త్రీ మంకీస్ - 30 | Daily Serial - crime comedy suspense thriller | Sakshi
Sakshi News home page

త్రీ మంకీస్ - 30

Published Mon, Nov 17 2014 10:44 PM | Last Updated on Sat, Sep 2 2017 4:38 PM

త్రీ మంకీస్ - 30

త్రీ మంకీస్ - 30

డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 30
- మల్లాది వెంకటకృష్ణమూర్తి

 ‘‘అది కాదు. బయటకి రాగానే వచ్చి తీసుకెళ్ళమని నాకు ఎస్సెమ్మెస్ ఇద్దామనే నీ మాటని.’’
 ‘‘మీ తోడన్నాగా.’’
 ‘‘ఆ తోళ్ళు పని చేస్తే నేను ఇప్పటికి తొమ్మిది వందల నలభై ఏడు సార్లు చచ్చేవాడిని. సరే. నువ్వు బయటకి రాగానే నీకు జైలు గుమ్మం బయట స్వాగతం పలికేది నేనే. మాట తప్పావో. ఉస్కో. అంతే. ఏదో ఓ వేలు ఉండదు. జాగ్రత్త.’’
 ‘‘తమరంతటికి తెగించేవారని నాకు తెలుసు. బాకీ ఎగ్గొట్టి చిటికెన వేళ్ళని పోగొట్టుకున్న వారి ఫొటోల మీద నా సంతకాలు తీసుకున్నారుగా.’’
 ‘‘అవును. నేను వసూలు చేేన  పద్ధతిని చట్టరీత్యా నీకు తెలియచేయాల్సిన బాధ్యత నా మీద ఉంది కదా. మధ్య వేలు లేని నీ ఫొటో మీద ఇంకెవరో సంతకం చేేన పరిస్థితిని తెచ్చుకోక. ఖబడ్దార్.’’
 ‘‘అలాగే మార్వాడీ గారు. కాస్తంత నాకు బెయిల్ సహాయం కూడా చేసి అప్పు కట్టుకోండి’’ కపీష్ కోరాడు.
 ఆ ఏభై ఏళ్ళ లావుపాటివాడు తల అడ్డంగా ఊపి, నిశ్శబ్దంగా లేచాడు.
 ‘‘ఇంకాసేపు కూర్చోవచ్చుగా’’ కపీష్ మార్వాడీని రిక్వెస్ట్ చేశాడు.
 ‘‘దేనికి?’’
 ‘‘మీరంటే నాకు ఇష్టం కాబట్టి’’ కపీష్ ఆమెకి వినపడేలా అతనితో చెప్పాడు.
 ‘‘నాకు ఎవరన్నా ఇష్టం లేదు. బాకీలంటేనే ఇష్టం’’ చెప్పి మార్వాడీ వెళ్ళిపోయాడు.
 ‘‘ఆలోచించండి’’ కపీష్ అరిచాడు.
 ‘‘లే’’ గార్డ్ చెప్పాడు.
 ‘‘ఇంకా టైం కాలేదుగా?’’
 ‘‘ఆయన వెళ్ళాక ఇంకెందుకు ఇక్కడ కూర్చోవడం? పద. పద.’’
 కపీష్ అయిష్టంగానే లేచాడు. తన వంక నవ్వుతూ చూస్తున్న ఆమెకి తన చొక్కా మీది నంబర్ని చూపించి లోపలకి వెళ్ళాడు.
 7
 మధ్యాహ్నం జైల్ మెస్‌లో భోజనం అయ్యాక వానర్, పట్టయ్యలు తమ సెల్‌లోకి వచ్చారు.
 ‘‘అంకుల్. అంత్యాక్షరి ఆడదామా?’’ కాసేపాగి వానర్ అడిగాడు.
 ‘‘నీకూ ఆసక్తి ఏర్పడిందన్నమాట?’’
 ‘‘ఇక్కడ చెయ్యడానికి ఇంకేం పని లేదుగా. విసుగ్గా ఉంది.’’
 ‘‘అందుకే మరి జైలు శిక్షని కనిపెట్టింది. నిన్న అంత్యాక్షరి ఎక్కడ ఆగింది? ఆఖరి అక్షరం స కదా?’’ పట్టయ్య అడిగాడు.
 ‘‘గుర్తు లేదు. మళ్ళీ మొదలెడదాం. కాని నిన్నటిలా మెలొడీ పేర పాతచింతకాయ పచ్చడి పాటలు కాదు. ఫాస్ట్ బీట్ గల పాటలైతేనే నాకు ఆసక్తి.’’
 ‘‘మాకూ బీట్ సాంగ్స్ చాలా ఉన్నాయి. మీకే మెలొడీ పాటలు లేవు.’’
 ‘‘బోలెడన్ని ఉన్నాయి. మీకు బీట్ సాంగ్స్ ఉన్నాయంటే నమ్మను.’’
 ‘‘అలాగా? ఐతే ఇది విను. ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా. నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్నా...’’
 ‘‘ఆగండి. నాకు అంత్యాక్షరి రూల్స్ తెలీవనుకోకండి. నిన్న మీరు మొదలెట్టారు. ఇవాళ నేను ఫాఫ్ట్ సాంగ్‌తో మొదలెడతాను.’’
 ‘‘ఉన్నాయంటావా?’’
 ‘‘మీరు ఫాస్ట్ బీట్. నేను రిథమ్... ఆడువారి మాటలకి అర్థాలే వేరులే. అర్థాలే వేరులే. అర్థాలే వేరులే...’’
 ‘‘ఆగాగు. అది మా పాట. మిస్సమ్మ సినిమాలోది. నైన్‌టీన్ ఫిఫ్టీస్ సాంగ్’’ పట్టయ్య అడ్డుపడ్డాడు.
 ‘‘కాదు. ఖుషీ సినిమాలోని పా ఇది.’’
 ‘‘మా పాటని కాపీ కొట్టి కొత్త పాట చేసి ఉంటారు. సరే. వేరులే... ల...’’
 ఆలోచించి పట్టయ్య పాడాడు.
 ‘‘లే. లే. లే. లే.  లే. లే. లే. నా రాజా లే లే నా రాజా.
 లేవనంటావా? నిద్దుర లేపమంటావా? లేలేలే నా రాజా... ఎలా ఉంది బీట్?’’
 ‘‘అదిరింది గురూ. ఇప్పుడు జ తో. జగమంత కుటుంబం నాది. ఏకాకి జీవితం నాది. సంసార సాగరం నాదే. సన్న్యాసం, శూన్యం నావే... నావే. వ’’ వానర్ పాడి చెప్పాడు.
 ‘‘ఇది మెలొడీనే. వయసు కుర్రది. ఒంపులున్నవి. అహ నైసు నైసుగా ఐసు చేస్తది... ఆ..ఆ... వయసు కుర్రది.. దతో మెలొడీ సాంగ్ పాడు.’’
 ‘‘దాయి దాయి దామ్మా. కులికే కుందనాల బొమ్మా. నీపై మనసైందమ్మా. నడిచే నిండు చందమామా...’’
 ‘‘కట్. కట్. ఇది మెలొడీ కాదు. ఫాస్ట్‌సాంగ్. ఇంకోటి పాడు.’’
 ‘‘సరే. ధీర ధీర ధీర మనసాగలేదురా. చేర రార శూర. సొగసందుకో దొర. ర. పాడండి.’’
 ‘‘రంజు బలే రాంచిలకా. రంగేళీ రవ్వల మొలక. అబ్బా దాని సోకు జబ్బల దాకా జాకెట్...’’
 ఆవిధంగా కొంత సాగాక గార్డ్ వచ్చి వారి సెల్ తలుపు తెరుస్తూ వానర్‌తో చెప్పాడు.
 ‘‘డాక్టరమ్మ నిన్ను రమ్మంటోంది.’’
 వానర్ లేచి గార్డ్‌ని అనుసరించాడు. ఇద్దరూ జైలు హాస్పిటల్ విభాగంలోకి వెళ్ళారు. డాక్టర్ మూలిక హుషారుగా ఉంది.
 ‘‘కమాన్ వానర్. కం’’ ఆహ్వానించి గార్డ్‌తో చెప్పింది.
 ‘‘నువ్వు బయట ఉండు.’’
 అతన్ని మళ్ళీ ఎగ్జామినేషన్ టేబిల్ మీద పడుకోబెట్టి నఖశిఖ పర్యంతం పరీక్షించసాగింది.
 
 - మళ్లీ  రేపు
 
 ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్,  సాక్షి ఫ్యామిలీ, సాక్షి  టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 3monkies.sakshi@gmail.com

 
 లెటర్స్

* నాకు మల్లాది గారి నవలలు అంటే చాలా ఇష్టం. చాలా కాలానికి మళ్లీ వారి నవల చదివే అవకాశాన్ని కల్పించిన సాక్షి దినపత్రికకు ధన్యవాదాలు.
 - కనకం స్వామి, కరీంనగర్
 
* సో నైస్ సర్. నేను బాగా ఇంట్రస్టింగ్‌గా ఫాలో అవుతున్నాను.
     థ్యాంక్స్ టు సాక్షి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement