మొహమాట పడుతున్నాడు. వాడి తరఫున నేను మాట్లాడనా?’’ ‘‘అలాగే. పెళ్ళి గురించేగా అంకుల్?’’ ‘‘అవును. అలా పక్కకి వెళ్దాం పద.’’ ఇద్దరూ పక్కకి వెళ్ళి మాట్లాడి వచ్చాక ఆమె కపీష్ చేతిని పట్టుకుని చెప్పింది. ‘‘గుళ్ళో పెళ్ళి వద్దు కప్.’’ ‘‘ఏం? చీప్‌గా ఉంటుందనా?’’ మర్కట్ అడిగాడు. ‘‘కాదు. అతిథులంతా కానుకలని హుండీలో వేసి వెళ్తారు.’’ ‘‘అది సరే. నా మిత్రుడికి ఇప్పుడో ఆరు వేల రూపాయలు అవసరం అయ్యాయి. అప్పుగానే’’ వానర్ చెప్పాడు. థంప్స్ డౌన్ సైన్‌ని చూపించి చెప్పింది - ‘‘ఇప్పుడు నా సమస్యా అదే. సారీ కప్. నా డబ్బంతా ప్రస్తుతం లాయర్ దగ్గర ఫీజ్ రూపంలో ఉంది. ఐ కాన్ట్ హెల్ప్ యు.’’ ‘‘ఇట్సాల్ రైట్. నాకు అప్పు అడగడంలో మొహమాటం లేదు. కాని నిన్ను అడగడంలో ఇబ్బంది పడ్డాను’’ కపీష్ చెప్పాడు. డోర్ బెల్ విని మర్కట్ తలుపు తెరిచాడు. అతన్ని చూడగానే ఎదురుగా నిలబడ్డ యువతి మొహం విప్పారింది. ‘‘వాటే సర్ప్రైజ్! నువ్వు ఇక్కడ ఉన్నావా? నీకోసం నేను ఎంత తపించిపోతున్నానో తెలుసా?’’ ఆమె చెప్పింది. ‘‘మీరెవరు?’’ మర్కట్ ఆశ్చర్యంగా అడిగాడు. ‘‘గుర్తు పట్టలా? నేను వైని.’’ ‘‘వైయా? ఎక్స్ కాదా?’’ ‘‘గుడ్ జోక్. వైతరణిని.’’ ‘‘ఓ!’’ తెల్లబోతూ చూస్తూండిపోయాడు. ‘‘నేను యూనిఫాంలో లేకపోవడంతో గుర్తు పట్టలేకపోయావా మట్?’’ ‘‘మట్ ఎవరు?’’ (మూలిక, వైతరిణిలను చూసి కపీష్ ఎందుకు భయపడ్డాడు?) - మళ్లీ రేపు ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 3monkies.sakshi@gmail.com లెటర్స్ ఎంత బిజీగా ఉన్నా త్రీ మంకీస్ చదవడం నా నిత్య చర్య అయింది. సీరియల్ పట్టులో ఉంది. - షాహీర్, తాడిపత్రి The episode published on 12-12-14 is very funny...this type of comic serials coming from authors r very rare...thanx to Malladi garu & sakshi... - pradeep kumar pedada,srikakulam -
త్రీమంకీస్ - 56
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 56 - మల్లాది వెంకటకృష్ణమూర్తి రుధిర టై మీదకి రావడం చూసి ముగ్గురూ మాట మార్చారు. ‘‘... ఎన్నైనా చెప్పు. పాత పాటలు చెత్త’’ మర్కట్ చెప్పాడు. ‘‘కాని స్లో అయినా కొన్ని అతను పాడినవి వినసొంపుగా ఉన్నాయి’’ వానర్ చెప్పాడు. ‘‘పీల్చుకోవడం అయిందా?’’ రుధిర అడిగింది. ‘‘ఆ. సరిపడా’’ కపీష్ చెప్పాడు. ‘‘ఐతే పదండి. పీజా వచ్చింది.’’ ‘‘అవును. వేడిగా తింటేనే బావుంటుంది’’ మర్కట్ చెప్పాడు. ‘‘పదండి. నేనందుకు ఎప్పుడూ సిద్ధమే’’ వానర్ చెప్పాడు. ముగ్గురూ కిందకి వెళ్తూ చూస్తే మొత్తం ఆరుగురు అమ్మాయిలు సెల్ఫోన్లో మాట్లాడుతూ కనిపించడంతో మర్కట్ చెప్పాడు. ‘‘మన రాష్ర్టంలో ప్రేమ అభివృద్ధి చెందుతోంది.’’ ‘‘ప్రేమ కన్నా సెల్‌ఫోన్ బిల్స్ అభివృద్ధి చెందుతున్నాయి’’ కపీష్ చెప్పాడు. ముందు జింజర్ బ్రడ్ని తిన్నాక కోక్ తాగుతూ వానర్ చెప్పాడు - ‘‘ఒన్ సర్కిల్ టు సర్కిల్ హాఫ్ సర్కిల్ ఏ. ఒన్ సర్కిల్ టు సర్కిల్ రెక్టాంగిల్ ఏ తాగుదామా?’’ వానర్ చెప్పాడు. ‘‘కోక్ రుచి కోక్దే. పెప్సీకి ఎక్కడ వస్తుంది?’’ మర్కట్ కూడా చెప్పాడు. ‘‘మీరు ఇప్పుడు ఏదో రైమ్‌ని పాడారు? ఏమిటది?’’ రుధిర అడిగింది. ‘‘ఒన్ సర్కిల్ టు సర్కిల్ హాఫ్ సర్కిల్ ఏ. ఒన్ సర్కిల్ టు సర్కిల్ రెక్టాంగిల్ అంటే కోక్ అని అర్థం. కోక్ స్పెల్లింగ్‌ని మేథ్స్ సింబల్స్‌తో చెప్పాడు’’ మర్కట్ వివరించాడు. రుధిర, ఆ ముగ్గురూ చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు. ఓ అత్తకి, అల్లుడికి ఆస్తి పంపకాల్లో తగాదా వస్తే తన అన్నయ్య ఆ వివాదం తీర్చి, ఇద్దర్నించీ చెరో ఐదు లక్షలు, ఎవరికి వాళ్ళకే న్యాయం చేస్తున్నట్లుగా నటిస్తూ ఎలా గుంజాడో లాంటి విషయాలు చెప్పింది రుధిర. ‘‘ఇది వినండి. దీన్ని నాకు నా ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ వాట్సాప్‌లో పంపాడు. కొన్ని సంవత్సరాలుగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఆఫీస్‌కి ఓ గాడిద వెళ్లి ఇంకా స్టుపిడ్‌గా తన పేరు ఉందా లేదా అని చెక్ చేస్తోంది. ఈ ఏడు అది లేకపోవడంతో కోపంగా అడిగింది. ‘ఈ ఏడు నా స్థానాన్ని ఎవరు అలంకరించారు?’ మీరు చెప్పండి. ఎవరు?’’ ‘‘రాహుల్ గాంధీ?’’ కపీష్ అడిగాడు. ‘‘కరెక్ట్. ఇది వినండి...’’ జోక్స్‌తో వాళ్ళకి టైమే తెలీకుండా పోయింది. ఆమెకి తెలీకుండా లేప్టాప్ని తెరవాలనుకుంటే రుధిర బాత్రూంకి కూడా వెళ్ళలేదు. ఎప్పట్లా తులసీరాం జైలుకి వచ్చి ములాఖత్ రిజిస్టర్లో సంతకం చేసి లోపలకి రాగానే అతని కోసం ఎదురు చూసే ఇద్దరు కానిస్టేబుల్స్ అతన్ని ప్రశ్నించారు. ‘‘కపీష్‌కి, నీకు మధ్య ఏమిటి సంబంధం? ఇంత పొద్దున్నే ఎందుకు వచ్చావు? అసలు రోజూ అతని దగ్గరకి ఎందుకు వస్తున్నావు?’’ ‘‘నేను అప్పు ఇచ్చేవాడు. అతను తీసుకునే వాడు. అదీ సంబంధం. నా దగ్గర పది వేలు అప్పు తీసుకున్నాడు. దాని వడ్డీ కోసం వస్తున్నాను. అతని డబ్బు మీ దగ్గర ఉందట. నాకు డబ్బిమ్మని మీకు చెప్పాడా? అతనేడి?’’ ‘‘అబద్ధం. అతను పారిపోవడానికి సహాయం చేయడానికి వచ్చావు.’’ ‘‘లేదే? అతను పారిపోయాడా?’’ ‘‘అవును. ఇవాళ తెల్లవారుఝామున పారిపోయాడు.’’ ‘‘ఐతే ఇక ఫర్వాలేదు. అతన్ని బయటే కలుసుకుని వడ్డీ వసూలు చేసుకుంటాను.’’ వెనక్కి తిరిగిన తులసీరాంని పట్టుకుని ఆపి ఓ కానిస్టేబుల్ చెప్పాడు - ‘‘నిన్ను అరెస్ట్ చేస్తున్నాం.’’ ‘‘దేనికి? అప్పు ఇవ్వడం నేరం కాదే?’’ ‘‘ఓ నేరస్థుడు జైలు నించి పారిపోవడానికి కుట్ర పన్నినందుకు.’’ ‘‘రామ రామ. ఎంత మాట? నాకేం తెలీదు.’’ ‘‘అది కోర్ట్ తేల్చాలి.’’ అతను ఎంత మొర పెట్టుకుంటున్నా వినకుండా ఫస్ట్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్ట్ ఇంటికి లాక్కెళ్ళారు. యమధర్మరాజు కేసు విని అడిగాడు - ‘‘నువ్వు నేరం చేశావా?’’ ‘‘లేదు మహాప్రభో. నేనే నేరం చేయలేదు. నా అప్పు తాలూకు వడ్డీ వసూలు చేసే ప్రయత్నం నేరమే అయితే అది నేను ఎప్పట్నించో చేస్తున్నాను.’’ ‘‘పధ్నాలుగు రోజులు’’ ఆయన చెప్పాడు. ‘‘ఇదన్యాయం సామే.’’ ‘‘ఈ దేశంలో న్యాయమే. ఇంగ్లీష్ కోర్ట్‌లో ఓ మనిషి అతను ఐరిష్ మేన్ అని ఋజువు కానంతవరకూ అమాయకుడిగా పరిగణించబడతాడు. అదే ఇండియన్ కోర్ట్‌లో ఓ మనిషి ఫలానా రాజకీయ నాయకుడి బావమరిది అని ఋజువు కానంతవరకూ అపరాధిగా పరిగణింపబడతాడు.’’ తులసీరాంని పోలీసులు తీసుకెళ్ళిపోయారు. యమధర్మరాజు సెల్‌ఫోన్ మోగింది. కొత్తగా ఆయన పెట్టుకున్న ‘ఏమి చెప్పుదును ఒరే. ఒరే. మనకు ఎదురే లేదిక హరే హరే. ఇంటి పోరు వదిలించుకుంటిరా...’ అనే పాట రింగ్ టోన్గా వినిపించింది. -
త్రీ మంకీస్ - 32
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 32 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘పెళ్ళైన వారానికల్లా నీకు అన్నీ వచ్చేస్తాయి. టెన్ - గో గ్రోసరీ షాపింగ్. ఎలెవన్ - మీట్ ఈచ్ అదర్స్ ఫ్రెండ్స్. ట్వెల్వ్ - బ్రౌజింగ్ ఏ మ్యూజియం. థర్టీన్... లేవకు. ఇంకా ఎగ్జామినేషన్ పూర్తి కాలేదు. థర్టీన్ - గో సైట్ సీయింగ్ టుగెదర్. ఫోర్టీన్ - ఎక్సర్సైజ్ టుగెదర్. ఫిఫ్టీన్ - త్రో ఏ పార్టీ టుగెదర్. సిక్స్టీన్ - రైట్ లవ్ లెటర్స్ టు ఈచ్ అదర్. సెవెంటీన్ - ఈట్ డిన్నర్ బై కేండిల్ లైట్. ఎయిటీన్ - గో టు ఏ కాన్సర్ట్ టుగెదర్. నైన్టీన్ - వాచ్ ది సన్ సెట్. ట్వంటీ - సెండే ఫన్నీ కార్డ్. ట్వంటీ టు - షేర్ ఏ ప్రైవేట్ జోక్. ట్వంటీ ఫోర్ - హేవ్ యువర్ పిక్చర్ టేకెన్ టుగెదర్. ట్వంటీ ఫైవ్... ట్వంటీ ఫైవ్ది ఏమిటో తెలుసా వార్.. షేర్ ఏన్ ఐస్‌క్రీం కోన్... లే. వార్! నిద్రలే. నిద్రపోయావేంటి?’’ ‘‘మీరు నన్ను హిప్నటైజ్ చేయలేదా?’’ ‘‘లేదు.’’ ‘‘చేశారనుకున్నాను.’’ ‘‘మొత్తం నూట పదహారు ఉన్నాయి. మిగిలినవి రేపు.’’ ‘‘కాని ఇవన్నీ నేను జైల్లో ఉండగా సాధ్యం కాదు కదా డాక్టర్.’’ ‘‘మూలీ’’ కుడి చేతి చూపుడు వేలుని కొడతా అన్నట్లుగా ఆడిస్తూ చెప్పింది. ‘‘మూలీ.’’ ‘‘నిజమే. కాని నువ్వు శాశ్వతంగా జైల్లో ఉండవు కదా? ఏదో ఓ రోజు బయటకి వస్తావు.’’ ‘‘ఈ లోగా బెయిలు మీద కూడా బయటకి రావచ్చు కదా?’’ ‘‘అవును. నీకు బెయిలిచ్చే మిత్రులు ఎవరైనా ఉన్నారా?’’ ‘‘నన్ను ప్రేమించే ఒకామె ఉంది.’’ ‘‘నువ్వు ఆల్రెడీ ప్రేమలో ఉన్నావా?’’ మూలిక నిరుత్సాహంగా చూస్తూ అడిగింది. ‘‘అవును. ఆమె పేరు మూలిక. మూలీ.’’ ‘‘భయపెట్టేశావు. యస్ నీకు బెయిలు గురించి ఆలోచిస్తాను. కాని నేను జైల్ డాక్టర్‌గా ఉన్నంతకాలం రక్తసంబంధీకులకి తప్ప ఇతరులు ఎవరికీ బెయిల్ ఇప్పించకూడదు.’’ ‘‘మీరు ప్రేమించిన వారికి కూడా?’’ ‘‘నేను ప్రేమించిన వారికి కూడా’’ ఆమె నవ్వి చెప్పింది. ‘‘మీ కాబోయే భర్తకి కూడా?’’ ‘‘నా కాబోయే భర్తకి కూడా. నీకీ ప్రపంచంలో బంధుమిత్రులు చాలామంది ఉంటారు కదా? వాళ్ళల్లో ఎవరైనా...’’ ‘‘వారంతా ఇక్కడే ఉన్నారు. నేను ముందుగా బయటకి వెళ్తే వాళ్ళకీ నేనే బెయిల్‌ని ఇప్పించాలి.’’ ‘‘సరే. రేపు మళ్ళీ కలుద్దాం. కబురు చేస్తాను.’’ ‘‘అలాగే మూలీ.’’ ‘‘సీయు వార్.’’ ‘‘మీ దగ్గరో ఫైవ్ ఉందా?’’ వానర్ అడిగాడు. ‘‘ఫైవ్? ఏం ఫైవ్?’’ ‘‘ఫైవ్ హండ్రెడ్ రుపీస్. నా డబ్బంతా జైలర్ తీసేసుకున్నాడు. ఖర్చులకి బొత్తిగా లేవు.’’ ‘‘వై నాట్?’’ ఆమె తన హేండ్ బేగ్ తెరిచి వంద రూపాయల నోట్లు ఐదు తీసి వానర్‌కి ఇచ్చి చెప్పింది. ‘‘చూశావా? నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను. లేకపోతే ఇంత డబ్బుని అప్పు ఇచ్చేదాన్నే కాదు. ట్వల్వ్ పర్సెంట్ వడ్డీని కూడా నేను ఛార్జ్ చేయడం లేదు... గార్డ్’’ పిలిచింది. అతను వచ్చాక చెప్పింది. ‘‘పేషెంట్‌ని అతని సెల్‌కి తీసుకెళ్ళు. రేపు మళ్ళీ ఎగ్జామిన్ చేయాలి.’’ ‘‘యస్ డాక్టర్’’ చెప్పి అతను వానర్ని వెంట పెట్టుకుని తీసుకెళ్ళాడు. 8 ‘‘నాకు ఇక్కడ టీ నచ్చడం లేదు. ఆ వేణ్ణీళ్ళల్లో టీ వాసనే లేదు’’ సాయంత్రం జైల్ మెస్‌లోని వానర్ చెప్పాడు. ‘‘నాకూ ఇక్కడి చపాతీ నచ్చలేదు. నిన్న రాత్రి తిన్న చపాతీ అరగనే లేదు. పిండి పిండి. సరిగ్గా కాల్చలేదు. నేను బయటకి వెళ్ళగానే బావర్చీకి వెళ్ళి వేడి వేడి చపాతీని, బగారా బైంగన్తో నంచుకుని తింటాను’’ మర్కట్ చెప్పాడు. ‘‘నాక్కూడా ఉల్లి కారం పెట్టిన వంకాయ కూరని వేడి వేడి అన్నంలో కలుపుకుని తినాలని ఉంది’’ వానర్ చెప్పాడు. ‘‘అవును. రెండో రోజుకే జైలంటే విరక్తి పుడుతోంది’’ కపీష్ చెప్పాడు. ఓ ఖైదీని మర్నాడు విడుదల చేయబోతున్న సందర్భంగా అతని బంధువులు జైలర్ అనుమతితో అందరికీ తలో లడ్డూని సరఫరా చేశారు. వానర్ లడ్డూని నోట్లో పెట్టుకుంటూండగా దుర్యోధన్ వాళ్ళ ముందుకు వచ్చి కూర్చుని చెప్పాడు. ‘‘నేనో మేజిక్ చేయనా? ఈ లడ్డూ ఉంది చూశావు? దీన్ని ఎలా మాయం చేస్తున్నానో చూడు’’ చెప్పి దాన్ని కుడి చేత్తో అందుకుని, బల్ల కింది ఎడం చేతిలోకి దాన్ని పడేసి కుడి చేతిలోని లడ్డూని పైకి విసిరినట్లుగా నటించి పైకే చూడసాగాడు. దుర్యోధన్తో సహా అంతా పైకి చూస్తూండగా దాన్ని దుర్యోధన్ తన అనుచరుడి వైపు విసిరేస్తే అందుకు సిద్ధంగా ఉన్న అతను దాన్ని లాఘవంగా పట్టుకున్నాడు. ‘‘మాయం! లడ్డూ మేజిక్ బాలేదూ? ఆ. నోట్లో లేదు చూశావా? కావాలంటే నన్ను వెతకండి’’ నవ్వుతూ రెండు చేతులూ పైకి ఎత్తి పెట్టి లేచి నిలబడుతూ చెప్పాడు. దుర్యోధన్ తన టేబిల్ వైపు నడిచి వెళ్ళి తన అనుచరుడి దగ్గర నుంచి లడ్డూని అందుకుని దాన్ని తింటూ చెప్పాడు - ‘‘అరె! ఇది మళ్ళీ నా చేతిలోకే వచ్చిందే.’’ అక్కడి ఖైదీలంతా గట్టిగా నవ్వారు. వానర్ మొహం కోపంతో ఎర్రబడింది. (హౌ టు ఎస్కేప్ ఫ్రం జైల్?) -
త్రీ మంకీస్ - 31
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 31 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘ఫంగస్ బిట్విన్ టోస్నిల్. టో నెయిల్స్ ఫంగస్నో... నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీతో నిన్న చెప్పానా?’’ ‘‘మీరు నాకన్నా ఐదారేళ్ళు పెద్ద కదా? అది కుదరదు.’’ ‘‘దాందేముంది. నువ్వు కూడా ఇరవై తొమ్మిదికి వచ్చే దాకా నేను అక్కడే వేచి ఉంటాను వార్.’’ ‘‘వార్? అంటే?’’ ‘‘నా ప్రేమ నీ పేరులోని న కొట్టేసింది అని నీకు తట్టలేదా? నువ్వు నన్ను పెళ్ళాడితే రకరకాల చెట్ల బెరళ్ళతో, ఆకులతో, వేళ్ళతో నీకు ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటలని చేయగలుగుతాను. నాకు ఎన్నో మూలికా రహస్యాలు తెలుసు. కాబట్టి రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.’’ ‘‘కాని నేను భోజనప్రియుడ్ని కాను డాక్టర్.’’ ‘‘ఆకలి పెరిగే లేహ్యం ఇచ్చానంటే చాలు. నువ్వు ఇట్టే భోజనప్రియుడిగా మారి పోతావు. పన్నెండేళ్ళకోసారి వచ్చేది ఏది?’’ ‘‘పుష్కరం?’’ ‘‘షేక్స్పియర్ కన్నా అతని భార్య వయసు అంత ఎక్కువ. రైతులు కోరుకునే కరం ఏమిటి?’’ మూలిక మళ్ళీ ప్రశ్నించింది. ‘‘ఎకరం?’’ ‘‘కరెక్ట్. నా పేర పన్నెండు ఎకరాలు ఉన్నాయి. ఆడవాళ్ళల్లో ఏ కరం ఉంటే పెళ్ళవడం కష్టం?’’ ‘‘అవకరం.’’ ‘‘కరెక్ట్. అది నాలో లేదు కాబట్టి మనకి పెళ్ళవడం కష్టం కాదు. సంక్రాంతి అనగానే గుర్తొచ్చే కరం ఏమిటి?’’ ‘‘మకరం.’’ ‘‘అవును. అంటే తెలుగులో మొసలి. దేంట్లోనైనా నాది మొసలి పట్టు. వర్కర్స్ ఉపయోగించే కరం ఏమిటి?’’ ‘‘పరికరం.’’ ‘‘కరెక్ట్. నా ఒంట్లోని పరికరాలన్నీ నీకోసమే ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నాయి’’ మగతగా చెప్పింది. ‘‘డేంజర్ అనగానే గుర్తొచ్చే కరం ఏమిటో మీకు తెలుసా?’’ వానర్ అడిగాడు. ‘‘ప్రమాదకరం?’’ ‘‘కరెక్ట్. మన పెళ్ళి నాకు ప్రమాదకరం అనిపిస్తోంది.’’ ‘‘నీకు కావచ్చు. నాకు మాత్రం ఆనందకరం. ఈ పూట ఒంట్లో ఎలా ఉంది? ఈ ధర్మామీటర్ని పావు అంగుళం మింగు’’ అతని నోట్లో దాన్ని ఉంచి చెప్పింది. ‘‘ఏ మూలిక తింటే లైంగిక శక్తి పెరుగుతుందో, ఏ మూలిక తింటే వృద్ధాప్యం దూరంగా ఉంటుందో, ఏ మూలిక తింటే ఆయుర్దాయం పెరుగుతుందో నాకు తెలుసు. మీకు మలబద్ధకం ఉందా?’’ ‘‘ఛీ! లేదు.’’ ‘‘ఉంటే దానికీ నాకు మూలికా వైద్యం తెలుసు. మన వైవాహిక జీవితం తప్పనిసరిగా సంతోషకరంగా సాగుతుందని వారంటీతో కూడిన గేరంటీని ఇస్తున్నాను.’’ అతని నోట్లోంచి ధర్మామీటర్ని తీసి చూసి విదిలించి చెప్పింది. ‘‘ఓ డిగ్రీ ఎక్కువ ఉంది. ఈ అరంగుళం బెరడుని వేడి నీళ్ళల్లో కాచి ఆ బెరడుని మింగి నీళ్ళు తాగు. రేపు మళ్ళీ వచ్చి నీ ఆరోగ్య పరీక్ష చేయించుకో. నీకోటి తెలుసా? అస్సాం గవర్నర్ పైల్స్ వ్యాధి తగ్గించినందుకు గాను ఆయన నాకు మూలికా రత్న అనే బిరుదుని ఇచ్చి గండపెండేరాన్ని తొడిగి, గజారోహణం చేయించారు. ప్రేమని ఎన్ని విధాలుగా వ్యక్తం చేయచ్చో నీకు తెలుసా?’’ ‘‘తెలుసు. అందుకు ఒకే విధం నాకు తెలుసు డాక్టర్.’’ ‘‘డాక్టర్ కాదు. మూలీ అని పిలు.’’ ‘‘మూలీ ఏమిటి?’’ వానర్ అర్థం కాక అడిగాడు. ‘‘మూలికకి స్వీట్ నేమ్.. ప్రేమని ఎన్ని విధాలుగా వ్యక్తం చేయచ్చో నీకు తెలుసా?’’ మళ్ళీ అడిగింది. ‘‘ఒకే విధంగా తెలుసు డాక్ట... మూలీ.’’ ‘‘ఏమిటది?’’ ‘‘క్షమించండి. మీ ముందు బూతులు మాట్లాడటం భావ్యం కాదు.’’ ‘‘అర్థమైంది. బూతులు మాట్లాడకుండా చెప్పే ఇంకా చాలా విధానాలు ఉన్నాయి వార్... వన్. గివ్ ఆర్ గెటే హగ్.’’ ‘‘సారీ?’’ ‘‘నాన్-సెక్సువల్ ప్రేమ ఎక్స్ప్రెషన్స్ చెప్తున్నాను విను. టు - కిస్ అండ్ బి కిస్డ్; త్రి - హోల్డ్ హేండ్స్. ఫోర్ - గో టుగెదర్ ఫరే లాంగ్ వాక్. అర్థమౌతోందా?’’ ‘‘నాకు ఇంగ్లీష్ కొద్దిగా వచ్చు మూలీ.’’ ‘‘వార్! నాకు ఎవర్ని చూసినా కలగనిది నిన్ను చూశాక నాలో ఏదో కలిగింది వార్.’’ ‘‘ఐ యాం సారీ.’’ ‘‘డోంట్ బి సారీ. గోటు పూరీ ఆన్ ఏ లారీ... ఫైవ్ - గో ఫరే మూవీ. సిక్స్ - సిట్ టుగెదర్ ఇన్ ది పార్క్. ఎయిట్ - గో అవుట్ టు ఈట్.’’ ‘‘అది సెవెన్ అనుకుంటా?’’ ‘‘కాదు. ఎయిట్ టు ఈట్. సెవెన్ స్నగుల్ అప్ టుగెదర్. నైన్ - కుక్ ఏ మీల్ టుగెదర్.’’ ‘‘నాకు మూలికలతో వంట చేయడం రాదు మూలీ’’ వానర్ అభ్యంతరం చెప్పాడు. (మెయిన్ విలన్ దుర్యోధన్కి, ముగ్గురు మిత్రులకి ముఖాముఖి) - మళ్లీ రేపు ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 3monkies.sakshi@gmail.com లెటర్స్ The characterisation of Swachha was very excellent and her discovering the new words in English is amazing. - Boga Sandhya (sandhyab1111@gmail.com) 3 మంకీస్‌లో ప్రతి వర్డ్ కామెడీకి ఉపయోగపడేలా రాస్తున్నారు. స్వచ్ఛ పాత్ర ద్వారా చక్కటి కామెడీ పండించారు. సూపర్. - నరేంద్ర నాయుడు కె. (narendranaidukundavarapu@gmail.com) -
త్రీ మంకీస్ - 30
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 30 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘అది కాదు. బయటకి రాగానే వచ్చి తీసుకెళ్ళమని నాకు ఎస్సెమ్మెస్ ఇద్దామనే నీ మాటని.’’ ‘‘మీ తోడన్నాగా.’’ ‘‘ఆ తోళ్ళు పని చేస్తే నేను ఇప్పటికి తొమ్మిది వందల నలభై ఏడు సార్లు చచ్చేవాడిని. సరే. నువ్వు బయటకి రాగానే నీకు జైలు గుమ్మం బయట స్వాగతం పలికేది నేనే. మాట తప్పావో. ఉస్కో. అంతే. ఏదో ఓ వేలు ఉండదు. జాగ్రత్త.’’ ‘‘తమరంతటికి తెగించేవారని నాకు తెలుసు. బాకీ ఎగ్గొట్టి చిటికెన వేళ్ళని పోగొట్టుకున్న వారి ఫొటోల మీద నా సంతకాలు తీసుకున్నారుగా.’’ ‘‘అవును. నేను వసూలు చేేన పద్ధతిని చట్టరీత్యా నీకు తెలియచేయాల్సిన బాధ్యత నా మీద ఉంది కదా. మధ్య వేలు లేని నీ ఫొటో మీద ఇంకెవరో సంతకం చేేన పరిస్థితిని తెచ్చుకోక. ఖబడ్దార్.’’ ‘‘అలాగే మార్వాడీ గారు. కాస్తంత నాకు బెయిల్ సహాయం కూడా చేసి అప్పు కట్టుకోండి’’ కపీష్ కోరాడు. ఆ ఏభై ఏళ్ళ లావుపాటివాడు తల అడ్డంగా ఊపి, నిశ్శబ్దంగా లేచాడు. ‘‘ఇంకాసేపు కూర్చోవచ్చుగా’’ కపీష్ మార్వాడీని రిక్వెస్ట్ చేశాడు. ‘‘దేనికి?’’ ‘‘మీరంటే నాకు ఇష్టం కాబట్టి’’ కపీష్ ఆమెకి వినపడేలా అతనితో చెప్పాడు. ‘‘నాకు ఎవరన్నా ఇష్టం లేదు. బాకీలంటేనే ఇష్టం’’ చెప్పి మార్వాడీ వెళ్ళిపోయాడు. ‘‘ఆలోచించండి’’ కపీష్ అరిచాడు. ‘‘లే’’ గార్డ్ చెప్పాడు. ‘‘ఇంకా టైం కాలేదుగా?’’ ‘‘ఆయన వెళ్ళాక ఇంకెందుకు ఇక్కడ కూర్చోవడం? పద. పద.’’ కపీష్ అయిష్టంగానే లేచాడు. తన వంక నవ్వుతూ చూస్తున్న ఆమెకి తన చొక్కా మీది నంబర్ని చూపించి లోపలకి వెళ్ళాడు. 7 మధ్యాహ్నం జైల్ మెస్‌లో భోజనం అయ్యాక వానర్, పట్టయ్యలు తమ సెల్‌లోకి వచ్చారు. ‘‘అంకుల్. అంత్యాక్షరి ఆడదామా?’’ కాసేపాగి వానర్ అడిగాడు. ‘‘నీకూ ఆసక్తి ఏర్పడిందన్నమాట?’’ ‘‘ఇక్కడ చెయ్యడానికి ఇంకేం పని లేదుగా. విసుగ్గా ఉంది.’’ ‘‘అందుకే మరి జైలు శిక్షని కనిపెట్టింది. నిన్న అంత్యాక్షరి ఎక్కడ ఆగింది? ఆఖరి అక్షరం స కదా?’’ పట్టయ్య అడిగాడు. ‘‘గుర్తు లేదు. మళ్ళీ మొదలెడదాం. కాని నిన్నటిలా మెలొడీ పేర పాతచింతకాయ పచ్చడి పాటలు కాదు. ఫాస్ట్ బీట్ గల పాటలైతేనే నాకు ఆసక్తి.’’ ‘‘మాకూ బీట్ సాంగ్స్ చాలా ఉన్నాయి. మీకే మెలొడీ పాటలు లేవు.’’ ‘‘బోలెడన్ని ఉన్నాయి. మీకు బీట్ సాంగ్స్ ఉన్నాయంటే నమ్మను.’’ ‘‘అలాగా? ఐతే ఇది విను. ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా. నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్నా...’’ ‘‘ఆగండి. నాకు అంత్యాక్షరి రూల్స్ తెలీవనుకోకండి. నిన్న మీరు మొదలెట్టారు. ఇవాళ నేను ఫాఫ్ట్ సాంగ్‌తో మొదలెడతాను.’’ ‘‘ఉన్నాయంటావా?’’ ‘‘మీరు ఫాస్ట్ బీట్. నేను రిథమ్... ఆడువారి మాటలకి అర్థాలే వేరులే. అర్థాలే వేరులే. అర్థాలే వేరులే...’’ ‘‘ఆగాగు. అది మా పాట. మిస్సమ్మ సినిమాలోది. నైన్టీన్ ఫిఫ్టీస్ సాంగ్’’ పట్టయ్య అడ్డుపడ్డాడు. ‘‘కాదు. ఖుషీ సినిమాలోని పా ఇది.’’ ‘‘మా పాటని కాపీ కొట్టి కొత్త పాట చేసి ఉంటారు. సరే. వేరులే... ల...’’ ఆలోచించి పట్టయ్య పాడాడు. ‘‘లే. లే. లే. లే. లే. లే. లే. నా రాజా లే లే నా రాజా. లేవనంటావా? నిద్దుర లేపమంటావా? లేలేలే నా రాజా... ఎలా ఉంది బీట్?’’ ‘‘అదిరింది గురూ. ఇప్పుడు జ తో. జగమంత కుటుంబం నాది. ఏకాకి జీవితం నాది. సంసార సాగరం నాదే. సన్న్యాసం, శూన్యం నావే... నావే. వ’’ వానర్ పాడి చెప్పాడు. ‘‘ఇది మెలొడీనే. వయసు కుర్రది. ఒంపులున్నవి. అహ నైసు నైసుగా ఐసు చేస్తది... ఆ..ఆ... వయసు కుర్రది.. దతో మెలొడీ సాంగ్ పాడు.’’ ‘‘దాయి దాయి దామ్మా. కులికే కుందనాల బొమ్మా. నీపై మనసైందమ్మా. నడిచే నిండు చందమామా...’’ ‘‘కట్. కట్. ఇది మెలొడీ కాదు. ఫాస్ట్సాంగ్. ఇంకోటి పాడు.’’ ‘‘సరే. ధీర ధీర ధీర మనసాగలేదురా. చేర రార శూర. సొగసందుకో దొర. ర. పాడండి.’’ ‘‘రంజు బలే రాంచిలకా. రంగేళీ రవ్వల మొలక. అబ్బా దాని సోకు జబ్బల దాకా జాకెట్...’’ ఆవిధంగా కొంత సాగాక గార్డ్ వచ్చి వారి సెల్ తలుపు తెరుస్తూ వానర్‌తో చెప్పాడు. ‘‘డాక్టరమ్మ నిన్ను రమ్మంటోంది.’’ వానర్ లేచి గార్డ్ని అనుసరించాడు. ఇద్దరూ జైలు హాస్పిటల్ విభాగంలోకి వెళ్ళారు. డాక్టర్ మూలిక హుషారుగా ఉంది. ‘‘కమాన్ వానర్. కం’’ ఆహ్వానించి గార్డ్‌తో చెప్పింది. ‘‘నువ్వు బయట ఉండు.’’ అతన్ని మళ్ళీ ఎగ్జామినేషన్ టేబిల్ మీద పడుకోబెట్టి నఖశిఖ పర్యంతం పరీక్షించసాగింది. - మళ్లీ రేపు ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 3monkies.sakshi@gmail.com లెటర్స్ * నాకు మల్లాది గారి నవలలు అంటే చాలా ఇష్టం. చాలా కాలానికి మళ్లీ వారి నవల చదివే అవకాశాన్ని కల్పించిన సాక్షి దినపత్రికకు ధన్యవాదాలు. - కనకం స్వామి, కరీంనగర్ * సో నైస్ సర్. నేను బాగా ఇంట్రస్టింగ్‌గా ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ టు సాక్షి.. -
త్రీ మంకీస్ - 29
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 29 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘సుశీలా! సుశీలా! కరెంట్ స్విచ్‌లని నీ కొంగుతో ముట్టుకోమన్నానా?’’ అరిచింది. ‘‘తప్పయిపోయింది అమ్మగారు’’ ఆమె భయంగా చెప్పింది. ‘‘చేత్తో లైట్ స్విచ్‌లని ముట్టుకుంటే షాక్ కొడుతుందా?’’ కపీష్ అడిగాడు. ‘‘ఊహూ. స్విచ్లకి మట్టవుతుంది. ఫేన్ ఆర్పిందంటే అది హాల్ ఊడుస్తుంది. మనం ముందు గదిలోకి వెళ్దాం పదండి.’’ పనిమనిషి వెళ్ళిపోయాక కపీష్ ముందు అడ్వాన్స్ అయ్యాడు. ఆమెని చుంబించపోతే అతన్ని ఆపి చెప్పింది. ‘‘కిచెన్ సింక్ పక్కన డెట్టాల్ బాటిల్ ఉంది. వెళ్ళి దాంతో మొహం శుభ్రంగా కడుక్కుని నోరు పుక్కిలించి రండి.’’ అతనికి తర్వాతి దృశ్యం స్ఫురించింది. నిత్యం తను డెట్టాల్‌లో స్నానం చేశాకే మంచం మీదకి రానిస్తుంది. లేచి సింక్ వైపు వెళ్ళకుండా, కపీష్ ఆమెకి కనీసం గుడ్ బై కూడా చెప్పకుండా ఆ ఇంట్లోంచి వేగంగా బయటకి నడిచాడు. ‘‘ముట్టుకుంటే మాసిపోయేంత అందమైన అమ్మాయిని వదిలేశావా గురూ?’’ వానర్ నమ్మలేనట్లుగా అడిగాడు. ‘‘అవును. ఏక్చువల్గా ఆ అమ్మాయికి ఓ అమెరికన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ పోస్ట్ ఆఫర్ ఉంది. నన్ను పెళ్ళి చేసుకుని డిపెండెంట్ వీసాతో అమెరికా తీసుకెళ్దామని అనుకున్నానని, మనసు మార్చుకోమని తర్వాత ఫోన్ చేసి చెప్పింది కూడా.’’ ‘‘మరి? నీ లైఫ్ హాయిగా సాగిపోతుందిగా?’’ మర్కట్ కూడా ఆశ్చర్యంగా అడిగాడు. ‘‘కాని పెళ్ళి అయ్యాక నన్ను గుండు మెయిన్టైన్ చేయమంది. లేదా ఇంట్లో జుట్టు రాలుతుందిట. రోజుకి నాలుగుసార్లు డెటాల్ నీళ్ళతో స్నానం చేయాలని కండిషన్. కాఫీ చుక్కలు కింద పడేలా తాగే నేను ఆమెతో వేగలేను. టైరైపోయినప్పుడు స్నానం చేయకుండా మంచం మీద పడుకునే లగ్జరీని నేను కోల్పోదలచుకోలేదు’’ కపీష్ చెప్పాడు. 6 జైల్ గార్డ్ కపీష్ దగ్గరకి వచ్చి చెప్పాడు - ‘‘నీ కోసం ములాఖాత్‌కి ఎవరో వచ్చారు. పద.’’ ‘‘ఏమిటీ? నీకు అంతమంది ఫ్రెండ్సా? అప్పుడే చూడటానికి వచ్చారు?’’ వానర్ ఆశ్చర్యంగా అడిగాడు. ‘‘లాయరై ఉంటాడు’’ మర్కట్ చెప్పాడు. ‘‘ఐతే మా కేసులు కూడా చూడమని చెప్పు బ్రదర్’’ వానర్ కోరాడు. ‘‘అంత సీన్ లేదు. అసలు నేను ఇక్కడ ఉన్నానని ఎవరికీ తెలీదే?’’ కపీష్ అయోమయంగా చెప్పాడు. ‘‘పేరు తులసి’’ ములాఖాత్ నించి వచ్చిన ఓ ఖైదీ చెప్పాడు. ‘‘స్వచ్ఛ పేరు, మనసు మార్చుకుందేమో?’’ వానర్ ప్రోత్సహిస్తూ చెప్పాడు. గార్డ్ వెంట ములాఖాత్ గదిలోకి వెళ్ళి కటకటాల కిటికీ ఎదురుగా కూర్చుని కపీష్ తన కోసం వచ్చింది ఎవరా అని చూశాడు. కిటికీలోంచి ఓ అందమైన అమ్మాయి మొహం కనపడింది. ఆమె వంక మైమరుపుగా చూశాడు. ఆ మొహం పక్క కిటికీ దగ్గరకి వెళ్ళింది. ఆ మొహం వెనక ఉన్న ఓ మొగ మొహాన్ని చూసి అదిరిపడి అడిగాడు. ‘‘ఓర్నీ! మీరా?’’ తడబడ్డాడు. ‘‘నేనే. తులసీరాంని.’’ నుదుట గంధం బొట్టు. దాని మీద కుంకం బొట్టు. అప్పుడే ఇస్త్రీ చేసినట్లున్న తెల్లటి ఖద్దరు చొక్కా. జవ్వాది వాసన గుప్పున వేస్తోంది. చొక్కా జేబులోంచి ఐదు వందల రూపాయల కట్ట బయటకి కనిపిస్తోంది. కపీష్ పక్క కిటికీ ముందు కూర్చుని ఓ ఖైదీతో మాట్లాడే ఆమె వంక చూశాడు. ఆమె కూడా అతని వంక ఓర చూపులు చూస్తోంది. ఇద్దరి చూపులూ కలుసుకున్నాయి. ‘‘మార్వాడీల కళ్ళు కప్పి అప్పులు తీసుకున్నవారు ఎక్కడికీ పారిపోలేరు. ఎక్కడ దాక్కున్నా ఇట్టే కనుక్కుంటాం’’ తులసీరాం చెప్పాడు. ‘‘అబ్బే. నేను దాక్కోడానికి ఇక్కడికి రాలేదు. అసలు రానంటున్నా లాక్కొచ్చారు’’ కపీష్ చెప్పాడు. ‘‘నీలాంటి ఒకడు సముద్రం అడుగున దాక్కున్నాడు. వాడికి సబ్‌మెరైన్‌లో ఉద్యోగం. వాడి నించి కూడా బాకీ వసూలు చేశాను. ఈ నెల వడ్డీ ఇవాల్సింది ఇవాళేగా. వసూలు చేసుకోడానికి వచ్చాను’’ చేతిని చాపి అడిగాడు. ‘‘అరెరె! నా దగ్గర లేదే?’’ ‘‘నేను వచ్చే రోజని తెలీదా? ఎందుకు లేదు?’’ మార్వాడీ గర్జించాడు. ‘‘జైల్లోకి రాగానే నా జేబులోవన్నీ జైలర్ స్వాధీనం చేసుకున్నాడు. తిరిగి బయటకి వెళ్ళేప్పుడు ఇస్తానన్నాడు. రేపో, ఎల్లుండో బయటకి రాగానే వచ్చి తీసుకెళ్ళమని మీకు ఎస్సెమ్మెస్ ఇద్దామని అనుకుంటున్నాను.’’ ‘‘నమ్మమంటావా?’’ ‘‘మీ తోడు. రెండు మూడు రోజుల్లో బయటకి వస్తాను.’’ (డాక్టర్ మూలిక వానర్ని ఏం చేసింది?) - మళ్లీ రేపు ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 3monkies.sakshi@gmail.com లెటర్స్ బంధాల్ని ఎంత పదిలంగా నిలుపుకోవాలో అందమైన జీవితం లాంటి నవలల ద్వారా తెలియచెప్పిన గొప్ప రచయిత మల్లాది గారు ఈ కాలాన్ని శాసిస్తున్న సోషల్ నెట్‌వర్క్‌పై రాసే త్రీ మంకీస్ అద్భుతంగా ఉంది. నా అభిమాన రచయిత మల్లాది గారికి, అందిస్తున్న సాక్షికి ధన్యవాదాలు. - పెరుగు సుజనారామం, ఆమంచర్ల -
త్రీమంకీస్ - 28
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 28 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘అనేకమంది కూర్చున్న సీట్ కదా.’’ ‘‘అవును. క్లీన్లీనెన్ ఈజ్ నెక్ట్స్ టు గాడ్లీనెన్.’’ ‘‘కదా. మీరు నాకు నచ్చారు.’’ ‘‘ఐతే నేను చెప్పే నాలుగు ఇంగ్లీష్ పదాలకి వ్యతిరేక పదాలని వెంటనే చెప్పండి చూద్దాం. ఇంగ్లీష్ తెలిసిన ఎవరికైనా ఆ వ్యతిరేక పదాలు తెలిసే ఉంటాయి.’’ ‘‘ష్యూర్’’ స్వచ్ఛ ఉత్సాహంగా చూసింది. ‘‘యు’’ కపీష్ చెప్పాడు. ‘‘ఐ.’’ ‘‘హేట్.’’ ‘‘లవ్.’’ ‘‘ఐ.’’ ‘‘యు.’’ ‘‘నెవర్.’’ ‘‘ఆల్వేస్’’ ఇప్పుడు కలిపి చెప్పండి.’’ ‘‘ఐ లవ్ యు ఆల్వేస్’’ ‘‘థాంక్స్ ఫర్ లవింగ్ మీ ఆల్వేస్’’ కపీష్ నవ్వుతూ చెప్పాడు. ‘‘తెలివే.’’ ఆమె సన్నగా నవ్వింది. ఆమె టి షర్ట్ మీది అక్షరాలని కపీష్ గమనించాడు. పర్ఫెక్ట్ క్రైమ్ ఐ స్టోల్ యువర్ హార్ట్. యు స్టీల్ మైన్. ‘‘మీ ఫాంటసీ ఏమిటి? మై ఫాంటసీ ఈజ్ టు హేవ్ టు మెన్’’ అడిగింది. ‘‘ఓ!!!’’ అతని గొంతు పొలమారింది. ‘‘ఒకరు కుకింగ్‌కి. మరొకరు క్లీనింగ్‌కి. మీకా రెండూ వస్తే మీ ఒక్కరితోనే సరిపెట్టుకుంటాను’’ స్వచ్ఛ నవ్వింది. ఇద్దరూ కలిసి ఇంటర్వెల్లో ఒకే ఐస్‌క్రీం కోన్ని షేర్ చేసుకున్నారు. ఆమె దాని మీద సేనిటైజర్ని చల్లాకే తినసాగింది. సినిమా అయ్యాక మర్నాడు తన ఇంటికి రమ్మని ఆహ్వానించింది. ఆమె తల్లితండ్రులు ఇంట్లో ఉండరని చెప్పాక అది ఆమెతో తను పాల్గొనబోయే సెక్స్‌కి ఆహ్వానంగా భావించిన కపీష్ తను పెట్టిన ఖర్చు వృథా కాలేదు అనుకున్నాడు. ‘‘రేపు నేను ఫ్రీనే. తప్పక వస్తాను’’ ఉత్సాహంగా చెప్పాడు. ‘‘మీరు కుక్కని పెంచుతున్నారా?’’ అడిగింది. ‘‘లేదు. ఏం?’’ ‘‘కుక్క బొచ్చు మీ చర్మానికి అంటుకుని మళ్ళీ నా చర్మానికి అంటుకుంటుందని!’’ మర్నాడు మధ్యాహ్నం రెండుకి సైనిక్‌పురిలోని ఆమె ఇంటికి వెళ్ళాడు. తలుపు బయట ‘దయచేసి మీ పాదరక్షలని బయటే వదలండి. సాక్స్ కూడా’ అనే బోర్డ్, ఆ వాక్యం పక్కనే నవ్వు మొహం బొమ్మ కనిపించడంతో వాటిని వదిలి లోపలకి వెళ్ళాడు. ఇంట్లో ఓ సర్వెంట్ అతను సాక్స్‌ని, పాదరక్షలని వదిలాడా? లేదా అని పర్యవేక్షించి, అతనికి ఓ కేప్‌ని ఇచ్చాడు. ‘‘ఇదేమిటి?’’ కపీష్ అర్థంకాక అడిగాడు. ‘‘షవర్ కేప్ సర్.’’ ‘‘దేనికి?’’ ‘‘తలకి పెట్టుకోండి. లేదా ఇంట్లో మీ జుట్టు రాలి పడచ్చు. మీకు కర్చీఫ్ ఉందా?’’ ‘‘పెన్, కర్చీఫ్, దువ్వెన లాంటివి జేబుల్లో ఉంచుకుని తిరగను.’’ ఓ కర్చీఫ్ ఇచ్చి చెప్పాడు - ‘‘తుమ్మితే ఉపయోగించుకోడానికి. లేదా నేలంతా పాడవుతుంది.’’ స్వచ్ఛ అతన్ని ఆప్యాయంగా ఆహ్వానించి ఇల్లు చూపించింది. ఇల్లు అద్దంలా శుభ్రంగా, పొందికగా ఉంది. పనిమనిషి ఇల్లు ఊడుస్తూ కనిపించింది. ‘‘పని మనిషి ఇవాళ లేట్‌గా వచ్చినట్లుంది?’’ తమ ఏకాంతానికి ఆమె భంగం అనుకుంటూ అడిగాడు. ‘‘లేదే. ఎందుకలా అడిగారు?’’ స్వచ్ఛ ప్రశ్నించింది. ‘‘అందరిళ్ళల్లో పనిమనుషులు ఉదయమే వస్తారుగా?’’ ‘‘మాకు ముగ్గురు పనిమనుషులు. ఉదయం ఓ పనిమనిషి, మధ్యాహ్నం ఓ పనిమనిషి, సాయంత్రం ఓ పనిమనిషి వస్తారు.’’ ‘‘ఎందుకలా?’’ ఆశ్చర్యంగా అడిగాడు. ‘‘ఊడ్చి తడి బట్ట వేసి నేలని తుడవాలి. లేదా ఇంట్లో మట్టి మట్టి.’’ ‘‘రోజుకి మూడుసార్లు?’’ ‘‘ ఔను. రోజుకి మూడుసార్లు. ఆదివారాలు వచ్చి కిటికీ చువ్వలు, ఫ్రేమ్‌లు, తలుపులు, ఫాన్లు, సీలింగ్ తుడిచేవాడు ఇంకోడున్నాడు.’’ ‘‘నిజంగా మీరు గ్రేట్ అండి.’’ ‘‘గ్రేట్ కాదు. క్లీన్లీనెస్ ఈజ్ నెక్ట్స్ టు గాడ్లీనెస్ అని నమ్మేదాన్ని.’’ పనిమనిషికి అర్థం కాకుండా ఇంగ్లీష్‌లో చెప్పింది. ‘‘మనం ప్రేమలో పడ్డాం కాబట్టి చాలా చేయాలి.’’ ‘‘నేను అందుకు ఎప్పుడూ సిద్ధమే’’ ఉత్సాహంగా చెప్పాడు. అకస్మాత్తుగా ఆమె కెవ్వున అరుస్తూ లేచింది. ‘ఏమిటి?’ అని అడుగుతూ కంగారుగా కపీష్ కూడా లేచాడు. - మళ్లీ రేపు ఈ సీరియల్‌ని విడవకుండా చదివేవారికి.. సీరియల్ పూర్తయ్యాక దీని మీద రాసి పంపే సద్విమర్శ లేదా విశ్లేషణల్లోంచి మూడింటిని ఎంపిక చేసి ప్రచురిస్తాం. వారికి రచయిత తలో రూ.500/- పంపుతారు. ఈ సీరియల్ మీద మీ అభిప్రాయాలని మీ ఫొటోతోపాటు ఈ కింది చిరునామాకి పంపండి.మీరు ఇరవై ఒకటో శతాబ్దపు పాఠకులైతే 3monkies.sakshi@gmail.com కి మీ ఫోటోని అటాచ్ చేస్తూ పంపండి. మీరు ఇంకా అక్కడే ఉంటే మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోతో సహా ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 లెటర్స్ * మూడు కోతులు ముచ్చటగా ఉన్నాయి. సంభాషణలు తూటాల్లా దూసుకుపోతున్నాయి.- ఎం. శ్రీనివాసులు రెడ్డి, పీలేరు * సోషల్ నెట్‌వర్క్‌లో పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవడం ఎంత కష్టమో మంచి కామెడీగా రాశారు. ఇది అందరూ అనుభవించే బాధ. - నరేంద్ర (narendranaidukundavarapu@gmail.com) -
త్రీమంకీస్ - 27
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 27 మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘చాలా. గ్లవ్స్ తెలుసుగా?’’ ‘‘తెలుసు. చేతికి తొడుక్కుంటాం.’’ ‘‘దానికి ‘ఫింగర్ పేంట్స్’ అనే కొత్త పేరుని కనుక్కున్నాను. ముందు అమెరికాలో, తర్వాత కొద్దికాలం తర్వాత మన దేశంలో కూడా దాన్ని అలాగే పిలుస్తారు.’’ ‘‘వావ్!’’ ‘‘వల్కనో తెలుసుగా?’’ ‘‘అగ్ని పర్వతం.’’ ‘‘దానికి ‘మౌంటెన్ ఫౌంటెన్’ అనే పేరు కనుక్కున్నాను. జపాన్‌లో అది ప్రాచుర్యం చెందుతోంది. ఫ్రెంచ్ ఫ్రైస్లో ఫ్రెంచ్ లేదు. కాబట్టి దానికి ‘ఫింగర్ పొటాటోస్’ అనే పేరు కనుక్కున్నాను.’’ ‘‘మీరు గ్రేటండి.’’ ‘‘ఐస్క్యూబ్స్కి ‘వాటర్ విత్ కార్నర్స్’ అనే పేరు కనుక్కున్నాను. స్టార్‌కి ‘స్పేస్‌లైట్’ అనే పదాన్ని కనుక్కున్నాను.’’ ‘‘బావున్నాయి. మీరు చాలా గ్రేట్ అండి’’ కపీష్ మెచ్చుకున్నాడు. ‘‘కంప్యూటర్‌కి ‘ఇంటర్నెట్ మెషీన్’ అనే పేరు పెట్టాను. అది అమెరికాలో పాపులర్ అవుతోంది. లావుపాటి వాళ్ళని ఫాట్ అనకుండా ‘స్కిన్నీ’ అనాలి.’’ ‘‘ఇది మాత్రం అర్ధం కాలేదు. నాకు తెలిసి సన్న వాళ్ళని స్కిన్నీ అంటారు.‘‘ ‘‘కదా? అది తప్పు. సన్నపాటి వాళ్ళ కన్నా లావుపాటి వాళ్ళకే ఎక్కువ స్కిన్ ఉంటుంది కదా. కాబట్టి వాళ్ళని స్కిన్నీ అనడం కరెక్ట్. యుఎస్ఏలో బాత్రూంలని రెస్ట్‌రూమ్స్ అంటారు. నిజానికి బెడ్ రూమ్స్‌ని రెస్ట్‌రూమ్స్ అనాలి అని నా ప్రాజెక్ట్‌లో రాశాను. ప్రెగ్నెంట్ విమెన్ని ‘బాడీ బిల్డర్’ అనాలి. ఫన్ సైజ్ కేండీ బార్స్‌ని సేడ్ సైజ్ కేండీ బార్స్ అనాలి. నెత్తి మీది జుట్టుని ‘పబ్లిక్ హెయిర్’ అనాలి. మోకాలు వెనక భాగానికి ఇంతదాకా అసలు పేరే లేదు. దానికి ‘నీపిట్స్’ అనే పేరుని కనుక్కున్నాను.’’ ‘‘ఒంటెని ‘డిజర్ట్ రేట్’ అనచ్చుగా?’’ కపీష్ తన తెలివిని ఉపయోగించాడు. ‘‘వావ్!’’ ‘‘టిష్యూలని ‘స్నీజ్ పేపర్’ అనచ్చుగా?’’ తమ ఎదురుగా ఉన్న పేపర్ టిష్యూలని చూని సూచించాడు. ‘‘మళ్ళీ వావ్! మనం ఒకేలా ఆలోచించే సిమిలర్ మైండ్ కలవాళ్ళం అని నాకు అనిపిస్తోంది. వి షుడ్ కీప్ సీయింగ్ ఈచ్ అదర్ ఆఫ్టెన్. బై ది వే, నా రీసెర్చ్‌లో ఇంగ్లీష్‌లో ప్రాచుర్యంలో లేని పదాలని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడం ఓ భాగం. ఉదాహరణకి డైసానియా అనే పదం అర్థం మీకు తెలుసా?’’ ‘‘తెలీదు.’’ ‘‘చూశారా? మీరా స్థితిని అనుభవిస్తారు కాని మీకు అర్థం తెలీదు. ఉదయం నిద్ర లేచాక మంచం దిగడానికి కష్టంగా ఉండటాన్ని డైసానియా అంటారు.’’ ‘‘వావ్!’’ ‘‘పెట్రోబోర్ అంటే?’’ ‘‘పెట్రోల్‌తో నడిచే కారా?’’ ‘‘కాదు. వర్షం వచ్చాక వేసే వాసన. టిటిల్ అంటే, ఇంగ్లీష్‌లోని స్మాల్ ఐ, జె అక్షరాల మీది చుక్కలు. డైపుస్కలర్ రేస్ అంటే మబ్బుల్లోంచి ఒకే చోటి నించి వస్తున్న సూర్య కిరణాలు. దీన్ని గాడ్స్ రేస్ అని కూడా అంటారు. ఫైల్ అంటే తెలుసా? పెన్సిల్ చివరి భాగంలో చుట్టబడ్డ మెటల్ భాగం. ముంటిన్ అంటే కిటికీ తలుపుల్లోని అద్దాలని విడదీసే స్ట్రిప్స్. ’మోర్టన్స్ టో’ అంటే కాలి బొటన వేలు కన్నా దాని పక్క పొడుగ్గా ఉన్న వేలు. ‘ఆర్మ్స్ ఎకింబో’ అంటే రెండు చేతులని నడుముకి అటు, ఇటు వేసి నిలబడటం. డ్రానక్ అంటే చెప్పుల షాపులో కాలి పాదాన్ని కొలిచే పరికరం. ‘డిజైర్ పాత్’ అంటే, నడిచే అడ్డ దారి. ఫాస్ఫెనెస్ అంటే తెలుసా?’’ ‘‘కనీసం దాని స్పెల్లింగ్ కూడా తెలీదు’’ కపీష్ చెప్పాడు. ‘‘కళ్ళు మూసుకుని వాటి మీద చేతులని ఉంచి నలిపితే చాలా లైట్‌గా కనపడే లైట్‌ని ఫాస్ఫెనెస్ అంటారు.’’ ‘‘అందుకే మీరు సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డి చేయగలుగుతున్నారు’’ మెచ్చుకున్నాడు. ‘‘మా ప్రొఫెసర్ ఇచ్చే ప్రోత్సాహం, గెడైన్స్ అలాంటిది. మెడికల్ టెక్ట్స్ బుక్స్ చదవమని సలహా ఇచ్చారు. ఫిల్ట్రమ్ అంటే ఏమిటో తెలుసా?’’ కపీష్ తల అడ్డంగా ఊపాడు. ‘‘పెపైదవి అంచు, ముక్కు కింద ఉన్న మీసం వచ్చే భాగం. ‘పర్లీక్యూర్ స్పేస్’ అంటే బొటన వేలు, చూపుడు వేలు మధ్య గల ఖాళీ. ఏగ్లెట్ అంటే షూ లేస్ మీద గల ప్లాస్టిక్ కోటింగ్. అలాగే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వారిని కలిస్తే చాలా పదాలు తెలిశాయి. సుత్తిని కొడతాం కదా? దాని వెనక భాగాన్ని పీన్ అంటారు. బట్టల తయారీ వాళ్ళని కూడా కలిశాను. ఆడవారి గౌనులో చేతులు పట్టే రంధ్రాలని ఆర్మ్స్కై అంటారు.’’ కపీష్‌కి తనకి తెలీకుండానే ఆమెతో అరవై నిమిషాలు ఐదు నిమిషాల్లా గడిచిపోయాయి. మార్వాడీ దగ్గర అప్పు తీసుకున్న వెయ్యి రూపాయల్లో ఆ నాలుగు వందల అరవై రూపాయలు మాత్రం తెలిసి ఖర్చయ్యాయి. మర్నాడు అదే మాల్లో ఐమేక్స్లో కలిశారు. ఆమె శానిటైజర్ తీసి తన సీట్లో, కపీష్ సీట్లో కొట్టి చెప్పింది. (‘మై ఫాంటసీ ఈజ్ టు హేవ్ టు మెన్’ అంది స్వచ్ఛ - ఎందుకు అనేది రేపు చూడండి....)