త్రీమంకీస్ - 67 | malladi special story | Sakshi
Sakshi News home page

త్రీమంకీస్ - 67

Published Wed, Dec 24 2014 11:21 PM | Last Updated on Sat, Aug 11 2018 8:21 PM

త్రీమంకీస్ - 67 - Sakshi

త్రీమంకీస్ - 67

డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 67
 

 - మల్లాది వెంకటకృష్ణమూర్తి
 
‘‘మేము సిఐడి సీరియల్ చూస్తున్నాం. సిఐడిలకి యూనిఫారాలు ఉండవని మాకు తెలుసు. నేనీ బేంక్ మేనేజర్ని. నా పేరు హేమాంబరధరరావు’’ టై కట్టుకున్నతను చెప్పాడు.
 ‘‘సిఐడిలు ఎవరూ తాము సిఐడిలమని చెప్పరు. మీరు దొంగలని చెప్పడం మంచి జోక్. నేను అసిస్టెంట్ మేనేజర్ పుండరీకాక్షయ్యని. మీకు ఆహ్వానం పలకడం మాకు ఆనందంగా ఉంది.’’
 ‘‘అవును. నిజానికి దొంగలు పక్క గదిలో ఉన్నారు’’ ఓ లేడీ క్లర్క్ చెప్పింది.
 ‘‘ఎంతమంది?’’ కపీష్ పరిస్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ అడిగాడు.
 ‘‘ఆరుగురు. మమ్మల్ని ఈ గదిలో బంధించారు. వాళ్ళ దగ్గర తుపాకులు ఉన్నాయి’’ పుండరీకాక్షయ్య చెప్పాడు.
 ‘‘తుపాకులే?’’ కపీష్ ఆశ్చర్యంగా అడిగాడు.
 ‘‘అవును.’’
 ‘‘ఐతే పెద్ద దొంగలే అయి ఉంటారు.’’
 చేతిలో కెటిల్, డిస్పోజబుల్ గ్లాసులు ఉన్న ఓ కుర్రాడు ముగ్గురికీ టీని వంచి ఇచ్చాడు.
 ‘‘నువ్వెక్కడి నించి వచ్చావు?’’ వానర్ అడిగాడు.
 ‘‘స్టాఫ్‌కి టీ ఇవ్వడానికి వచ్చాను. దొంగలు నన్ను మళ్ళీ బయటకి వెళ్ళనివ్వలేదు. చల్లారకుండా టీని అమ్ముదామని.’’
 ‘‘కోక్ లేదా?’’ వానర్ అడిగాడు.
 ‘‘షాపులో ఛిల్లర్‌లో ఉంది. నన్ను బయటకి వెళ్ళనిస్తే తెస్తాను’’ వాడు చెప్పాడు.
 ‘‘అది కుదిరే పని కాదు. మొత్తం మీరు ఎంతమంది ఉన్నారు?’’ మేనేజర్ టీ తాగే కపీష్‌ని అడిగాడు.
 ‘‘ముగ్గురమే’’ మర్కట్ చెప్పాడు.
 ‘‘ఇక్కడ కాదు. సొరంగంలో ఇంకా ఎంతమంది ఉన్నారు అన్నది నా ప్రశ్న.’’
 ‘‘సొరంగం ఖాళీ.’’
 ‘‘మీ వెంట తుపాకులు తీసుకురాలేదే?’’ అసిస్టెంట్ మేనేజర్ ప్రశ్నించాడు.
 ‘‘దేనికి?’’ వానర్ అడిగాడు.
 ‘‘మా బేంక్ మీద దొంగలు దాడి చేశారనేగా మీరు మమ్మల్ని రక్షించి వారిని పట్టుకోడానికి రహస్యంగా సొరంగం తవ్వి వచ్చింది?’’
 ‘‘అవును’’ కపీష్ తన మిత్రులు ఇద్దరి వంకా అర్థవంతంగా చూస్తూ చెప్పాడు.
 ‘‘అవునవును’’ ఇద్దరూ వత్తాసు పలికారు.
 ‘‘మరి వారిని పట్టుకోడానికి తుపాకులు అవసరం కదా? అసలు మీరు నిజంగా పోలీసులేనా?’’ అసిస్టెంట్ మేనేజర్ అడిగాడు.
 ‘‘పూర్తిగా. నేను సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌ని. వీరిద్దరూ సబ్ ఇన్‌స్పెక్టర్లు’’ వెంటనే కపీష్ చెప్పాడు.
 ‘‘మీ పేరు?’’
 ‘‘క... కష్. ఇతను ఎస్సై మట్. ఇతను ఎస్సై వార్.’’
 ‘‘అలాంటి పేర్లు కూడా పెట్టుకుంటారా?’’
 ‘‘మేము ఆంగ్లోఇండియన్ సంతతికి చెందిన నాలుగో జెనరేషన్ వాళ్ళం.’’
 ‘‘నేను కలకత్తా బ్రాంచ్‌లో పని చేశాను. కాని ఆంగ్లోఇండియన్స్‌కి ఇలాంటి పేర్లు ఉంటాయని తెలీదు’’ అసిస్టెంట్ మేనేజర్ చెప్పాడు.
 ‘‘ఇప్పుడు మీకు తెలిసింది’’ వానర్ చెప్పాడు.
 ‘‘మీ దగ్గర కనీసం కత్తులైనా ఉన్నాయా?’’
 ‘‘లేవు. మేము హోస్టేజ్ రెస్క్యూ టీంకి చెందినవాళ్ళం. అంటే బాధితుల్ని రక్షించే బృందమని అర్థం. తుపాకులు పేలడం మాకు ఇష్టం ఉండదు. అందువల్ల బాధితులకి ప్రమాదం’’ కపీష్ చెప్పాడు.
 ‘‘ఐతే మీది సూక్ష్మబుద్ధి కావచ్చు. కాని అవి ఉంటే రక్షించడం ఎక్కువ తేలిక అయ్యేదేమో?’’ పుండరీకాక్షయ్య అసంతృప్తిగా చెప్పాడు.
 ‘‘మనం ఇప్పుడు ఓ లైన్‌లో సొరంగం ముందు క్యూలో నిలబడి అందులోకి దిగుదాం’’ మేనేజర్ చెప్పాడు.
 ‘‘అవును. ముందు మిమ్మల్ని రక్షించి తీసుకెళ్తాం. తర్వాత వాళ్ళ సంగతి చూడటానికి తుపాకులతో మామూలు పోలీసులు వస్తారు. పదండి’’ కపీష్ చెప్పాడు.
 లేడీ క్లర్క్ కపీష్ మొహాన్ని తన చున్నీతో సిమెంట్ పోయేలా శుభ్రంగా తుడిచింది. తర్వాత అడిగింది.
 ‘‘మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుంది?’’
 ‘‘ఇంజనీరింగ్ కాలేజీలో చూసి ఉంటారు.’’
 ‘‘అక్కడ కాదు.’’
 ‘‘ఐతే జైల్లో చూసి ఉంటారు’’ వానర్ చెప్పాడు.
 ‘‘మేం ఖైదీలని అప్పగించడానికి నిన్న జైలుకి వెళ్ళాం’’ కపీష్ వెంటనే వానర్ కాలు తొక్కుతూ చెప్పాడు.
 ‘‘కాదు. ఫొటో చూశాను’’ ఆమె మళ్ళీ చెప్పింది.
 ‘‘ఫేస్‌బుక్‌లో చూసి ఉంటారు.’’
 ‘‘నాకు ఎఫ్‌బి లేదు. ఇంకెక్కడో చూశాను.’’
 ‘‘గుర్తు తెచ్చుకోండి’’ మేనేజర్ చెప్పాడు.
 ‘టీవీలో’ అని అంటుందని ముగ్గురు మిత్రులూ భయపడ్డారు. కాని ఆమె ఇలా చెప్పింది.
 ‘‘గుర్తు రావడం లేదు. బహుశ ఇంజనీరింగ్ కాలేజీలోనే చూశానేమో?’’
 ‘‘వాళ్ళొస్తున్నారు’’ అంతదాకా వారికి దూరంగా లాకర్ రూం తలుపు దగ్గర నిలబడ్డ ప్యూన్ గుసగుసలాడుతున్నట్లుగా చెప్పాడు.
 వెంటనే అక్కడి నలుగురు భయంగా కదిలారు. వారు సొరంగం రంధ్రం కనపడకుండా దాన్ని కాళ్ళతో కవర్ చేస్తూ నిలబడ్డారు. ముగ్గురు బలిష్టమైన వ్యక్తులు లాకర్ గదిలోకి వచ్చారు. వారందరి మొహాలకి నల్లటి సాక్స్ తొడిగి ఉన్నాయి. ఖాకీ షర్ట్‌లు, పేంట్లు, కేన్వాస్ బూట్లు. ప్రతి వారి చేతిలో సబ్‌మెషీన్ గన్స్ ఉన్నాయి.
 (ముగ్గురు మిత్రులు బేంక్ నుంచి
 ఎలా తప్పించుకున్నారు?)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement