త్రీమంకీస్ - 25 | malladi special story | Sakshi
Sakshi News home page

త్రీమంకీస్ - 25

Published Wed, Nov 12 2014 10:54 PM | Last Updated on Sat, Sep 2 2017 4:20 PM

త్రీమంకీస్ - 25

త్రీమంకీస్ - 25

 డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 25
 
 - మల్లాది వెంకటకృష్ణమూర్తి
 
‘‘తేలిక. ఎఫ్‌బీలో నీకన్నా అతను నాకు ఎక్కువ లైకులు పెట్టాడు.’’
ప్రశ్నార్థక మొహం పెట్టిన వానర్ కాసేపు మాట్లాడలేకపోయాడు.
‘‘నేను అన్నిటికీ లైక్స్ పెట్టానే. అసలు అందుకే అరగంటకోసారి అందులోకి వెళ్ళే వాడిని.’’
‘‘కాని అన్నిసార్లు కాదు. క్రితం అగస్టు మూడున నేను పెట్టిన మా అక్క ఆఖరి కూతురు డైపర్ ఫొటోకి నువ్వు లైక్ పెట్టలేదు.’’
‘‘ఛ! తాగేప్పుడు అది గుర్తు చేయక. అలాంటి వాటికి ఎవరైనా లైక్స్ పెడతారా?’’ వానర్ ఆశ్చర్యంగా అడిగాడు.
‘‘మిస్టర్ రెయిన్ పెట్టాడు. ఇంకా...’’
‘‘ఆ తర్వాతది చెప్పక. నిజమే. అలాంటి వాటికి నేను లైక్స్ పెట్టలేను.’’
‘‘నాకు సంబంధించిన అన్నిటినీ నువ్వు లైక్ చేస్తేనే నీకు నా మీద హండ్రెడ్ పర్సెంట్ ప్రేమ ఉన్నట్లు. నీది తొంభై ఎనిమిది శాతం. అతనిది నూటొక్క శాతం.’’
‘‘ఒక్క శాతం ఎలా పెరిగింది?’’
‘‘అతను నా పోస్ట్ట్‌లని అన్నిటినీ షేర్ చేసేవాడు. నువ్వు చేయలేదు.’’
‘‘షేర్ చేయడం అంటే?’’
ఆమె వివరించాక ఫిర్యాదుగా చెప్పాడు - ‘‘మొదటి రోజు నువ్వు దాని గురించి నాకు చెప్పలేదు.’’    
‘‘నీ ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ చేసిన రోజు ఏం చెప్పానో గుర్తుందా? పెళ్ళి చూపులు అంటూ ప్రత్యేకంగా ఉండవు. ఫేస్‌బుక్‌లోనే ఇప్పుడు అన్నీ అయిపోతున్నాయి. ఐ డోంట్ లైక్ యు. బై.’’
‘‘మరేం ఫర్వాలేదు. నేను నేనే కాని నా ఎఫ్‌బి స్టేటస్‌ని కానుగా’’ అవమానాన్ని దిగమింగుకుంటూ వానర్ చెప్పాడు.
‘‘గతం గతః. స్వస్థి’’ లేచి వెళ్ళిపోయింది.
ఆమె తన ఎకౌంట్‌లోని ఫ్రెండ్స్ లిస్ట్‌లోంచి, అంటే తన జీవితంలోంచి వానర్‌ని తొలగించేసింది.
   
మిత్రులు ఇద్దరూ బాధతో కూడిన మౌనంతో నవ్వుతున్న వానర్ వంక చూశారు.
‘‘దేనికి నవ్వుతున్నావు? తేరుకున్నావా?’’ మర్కట్ అడిగాడు.
‘‘ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? వర్షిష్‌కి కూడా ఆమె స్వస్థి చెప్పేసింది.’’ ఆనందంగా చెప్పాడు.
‘‘ఏదీ? మిస్టర్ రెయిన్‌కి?’’ మర్కట్ అడిగాడు.
‘‘అవును.’’
‘‘ఎందుకు?’’
‘‘మళ్ళీ ఫేస్‌బుక్కే కారణం.’’
‘‘ఏం జరిగిందేమిటి?’’ కపీష్ అడిగాడు.
‘‘అతను లూప్ లైన్లో ఓ అమ్మాయితో ఫ్రెండ్‌షిప్ చేశాడు. ఆమె వర్షిష్‌తో కలిసి తీసుకున్న సెల్ఫీని తన ఫేస్‌బుక్‌లో పెట్టి వర్షిష్‌కి షేర్ చేసింది. అది చూసిన సీతా హరిహరన్ భగ్గుమంది.’’
‘‘నేనే వర్షిష్ గాడ్నయితే, ‘అపార్థం, ఆమె నా కజిన్’ అనేవాడ్ని’’ మర్కట్ చెప్పాడు.
‘‘వర్షిష్ గాడు కూడా సరిగ్గా అదే అన్నాడు. కాని సీత నమ్మలేదు.’’
‘‘ఏం?’’
 ‘‘ఆ అమ్మాయి ఎవరో కాదు...’’
 ‘‘అర్థమైంది. సీత కజిన్.’’
 ‘‘కాదు. స్వంత చెల్లెలు. దాంతో మొత్తం సత్యనాష్ అయిపోయింది.’’
 ‘‘నీకెలా తెలిసింది? వర్షిష్ నీ ఫ్రెండా?’’ కపీష్ అడిగాడు.

 ‘‘కాదు. సీత మళ్ళీ నా దగ్గరకి వచ్చి జరిగింది చెప్పి, నేను సెకండ్ బెస్ట్ కాబట్టి పూర్వంలా కాఫీడేకి వెళ్దాం అని పిలిచింది. బ్రదర్స్. ప్రేమ ఓ ఉన్మాదం. అందులో పడితే ఇంక మనం ప్రేమించిన అమ్మాయి తప్ప ఇంకేదీ కనపడదు. ప్రపంచం, తల్లితండ్రులు. ఏదీ. ఆ ఉన్మాదంలోనే కిరోసిన్ పోసికాల్చుకుంటారు. ఏసిడ్‌ని చల్లుతారు. నేనా ఉన్మాదంలోంచి బయట పడ్డాను కాబట్టి కాఫీడే షాప్‌లో ఆమె కోసం నేను పూర్వం ఖర్చు చేసిందంతా ఇస్తే సరే అన్నాను. కాని తను దుబారా ఖర్చులు చేయనంది. నేను రెట్టిస్తే ఊహు. సీతా హరిహరన్ చర్మం మన చర్మం కన్నా బాగా దళసరి. పెళ్ళయ్యాక జీతంలోంచి ఇస్తానంది. కటీఫ్ చెప్పేశాను.’’

‘‘మంచి పని చేశావు’’ కపీష్ మెచ్చుకున్నాడు.
‘‘ఫేస్‌బుక్, జైలు ఒకటే. వాటికి గల తేడా అల్లా, రెండింటికీ చుట్టూ మాట్లాడటానికి ఎవరూ ఉండరు. ఫేస్‌బుక్‌లో మాత్రం గోడల మీద ఏది తోస్తే అది రాసేస్తూండచ్చు.’’
 ‘‘నీ మాటేంటి?’’ మర్కట్ కపీష్‌ని అడిగాడు.
 కపీష్ చిన్నగా నిట్టూర్చాడు.    
 ‘‘అదో విషాదగాథ’’ చెప్పాడు.
 ‘‘ఏం విషాదగాథ గురూ?’’ మర్కట్ ఆసక్తిగా అడిగాడు.
 ‘‘నీదీ మా ప్రేమలా ఎలా విషాదాంతం అయిందో చెప్పు గురూ?’’ వానర్ కూడా అడిగాడు.
 ‘‘నాకు స్వచ్ఛతో పరిచయం అయింది సూపర్ బజార్లోని బాత్‌రూం క్లీనింగ్ వస్తువుల షెల్ఫ్ దగ్గర.’’
 అతను చెప్పేది మిత్రులు ఇద్దరూ వినసాగారు.
   
 (మోమోస్ అంటే ఏమిటి?)
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement