త్రీ మంకీస్ - 29 | malladi special story... | Sakshi
Sakshi News home page

త్రీ మంకీస్ - 29

Published Sun, Nov 16 2014 11:34 PM | Last Updated on Sat, Sep 2 2017 4:35 PM

త్రీ మంకీస్ - 29

త్రీ మంకీస్ - 29

డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 29
- మల్లాది వెంకటకృష్ణమూర్తి

 ‘‘సుశీలా! సుశీలా! కరెంట్ స్విచ్‌లని నీ కొంగుతో ముట్టుకోమన్నానా?’’ అరిచింది.
 ‘‘తప్పయిపోయింది అమ్మగారు’’ ఆమె భయంగా చెప్పింది.
 ‘‘చేత్తో లైట్ స్విచ్‌లని ముట్టుకుంటే షాక్ కొడుతుందా?’’ కపీష్ అడిగాడు.
 ‘‘ఊహూ. స్విచ్‌లకి మట్టవుతుంది. ఫేన్ ఆర్పిందంటే అది హాల్ ఊడుస్తుంది. మనం ముందు గదిలోకి వెళ్దాం పదండి.’’
 పనిమనిషి వెళ్ళిపోయాక కపీష్ ముందు అడ్వాన్స్ అయ్యాడు. ఆమెని చుంబించపోతే అతన్ని ఆపి చెప్పింది.
 ‘‘కిచెన్ సింక్ పక్కన డెట్టాల్ బాటిల్ ఉంది. వెళ్ళి దాంతో మొహం శుభ్రంగా కడుక్కుని నోరు పుక్కిలించి రండి.’’
 అతనికి తర్వాతి దృశ్యం స్ఫురించింది. నిత్యం తను డెట్టాల్‌లో స్నానం చేశాకే మంచం మీదకి రానిస్తుంది. లేచి సింక్ వైపు వెళ్ళకుండా, కపీష్ ఆమెకి కనీసం గుడ్ బై కూడా చెప్పకుండా ఆ ఇంట్లోంచి వేగంగా బయటకి నడిచాడు.
   
 ‘‘ముట్టుకుంటే మాసిపోయేంత అందమైన అమ్మాయిని వదిలేశావా గురూ?’’ వానర్ నమ్మలేనట్లుగా అడిగాడు.
 ‘‘అవును. ఏక్చువల్‌గా ఆ అమ్మాయికి ఓ అమెరికన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ పోస్ట్ ఆఫర్ ఉంది. నన్ను పెళ్ళి చేసుకుని డిపెండెంట్ వీసాతో అమెరికా తీసుకెళ్దామని అనుకున్నానని, మనసు మార్చుకోమని తర్వాత ఫోన్ చేసి చెప్పింది కూడా.’’
 ‘‘మరి? నీ లైఫ్ హాయిగా సాగిపోతుందిగా?’’ మర్కట్ కూడా ఆశ్చర్యంగా అడిగాడు.
 ‘‘కాని పెళ్ళి అయ్యాక నన్ను గుండు మెయిన్‌టైన్ చేయమంది. లేదా ఇంట్లో జుట్టు రాలుతుందిట. రోజుకి నాలుగుసార్లు డెటాల్ నీళ్ళతో స్నానం చేయాలని కండిషన్. కాఫీ చుక్కలు కింద పడేలా తాగే నేను ఆమెతో వేగలేను. టైరైపోయినప్పుడు స్నానం చేయకుండా మంచం మీద పడుకునే లగ్జరీని నేను కోల్పోదలచుకోలేదు’’ కపీష్ చెప్పాడు.
 6
 జైల్ గార్డ్ కపీష్ దగ్గరకి వచ్చి చెప్పాడు - ‘‘నీ కోసం ములాఖాత్‌కి ఎవరో వచ్చారు. పద.’’
 ‘‘ఏమిటీ? నీకు అంతమంది ఫ్రెండ్సా? అప్పుడే చూడటానికి వచ్చారు?’’ వానర్ ఆశ్చర్యంగా అడిగాడు.
 ‘‘లాయరై ఉంటాడు’’ మర్కట్ చెప్పాడు.
 ‘‘ఐతే మా కేసులు కూడా చూడమని చెప్పు బ్రదర్’’ వానర్ కోరాడు.
 ‘‘అంత సీన్ లేదు. అసలు నేను ఇక్కడ ఉన్నానని ఎవరికీ తెలీదే?’’ కపీష్ అయోమయంగా చెప్పాడు.
 ‘‘పేరు తులసి’’ ములాఖాత్ నించి వచ్చిన ఓ ఖైదీ చెప్పాడు.
 ‘‘స్వచ్ఛ పేరు, మనసు మార్చుకుందేమో?’’ వానర్ ప్రోత్సహిస్తూ చెప్పాడు.
 గార్డ్ వెంట ములాఖాత్ గదిలోకి వెళ్ళి కటకటాల కిటికీ ఎదురుగా కూర్చుని కపీష్ తన కోసం వచ్చింది ఎవరా అని చూశాడు. కిటికీలోంచి ఓ అందమైన అమ్మాయి మొహం కనపడింది. ఆమె వంక మైమరుపుగా చూశాడు. ఆ మొహం పక్క కిటికీ దగ్గరకి వెళ్ళింది. ఆ మొహం వెనక ఉన్న ఓ మొగ మొహాన్ని చూసి అదిరిపడి అడిగాడు.
 ‘‘ఓర్నీ! మీరా?’’ తడబడ్డాడు.
 ‘‘నేనే. తులసీరాంని.’’
 నుదుట గంధం బొట్టు. దాని మీద కుంకం బొట్టు. అప్పుడే ఇస్త్రీ చేసినట్లున్న తెల్లటి ఖద్దరు చొక్కా. జవ్వాది వాసన గుప్పున వేస్తోంది. చొక్కా జేబులోంచి ఐదు వందల రూపాయల కట్ట బయటకి కనిపిస్తోంది.
 కపీష్ పక్క కిటికీ ముందు కూర్చుని ఓ ఖైదీతో మాట్లాడే ఆమె వంక చూశాడు. ఆమె కూడా అతని వంక ఓర చూపులు చూస్తోంది. ఇద్దరి చూపులూ కలుసుకున్నాయి.
 ‘‘మార్వాడీల కళ్ళు కప్పి అప్పులు తీసుకున్నవారు ఎక్కడికీ పారిపోలేరు. ఎక్కడ దాక్కున్నా ఇట్టే కనుక్కుంటాం’’ తులసీరాం చెప్పాడు.
 ‘‘అబ్బే. నేను దాక్కోడానికి ఇక్కడికి రాలేదు. అసలు రానంటున్నా లాక్కొచ్చారు’’ కపీష్ చెప్పాడు.
 ‘‘నీలాంటి ఒకడు సముద్రం అడుగున దాక్కున్నాడు. వాడికి సబ్‌మెరైన్‌లో ఉద్యోగం. వాడి నించి కూడా బాకీ వసూలు చేశాను. ఈ నెల వడ్డీ ఇవాల్సింది ఇవాళేగా. వసూలు చేసుకోడానికి వచ్చాను’’ చేతిని చాపి అడిగాడు.
 ‘‘అరెరె! నా దగ్గర లేదే?’’
 ‘‘నేను వచ్చే రోజని తెలీదా? ఎందుకు లేదు?’’ మార్వాడీ గర్జించాడు.
 ‘‘జైల్‌లోకి రాగానే నా జేబులోవన్నీ జైలర్ స్వాధీనం చేసుకున్నాడు. తిరిగి బయటకి వెళ్ళేప్పుడు ఇస్తానన్నాడు. రేపో, ఎల్లుండో బయటకి రాగానే వచ్చి తీసుకెళ్ళమని మీకు ఎస్సెమ్మెస్ ఇద్దామని అనుకుంటున్నాను.’’
 ‘‘నమ్మమంటావా?’’
 ‘‘మీ తోడు. రెండు మూడు రోజుల్లో బయటకి వస్తాను.’’
 
 (డాక్టర్ మూలిక వానర్‌ని ఏం చేసింది?)
 
- మళ్లీ  రేపు
 
ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి  టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 3monkies.sakshi@gmail.com
 
లెటర్స్
బంధాల్ని ఎంత పదిలంగా నిలుపుకోవాలో అందమైన జీవితం లాంటి నవలల ద్వారా తెలియచెప్పిన గొప్ప రచయిత మల్లాది గారు ఈ కాలాన్ని శాసిస్తున్న సోషల్ నెట్‌వర్క్‌పై రాసే త్రీ మంకీస్ అద్భుతంగా ఉంది. నా అభిమాన రచయిత మల్లాది గారికి, అందిస్తున్న సాక్షికి ధన్యవాదాలు.
 - పెరుగు సుజనారామం, ఆమంచర్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement