త్రీమంకీస్ - 62 | malladi special story | Sakshi
Sakshi News home page

త్రీమంకీస్ - 62

Published Fri, Dec 19 2014 10:49 PM | Last Updated on Sat, Sep 2 2017 6:26 PM

త్రీమంకీస్ - 62

త్రీమంకీస్ - 62

డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 62
 
 - మల్లాది వెంకటకృష్ణమూర్తి
 
‘‘ఇది మై టాకింగ్ టామ్ అనే ఫ్రీ ఆప్. గూగుల్ స్టోర్స్‌లోంచి లేదా ప్లే స్టోర్స్‌లోంచి దీన్ని స్మార్ట్ ఫోన్స్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మనం ఏం మాట్లాడితే అది రిపీట్ చేస్తుంది. ఏ భాషైనా సరే. గూగుల్‌లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. అన్ని ఏప్స్‌లా వైఫై కనెక్షన్ ఉన్నప్పుడే దీన్ని మనం ఉపయోగించుకోగలం.’’
 ‘‘ఓ! ఫ్రెండ్స్‌తో, ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మై టామ్ మంచి టైం పాన్. క్విజ్ అప్ ఏప్ గురించి నీకు తెలుసా?’’ అడిగింది.
 ‘‘ఊహు. తెలీదు.’’
 ‘‘దీన్ని కూడా ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. స్పోర్ట్స్, హిస్టరీ, లిటరేచర్, బిజినెస్, ఆర్ట్, ఎడ్యుకేషనల్, జాగ్రఫీ, లైఫ్‌స్టైల్, మూవీస్ మొదలైన విషయాలలోంచి మనం ఆసక్తి గల టాపిక్‌ని ఎంచుకోవచ్చు. నీకు ఏ టాపిక్ ఫేవరేట్?’’
 ‘‘హిస్టరీ.’’
 ఆమె హిస్టరీ మీద టచ్ చేశాక చెప్పింది.
 ‘‘చూశావా? ఇందులో మళ్ళీ అనేక డివిజన్స్ ఉంటాయి. 16-17 సెంచురీ, 18-19 సెంచురీ, 20-21 సెంచురీ, 2013, ఏసియన్ హిస్టరీ, బ్రిటీష్ హిస్టరీ, గ్రీన్ హిస్టరీ, ఆస్ట్రేలియన్ హిస్టరీ, యూరోపియన్ హిస్టరీ, బ్రిటీష్ మోనార్కీ, ఇండియన్ హిస్టరీ... మనకి తెలిసింది కాబట్టి దీని మీద టచ్ చేస్తాను. పది ప్రశ్నలు వచ్చాయి. ఇండియాలో మొదటి రైల్వే బాంబే నించి ఏ నగరానికి వేయబడింది? ఆప్షన్స్ ఢిల్లీ, ఆగ్రా, థానే, అహమ్మదాబాద్...’’
 ‘‘థానే’’ వానర్ చెప్పాడు.
 దాన్ని టచ్ చేశాక చెప్పింది.
 ‘‘కరెక్ట్. నీకు పద్దెనిమిది మార్కులు వచ్చాయి. దీన్ని మనం ఎఫ్‌బి ద్వారా లేదా జిమెయిల్ ద్వారా సైన్‌అప్ చేసుకోవాలి కాబట్టి దీంట్లో సైన్‌అప్ అయిన వాటిలోని మన కాంటాక్ట్స్ పేర్లు, వాళ్ళ స్కోర్‌లు కనిపిస్తాయి. వాళ్ళని మనం ఛాలెంజ్ చేసి ఆడచ్చు. వాళ్ళు ఆఫ్ లైన్ ఉన్నా తర్వాత చూసి ఆడతారు. పది క్షణాల టైంలోనే మనం ఆన్సర్‌ని టచ్ చేయాలి. ఇలా అనేక టాపిక్స్ మీద మనం ప్రశ్నలకి జవాబు చెప్పే గేమ్‌ని ఆడచ్చు. మన ఫ్రెండ్స్‌తో కూడా ఆడచ్చు. వాళ్ళు ఆఫ్‌లైన్‌లో ఉంటే లైన్‌లోకి వచ్చాక వాళ్ళకి మనం ఛాలెంజ్ చేశామని తెలుస్తుంది. ప్రతీ గేమ్ పూర్తయ్యాక స్కోర్ బోర్డ్ కూడా కనిపిస్తుంది. ఆ పర్టికులర్ గేమ్‌లో ప్రపంచవ్యాప్తంగా మన రేంక్, మనం ఏ దేశంలో సైనప్ అయితే ఆ దేశంలోని మన రేంక్, దేశంలోని మన రాష్ర్టంలోని మన రేంక్, ఇంకా మన మిత్రుల్లో ఆ ఆట అప్పటికే ఎవరైనా ఆడిన వారితో మన రేంక్ కనిపిస్తాయి.’’
 ‘‘దీనివల్ల మనకి నాలెడ్జ్ పెరుగుతుంది’’ వానర్ చెప్పాడు.
 ‘‘నేను ఇప్పుడు ఫుడ్ గేమ్‌లు ఆడుతున్నాను’’ మూలిక చెప్పింది.
 ‘‘మీ ఇంట్లో స్వీట్ కాని, పళ్ళు కాని ఉన్నాయా?’’ అడిగాడు.
 ‘‘లేవు. ఏం?’’
 ‘‘అన్నం తినగానే ఏదైనా స్వీట్ తినడం నాకు అలవాటు.’’
 ‘‘ఐతే వెళ్ళి కొనుక్కురా. సందు చివరే స్వగృహ స్వీట్ షాప్ ఉంది. బందరు వాళ్ళు. బందరు మిఠాయి బావుంటుంది.’’
 ‘‘అలాగే. ఓ ఫిఫ్టీ ఉంటే ఇస్తారా? వంద గ్రాములు చాలుగా?’’
 ‘‘సారీ! మనీ ఫ్రీ వీక్ కాబట్టి నేను బిల్ చెల్లించడం లేదు’’ మూలిక చెప్పింది.
 ‘‘అదేమిటి? డబ్బు ఖర్చు చేయకుండా ఈ వారం అవసరాలు ఎలా గడుస్తాయి?’’ వానర్ అడిగాడు.
 ‘‘అందుకు బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారుగా.’’
 ‘‘ఇక నిన్ను నేను అప్పు ఏం అడుగుతాను?’’ గొణిగాడు.
 ‘‘సారీ?’’ ఆమె అడిగింది.
 ‘‘ఏం లేదు. మంచి పాలసీ అంటున్నాను. ఆ పాలసీ ఎందుకు పెట్టుకున్నారు? ఏ టీవీ సీరియల్‌లో చూశారు?’’
 ‘‘నా జీవితంలోని అవసరమే నాకా పాలసీని నేర్పింది’’ ఆమె చెప్పింది.
   
 మర్నాడు ఉదయం మాట ఇచ్చినట్లుగానే వైతరణి మర్కట్‌ని, మూలిక వానర్‌ని రుధిర ఇంటికి తీసుకువచ్చి దింపారు. గత రాత్రే కపీష్ కోరిక ప్రకారం రుధిర ఏర్పాటు చేసిన ఆటోలో ముగ్గురూ రైట్ టైం చిరునామాకి చేరుకున్నారు. ఆ ఆటో డ్రైవర్ రుధిర బాబాయే. తెల్లారుఝామున రైల్వే స్ట్టేషన్‌లోంచి వచ్చే ఒంటరి ఆడవాళ్ళని ఎక్కించుకుని మధ్యలో ఆపి వారిని దింపి సామానుతో, వారి హేండ్ బేగ్, నగలతో ఉడాయించే డిపార్ట్‌మెంట్‌లో అతను నిష్ణాతుడు.
 ఆటోలోంచి దిగకుండానే పరిశీలించి చూసి కపీష్ చెప్పాడు.
 ‘‘సందేహం లేదు. అదే బేంక్. ఇప్పుడే వస్తాను. ఉండండి.’’
 దిగి రైట్ టైం అనే నియోన్ బోర్డున్న వాచీ షాప్‌లోకి వెళ్ళాడు. రైట్ టైం వాచ్ షాప్ ఇప్పుడు అక్కడ లేదు. ‘వి మూవ్డ్’ అన్న బోర్డు మీద కొత్త చిరునామా కనిపించింది. కిటికీలోంచి చూస్తే షాపంతా ఖాళీ. కపీష్ మూసి ఉన్న కిటికీ రెక్కని నెట్టి చూశాడు. ఒకటి తెరచుకుంది. దాన్ని మళ్ళీ మూసేశాడు. బేంక్ వైపున్న కిటికీ దగ్గరకి వెళ్ళాడు. ఆ కిటికీ వెనకనించే సొరంగం మొదలై ఉంటుందని కపీష్ అంచనా వేశాడు. అక్కడి వెట్రిఫైడ్ టైల్‌ని తొలగించి అక్కడనుంచి సొరంగాన్ని తవ్వారని అనుకున్నాడు. ఆ షాపు యజమానికి కూడా దీంట్లో భాగం ఉండచ్చని భావించాడు. కన్‌ఫం చేసుకోడానికి రుధిర ఇంట్లో వెదికితే దొరికిన డెప్త్ గేజర్ అనే ఎలక్ట్రానిక్ పరికరాన్ని జేబులోంచి బయటకి తీసి దాన్ని ఆ టైల్‌కి గురి చేసి మీటని నొక్కాడు. సెల్‌ఫోన్‌లా ఉన్న ఆ పరికరం కింద మూడున్నర అడుగుల గుంత ఉందని స్క్రీన్ మీద చూపించింది.
 
 (బ్యాంక్ స్ట్రాంగ్ రూం నుంచి ఉన్న సొరంగాన్ని
 కపీష్ ఎలా కనిపెట్టాడు)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement