త్రీమంకీస్ - 75 | malladi special story | Sakshi
Sakshi News home page

త్రీమంకీస్ - 75

Published Fri, Jan 2 2015 12:07 AM | Last Updated on Sat, Sep 2 2017 7:04 PM

త్రీమంకీస్ - 75

త్రీమంకీస్ - 75

డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 75
మల్లాది వెంకటకృష్ణమూర్తి
 

 22
 శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ డొమెస్టిక్ డిపార్చర్ లాంజ్ ముందు ఆగిన ఇన్నోవా కారులోంచి ముగ్గురు దిగారు. వారి చేతుల్లో మూడు ఎయిర్‌బేగ్‌లు ఉన్నాయి. ఒంటి మీద ఖరీదైన టీ షర్ట్‌లు, బూట్లు. వానర్ ఆ కొత్త వాతావరణాన్ని కొద్దిగా బెరుకుగా చూస్తూంటే కపీష్, మర్కట్‌లు బింకంగా ఉన్నారు.
 ‘‘పోర్టర్ కావాలా?’’ ఒకతను వచ్చి ఇంగ్లీష్‌లో అడిగాడు.
 ‘‘పెట్టెకి ఎంత?’’ వానర్ అడిగాడు.
 ‘‘మన దగ్గర పెట్టెల్లేనప్పుడు ఎందుకా ప్రశ్న?’’ మర్కట్ కసిరాడు.
 ‘‘తెలుసుకుందామని.’’
 ‘‘ముంబైకి వెళ్ళే విమానం ఎక్కడ ఎక్కాలి?’’ కపీష్ అతన్ని అడిగాడు.
 ‘‘రండి చూపిస్తాను. మీ ఎయిర్ బేగ్స్ ఇవ్వండి’’ అతను వాటిని తీసుకోబోయాడు.
 ‘‘పోర్టర్ అవసరం లేదు.’’
 ‘‘ఆ డోర్‌లోంచి లోపలకి వెళ్ళండి’’ నిర్లక్ష్యంగా చేతినెత్తి చూపించి వెళ్ళిపోయాడు.
 ముగ్గురూ ఓ కాలి వంతెనని దాటి ఎదురుగా ఉన్న అద్దాల తలుపు వైపు నడిచారు. యూనిఫాంలోని పోలీస్ ఆపి అడిగాడు - ‘‘టిక్కెట్, ఐడెంటిటీ ప్లీజ్.’’
 వాళ్ళు టిక్కెట్ ప్రింటవుట్‌ని, ఆధార్ కార్డ్‌ని చూపించారు. అతను కపీష్‌ది మాత్రమే చూసి ముగ్గుర్నీ లోపలకి వదిలాడు. ‘‘పబ్లిక్ టాయ్‌లెట్‌ని ఉపయోగించడానికి ఆధార్ కార్డ్‌ని తప్పనిసరి చేసి తెలంగాణా ప్రభుత్వం మంచి పని చేసింది. లేదా ఆధార్ కార్డులని మనం తీసుకునే వాళ్ళమే కాదు’’ మర్కట్ చెప్పాడు.
 ‘‘భలే గుర్తు చేశావ్. ఎందుకైనా మంచిది. వానర్! నువ్వు ఓసారి బాత్‌రూంకి వెళ్ళి బ్లాడర్‌ని ఖాళీ చేసి రా’’ కపీష్ హెచ్చరించాడు.
 ‘‘అవును. లేదా వాళ్ళు విమానంలోంచి మనల్ని దింపేస్తారు’’ మర్కట్ కూడా దానికి మద్దతుని తెలిపాడు.
 ‘జెంట్స్ రూం’లో వానర్‌కి తన ప్రిన్సిపాల్ తారసపడ్డాడు.
 ‘‘ఏం ఉద్యోగం చేస్తున్నావు? అమెరికాలోనా?’’ ఆయన అడిగాడు.
 ‘‘లేదు సార్. ఇంకా నాకు ఉద్యోగం దొరకలేదు’’ వానర్ జవాబు చెప్పాడు.
 పని కానిచ్చాక వానర్ బయటికి వచ్చాడు. ప్రిన్సిపాల్ కొద్ది క్షణాల తర్వాత బయటికి వచ్చి వ్యంగ్యంగా చెప్పాడు - ‘‘నువ్వు వాష్ బేసిన్‌లో చేతులు కడుక్కోలేదు. కాబట్టి నిరుద్యోగిగానే ఉండిపోయావు. నేను ప్రిన్సిపాల్‌ని కాబట్టి చేతులు కడుక్కుని వచ్చాను.’’
 వానర్ ఏమాత్రం తొట్రుపడకుండా జవాబు చెప్పాడు.
 ‘‘నిరుద్యోగి చేతులు తడవకుండా ఆ పని చేస్తాడు ప్రిన్సిపాల్ గారు.’’
 వాళ్ళు ఓ క్యూలో నిలబడి కౌంటర్ దగ్గరకి వెళ్ళాక టిక్కెట్‌ని చూసి కౌంటర్‌లోని వ్యక్తి చెప్పాడు - ‘‘ఇది స్పైస్‌జెట్ కౌంటర్. మీరు వెళ్ళాల్సింది ఇండిగో. అటు వెళ్ళండి.’’
 ముగ్గురూ మళ్ళీ అక్కడికి వెళ్ళి క్యూలో నిలబడ్డారు. తమ వంతు వచ్చాక తమ టికెట్స్‌ని, తన ఐడెంటిటీ కార్డ్‌ని కపీష్ చూపించాడు. అతని టి షర్ట్ మీది ఇంగ్లీష్ మాటలని అతను చదివాడు.
 ష్! ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్లీపింగ్.
 ‘‘చెకిన్ బేగేజ్ ఉందా?’’ కౌంటర్లోని వ్యక్తి అడిగాడు.
 ‘‘సారీ?’’ అర్థంకాక కపీష్ అడిగాడు.
 అతను ఫస్ట్ ఫ్లయర్ అని గ్రహించిన కౌంటర్లోని వ్యక్తి ముగ్గురి దగ్గరా ఎయిర్ బేగ్స్ మాత్రమే ఉండటం చూసి అడిగాడు.
 ‘‘అవికాక ఇంకేమైనా సామాను ఉందా?’’
 ‘‘లేదు.’’
 మూడు టేగ్స్ ఇచ్చి చెప్పాడు.
 ‘‘వీటిని ఎయిర్ బేగ్స్‌కి కట్టండి. విమానంలోకి ఎక్కే దాకా ఇవి పడిపోకుండా చూసుకోండి... మీ ఐడెంటిటీ కార్డ్స్ చూపిస్తారా?’’ మిగిలిన ఇద్దర్నీ అడిగాడు.
 ‘‘గేట్ దగ్గర ఒక్కరిదే చూశారు?’’
 ‘‘అతను తప్పు చేశాడు. నేనా తప్పు చేయకూడదు.’’
 ఇద్దరూ తమ ఆధార్ కార్డ్‌లని చూపించారు. ముగ్గురి బోర్డింగ్ పాస్‌లని కపీష్‌కి ఇచ్చి, ఓ దాన్లోని బోర్డింగ్ టైం గేట్ నంబర్లని రౌండ్ చేసి చెప్పాడు - ‘‘మీ గేట్ నంబర్ ఇరవై ఒకటి. అటు వెళ్ళాలి. ఎంజాయ్ యువర్ ట్రిప్.’’
 ‘‘థాంక్యూ.’’
 ‘‘యువర్ అటెన్షన్ ప్లీజ్. ఇండిగో ఫ్ల్లైట్ నంబర్ 000 డిపార్టింగ్ టు ముంబై ఈజ్ రెడీ ఫర్ ఇమీడియెట్ డిపార్చర్.’’
 ముగ్గురూ సెక్యూరిటీ చెక్‌లోకి వెళ్ళారు.
 ‘‘బూట్లు విప్పాలి’’ సెక్యూరిటీ అతను చెప్పాడు.
 ‘‘దేనికి? లోపల దేవుడి విగ్రహం ఉందా?’’ వానర్ అడిగాడు.
 ‘‘కాదు. రిచర్డ్ రెయిడ్ అనే అతను బూటులో పేలుడు పదార్థాన్ని పెట్టుకుని వెళ్ళాడు. అప్పటినించి అన్ని బూట్లని స్కానింగ్ చేస్తున్నాం’’ అతను ఓపికగా జవాబు చెప్పాడు.
 ‘‘ఇంకా నయం. రిచర్డ్ రెయిడ్ అండర్‌వేర్‌లో దాన్ని దాచి పెట్టుకుని వెళ్ళలేదు’’ వానర్ వెంటనే చెప్పాడు
 చెకింగ్ అయాక వెళ్ళి తమ గేట్‌లోని కుర్చీల్లో కూర్చున్నారు. ఓ అందమైన అమ్మాయి ఒంటరిగా కూర్చుని సెల్‌ఫోన్‌లో ఎవరితోనో ఛాటింగ్ చేస్తోంది. ఆమె దగ్గరకి వెళ్ళి వానర్ అడిగాడు - ‘‘ఎక్స్‌క్యూజ్‌మి. మీ పక్క సీట్ ఖాళీయేనా?’’
 ‘‘ఖాళీయే. మీరు కూర్చుంటే నా సీట్ కూడా ఖాళీ అవుతుంది’’ చెప్పి ఆమె మళ్ళీ ఛాటింగ్‌లో మునిగిపోయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement