Crime Comedy saspensthrillar
-
త్రీమంకీస్ - 42
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 42 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘చందూ! ఆలస్యమైందేమిటి?’’ అతని భార్య లల్లేశ్వరి అడిగింది. ‘‘ఆఫీసయ్యాక క్లబ్లో ఆగాను’’గోలచందర్ అబద్ధం చెప్పాడు. ‘‘మీరు నిజంగా క్లబ్నించే వస్తున్నారా?’’ఆమె అడిగింది. ‘‘అవును. ఏం?’’ ‘‘ఈ మధ్య మీ ప్రవర్తన ఇదివరకటిలా లేదు. మీకే అమ్మాయితోనైనా పరిచయమా?’’ ‘‘ఇదేమిటి కొత్తగా?’’ ‘‘సారీ. ఏంలేదు’’ లల్లేశ్వరి లోపలికి వెళ్ళిపోయింది. మాంచాల పేకముక్కని కింద పడేసి చెప్పింది. ‘‘నేను మళ్ళీ ఓడిపోయాను.’’ తన హేండ్ బేగ్ తెరిచి లల్లేశ్వరికి రెండు వందల ఏభై రూపాయలని ఇచ్చింది. ‘‘మాంచాలా! నాలోని అందం ఏమైనా తగ్గిందా?’’ లల్లేశ్వరి అడిగింది. ‘‘లేదు. నిన్ను చూస్తే మీ వారు సెకండ్ హనీమూన్‌కి తీసుకెళ్తారు’’ మాంచాల నవ్వుతూ చెప్పింది. ‘‘అతనసలు నన్ను గమనిస్తాడని అనుకోను.’’ ‘‘అదేమిటి ? గోలచందర్తో నీకు ఏమైనా ఇబ్బందా?’’ మాంచాల అడిగింది. ‘‘లేదు. నాతోనే ఇబ్బంది. నాకు వెల్లుల్లి పడదు. అది ఆయనకి పరమ ఇష్టం.’’ ‘‘ఐతే ఆయనతోనే ఇబ్బంది. మానేయచ్చుగా?’’ ‘‘వెల్లుల్లి కోసం ఇంకెవరింటికో వెళ్తున్నాడని నాకు అనుమానంగా ఉంది.’’ ‘‘ఎవరింటికి?’’ ‘‘అదే అంతుపట్టని రహస్యమై కూర్చుంది. రహస్య టెలిఫోన్ కాల్స్ కానీ, చేతి రుమాళ్ళు మీద నిగూఢమైన లిప్‌స్టిక్ ముద్రలు కానీ అతని దగ్గర దొరకలేదు. ఐనా అతనికి వెల్లుల్లితో చక్కగా వండే ఇంకో అమ్మాయితో పరిచయమైందని అనుకుంటున్నాను.’’ ‘‘అసలు నీకా అనుమానం ఎందుకు వచ్చింది?’’ మాంచాల అడిగింది. ‘‘వెల్లుల్లి వాసనని బట్టి.’’ ‘‘కానీ. అతను నిన్నెంతగా ప్రేమిస్తున్నాడో నీకు తెలుసు. నీది అనుమానమేనేమో? అతను వెల్లుల్లిని త్యాగం చేశాడేమో?’’ ‘‘నన్నెంతగానో ప్రేమిస్తున్నానని, వెల్లుల్లిని దొంగతనంగా తినడం లేదని చెప్తున్నాడు. కాని ఒకోసారి ఆ వాసన? నా సలహా, నీకు నచ్చనివి తినేవాడ్ని ఎన్నడూ ఇంకో పెళ్ళి చేసుకోక.’’ ‘‘అదే నిజమైతే గోలచందర్ నిన్ను మోసం చేయడం అన్యాయమే’’ మాంచాల తన ేన్నహితురాలితో చెప్పింది. ‘‘నా భర్త పనిచేసే కంపెనీకి నేనే యజమానురాలిని. అతను రాత్రుళ్ళు లేటుగా పని చేస్తున్నానని చెప్పడం అబద్ధమని నాకు తెలుసు. అతన్ని నా కంపెనీ చైర్మన్‌ని చేయడం నా పొరపాటేమో! అతనికి వెల్లుల్లి కారణంగా ఇంకొకరితో సంబంధం ఉందని తెలియగానే తీసేసి విడాకులిస్తాను’’ లల్లేశ్వరి చెప్పింది. ‘‘విడాకులా? నీ దగ్గర సాక్ష్యం లేదన్నావుగా?’’ మాంచాల కంగారుగా అడిగింది. లల్లేశ్వరి లేచి బయటికి వెళ్తూ చెప్పింది. ‘‘బేకరీ షాప్‌కి వెళ్ళి చికెన్ పఫ్స్ కొనాలి. అవి గోలచందర్కి బాగా ఇష్టం.’’ ‘‘ఈ రాత్రి భోజనంలో మీరు చికెన్ పఫ్స్ తిన్నారు కదా?’’ మాంచాల నవ్వుతూ అడిగింది. ‘‘అవును. నీకెలా తెలుసు?’’ ‘‘మీ ఆవిడ మిమ్మల్ని అనుమానిస్తోంది. కానీ ఆమె దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. అందుకని మనం త్వరపడి ఏమైనా చేయాలి.’’ ‘‘అవును.’’ ‘‘విడాకుల తర్వాత మీకున్నదంతా పోతుంది.’’ ‘‘అవును.’’ ‘‘అవునని చెప్తే సమస్య తీరదు. నా దగ్గరకి వచ్చి వెల్లుల్లి తినడం అన్నా మానండి. లేదా నేను చెప్పినట్లయినా చేయండి.’’ ‘‘సరే. నేనా పని ఈ రాత్రికే చేస్తాను’’ గోలచందర్ అయిష్టంగా చెప్పాడు. ‘‘నేను మిమ్మల్ని ఇంకా ప్రేమించక మునుపు ఓరోజు ‘నువ్వు నన్ను ప్రేమించకపోతే నేను ఈ ప్రపంచంలోని అతి సెక్సీయెస్ట్ పర్సన్‌ని హత్య చేసేసి ఉండేవాడ్ని. కాని ఆత్మహత్య నేరం అని మానేశాను’ అన్నారు గుర్తుందా? హత్య కూడా నేరమే ఐనా దాన్ని మీరు ఆ ప్రేమకోసం చేయక తప్పదు’’ మాంచాల చెప్పింది. ‘‘మీకు లగ్జరీ ఇష్టమా?’’ కాసేపాగి అడిగింది. ‘‘ఎవరికి ఇష్టం ఉండదు?’’ ‘‘ఐతే ఈ రాత్రికే ఆ పని పూర్తి చేయండి’’ మాంచాల కోరింది. -
త్రీమంకీస్ - 33
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 33 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘నాక్కూడా ఓ రోజు వస్తుంది’’ గొణిగాడు. ముగ్గురు మిత్రులు వాళ్ళకి దూరంగా కూర్చున్నారు. మర్కట్ కిటికీలోంచి బయటకి చూశాడు. అతనికి ఓ కుక్క కనిపించింది. జైల్లోకి కుక్క ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోయాడు. అది కూడా ఏదైనా నేరం చేసి ఉంటుందా? ‘‘పాపం! ఇది జైలర్ ఇంట్లోని చెట్టు బోదె దగ్గర కాలెత్తినట్లుంది’’ ఆ కుక్కని చూస్తూ చెప్పాడు. ‘‘కాదు. అది విఐపి ఖైదీ కుక్క. దాన్ని విడిచి ఉండలేక వెంట తెచ్చుకున్నాడని పట్టయ్య చెప్పాడు’’ వానర్ కిటికీలోంచి కనపడే దాన్ని చూసి చెప్పాడు. ‘‘నేరం దాని యజమానిది. పాపం! దీనికి కూడా శిక్షా?’’ మర్కట్ చెప్పాడు. మళ్ళీ కాసేపాగి చెప్పాడు. ‘‘నాకు కుక్కలంటే చాలా భయం.’’ కపీష్ కొద్ది క్షణాలు నిశ్శబ్దంగా ఉండి తర్వాత గొంతు తగ్గించి అడిగాడు. ‘‘మనం ఈ జైల్లోకి వచ్చిన ఏడాదిలో మీకు ఎప్పుడైనా పారిపోవాలనే ఆలోచన వచ్చిందా?’’ ‘‘ఏడాదా? కాలేదే?’’ ‘‘మీకు అనిపించడం లేదేమో కాని నాకు ఏడాది అయినట్లుగా ఉంది.’’ ‘‘నాకు ఇవాళ పొద్దున టీ తాగాక ఆ ఆలోచన వచ్చింది’’ వానర్ చెప్పాడు. ‘‘నిన్న రాత్రి చపాతీ తిన్నాకే నాకా ఆలోచన వచ్చింది. నీకూ వచ్చిందా?’’ మర్కట్ కపీష్‌ని అడిగాడు. ‘‘నాకు పోలీస్ జీప్‌లోంచి జైలు తలుపు కనిపించిన మరుక్షణమే వచ్చింది. పారిపోదాం’’ కపీష్ గొంతు తగ్గించి సూచించాడు. ‘‘ఎలా?’’ ‘‘కొన్ని హాలీవుడ్ సినిమాలు చూశాను. అందులో దొంగలు పారిపోయే సన్నివేశాలు నాకు గుర్తున్నాయి. వాటిల్లో అన్నిటికన్నా గొప్పది ది గ్రేట్ ఎస్కేప్. జైల్లోంచి యుద్ధ ఖైదీలు సొరంగాన్ని తవ్వి పారిపోతారు.’’ ‘‘అది మనకి సాధ్యం కాదు. పనిముట్లు లేవు. అంతా చూస్తారు. అదీకాక అది అంత ఈజీ కాదు’’ వానర్ వెంటనే చెప్పాడు. ‘‘ఎవ్విరిథింగ్ ఈజ్ ఈజీ వెన్ యు ఆర్ క్రేజీ నథింగ్ ఈజ్ ఈజీ వెన్ యు ఆర్ లేజీ. మనం క్రేజీ ఐతే పారిపోయేందుకు ఇంకా తేలిక మార్గం ఉంది. ప్లాన్ ఏ. ఓ సినిమాలో జైలు లాండ్రీలోని బట్టల మూటలో దాక్కుని ఒకడు పారిపోతాడు’’ కపీష్ చెప్పాడు. ‘‘అదృష్టవశాత్తు నాకు లాండ్రీ డ్యూటీనే ఇచ్చారుగా. నేనలా పారిపోవచ్చన్నమాట’’ వానర్ ఉత్సాహంగా చెప్పాడు. ‘‘అవును. నువ్వా మూటలో దాక్కుంటే సరి. ప్రతీ రాత్రి వేన్లో బయటకి వెళ్తుంది.’’ ‘‘అయితే రేపే పారిపోదాం’’ వానర్ ఉత్సాహంగా చెప్పాడు. ‘‘అవును. వేన్ రాత్రి ఏడున్నరకి వస్తుంది’’ కపీష్ చెప్పాడు. ‘‘నా సంగతో?’’ మర్కట్ అడిగాడు. ‘‘నీది కిచెన్ డ్యూటీ కదా?’’ ‘‘అవును.’’ ‘‘కిచెన్‌లో పని చేస్తూ నీకు పారిపోయే మార్గం తట్టలేదా?’’ కపీష్ మందలింపుగా చెప్పాడు. ‘‘ఎలా?’’ ‘‘నీ డ్యూటీ ఏమిటి?’’ ‘‘కూరగాయల్ని కోయడం.’’ ‘‘కోసాక ఆ చెత్తని ఏం చేస్తారు?’’ ‘‘చెత్త డబ్బాలో పోస్తారు.’’ ‘‘ప్లాన్ బి. అందులోని నల్లటి ప్లాస్టిక్ చెత్త కవర్ని కూడా ఖాళీ చేయడానికి అదే వేన్లో తీసుకెళ్తారు.’’ ‘‘అర్థమైంది. నేను అందులో దాక్కోవాలి. ఒకవేళ ప్లాన్ బి పని చేయకపోతే?’’ ‘‘మరేం ఫర్వాలేదు. ఆల్ఫాబెట్లో ఇంకా ఇరవై నాలుగు అక్షరాలు ఉన్నాయి.’’ ‘‘మరి నువ్వు?’’ ‘‘నా డ్యూటీ జైల్ లైబ్రరీలో. అక్కడ నించి బయటకి వెళ్ళేవి ఏం లేవు.’’ ‘‘మేం తప్పించుకున్నాక బయట నించి తాడు విసురుతాం. ఏ టైంకి విసరం?’’ వానర్ అడిగాడు. ‘‘ఆ అవసరం లేదు. బహుశ నేనూ మీతోనే తప్పించుకుంటాను’’ కపీష్ చెప్పాడు. ‘‘ఎలా?’’ ‘‘ఆలోచిస్తున్నాను. ఆ బాండ్ సినిమా పేరు గుర్తు రావడం లేదు.’’ ‘‘బయకి వెళ్ళగానే ముందు ఇరానీ చాయ్ తాగుతాను’’ వానర్ చెప్పాడు. ‘‘నేను బావర్చీకి వెళ్ళి వేడి వేడి చపాతీ తింటాను’’ మర్కట్ చెప్పాడు. కపీష్ మాట్లాడకపోవడంతో వాళ్ళు అడిగారు. ‘‘నువ్వు?’’ ‘‘నేను పది కోట్లు సంపాదించే ప్రయత్నం కొనసాగిస్తాను’’ కపీష్ చెప్పాడు. ‘‘నిన్ను జైలర్ గారు విడుదల చేయమన్నారు’’ ఆ రాత్రి జైల్ సెల్ తలుపు తెరిచి గార్డ్ చెప్పాడు. ‘‘దేనికి?’’ వానర్ అడిగాడు. ‘‘నువ్వు చేసింది నేరం కాదని ఆయనకి కోర్ట్ ఆర్డర్ అందింది. ఫేస్బుక్లో ఏదైనా పోస్ట్ చేయడం నేరం కాదు.’’ ‘‘నా ఇద్దరు మిత్రులూ?’’ ‘‘వాళ్ళ గురించి కోర్ట్ ఆర్డర్ ఏం రాలేదు.’’ మిత్రులిద్దర్నీ కలుసుకున్నాడు. బయటకి వెళ్ళాక తమకి పోస్ట్‌లో పంపాల్సిన లిస్ట్‌ని ఇద్దరూ చెప్పారు. కపీష్ పార, గొడ్డలి, పలుగు, గమ్మేళాలని కోరితే, మర్కట్ ఓ పర్సనల్ కంప్యూటర్ని, సిక్స్టీన్ జిబి పెన్ డ్రైవ్‌ని కోరాడు. (వానర్ జైలు బయటకి వెళ్లడం ఎలా రద్దయింది?) -
త్రీ మంకీస్ - 31
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 31 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘ఫంగస్ బిట్విన్ టోస్నిల్. టో నెయిల్స్ ఫంగస్నో... నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీతో నిన్న చెప్పానా?’’ ‘‘మీరు నాకన్నా ఐదారేళ్ళు పెద్ద కదా? అది కుదరదు.’’ ‘‘దాందేముంది. నువ్వు కూడా ఇరవై తొమ్మిదికి వచ్చే దాకా నేను అక్కడే వేచి ఉంటాను వార్.’’ ‘‘వార్? అంటే?’’ ‘‘నా ప్రేమ నీ పేరులోని న కొట్టేసింది అని నీకు తట్టలేదా? నువ్వు నన్ను పెళ్ళాడితే రకరకాల చెట్ల బెరళ్ళతో, ఆకులతో, వేళ్ళతో నీకు ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటలని చేయగలుగుతాను. నాకు ఎన్నో మూలికా రహస్యాలు తెలుసు. కాబట్టి రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.’’ ‘‘కాని నేను భోజనప్రియుడ్ని కాను డాక్టర్.’’ ‘‘ఆకలి పెరిగే లేహ్యం ఇచ్చానంటే చాలు. నువ్వు ఇట్టే భోజనప్రియుడిగా మారి పోతావు. పన్నెండేళ్ళకోసారి వచ్చేది ఏది?’’ ‘‘పుష్కరం?’’ ‘‘షేక్స్పియర్ కన్నా అతని భార్య వయసు అంత ఎక్కువ. రైతులు కోరుకునే కరం ఏమిటి?’’ మూలిక మళ్ళీ ప్రశ్నించింది. ‘‘ఎకరం?’’ ‘‘కరెక్ట్. నా పేర పన్నెండు ఎకరాలు ఉన్నాయి. ఆడవాళ్ళల్లో ఏ కరం ఉంటే పెళ్ళవడం కష్టం?’’ ‘‘అవకరం.’’ ‘‘కరెక్ట్. అది నాలో లేదు కాబట్టి మనకి పెళ్ళవడం కష్టం కాదు. సంక్రాంతి అనగానే గుర్తొచ్చే కరం ఏమిటి?’’ ‘‘మకరం.’’ ‘‘అవును. అంటే తెలుగులో మొసలి. దేంట్లోనైనా నాది మొసలి పట్టు. వర్కర్స్ ఉపయోగించే కరం ఏమిటి?’’ ‘‘పరికరం.’’ ‘‘కరెక్ట్. నా ఒంట్లోని పరికరాలన్నీ నీకోసమే ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నాయి’’ మగతగా చెప్పింది. ‘‘డేంజర్ అనగానే గుర్తొచ్చే కరం ఏమిటో మీకు తెలుసా?’’ వానర్ అడిగాడు. ‘‘ప్రమాదకరం?’’ ‘‘కరెక్ట్. మన పెళ్ళి నాకు ప్రమాదకరం అనిపిస్తోంది.’’ ‘‘నీకు కావచ్చు. నాకు మాత్రం ఆనందకరం. ఈ పూట ఒంట్లో ఎలా ఉంది? ఈ ధర్మామీటర్ని పావు అంగుళం మింగు’’ అతని నోట్లో దాన్ని ఉంచి చెప్పింది. ‘‘ఏ మూలిక తింటే లైంగిక శక్తి పెరుగుతుందో, ఏ మూలిక తింటే వృద్ధాప్యం దూరంగా ఉంటుందో, ఏ మూలిక తింటే ఆయుర్దాయం పెరుగుతుందో నాకు తెలుసు. మీకు మలబద్ధకం ఉందా?’’ ‘‘ఛీ! లేదు.’’ ‘‘ఉంటే దానికీ నాకు మూలికా వైద్యం తెలుసు. మన వైవాహిక జీవితం తప్పనిసరిగా సంతోషకరంగా సాగుతుందని వారంటీతో కూడిన గేరంటీని ఇస్తున్నాను.’’ అతని నోట్లోంచి ధర్మామీటర్ని తీసి చూసి విదిలించి చెప్పింది. ‘‘ఓ డిగ్రీ ఎక్కువ ఉంది. ఈ అరంగుళం బెరడుని వేడి నీళ్ళల్లో కాచి ఆ బెరడుని మింగి నీళ్ళు తాగు. రేపు మళ్ళీ వచ్చి నీ ఆరోగ్య పరీక్ష చేయించుకో. నీకోటి తెలుసా? అస్సాం గవర్నర్ పైల్స్ వ్యాధి తగ్గించినందుకు గాను ఆయన నాకు మూలికా రత్న అనే బిరుదుని ఇచ్చి గండపెండేరాన్ని తొడిగి, గజారోహణం చేయించారు. ప్రేమని ఎన్ని విధాలుగా వ్యక్తం చేయచ్చో నీకు తెలుసా?’’ ‘‘తెలుసు. అందుకు ఒకే విధం నాకు తెలుసు డాక్టర్.’’ ‘‘డాక్టర్ కాదు. మూలీ అని పిలు.’’ ‘‘మూలీ ఏమిటి?’’ వానర్ అర్థం కాక అడిగాడు. ‘‘మూలికకి స్వీట్ నేమ్.. ప్రేమని ఎన్ని విధాలుగా వ్యక్తం చేయచ్చో నీకు తెలుసా?’’ మళ్ళీ అడిగింది. ‘‘ఒకే విధంగా తెలుసు డాక్ట... మూలీ.’’ ‘‘ఏమిటది?’’ ‘‘క్షమించండి. మీ ముందు బూతులు మాట్లాడటం భావ్యం కాదు.’’ ‘‘అర్థమైంది. బూతులు మాట్లాడకుండా చెప్పే ఇంకా చాలా విధానాలు ఉన్నాయి వార్... వన్. గివ్ ఆర్ గెటే హగ్.’’ ‘‘సారీ?’’ ‘‘నాన్-సెక్సువల్ ప్రేమ ఎక్స్ప్రెషన్స్ చెప్తున్నాను విను. టు - కిస్ అండ్ బి కిస్డ్; త్రి - హోల్డ్ హేండ్స్. ఫోర్ - గో టుగెదర్ ఫరే లాంగ్ వాక్. అర్థమౌతోందా?’’ ‘‘నాకు ఇంగ్లీష్ కొద్దిగా వచ్చు మూలీ.’’ ‘‘వార్! నాకు ఎవర్ని చూసినా కలగనిది నిన్ను చూశాక నాలో ఏదో కలిగింది వార్.’’ ‘‘ఐ యాం సారీ.’’ ‘‘డోంట్ బి సారీ. గోటు పూరీ ఆన్ ఏ లారీ... ఫైవ్ - గో ఫరే మూవీ. సిక్స్ - సిట్ టుగెదర్ ఇన్ ది పార్క్. ఎయిట్ - గో అవుట్ టు ఈట్.’’ ‘‘అది సెవెన్ అనుకుంటా?’’ ‘‘కాదు. ఎయిట్ టు ఈట్. సెవెన్ స్నగుల్ అప్ టుగెదర్. నైన్ - కుక్ ఏ మీల్ టుగెదర్.’’ ‘‘నాకు మూలికలతో వంట చేయడం రాదు మూలీ’’ వానర్ అభ్యంతరం చెప్పాడు. (మెయిన్ విలన్ దుర్యోధన్కి, ముగ్గురు మిత్రులకి ముఖాముఖి) - మళ్లీ రేపు ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 3monkies.sakshi@gmail.com లెటర్స్ The characterisation of Swachha was very excellent and her discovering the new words in English is amazing. - Boga Sandhya (sandhyab1111@gmail.com) 3 మంకీస్‌లో ప్రతి వర్డ్ కామెడీకి ఉపయోగపడేలా రాస్తున్నారు. స్వచ్ఛ పాత్ర ద్వారా చక్కటి కామెడీ పండించారు. సూపర్. - నరేంద్ర నాయుడు కె. (narendranaidukundavarapu@gmail.com) -
త్రీ మంకీస్ - 30
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 30 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘అది కాదు. బయటకి రాగానే వచ్చి తీసుకెళ్ళమని నాకు ఎస్సెమ్మెస్ ఇద్దామనే నీ మాటని.’’ ‘‘మీ తోడన్నాగా.’’ ‘‘ఆ తోళ్ళు పని చేస్తే నేను ఇప్పటికి తొమ్మిది వందల నలభై ఏడు సార్లు చచ్చేవాడిని. సరే. నువ్వు బయటకి రాగానే నీకు జైలు గుమ్మం బయట స్వాగతం పలికేది నేనే. మాట తప్పావో. ఉస్కో. అంతే. ఏదో ఓ వేలు ఉండదు. జాగ్రత్త.’’ ‘‘తమరంతటికి తెగించేవారని నాకు తెలుసు. బాకీ ఎగ్గొట్టి చిటికెన వేళ్ళని పోగొట్టుకున్న వారి ఫొటోల మీద నా సంతకాలు తీసుకున్నారుగా.’’ ‘‘అవును. నేను వసూలు చేేన పద్ధతిని చట్టరీత్యా నీకు తెలియచేయాల్సిన బాధ్యత నా మీద ఉంది కదా. మధ్య వేలు లేని నీ ఫొటో మీద ఇంకెవరో సంతకం చేేన పరిస్థితిని తెచ్చుకోక. ఖబడ్దార్.’’ ‘‘అలాగే మార్వాడీ గారు. కాస్తంత నాకు బెయిల్ సహాయం కూడా చేసి అప్పు కట్టుకోండి’’ కపీష్ కోరాడు. ఆ ఏభై ఏళ్ళ లావుపాటివాడు తల అడ్డంగా ఊపి, నిశ్శబ్దంగా లేచాడు. ‘‘ఇంకాసేపు కూర్చోవచ్చుగా’’ కపీష్ మార్వాడీని రిక్వెస్ట్ చేశాడు. ‘‘దేనికి?’’ ‘‘మీరంటే నాకు ఇష్టం కాబట్టి’’ కపీష్ ఆమెకి వినపడేలా అతనితో చెప్పాడు. ‘‘నాకు ఎవరన్నా ఇష్టం లేదు. బాకీలంటేనే ఇష్టం’’ చెప్పి మార్వాడీ వెళ్ళిపోయాడు. ‘‘ఆలోచించండి’’ కపీష్ అరిచాడు. ‘‘లే’’ గార్డ్ చెప్పాడు. ‘‘ఇంకా టైం కాలేదుగా?’’ ‘‘ఆయన వెళ్ళాక ఇంకెందుకు ఇక్కడ కూర్చోవడం? పద. పద.’’ కపీష్ అయిష్టంగానే లేచాడు. తన వంక నవ్వుతూ చూస్తున్న ఆమెకి తన చొక్కా మీది నంబర్ని చూపించి లోపలకి వెళ్ళాడు. 7 మధ్యాహ్నం జైల్ మెస్‌లో భోజనం అయ్యాక వానర్, పట్టయ్యలు తమ సెల్‌లోకి వచ్చారు. ‘‘అంకుల్. అంత్యాక్షరి ఆడదామా?’’ కాసేపాగి వానర్ అడిగాడు. ‘‘నీకూ ఆసక్తి ఏర్పడిందన్నమాట?’’ ‘‘ఇక్కడ చెయ్యడానికి ఇంకేం పని లేదుగా. విసుగ్గా ఉంది.’’ ‘‘అందుకే మరి జైలు శిక్షని కనిపెట్టింది. నిన్న అంత్యాక్షరి ఎక్కడ ఆగింది? ఆఖరి అక్షరం స కదా?’’ పట్టయ్య అడిగాడు. ‘‘గుర్తు లేదు. మళ్ళీ మొదలెడదాం. కాని నిన్నటిలా మెలొడీ పేర పాతచింతకాయ పచ్చడి పాటలు కాదు. ఫాస్ట్ బీట్ గల పాటలైతేనే నాకు ఆసక్తి.’’ ‘‘మాకూ బీట్ సాంగ్స్ చాలా ఉన్నాయి. మీకే మెలొడీ పాటలు లేవు.’’ ‘‘బోలెడన్ని ఉన్నాయి. మీకు బీట్ సాంగ్స్ ఉన్నాయంటే నమ్మను.’’ ‘‘అలాగా? ఐతే ఇది విను. ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా. నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్నా...’’ ‘‘ఆగండి. నాకు అంత్యాక్షరి రూల్స్ తెలీవనుకోకండి. నిన్న మీరు మొదలెట్టారు. ఇవాళ నేను ఫాఫ్ట్ సాంగ్‌తో మొదలెడతాను.’’ ‘‘ఉన్నాయంటావా?’’ ‘‘మీరు ఫాస్ట్ బీట్. నేను రిథమ్... ఆడువారి మాటలకి అర్థాలే వేరులే. అర్థాలే వేరులే. అర్థాలే వేరులే...’’ ‘‘ఆగాగు. అది మా పాట. మిస్సమ్మ సినిమాలోది. నైన్టీన్ ఫిఫ్టీస్ సాంగ్’’ పట్టయ్య అడ్డుపడ్డాడు. ‘‘కాదు. ఖుషీ సినిమాలోని పా ఇది.’’ ‘‘మా పాటని కాపీ కొట్టి కొత్త పాట చేసి ఉంటారు. సరే. వేరులే... ల...’’ ఆలోచించి పట్టయ్య పాడాడు. ‘‘లే. లే. లే. లే. లే. లే. లే. నా రాజా లే లే నా రాజా. లేవనంటావా? నిద్దుర లేపమంటావా? లేలేలే నా రాజా... ఎలా ఉంది బీట్?’’ ‘‘అదిరింది గురూ. ఇప్పుడు జ తో. జగమంత కుటుంబం నాది. ఏకాకి జీవితం నాది. సంసార సాగరం నాదే. సన్న్యాసం, శూన్యం నావే... నావే. వ’’ వానర్ పాడి చెప్పాడు. ‘‘ఇది మెలొడీనే. వయసు కుర్రది. ఒంపులున్నవి. అహ నైసు నైసుగా ఐసు చేస్తది... ఆ..ఆ... వయసు కుర్రది.. దతో మెలొడీ సాంగ్ పాడు.’’ ‘‘దాయి దాయి దామ్మా. కులికే కుందనాల బొమ్మా. నీపై మనసైందమ్మా. నడిచే నిండు చందమామా...’’ ‘‘కట్. కట్. ఇది మెలొడీ కాదు. ఫాస్ట్సాంగ్. ఇంకోటి పాడు.’’ ‘‘సరే. ధీర ధీర ధీర మనసాగలేదురా. చేర రార శూర. సొగసందుకో దొర. ర. పాడండి.’’ ‘‘రంజు బలే రాంచిలకా. రంగేళీ రవ్వల మొలక. అబ్బా దాని సోకు జబ్బల దాకా జాకెట్...’’ ఆవిధంగా కొంత సాగాక గార్డ్ వచ్చి వారి సెల్ తలుపు తెరుస్తూ వానర్‌తో చెప్పాడు. ‘‘డాక్టరమ్మ నిన్ను రమ్మంటోంది.’’ వానర్ లేచి గార్డ్ని అనుసరించాడు. ఇద్దరూ జైలు హాస్పిటల్ విభాగంలోకి వెళ్ళారు. డాక్టర్ మూలిక హుషారుగా ఉంది. ‘‘కమాన్ వానర్. కం’’ ఆహ్వానించి గార్డ్‌తో చెప్పింది. ‘‘నువ్వు బయట ఉండు.’’ అతన్ని మళ్ళీ ఎగ్జామినేషన్ టేబిల్ మీద పడుకోబెట్టి నఖశిఖ పర్యంతం పరీక్షించసాగింది. - మళ్లీ రేపు ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 3monkies.sakshi@gmail.com లెటర్స్ * నాకు మల్లాది గారి నవలలు అంటే చాలా ఇష్టం. చాలా కాలానికి మళ్లీ వారి నవల చదివే అవకాశాన్ని కల్పించిన సాక్షి దినపత్రికకు ధన్యవాదాలు. - కనకం స్వామి, కరీంనగర్ * సో నైస్ సర్. నేను బాగా ఇంట్రస్టింగ్‌గా ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ టు సాక్షి.. -
త్రీ మంకీస్ - 29
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 29 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘సుశీలా! సుశీలా! కరెంట్ స్విచ్‌లని నీ కొంగుతో ముట్టుకోమన్నానా?’’ అరిచింది. ‘‘తప్పయిపోయింది అమ్మగారు’’ ఆమె భయంగా చెప్పింది. ‘‘చేత్తో లైట్ స్విచ్‌లని ముట్టుకుంటే షాక్ కొడుతుందా?’’ కపీష్ అడిగాడు. ‘‘ఊహూ. స్విచ్లకి మట్టవుతుంది. ఫేన్ ఆర్పిందంటే అది హాల్ ఊడుస్తుంది. మనం ముందు గదిలోకి వెళ్దాం పదండి.’’ పనిమనిషి వెళ్ళిపోయాక కపీష్ ముందు అడ్వాన్స్ అయ్యాడు. ఆమెని చుంబించపోతే అతన్ని ఆపి చెప్పింది. ‘‘కిచెన్ సింక్ పక్కన డెట్టాల్ బాటిల్ ఉంది. వెళ్ళి దాంతో మొహం శుభ్రంగా కడుక్కుని నోరు పుక్కిలించి రండి.’’ అతనికి తర్వాతి దృశ్యం స్ఫురించింది. నిత్యం తను డెట్టాల్‌లో స్నానం చేశాకే మంచం మీదకి రానిస్తుంది. లేచి సింక్ వైపు వెళ్ళకుండా, కపీష్ ఆమెకి కనీసం గుడ్ బై కూడా చెప్పకుండా ఆ ఇంట్లోంచి వేగంగా బయటకి నడిచాడు. ‘‘ముట్టుకుంటే మాసిపోయేంత అందమైన అమ్మాయిని వదిలేశావా గురూ?’’ వానర్ నమ్మలేనట్లుగా అడిగాడు. ‘‘అవును. ఏక్చువల్గా ఆ అమ్మాయికి ఓ అమెరికన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ పోస్ట్ ఆఫర్ ఉంది. నన్ను పెళ్ళి చేసుకుని డిపెండెంట్ వీసాతో అమెరికా తీసుకెళ్దామని అనుకున్నానని, మనసు మార్చుకోమని తర్వాత ఫోన్ చేసి చెప్పింది కూడా.’’ ‘‘మరి? నీ లైఫ్ హాయిగా సాగిపోతుందిగా?’’ మర్కట్ కూడా ఆశ్చర్యంగా అడిగాడు. ‘‘కాని పెళ్ళి అయ్యాక నన్ను గుండు మెయిన్టైన్ చేయమంది. లేదా ఇంట్లో జుట్టు రాలుతుందిట. రోజుకి నాలుగుసార్లు డెటాల్ నీళ్ళతో స్నానం చేయాలని కండిషన్. కాఫీ చుక్కలు కింద పడేలా తాగే నేను ఆమెతో వేగలేను. టైరైపోయినప్పుడు స్నానం చేయకుండా మంచం మీద పడుకునే లగ్జరీని నేను కోల్పోదలచుకోలేదు’’ కపీష్ చెప్పాడు. 6 జైల్ గార్డ్ కపీష్ దగ్గరకి వచ్చి చెప్పాడు - ‘‘నీ కోసం ములాఖాత్‌కి ఎవరో వచ్చారు. పద.’’ ‘‘ఏమిటీ? నీకు అంతమంది ఫ్రెండ్సా? అప్పుడే చూడటానికి వచ్చారు?’’ వానర్ ఆశ్చర్యంగా అడిగాడు. ‘‘లాయరై ఉంటాడు’’ మర్కట్ చెప్పాడు. ‘‘ఐతే మా కేసులు కూడా చూడమని చెప్పు బ్రదర్’’ వానర్ కోరాడు. ‘‘అంత సీన్ లేదు. అసలు నేను ఇక్కడ ఉన్నానని ఎవరికీ తెలీదే?’’ కపీష్ అయోమయంగా చెప్పాడు. ‘‘పేరు తులసి’’ ములాఖాత్ నించి వచ్చిన ఓ ఖైదీ చెప్పాడు. ‘‘స్వచ్ఛ పేరు, మనసు మార్చుకుందేమో?’’ వానర్ ప్రోత్సహిస్తూ చెప్పాడు. గార్డ్ వెంట ములాఖాత్ గదిలోకి వెళ్ళి కటకటాల కిటికీ ఎదురుగా కూర్చుని కపీష్ తన కోసం వచ్చింది ఎవరా అని చూశాడు. కిటికీలోంచి ఓ అందమైన అమ్మాయి మొహం కనపడింది. ఆమె వంక మైమరుపుగా చూశాడు. ఆ మొహం పక్క కిటికీ దగ్గరకి వెళ్ళింది. ఆ మొహం వెనక ఉన్న ఓ మొగ మొహాన్ని చూసి అదిరిపడి అడిగాడు. ‘‘ఓర్నీ! మీరా?’’ తడబడ్డాడు. ‘‘నేనే. తులసీరాంని.’’ నుదుట గంధం బొట్టు. దాని మీద కుంకం బొట్టు. అప్పుడే ఇస్త్రీ చేసినట్లున్న తెల్లటి ఖద్దరు చొక్కా. జవ్వాది వాసన గుప్పున వేస్తోంది. చొక్కా జేబులోంచి ఐదు వందల రూపాయల కట్ట బయటకి కనిపిస్తోంది. కపీష్ పక్క కిటికీ ముందు కూర్చుని ఓ ఖైదీతో మాట్లాడే ఆమె వంక చూశాడు. ఆమె కూడా అతని వంక ఓర చూపులు చూస్తోంది. ఇద్దరి చూపులూ కలుసుకున్నాయి. ‘‘మార్వాడీల కళ్ళు కప్పి అప్పులు తీసుకున్నవారు ఎక్కడికీ పారిపోలేరు. ఎక్కడ దాక్కున్నా ఇట్టే కనుక్కుంటాం’’ తులసీరాం చెప్పాడు. ‘‘అబ్బే. నేను దాక్కోడానికి ఇక్కడికి రాలేదు. అసలు రానంటున్నా లాక్కొచ్చారు’’ కపీష్ చెప్పాడు. ‘‘నీలాంటి ఒకడు సముద్రం అడుగున దాక్కున్నాడు. వాడికి సబ్‌మెరైన్‌లో ఉద్యోగం. వాడి నించి కూడా బాకీ వసూలు చేశాను. ఈ నెల వడ్డీ ఇవాల్సింది ఇవాళేగా. వసూలు చేసుకోడానికి వచ్చాను’’ చేతిని చాపి అడిగాడు. ‘‘అరెరె! నా దగ్గర లేదే?’’ ‘‘నేను వచ్చే రోజని తెలీదా? ఎందుకు లేదు?’’ మార్వాడీ గర్జించాడు. ‘‘జైల్లోకి రాగానే నా జేబులోవన్నీ జైలర్ స్వాధీనం చేసుకున్నాడు. తిరిగి బయటకి వెళ్ళేప్పుడు ఇస్తానన్నాడు. రేపో, ఎల్లుండో బయటకి రాగానే వచ్చి తీసుకెళ్ళమని మీకు ఎస్సెమ్మెస్ ఇద్దామని అనుకుంటున్నాను.’’ ‘‘నమ్మమంటావా?’’ ‘‘మీ తోడు. రెండు మూడు రోజుల్లో బయటకి వస్తాను.’’ (డాక్టర్ మూలిక వానర్ని ఏం చేసింది?) - మళ్లీ రేపు ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 3monkies.sakshi@gmail.com లెటర్స్ బంధాల్ని ఎంత పదిలంగా నిలుపుకోవాలో అందమైన జీవితం లాంటి నవలల ద్వారా తెలియచెప్పిన గొప్ప రచయిత మల్లాది గారు ఈ కాలాన్ని శాసిస్తున్న సోషల్ నెట్‌వర్క్‌పై రాసే త్రీ మంకీస్ అద్భుతంగా ఉంది. నా అభిమాన రచయిత మల్లాది గారికి, అందిస్తున్న సాక్షికి ధన్యవాదాలు. - పెరుగు సుజనారామం, ఆమంచర్ల -
త్రీమంకీస్ - 28
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 28 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘అనేకమంది కూర్చున్న సీట్ కదా.’’ ‘‘అవును. క్లీన్లీనెన్ ఈజ్ నెక్ట్స్ టు గాడ్లీనెన్.’’ ‘‘కదా. మీరు నాకు నచ్చారు.’’ ‘‘ఐతే నేను చెప్పే నాలుగు ఇంగ్లీష్ పదాలకి వ్యతిరేక పదాలని వెంటనే చెప్పండి చూద్దాం. ఇంగ్లీష్ తెలిసిన ఎవరికైనా ఆ వ్యతిరేక పదాలు తెలిసే ఉంటాయి.’’ ‘‘ష్యూర్’’ స్వచ్ఛ ఉత్సాహంగా చూసింది. ‘‘యు’’ కపీష్ చెప్పాడు. ‘‘ఐ.’’ ‘‘హేట్.’’ ‘‘లవ్.’’ ‘‘ఐ.’’ ‘‘యు.’’ ‘‘నెవర్.’’ ‘‘ఆల్వేస్’’ ఇప్పుడు కలిపి చెప్పండి.’’ ‘‘ఐ లవ్ యు ఆల్వేస్’’ ‘‘థాంక్స్ ఫర్ లవింగ్ మీ ఆల్వేస్’’ కపీష్ నవ్వుతూ చెప్పాడు. ‘‘తెలివే.’’ ఆమె సన్నగా నవ్వింది. ఆమె టి షర్ట్ మీది అక్షరాలని కపీష్ గమనించాడు. పర్ఫెక్ట్ క్రైమ్ ఐ స్టోల్ యువర్ హార్ట్. యు స్టీల్ మైన్. ‘‘మీ ఫాంటసీ ఏమిటి? మై ఫాంటసీ ఈజ్ టు హేవ్ టు మెన్’’ అడిగింది. ‘‘ఓ!!!’’ అతని గొంతు పొలమారింది. ‘‘ఒకరు కుకింగ్‌కి. మరొకరు క్లీనింగ్‌కి. మీకా రెండూ వస్తే మీ ఒక్కరితోనే సరిపెట్టుకుంటాను’’ స్వచ్ఛ నవ్వింది. ఇద్దరూ కలిసి ఇంటర్వెల్లో ఒకే ఐస్‌క్రీం కోన్ని షేర్ చేసుకున్నారు. ఆమె దాని మీద సేనిటైజర్ని చల్లాకే తినసాగింది. సినిమా అయ్యాక మర్నాడు తన ఇంటికి రమ్మని ఆహ్వానించింది. ఆమె తల్లితండ్రులు ఇంట్లో ఉండరని చెప్పాక అది ఆమెతో తను పాల్గొనబోయే సెక్స్‌కి ఆహ్వానంగా భావించిన కపీష్ తను పెట్టిన ఖర్చు వృథా కాలేదు అనుకున్నాడు. ‘‘రేపు నేను ఫ్రీనే. తప్పక వస్తాను’’ ఉత్సాహంగా చెప్పాడు. ‘‘మీరు కుక్కని పెంచుతున్నారా?’’ అడిగింది. ‘‘లేదు. ఏం?’’ ‘‘కుక్క బొచ్చు మీ చర్మానికి అంటుకుని మళ్ళీ నా చర్మానికి అంటుకుంటుందని!’’ మర్నాడు మధ్యాహ్నం రెండుకి సైనిక్‌పురిలోని ఆమె ఇంటికి వెళ్ళాడు. తలుపు బయట ‘దయచేసి మీ పాదరక్షలని బయటే వదలండి. సాక్స్ కూడా’ అనే బోర్డ్, ఆ వాక్యం పక్కనే నవ్వు మొహం బొమ్మ కనిపించడంతో వాటిని వదిలి లోపలకి వెళ్ళాడు. ఇంట్లో ఓ సర్వెంట్ అతను సాక్స్‌ని, పాదరక్షలని వదిలాడా? లేదా అని పర్యవేక్షించి, అతనికి ఓ కేప్‌ని ఇచ్చాడు. ‘‘ఇదేమిటి?’’ కపీష్ అర్థంకాక అడిగాడు. ‘‘షవర్ కేప్ సర్.’’ ‘‘దేనికి?’’ ‘‘తలకి పెట్టుకోండి. లేదా ఇంట్లో మీ జుట్టు రాలి పడచ్చు. మీకు కర్చీఫ్ ఉందా?’’ ‘‘పెన్, కర్చీఫ్, దువ్వెన లాంటివి జేబుల్లో ఉంచుకుని తిరగను.’’ ఓ కర్చీఫ్ ఇచ్చి చెప్పాడు - ‘‘తుమ్మితే ఉపయోగించుకోడానికి. లేదా నేలంతా పాడవుతుంది.’’ స్వచ్ఛ అతన్ని ఆప్యాయంగా ఆహ్వానించి ఇల్లు చూపించింది. ఇల్లు అద్దంలా శుభ్రంగా, పొందికగా ఉంది. పనిమనిషి ఇల్లు ఊడుస్తూ కనిపించింది. ‘‘పని మనిషి ఇవాళ లేట్‌గా వచ్చినట్లుంది?’’ తమ ఏకాంతానికి ఆమె భంగం అనుకుంటూ అడిగాడు. ‘‘లేదే. ఎందుకలా అడిగారు?’’ స్వచ్ఛ ప్రశ్నించింది. ‘‘అందరిళ్ళల్లో పనిమనుషులు ఉదయమే వస్తారుగా?’’ ‘‘మాకు ముగ్గురు పనిమనుషులు. ఉదయం ఓ పనిమనిషి, మధ్యాహ్నం ఓ పనిమనిషి, సాయంత్రం ఓ పనిమనిషి వస్తారు.’’ ‘‘ఎందుకలా?’’ ఆశ్చర్యంగా అడిగాడు. ‘‘ఊడ్చి తడి బట్ట వేసి నేలని తుడవాలి. లేదా ఇంట్లో మట్టి మట్టి.’’ ‘‘రోజుకి మూడుసార్లు?’’ ‘‘ ఔను. రోజుకి మూడుసార్లు. ఆదివారాలు వచ్చి కిటికీ చువ్వలు, ఫ్రేమ్‌లు, తలుపులు, ఫాన్లు, సీలింగ్ తుడిచేవాడు ఇంకోడున్నాడు.’’ ‘‘నిజంగా మీరు గ్రేట్ అండి.’’ ‘‘గ్రేట్ కాదు. క్లీన్లీనెస్ ఈజ్ నెక్ట్స్ టు గాడ్లీనెస్ అని నమ్మేదాన్ని.’’ పనిమనిషికి అర్థం కాకుండా ఇంగ్లీష్‌లో చెప్పింది. ‘‘మనం ప్రేమలో పడ్డాం కాబట్టి చాలా చేయాలి.’’ ‘‘నేను అందుకు ఎప్పుడూ సిద్ధమే’’ ఉత్సాహంగా చెప్పాడు. అకస్మాత్తుగా ఆమె కెవ్వున అరుస్తూ లేచింది. ‘ఏమిటి?’ అని అడుగుతూ కంగారుగా కపీష్ కూడా లేచాడు. - మళ్లీ రేపు ఈ సీరియల్‌ని విడవకుండా చదివేవారికి.. సీరియల్ పూర్తయ్యాక దీని మీద రాసి పంపే సద్విమర్శ లేదా విశ్లేషణల్లోంచి మూడింటిని ఎంపిక చేసి ప్రచురిస్తాం. వారికి రచయిత తలో రూ.500/- పంపుతారు. ఈ సీరియల్ మీద మీ అభిప్రాయాలని మీ ఫొటోతోపాటు ఈ కింది చిరునామాకి పంపండి.మీరు ఇరవై ఒకటో శతాబ్దపు పాఠకులైతే 3monkies.sakshi@gmail.com కి మీ ఫోటోని అటాచ్ చేస్తూ పంపండి. మీరు ఇంకా అక్కడే ఉంటే మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోతో సహా ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 లెటర్స్ * మూడు కోతులు ముచ్చటగా ఉన్నాయి. సంభాషణలు తూటాల్లా దూసుకుపోతున్నాయి.- ఎం. శ్రీనివాసులు రెడ్డి, పీలేరు * సోషల్ నెట్‌వర్క్‌లో పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవడం ఎంత కష్టమో మంచి కామెడీగా రాశారు. ఇది అందరూ అనుభవించే బాధ. - నరేంద్ర (narendranaidukundavarapu@gmail.com) -
త్రీమంకీస్ - 27
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 27 మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘చాలా. గ్లవ్స్ తెలుసుగా?’’ ‘‘తెలుసు. చేతికి తొడుక్కుంటాం.’’ ‘‘దానికి ‘ఫింగర్ పేంట్స్’ అనే కొత్త పేరుని కనుక్కున్నాను. ముందు అమెరికాలో, తర్వాత కొద్దికాలం తర్వాత మన దేశంలో కూడా దాన్ని అలాగే పిలుస్తారు.’’ ‘‘వావ్!’’ ‘‘వల్కనో తెలుసుగా?’’ ‘‘అగ్ని పర్వతం.’’ ‘‘దానికి ‘మౌంటెన్ ఫౌంటెన్’ అనే పేరు కనుక్కున్నాను. జపాన్‌లో అది ప్రాచుర్యం చెందుతోంది. ఫ్రెంచ్ ఫ్రైస్లో ఫ్రెంచ్ లేదు. కాబట్టి దానికి ‘ఫింగర్ పొటాటోస్’ అనే పేరు కనుక్కున్నాను.’’ ‘‘మీరు గ్రేటండి.’’ ‘‘ఐస్క్యూబ్స్కి ‘వాటర్ విత్ కార్నర్స్’ అనే పేరు కనుక్కున్నాను. స్టార్‌కి ‘స్పేస్‌లైట్’ అనే పదాన్ని కనుక్కున్నాను.’’ ‘‘బావున్నాయి. మీరు చాలా గ్రేట్ అండి’’ కపీష్ మెచ్చుకున్నాడు. ‘‘కంప్యూటర్‌కి ‘ఇంటర్నెట్ మెషీన్’ అనే పేరు పెట్టాను. అది అమెరికాలో పాపులర్ అవుతోంది. లావుపాటి వాళ్ళని ఫాట్ అనకుండా ‘స్కిన్నీ’ అనాలి.’’ ‘‘ఇది మాత్రం అర్ధం కాలేదు. నాకు తెలిసి సన్న వాళ్ళని స్కిన్నీ అంటారు.‘‘ ‘‘కదా? అది తప్పు. సన్నపాటి వాళ్ళ కన్నా లావుపాటి వాళ్ళకే ఎక్కువ స్కిన్ ఉంటుంది కదా. కాబట్టి వాళ్ళని స్కిన్నీ అనడం కరెక్ట్. యుఎస్ఏలో బాత్రూంలని రెస్ట్‌రూమ్స్ అంటారు. నిజానికి బెడ్ రూమ్స్‌ని రెస్ట్‌రూమ్స్ అనాలి అని నా ప్రాజెక్ట్‌లో రాశాను. ప్రెగ్నెంట్ విమెన్ని ‘బాడీ బిల్డర్’ అనాలి. ఫన్ సైజ్ కేండీ బార్స్‌ని సేడ్ సైజ్ కేండీ బార్స్ అనాలి. నెత్తి మీది జుట్టుని ‘పబ్లిక్ హెయిర్’ అనాలి. మోకాలు వెనక భాగానికి ఇంతదాకా అసలు పేరే లేదు. దానికి ‘నీపిట్స్’ అనే పేరుని కనుక్కున్నాను.’’ ‘‘ఒంటెని ‘డిజర్ట్ రేట్’ అనచ్చుగా?’’ కపీష్ తన తెలివిని ఉపయోగించాడు. ‘‘వావ్!’’ ‘‘టిష్యూలని ‘స్నీజ్ పేపర్’ అనచ్చుగా?’’ తమ ఎదురుగా ఉన్న పేపర్ టిష్యూలని చూని సూచించాడు. ‘‘మళ్ళీ వావ్! మనం ఒకేలా ఆలోచించే సిమిలర్ మైండ్ కలవాళ్ళం అని నాకు అనిపిస్తోంది. వి షుడ్ కీప్ సీయింగ్ ఈచ్ అదర్ ఆఫ్టెన్. బై ది వే, నా రీసెర్చ్‌లో ఇంగ్లీష్‌లో ప్రాచుర్యంలో లేని పదాలని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడం ఓ భాగం. ఉదాహరణకి డైసానియా అనే పదం అర్థం మీకు తెలుసా?’’ ‘‘తెలీదు.’’ ‘‘చూశారా? మీరా స్థితిని అనుభవిస్తారు కాని మీకు అర్థం తెలీదు. ఉదయం నిద్ర లేచాక మంచం దిగడానికి కష్టంగా ఉండటాన్ని డైసానియా అంటారు.’’ ‘‘వావ్!’’ ‘‘పెట్రోబోర్ అంటే?’’ ‘‘పెట్రోల్‌తో నడిచే కారా?’’ ‘‘కాదు. వర్షం వచ్చాక వేసే వాసన. టిటిల్ అంటే, ఇంగ్లీష్‌లోని స్మాల్ ఐ, జె అక్షరాల మీది చుక్కలు. డైపుస్కలర్ రేస్ అంటే మబ్బుల్లోంచి ఒకే చోటి నించి వస్తున్న సూర్య కిరణాలు. దీన్ని గాడ్స్ రేస్ అని కూడా అంటారు. ఫైల్ అంటే తెలుసా? పెన్సిల్ చివరి భాగంలో చుట్టబడ్డ మెటల్ భాగం. ముంటిన్ అంటే కిటికీ తలుపుల్లోని అద్దాలని విడదీసే స్ట్రిప్స్. ’మోర్టన్స్ టో’ అంటే కాలి బొటన వేలు కన్నా దాని పక్క పొడుగ్గా ఉన్న వేలు. ‘ఆర్మ్స్ ఎకింబో’ అంటే రెండు చేతులని నడుముకి అటు, ఇటు వేసి నిలబడటం. డ్రానక్ అంటే చెప్పుల షాపులో కాలి పాదాన్ని కొలిచే పరికరం. ‘డిజైర్ పాత్’ అంటే, నడిచే అడ్డ దారి. ఫాస్ఫెనెస్ అంటే తెలుసా?’’ ‘‘కనీసం దాని స్పెల్లింగ్ కూడా తెలీదు’’ కపీష్ చెప్పాడు. ‘‘కళ్ళు మూసుకుని వాటి మీద చేతులని ఉంచి నలిపితే చాలా లైట్‌గా కనపడే లైట్‌ని ఫాస్ఫెనెస్ అంటారు.’’ ‘‘అందుకే మీరు సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డి చేయగలుగుతున్నారు’’ మెచ్చుకున్నాడు. ‘‘మా ప్రొఫెసర్ ఇచ్చే ప్రోత్సాహం, గెడైన్స్ అలాంటిది. మెడికల్ టెక్ట్స్ బుక్స్ చదవమని సలహా ఇచ్చారు. ఫిల్ట్రమ్ అంటే ఏమిటో తెలుసా?’’ కపీష్ తల అడ్డంగా ఊపాడు. ‘‘పెపైదవి అంచు, ముక్కు కింద ఉన్న మీసం వచ్చే భాగం. ‘పర్లీక్యూర్ స్పేస్’ అంటే బొటన వేలు, చూపుడు వేలు మధ్య గల ఖాళీ. ఏగ్లెట్ అంటే షూ లేస్ మీద గల ప్లాస్టిక్ కోటింగ్. అలాగే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వారిని కలిస్తే చాలా పదాలు తెలిశాయి. సుత్తిని కొడతాం కదా? దాని వెనక భాగాన్ని పీన్ అంటారు. బట్టల తయారీ వాళ్ళని కూడా కలిశాను. ఆడవారి గౌనులో చేతులు పట్టే రంధ్రాలని ఆర్మ్స్కై అంటారు.’’ కపీష్‌కి తనకి తెలీకుండానే ఆమెతో అరవై నిమిషాలు ఐదు నిమిషాల్లా గడిచిపోయాయి. మార్వాడీ దగ్గర అప్పు తీసుకున్న వెయ్యి రూపాయల్లో ఆ నాలుగు వందల అరవై రూపాయలు మాత్రం తెలిసి ఖర్చయ్యాయి. మర్నాడు అదే మాల్లో ఐమేక్స్లో కలిశారు. ఆమె శానిటైజర్ తీసి తన సీట్లో, కపీష్ సీట్లో కొట్టి చెప్పింది. (‘మై ఫాంటసీ ఈజ్ టు హేవ్ టు మెన్’ అంది స్వచ్ఛ - ఎందుకు అనేది రేపు చూడండి....)