త్రీమంకీస్ - 59 | malladi special story | Sakshi
Sakshi News home page

త్రీమంకీస్ - 59

Published Tue, Dec 16 2014 11:35 PM | Last Updated on Sat, Sep 2 2017 6:16 PM

త్రీమంకీస్ - 59

త్రీమంకీస్ - 59

డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 59
 
- మల్లాది వెంకటకృష్ణమూర్తి
 
 టీ పాయ్ మీద ఎక్కిన మర్కట్ వాటి వంక భయంగా చూస్తూ అడిగాడు - ‘‘డేడ్? నేనా? వాటికా?’’
 ‘‘అవును. నేను వాటికి మమ్ అయినప్పుడు నువ్వు డేడ్ అవుతావు కదా?’’
 వైతరణి వాటిని ప్రేమగా మందలించి, అతని భయాన్ని చూసి నవ్వి చెప్పింది.
 ‘‘అవి డేడీని ఏం చేయవు.’’
 కాసేపటికి అవి సర్దుకున్నాయి. సోఫా మీద కూర్చుని ఆమె వాటిని కాసేపు ముద్దు చేస్తూంటే ఎదురుగా ఉన్న సోఫా మీద కాళ్ళు ముడుచుకుని కూర్చున్న మర్కట్, అవి తమ జీవితాల్లో లేకపోతే వాటి స్థానంలో తను ఉండి ఉండేవాడని అనుకున్నాడు.
 ‘‘క్లింటన్ తల్లికి ఆడీ కారు అలవాటు. ఇండికా లాంటివి ఎక్కదు. దీన్ని నాకు అమ్మినవాడు పవన్ కళ్యాణ్‌కి, మహేష్ బాబుకి, అనుష్కకి కూడా కుక్కల్ని అమ్మాడు. నాగార్జున పెంచే కుక్కే దీని తల్లిని క్రాస్ చేసింది. అది తమన్నా కుక్క. అంటే దీని తల్లి తమన్నా ఇంట్లో, తండ్రి నాగార్జున ఇంట్లో ఉన్నాయి. వీడి పిన్ని బాలకృష్ణతో ఏక్ట్ చేసింది. అసలు దీని ముత్తాతని ఎస్‌వి రంగారావు ఐర్లండ్ నించి తెప్పించాడు. కుక్కల్ని ప్రేమించే వారు చరిత్రలో ఎందరో. హిజ్ మాస్టర్స్ వాయిస్ గ్రామఫోన్ రికార్డ్ కంపెనీకి ఆ పేరు, ఆ లోగో ఎందుకు వచ్చాయో తెలుసా? దాని యజమాని పాడుతూంటే ఆ కుక్క చెవులు రిక్కించుకుని వినేది. అందుకని అలా వినే కుక్కనే లోగోగా చేశారు’’ వైతరణి వాటిని ముద్దాడుతూ చెప్పింది.
 ఓ కుక్క బొమ్మ, కింద ‘ఆల్ మెన్ ఆర్ ఈక్వల్ బిఫోర్ డాగ్స్’ అనే పోస్టర్ కనిపించింది.
 ‘‘ఈ ఫొటోలోని కుక్క మీ కుక్క కాదనుకుంటా?’’ మర్కట్ అడిగాడు.
 ‘‘కాదు. తోడికోడళ్ళు చూశారా?’’
 ‘‘సినిమానా? లేదు.’’
 ‘‘నాగచైతన్య నానమ్మ ఆ సినిమాని తీసింది. అందులో అది నటించింది. నేను దాని ఫేన్‌ని. ఈ రెండో ఫొటో టిన్ టిన్ అని హాలీవుడ్‌లో ముప్ఫై రెండు సినిమాల్లో నటించింది. ఇది పోయినప్పుడు అమెరికన్స్ అంతా కంటతడిపెట్టారు’’ వైతరణి చెప్పింది.
 ‘‘ఇది?’’
 ‘‘తెలీదా? లైకా. అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి జీవి. కుక్కనే ఎందుకు పంపారంటే అది మనిషి కన్నా తెలివి గలది కాబట్టి.’’
 ‘‘ఇది ఎక్స్‌ట్రా చేసి చెప్పడం’’ మనిషి కాబట్టి మర్కట్ అభ్యంతరం చెప్పాడు.
 ‘‘లేకపోతే డిటెక్టివ్‌లు, పోలీసులు దొంగల్ని పట్టుకోడానికి కుక్కల సహాయమే దేనికి తీసుకుంటారు? హైద్రాబాద్ డాగ్స్ క్లబ్‌కి బుష్ ప్రెసిడెంట్. దానికి హిందీ పాటలంటే ఇష్టం. ‘బెనారసివాలా’ పాటకి డేన్స్ చేస్తుంది. ఈ మధ్య రెహమాన్ వచ్చాక తెలుగు పాటలని లైక్ చేస్తోంది. ఓసారి నా ఉంగరం ఎక్కడో పడిపోతే ఇల్లంతా వెతుకుతున్నాను. క్లింటన్ కిందకి పరిగెత్తి అక్కడ నించి మొరగసాగాడు. వెళ్ళి చూద్దును కదా, వాడు నిలబడ్డ క్రోటన్ మొక్క కింద ఉంగరం కనిపించింది. వాడు మనుషుల భావాల్ని ఇట్టే పట్టేస్తాడు. కాబట్టి వాడిని కుక్క అంటే చిన్న బుచ్చుకుంటాడు.’’
 ‘‘దానికి మన తెలుగు అర్థం అవుతుందన్నమాట.’’
 ‘‘అది కాదు. వాడు. అవును. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ప్రతీది అర్థం అవుతుంది. కుక్కల వల్ల మనుషుల మధ్య స్నేహం ఏర్పడుతుందని తెలుసా? బుష్ వల్ల నాకో ఐపిఎస్ ఆఫీసర్ భార్య, సినిమాల్లో ఫైట్ మాస్టర్ సన్నిహితులైపోయారు.’’
 ‘‘కుక్క ఫ్రెండ్స్ అన్నమాట.’’
 ‘‘అవును. వాళ్ళు రోజూ కుక్కల్ని వాకింగ్‌కి తీసుకువచ్చే టైంలోనే నేనూ వెళ్తూంటాను. అలా పరిచయం.’’
 గొప్ప వారి కుక్క ఏనుగు కన్నా బలమైంది అనే సామెత ఎలా వచ్చిందో మర్కట్‌కి బోధ పడింది. బుష్ మర్కట్‌ని చూసినప్పుడల్లా మొరుగుతూనే ఉంది.
 ‘‘అసలు మీకు కుక్కని పెంచుకోవాలనే ఆలోచన ఎలా కలిగింది?’’ మర్కట్ అడిగాడు.
 ‘‘గుర్రం, కుక్క ఉన్న సినిమాలకే నా చిన్నప్పుడు వెళ్ళేదాన్ని. గుర్రాన్ని పెంచుకోవడం కష్టం అని కుక్కని కొన్నాను. కాని కుక్కని సరైన ఎంపిక చేశానని ఇప్పుడు అర్థమైంది. ఓసారి మా బుష్ ఏం చేసిందో తెలుసా?..’’
 ఆ సంభాషణ తర్వాత మర్కట్ ఆమెకి మనసులోనే గుడ్ బై చెప్పేశాడు. ఆమె క్లింటన్, బుష్‌లకి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుందని తెలిశాక మర్కట్ తనని తప్ప కుక్కలని ప్రేమించే భార్య లేదా ప్రియురాలు వద్దనే నిర్ణయం తీసుకున్నాడు.
 ‘‘ఇది ఐ ఫోన్ 9’’ బెడ్ రూంలో వైతరణి చెప్పింది.
 ‘‘అదేమిటి? ఐ ఫోన్ 6 మాత్రమేగా వచ్చిందిగా?’’
 ‘‘దీన్ని తలకిందులుగా పట్టుకున్నానని నువ్వు గమనించలేదు. నా మొత్తం సేవింగ్స్ అంతా ఈ ఫోన్‌కి ఖర్చవగా ఇంకా క్రెడిట్ కార్డ్ కంపెనీకి నేను రేపటిలోగా పాతిక వేలు కట్టాలి.’’
 ‘నా బొంద. ఇంక నిన్ను అప్పేం అడుగుతాను? ఇక మిగిలింది వానర్. వాడు సాధించచ్చు’ మర్కట్ మనసులో అనుకున్నాడు.
 
 వానర్‌కు డాక్టర్ మూలిక చెప్పిన ప్రేమను వ్యక్తం చేసే పద్ధతి ఏది?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement