త్రీమంకీస్ - 66 | malladi special | Sakshi
Sakshi News home page

త్రీమంకీస్ - 66

Published Tue, Dec 23 2014 11:31 PM | Last Updated on Sat, Sep 2 2017 6:38 PM

త్రీమంకీస్ - 66

త్రీమంకీస్ - 66

డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 66
 
 - మల్లాది వెంకటకృష్ణమూర్తి
 
‘‘పని మీద వెళ్ళేప్పుడు శవం ఎదురు రావడం మంచి శకునం అని మా నానమ్మ చెప్పేది’’ వానర్ ఉత్సాహంగా చెప్పాడు.
 ముందుగా ముగ్గురూ మేక్‌డోనాల్డ్స్ రెస్టారెంట్‌కి వెళ్ళారు.
 ‘‘మేక్‌వెజీ ట్విస్ట్ తొంభై నాలుగు రూపాయలా? కాస్ట్లీ. దీంతో చక్కటి ఉల్లి రవ్వ దోసె, ఇంకా చిల్లర వచ్చేవి’’ బిల్ చూసి వానర్ అసంతృప్తిగా చెప్పాడు.
 ‘‘ఇప్పుడు కాస్ట్‌లీ అనిపిస్తుంది. మరికొన్ని గంటల్లో మనం ధనవంతులయ్యాక తొంభై నాలుగేనా అనిపిస్తుంది. అప్పుడు కూడా డబ్బుండీ లేని వాళ్ళల్లా పిసినారిగా ఉంటే అది నీ ఖర్మ’’ కపీష్ చెప్పాడు.
 ‘‘ఏమాటకామాట చెప్పాలి. తొంభై నాలుగైనా రుచి బావుంది’’ వానర్ చెప్పాడు.
 ‘‘ఇక్కడ విందు ముగిశాక కారుని దొంగిలించాలి.’’
 ‘‘చదువుకునే రోజుల్లో మనకి గది అద్దెకి ఇచ్చినాయన కారుందిగా? ఆయన దాన్ని షో కోసం కొన్నాడు. ఇంట్లోనే వదిలి ఆఫీసుకి మోటార్ సైకిల్ మీద వెళ్తూంటాడు కదా?’’ మర్కట్ గుర్తు చేశాడు.
 ‘‘అవును. నేనూ అదే అనుకున్నాను’’ కపీష్ చెప్పాడు.
 ‘‘నేను కూడా. మేథావులు ఒకేలా ఆలోచిస్తారంటే ఇదే’’ వానర్ కూడా చెప్పాడు.
 ‘‘ఇప్పుడు మనం ఒన్ సర్కిల్ టు సర్కిల్ హాఫ్ సర్కిల్ ఏ. ఒన్ సర్కిల్ టు సర్కిల్ రెక్టాంగిల్ ఏ తాగుదామా?’’ వానర్ చెప్పాడు.
 కోక్ గ్లాసులని తాకించి ముగ్గురూ ఛీర్స్ చెప్పుకున్నారు.
 ముగ్గురూ అనుకున్నట్లుగా ఎలాంటి ఇబ్బందీ లేకుండా తమ పాత ఇంటి యజమాని కారుని దొంగిలించాక దాంట్లో రాణిగంజ్‌కి వెళ్ళి నాలుగైదు దుకాణాలు తిరిగి వర్కింగ్ కండిషన్‌లో ఉన్న ఎలక్ట్రిక్ డ్రిల్‌ని, ఇతర పరికరాలని కొన్నారు. వారు సంపాదించిన డబ్బు బొటాబొటీగా సరిపోయింది.
 బయటకి వచ్చాక కపీష్ చెప్పాడు.
 ‘‘ఇప్పుడు మనకి కావలసింది కారులో పది లీటర్ల డీజిల్‌ని నింపడం.’’
 ‘‘దానికన్నా ముందు మనకి బియ్యం సంచీలు కావాలి’’ వానర్ చెప్పాడు.
 ‘‘దేనికి?’’ కపీష్ ఆశ్చర్యంగా అడిగాడు.
 ‘‘వాటిలో డబ్బు నింపుకోడానికి.’’
 ‘‘ఖాళీ సంచీలని చెప్పవే?’’ మర్కట్ విసుక్కున్నాడు.
 ఇంకో అరగంటలోనే వారు ఆ సొరంగంలోకి ప్రవేశించేది.
20
 కారుని మర్కట్ డ్రైవ్ చేశాడు. దాన్ని ఓ చోట పార్క్ చేశాక ముగ్గురూ ఖాళీ బియ్యం సంచులతో, అందులో కావాల్సిన పరికరాలతో రైట్ టైం వాచీల దుకాణం దగ్గరకి వెళ్ళి అటు, ఇటూ చూసి కిటికీ తలుపుని తెరిచి అందులోకి దూకారు. మళ్ళీ కిటికీని మూసేశారు. లోపల ఖాళీ కౌంటర్లు బోసిపోతున్నాయి. సరాసరి కిటీకి పక్కన నేల మీద ఉన్న సొరంగం ఉందని కపీష్ నమ్మిన చోట కాలితో కింద పరచిన కార్పెట్‌ని కొద్దిగా పక్కకి తొలగించి, బూటు కాలితో కొట్టాడు. శబ్దం బోలుగా వినిపించింది.
 ‘‘డెప్త్ టెస్టర్ అబద్ధం ఆడలేదు’’ కపీష్ తృప్తిగా చెప్పాడు.
 దాని మీద ఉన్న వెట్రిఫైడ్ రాతిని తొలగించాడు. కింద కంత కనిపించింది. చీకటి. బియ్యం బస్తాలోంచి టార్చ్ లైట్‌ని తీసి లోపలకి ప్రసరింప చేసి చెప్పాడు.
 ‘‘ముందు నేను వెళ్తాను. వెనక మీరు రండి. ఆఖరుగా వచ్చే నువ్వు రాతిని మళ్ళీ యథాస్థానంలో ఉంచు’’ వానర్‌కి సూచించాడు.
 ‘‘సరే.’’
 ‘‘గుడ్ లక్ టు అజ్’’ చెప్పి కపీష్ సొరంగంలోకి దిగాడు. టార్చి వెలుగులో ముందుకి పాకసాగాడు. అది జైల్లోని సొరంగం కన్నా కొద్దిగా విశాలంగా ఉంది. జైల్లో లభించిన తక్కువ పరికరాలతోనే వాళ్ళు తవ్వడం వల్ల ఆ తేడా అనుకున్నాడు. వెనకాల నించి మర్కట్, వానర్‌ల మాటలు అతనికి వినిపించాయి.
 సొరంగం చివర కపీష్ తల పెకైత్తి పరిశీలించి అప్పటికే బేంక్ స్ట్రాంగ్ రూమ్ నేల మీది కాంక్రీట్ చాలా భాగం చెక్కేసి ఉండటం గమనించాడు. కపీష్ వెనకాల సొరంగంలో బోర్లా పడుకున్న మర్కట్, వానర్లకి బేటరీతో ఆపరేట్ చేసే ఎలక్ట్రానిక్ డ్రిల్ శబ్దం వినపడసాగింది. ఆ శబ్దాన్ని వినలేక ఇద్దరూ చెవులు మూసుకున్నారు. ఆ పరికరంతో సొరంగం మీది మిగిలిన కాంక్రీట్‌ని గుండ్రంగా మనిషి పట్టేంత మేరకి చెక్కసాగాడు. అరగంటలో పైనించి సన్నటి వెలుగు రేఖ సొరంగంలోకి పడింది.
   
 దాదాపు గంట తర్వాత సిమెంట్‌తో మట్టి కొట్టుకుపోయిన కపీష్ తను చేసిన రంధ్రంలోంచి తలని పైకి తీసుకెళ్ళి చూశాడు. అనేక కాళ్ళు కనపడ్డాయి. చాలామంది దాని చుట్టూ నిలబడి ఒంగొని తన వంకే చూడటం గమనించాడు. వారిలోని ఒకరు కపీష్‌కి చేతిని అందించి పైకి లాగాడు. తర్వాత మిగిలిన ఇద్దర్నీ కూడా. కపీష్ ఎడం చేతిలోని సుత్తి, టార్చ్ లైట్‌ని ఇంకొకరు అందుకున్నారు.
 కపీష్ చుట్టూ చూశాడు. అది బేంక్ స్ట్రాంగ్ రూమే.
 ఇన్‌షర్ట్ వేసుకుని టై ధరించిన ఓ ఏభై ఏళ్ళ వ్యక్తి కపీష్‌తో కరచాలనం చేస్తూ చెప్పాడు.
 ‘‘ప్రుడెన్షియల్ బేంక్ మేనేజర్ వెల్‌కమ్స్ సిఐడి పోలీస్’’
 ‘‘మేము పోలీసులం కాము’’ మర్కట్ చెప్పాడు.
 ‘‘నిజానికి దొంగతనానికి వచ్చిన వాళ్ళం’’ వానర్ చెప్పాడు.
 
 (ముగ్గురు మిత్రులు వచ్చిన బేంక్‌లో
 అప్పటికే దొంగలు ఉన్నారా?)
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement