త్రీ మంకీస్ - 31
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 31
- మల్లాది వెంకటకృష్ణమూర్తి
‘‘ఫంగస్ బిట్విన్ టోస్‌నిల్. టో నెయిల్స్ ఫంగస్‌నో... నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీతో నిన్న చెప్పానా?’’
‘‘మీరు నాకన్నా ఐదారేళ్ళు పెద్ద కదా? అది కుదరదు.’’
‘‘దాందేముంది. నువ్వు కూడా ఇరవై తొమ్మిదికి వచ్చే దాకా నేను అక్కడే వేచి ఉంటాను వార్.’’
‘‘వార్? అంటే?’’
‘‘నా ప్రేమ నీ పేరులోని న కొట్టేసింది అని నీకు తట్టలేదా? నువ్వు నన్ను పెళ్ళాడితే రకరకాల చెట్ల బెరళ్ళతో, ఆకులతో, వేళ్ళతో నీకు ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటలని చేయగలుగుతాను. నాకు ఎన్నో మూలికా రహస్యాలు తెలుసు. కాబట్టి రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.’’
‘‘కాని నేను భోజనప్రియుడ్ని కాను డాక్టర్.’’
‘‘ఆకలి పెరిగే లేహ్యం ఇచ్చానంటే చాలు. నువ్వు ఇట్టే భోజనప్రియుడిగా మారి పోతావు. పన్నెండేళ్ళకోసారి వచ్చేది ఏది?’’
‘‘పుష్కరం?’’
‘‘షేక్స్‌పియర్ కన్నా అతని భార్య వయసు అంత ఎక్కువ. రైతులు కోరుకునే కరం ఏమిటి?’’ మూలిక మళ్ళీ ప్రశ్నించింది.
‘‘ఎకరం?’’
‘‘కరెక్ట్. నా పేర పన్నెండు ఎకరాలు ఉన్నాయి. ఆడవాళ్ళల్లో ఏ కరం ఉంటే పెళ్ళవడం కష్టం?’’
‘‘అవకరం.’’
‘‘కరెక్ట్. అది నాలో లేదు కాబట్టి మనకి పెళ్ళవడం కష్టం కాదు. సంక్రాంతి అనగానే గుర్తొచ్చే కరం ఏమిటి?’’
‘‘మకరం.’’
‘‘అవును. అంటే తెలుగులో మొసలి. దేంట్లోనైనా నాది మొసలి పట్టు. వర్కర్స్ ఉపయోగించే కరం ఏమిటి?’’
‘‘పరికరం.’’
‘‘కరెక్ట్. నా ఒంట్లోని పరికరాలన్నీ నీకోసమే ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నాయి’’ మగతగా చెప్పింది.
‘‘డేంజర్ అనగానే గుర్తొచ్చే కరం ఏమిటో మీకు తెలుసా?’’ వానర్ అడిగాడు.
‘‘ప్రమాదకరం?’’
‘‘కరెక్ట్. మన పెళ్ళి నాకు ప్రమాదకరం అనిపిస్తోంది.’’
‘‘నీకు కావచ్చు. నాకు మాత్రం ఆనందకరం. ఈ పూట ఒంట్లో ఎలా ఉంది? ఈ ధర్మామీటర్ని పావు అంగుళం మింగు’’ అతని నోట్లో దాన్ని ఉంచి చెప్పింది.
‘‘ఏ మూలిక తింటే లైంగిక శక్తి పెరుగుతుందో, ఏ మూలిక తింటే వృద్ధాప్యం దూరంగా ఉంటుందో, ఏ మూలిక తింటే ఆయుర్దాయం పెరుగుతుందో నాకు తెలుసు. మీకు మలబద్ధకం ఉందా?’’
‘‘ఛీ! లేదు.’’
‘‘ఉంటే దానికీ నాకు మూలికా వైద్యం తెలుసు. మన వైవాహిక జీవితం తప్పనిసరిగా సంతోషకరంగా సాగుతుందని వారంటీతో కూడిన గేరంటీని ఇస్తున్నాను.’’
అతని నోట్లోంచి ధర్మామీటర్ని తీసి చూసి విదిలించి చెప్పింది.
‘‘ఓ డిగ్రీ ఎక్కువ ఉంది. ఈ అరంగుళం బెరడుని వేడి నీళ్ళల్లో కాచి ఆ బెరడుని మింగి నీళ్ళు తాగు. రేపు మళ్ళీ వచ్చి నీ ఆరోగ్య పరీక్ష చేయించుకో. నీకోటి తెలుసా? అస్సాం గవర్నర్ పైల్స్ వ్యాధి తగ్గించినందుకు గాను ఆయన నాకు మూలికా రత్న అనే బిరుదుని ఇచ్చి గండపెండేరాన్ని తొడిగి, గజారోహణం చేయించారు. ప్రేమని ఎన్ని విధాలుగా వ్యక్తం చేయచ్చో నీకు తెలుసా?’’
‘‘తెలుసు. అందుకు ఒకే విధం నాకు తెలుసు డాక్టర్.’’
‘‘డాక్టర్ కాదు. మూలీ అని పిలు.’’
‘‘మూలీ ఏమిటి?’’ వానర్ అర్థం కాక అడిగాడు.
‘‘మూలికకి స్వీట్ నేమ్.. ప్రేమని ఎన్ని విధాలుగా వ్యక్తం చేయచ్చో నీకు తెలుసా?’’ మళ్ళీ అడిగింది.
‘‘ఒకే విధంగా తెలుసు డాక్ట... మూలీ.’’
‘‘ఏమిటది?’’
‘‘క్షమించండి. మీ ముందు బూతులు మాట్లాడటం భావ్యం కాదు.’’
‘‘అర్థమైంది. బూతులు మాట్లాడకుండా చెప్పే ఇంకా చాలా విధానాలు ఉన్నాయి వార్... వన్. గివ్ ఆర్ గెటే హగ్.’’
‘‘సారీ?’’
‘‘నాన్-సెక్సువల్ ప్రేమ ఎక్స్‌ప్రెషన్స్ చెప్తున్నాను విను. టు - కిస్ అండ్ బి కిస్డ్; త్రి - హోల్డ్ హేండ్స్. ఫోర్ - గో టుగెదర్ ఫరే లాంగ్ వాక్. అర్థమౌతోందా?’’
‘‘నాకు ఇంగ్లీష్ కొద్దిగా వచ్చు మూలీ.’’
‘‘వార్! నాకు ఎవర్ని చూసినా కలగనిది నిన్ను చూశాక నాలో ఏదో కలిగింది వార్.’’
‘‘ఐ యాం సారీ.’’
‘‘డోంట్ బి సారీ. గోటు పూరీ ఆన్ ఏ లారీ... ఫైవ్ - గో ఫరే మూవీ. సిక్స్ - సిట్ టుగెదర్ ఇన్ ది పార్క్. ఎయిట్ - గో అవుట్ టు ఈట్.’’
‘‘అది సెవెన్ అనుకుంటా?’’
‘‘కాదు. ఎయిట్ టు ఈట్. సెవెన్ స్నగుల్ అప్ టుగెదర్. నైన్ - కుక్ ఏ మీల్ టుగెదర్.’’
‘‘నాకు మూలికలతో వంట చేయడం రాదు మూలీ’’ వానర్ అభ్యంతరం చెప్పాడు.
(మెయిన్ విలన్ దుర్యోధన్‌కి, ముగ్గురు మిత్రులకి ముఖాముఖి)
- మళ్లీ రేపు
ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 3monkies.sakshi@gmail.com
లెటర్స్
The characterisation of Swachha was very excellent and her discovering the new words in English is amazing.
- Boga Sandhya (sandhyab1111@gmail.com)
3 మంకీస్‌లో ప్రతి వర్డ్ కామెడీకి ఉపయోగపడేలా రాస్తున్నారు. స్వచ్ఛ పాత్ర ద్వారా చక్కటి కామెడీ పండించారు. సూపర్.
- నరేంద్ర నాయుడు కె. (narendranaidukundavarapu@gmail.com)