త్రీమంకీస్ - 33 | malladi special story | Sakshi
Sakshi News home page

త్రీమంకీస్ - 33

Published Thu, Nov 20 2014 11:06 PM | Last Updated on Sat, Sep 2 2017 4:49 PM

త్రీమంకీస్  - 33

త్రీమంకీస్ - 33

 డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 33
 
 - మల్లాది వెంకటకృష్ణమూర్తి
 
‘‘నాక్కూడా ఓ రోజు వస్తుంది’’ గొణిగాడు.
ముగ్గురు మిత్రులు వాళ్ళకి దూరంగా కూర్చున్నారు.
మర్కట్ కిటికీలోంచి బయటకి చూశాడు. అతనికి ఓ కుక్క కనిపించింది. జైల్లోకి కుక్క ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోయాడు. అది కూడా ఏదైనా నేరం చేసి ఉంటుందా?
‘‘పాపం! ఇది జైలర్ ఇంట్లోని చెట్టు బోదె దగ్గర కాలెత్తినట్లుంది’’ ఆ కుక్కని చూస్తూ చెప్పాడు.
 ‘‘కాదు. అది విఐపి ఖైదీ కుక్క. దాన్ని విడిచి ఉండలేక వెంట తెచ్చుకున్నాడని పట్టయ్య చెప్పాడు’’ వానర్ కిటికీలోంచి కనపడే దాన్ని చూసి చెప్పాడు.
 ‘‘నేరం దాని యజమానిది. పాపం! దీనికి కూడా శిక్షా?’’ మర్కట్ చెప్పాడు.
 మళ్ళీ కాసేపాగి చెప్పాడు.
 ‘‘నాకు కుక్కలంటే చాలా భయం.’’
 కపీష్ కొద్ది క్షణాలు నిశ్శబ్దంగా ఉండి తర్వాత గొంతు తగ్గించి అడిగాడు.
 ‘‘మనం ఈ జైల్లోకి వచ్చిన ఏడాదిలో మీకు ఎప్పుడైనా పారిపోవాలనే ఆలోచన వచ్చిందా?’’
 ‘‘ఏడాదా? కాలేదే?’’
 ‘‘మీకు అనిపించడం లేదేమో కాని నాకు ఏడాది అయినట్లుగా ఉంది.’’
 ‘‘నాకు ఇవాళ పొద్దున టీ తాగాక ఆ ఆలోచన వచ్చింది’’ వానర్ చెప్పాడు.
 ‘‘నిన్న రాత్రి చపాతీ తిన్నాకే నాకా ఆలోచన వచ్చింది. నీకూ వచ్చిందా?’’ మర్కట్ కపీష్‌ని అడిగాడు.
 ‘‘నాకు పోలీస్ జీప్‌లోంచి జైలు తలుపు కనిపించిన మరుక్షణమే వచ్చింది. పారిపోదాం’’ కపీష్ గొంతు తగ్గించి సూచించాడు.
 ‘‘ఎలా?’’
 ‘‘కొన్ని హాలీవుడ్ సినిమాలు చూశాను. అందులో దొంగలు పారిపోయే సన్నివేశాలు నాకు గుర్తున్నాయి. వాటిల్లో అన్నిటికన్నా గొప్పది ది గ్రేట్ ఎస్కేప్. జైల్లోంచి యుద్ధ ఖైదీలు సొరంగాన్ని తవ్వి పారిపోతారు.’’
 ‘‘అది మనకి సాధ్యం కాదు. పనిముట్లు లేవు. అంతా చూస్తారు. అదీకాక అది అంత ఈజీ కాదు’’ వానర్ వెంటనే చెప్పాడు.
 ‘‘ఎవ్విరిథింగ్ ఈజ్ ఈజీ
 వెన్ యు ఆర్ క్రేజీ
 నథింగ్ ఈజ్ ఈజీ
 వెన్ యు ఆర్ లేజీ.
 మనం క్రేజీ ఐతే పారిపోయేందుకు ఇంకా తేలిక మార్గం ఉంది. ప్లాన్ ఏ. ఓ సినిమాలో జైలు లాండ్రీలోని బట్టల మూటలో దాక్కుని ఒకడు పారిపోతాడు’’ కపీష్ చెప్పాడు.
 ‘‘అదృష్టవశాత్తు నాకు లాండ్రీ డ్యూటీనే ఇచ్చారుగా. నేనలా పారిపోవచ్చన్నమాట’’ వానర్ ఉత్సాహంగా చెప్పాడు.
 ‘‘అవును. నువ్వా మూటలో దాక్కుంటే సరి. ప్రతీ రాత్రి వేన్‌లో బయటకి వెళ్తుంది.’’
 ‘‘అయితే రేపే పారిపోదాం’’ వానర్ ఉత్సాహంగా చెప్పాడు.
 ‘‘అవును. వేన్ రాత్రి ఏడున్నరకి వస్తుంది’’ కపీష్ చెప్పాడు.
 ‘‘నా సంగతో?’’ మర్కట్ అడిగాడు.
 ‘‘నీది కిచెన్ డ్యూటీ కదా?’’
 ‘‘అవును.’’
 ‘‘కిచెన్‌లో పని చేస్తూ నీకు పారిపోయే మార్గం తట్టలేదా?’’ కపీష్ మందలింపుగా చెప్పాడు.
 ‘‘ఎలా?’’
 ‘‘నీ డ్యూటీ ఏమిటి?’’
 ‘‘కూరగాయల్ని కోయడం.’’
 ‘‘కోసాక ఆ చెత్తని ఏం చేస్తారు?’’
 ‘‘చెత్త డబ్బాలో పోస్తారు.’’
 ‘‘ప్లాన్ బి. అందులోని నల్లటి ప్లాస్టిక్ చెత్త కవర్ని కూడా ఖాళీ చేయడానికి అదే వేన్‌లో తీసుకెళ్తారు.’’
 ‘‘అర్థమైంది. నేను అందులో దాక్కోవాలి. ఒకవేళ ప్లాన్ బి పని చేయకపోతే?’’
 ‘‘మరేం ఫర్వాలేదు. ఆల్ఫాబెట్లో ఇంకా ఇరవై నాలుగు అక్షరాలు ఉన్నాయి.’’
 ‘‘మరి నువ్వు?’’
 ‘‘నా డ్యూటీ జైల్ లైబ్రరీలో. అక్కడ నించి బయటకి వెళ్ళేవి ఏం లేవు.’’
 ‘‘మేం తప్పించుకున్నాక బయట నించి తాడు విసురుతాం. ఏ టైంకి విసరం?’’ వానర్ అడిగాడు.
 ‘‘ఆ అవసరం లేదు. బహుశ నేనూ మీతోనే తప్పించుకుంటాను’’ కపీష్ చెప్పాడు.
 ‘‘ఎలా?’’
 ‘‘ఆలోచిస్తున్నాను. ఆ బాండ్ సినిమా పేరు గుర్తు రావడం లేదు.’’
 ‘‘బయకి వెళ్ళగానే ముందు ఇరానీ చాయ్ తాగుతాను’’ వానర్ చెప్పాడు.
 ‘‘నేను బావర్చీకి వెళ్ళి వేడి వేడి చపాతీ తింటాను’’ మర్కట్ చెప్పాడు.
 కపీష్ మాట్లాడకపోవడంతో వాళ్ళు అడిగారు.
 ‘‘నువ్వు?’’
 ‘‘నేను పది కోట్లు సంపాదించే ప్రయత్నం కొనసాగిస్తాను’’ కపీష్ చెప్పాడు.
   
 ‘‘నిన్ను జైలర్ గారు విడుదల చేయమన్నారు’’ ఆ రాత్రి జైల్ సెల్ తలుపు తెరిచి గార్డ్ చెప్పాడు.
 ‘‘దేనికి?’’ వానర్ అడిగాడు.
 ‘‘నువ్వు చేసింది నేరం కాదని ఆయనకి కోర్ట్ ఆర్డర్ అందింది. ఫేస్‌బుక్‌లో ఏదైనా పోస్ట్ చేయడం నేరం కాదు.’’
 ‘‘నా ఇద్దరు మిత్రులూ?’’
 ‘‘వాళ్ళ గురించి కోర్ట్ ఆర్డర్ ఏం రాలేదు.’’
 మిత్రులిద్దర్నీ కలుసుకున్నాడు. బయటకి వెళ్ళాక తమకి పోస్ట్‌లో పంపాల్సిన లిస్ట్‌ని ఇద్దరూ చెప్పారు. కపీష్ పార, గొడ్డలి, పలుగు, గమ్మేళాలని కోరితే, మర్కట్ ఓ పర్సనల్ కంప్యూటర్ని, సిక్స్‌టీన్ జిబి పెన్ డ్రైవ్‌ని కోరాడు.
 (వానర్ జైలు బయటకి వెళ్లడం ఎలా రద్దయింది?)
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement