త్రీమంకీస్ - 42
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 42
- మల్లాది వెంకటకృష్ణమూర్తి
‘‘చందూ! ఆలస్యమైందేమిటి?’’ అతని భార్య లల్లేశ్వరి అడిగింది.
‘‘ఆఫీసయ్యాక క్లబ్‌లో ఆగాను’’గోలచందర్ అబద్ధం చెప్పాడు.
‘‘మీరు నిజంగా క్లబ్‌నించే వస్తున్నారా?’’ఆమె అడిగింది.
‘‘అవును. ఏం?’’
‘‘ఈ మధ్య మీ ప్రవర్తన ఇదివరకటిలా లేదు. మీకే అమ్మాయితోనైనా పరిచయమా?’’
‘‘ఇదేమిటి కొత్తగా?’’
‘‘సారీ. ఏంలేదు’’ లల్లేశ్వరి లోపలికి వెళ్ళిపోయింది.
మాంచాల పేకముక్కని కింద పడేసి చెప్పింది.
‘‘నేను మళ్ళీ ఓడిపోయాను.’’
తన హేండ్ బేగ్ తెరిచి లల్లేశ్వరికి రెండు వందల ఏభై రూపాయలని ఇచ్చింది.
‘‘మాంచాలా! నాలోని అందం ఏమైనా తగ్గిందా?’’ లల్లేశ్వరి అడిగింది.
‘‘లేదు. నిన్ను చూస్తే మీ వారు సెకండ్ హనీమూన్‌కి తీసుకెళ్తారు’’ మాంచాల నవ్వుతూ చెప్పింది.
‘‘అతనసలు నన్ను గమనిస్తాడని అనుకోను.’’
‘‘అదేమిటి ? గోలచందర్‌తో నీకు ఏమైనా ఇబ్బందా?’’ మాంచాల అడిగింది.
‘‘లేదు. నాతోనే ఇబ్బంది. నాకు వెల్లుల్లి పడదు. అది ఆయనకి పరమ ఇష్టం.’’
‘‘ఐతే ఆయనతోనే ఇబ్బంది. మానేయచ్చుగా?’’
‘‘వెల్లుల్లి కోసం ఇంకెవరింటికో వెళ్తున్నాడని నాకు అనుమానంగా ఉంది.’’
‘‘ఎవరింటికి?’’
‘‘అదే అంతుపట్టని రహస్యమై కూర్చుంది. రహస్య టెలిఫోన్ కాల్స్ కానీ, చేతి రుమాళ్ళు మీద నిగూఢమైన లిప్‌స్టిక్ ముద్రలు కానీ అతని దగ్గర దొరకలేదు. ఐనా అతనికి వెల్లుల్లితో చక్కగా వండే ఇంకో అమ్మాయితో పరిచయమైందని అనుకుంటున్నాను.’’
‘‘అసలు నీకా అనుమానం ఎందుకు వచ్చింది?’’ మాంచాల అడిగింది.
‘‘వెల్లుల్లి వాసనని బట్టి.’’
‘‘కానీ. అతను నిన్నెంతగా ప్రేమిస్తున్నాడో నీకు తెలుసు. నీది అనుమానమేనేమో? అతను వెల్లుల్లిని త్యాగం చేశాడేమో?’’
‘‘నన్నెంతగానో ప్రేమిస్తున్నానని, వెల్లుల్లిని దొంగతనంగా తినడం లేదని చెప్తున్నాడు. కాని ఒకోసారి ఆ వాసన? నా సలహా, నీకు నచ్చనివి తినేవాడ్ని ఎన్నడూ ఇంకో పెళ్ళి చేసుకోక.’’
‘‘అదే నిజమైతే గోలచందర్ నిన్ను మోసం చేయడం అన్యాయమే’’ మాంచాల తన ేన్నహితురాలితో చెప్పింది.
‘‘నా భర్త పనిచేసే కంపెనీకి నేనే యజమానురాలిని. అతను రాత్రుళ్ళు లేటుగా పని చేస్తున్నానని చెప్పడం అబద్ధమని నాకు తెలుసు. అతన్ని నా కంపెనీ చైర్మన్‌ని చేయడం నా పొరపాటేమో! అతనికి వెల్లుల్లి కారణంగా ఇంకొకరితో సంబంధం ఉందని తెలియగానే తీసేసి విడాకులిస్తాను’’ లల్లేశ్వరి చెప్పింది.
‘‘విడాకులా? నీ దగ్గర సాక్ష్యం లేదన్నావుగా?’’ మాంచాల కంగారుగా అడిగింది.
లల్లేశ్వరి లేచి బయటికి వెళ్తూ చెప్పింది.
‘‘బేకరీ షాప్‌కి వెళ్ళి చికెన్ పఫ్స్ కొనాలి. అవి గోలచందర్‌కి బాగా ఇష్టం.’’
‘‘ఈ రాత్రి భోజనంలో మీరు చికెన్ పఫ్స్ తిన్నారు కదా?’’ మాంచాల నవ్వుతూ అడిగింది.
‘‘అవును. నీకెలా తెలుసు?’’
‘‘మీ ఆవిడ మిమ్మల్ని అనుమానిస్తోంది. కానీ ఆమె దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. అందుకని మనం త్వరపడి ఏమైనా చేయాలి.’’
‘‘అవును.’’
‘‘విడాకుల తర్వాత మీకున్నదంతా పోతుంది.’’
‘‘అవును.’’
‘‘అవునని చెప్తే సమస్య తీరదు. నా దగ్గరకి వచ్చి వెల్లుల్లి తినడం అన్నా మానండి. లేదా నేను చెప్పినట్లయినా చేయండి.’’
‘‘సరే. నేనా పని ఈ రాత్రికే చేస్తాను’’ గోలచందర్ అయిష్టంగా చెప్పాడు.
‘‘నేను మిమ్మల్ని ఇంకా ప్రేమించక మునుపు ఓరోజు ‘నువ్వు నన్ను ప్రేమించకపోతే నేను ఈ ప్రపంచంలోని అతి సెక్సీయెస్ట్ పర్సన్‌ని హత్య చేసేసి ఉండేవాడ్ని. కాని ఆత్మహత్య నేరం అని మానేశాను’ అన్నారు గుర్తుందా? హత్య కూడా నేరమే ఐనా దాన్ని మీరు ఆ ప్రేమకోసం చేయక తప్పదు’’ మాంచాల చెప్పింది.
‘‘మీకు లగ్జరీ ఇష్టమా?’’ కాసేపాగి అడిగింది.
‘‘ఎవరికి ఇష్టం ఉండదు?’’
‘‘ఐతే ఈ రాత్రికే ఆ పని పూర్తి చేయండి’’ మాంచాల కోరింది.