త్రీమంకీస్ - 58 | malladi special story | Sakshi
Sakshi News home page

త్రీమంకీస్ - 58

Published Mon, Dec 15 2014 10:54 PM | Last Updated on Sat, Sep 2 2017 6:13 PM

త్రీమంకీస్ - 58

త్రీమంకీస్ - 58

డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 58
 
 - మల్లాది వెంకటకృష్ణమూర్తి

 
 ‘‘నువ్వే.’’
 ‘‘నా పేరు మర్కట్ అని చెప్పానే?’’
 ‘‘నా ఫ్రెండ్ ‘ర్క’ని కొట్టేసింది’’ ఆమెతో వచ్చిన మూలిక నవ్వుతూ చెప్పింది.
 ‘ఎవరది’ అంటూ లోపల నించి అక్కడికి వచ్చిన కపీష్ వాళ్ళిద్దర్నీ చూసి ఆశ్చర్యపోలేదు. భయపడ్డాడు. లోపల నించి తన వెనకే వచ్చిన రుధిరని అడిగాడు - ‘‘వీళ్ళు మమ్మల్ని పోలీసులకి పట్టిస్తారేమో?’’
 ‘‘ఆ పని ఎప్పటికీ చేయరు. నేను నిన్ను పట్టించానా?’’
 ‘‘మన సంగతి వేరు. మనం మనం ప్రేమించుకుంటున్నాం.’’
 ‘‘అలాగే వీళ్ళూ వీళ్ళూ ప్రేమించుకుంటున్నారు’’ రుధిర చెప్పింది.
 ‘‘కాబట్టి పట్టించం’’ డాక్టర్ మూలిక చెప్పింది.
 ‘‘నువ్వు ఇక్కడ ఉన్నావని మాటమాత్రంగానైనా చెప్పలేదే? మనింటికి పద’’ డాక్టర్ మూలిక వానర్ చేతిని పట్టుకుని లాగింది.
 వైతరణి కూడా మర్కట్ చేతిని పట్టుకుని లాగి చెప్పింది - ‘‘నువ్వు కూడా. నన్ను స్కర్ట్, టాప్‌లలో చూడాలని ఉందన్నావు కదా. చూద్దువు గాని.’’
 ‘‘కాని మేం ముగ్గురం ఒకేచోట ఉండాల్సిన అవసరం ఉంది’’ వానర్ ఇబ్బందిగా కపీష్ వంక చూస్తూ చెప్పాడు.
 ‘‘చూడు మరి’’ డాక్టర్ మూలిక రుధిరతో ఫిర్యాదుగా చెప్పింది.
 ‘‘వెళ్ళండి. ఇది సింగిల్ బెడ్ రూం ఫ్లాట్ అని మీకూ తెలుసుగా? రాత్రి ఏం ఇబ్బంది పడ్డారో, ఏమిటో?’’ రుధిర చెప్పింది.
 ‘‘నువ్వేం మాట్లాడవే?’’ మర్కట్ కపీష్‌ని నిలదీశాడు.
 ‘‘మనం ముగ్గురం ఒకేచోట ఉండాల్సిన అవసరం నాకు పెద్దగా కనిపించడం లేదు. వాళ్ళని మీరు డిజప్పాయింట్ చేయడం మర్యాద కాదు’’ అతను చెప్పాడు.
 ‘‘ఓరి మిత్రద్రోహి!’’ వానర్ అరిచాడు.
 ‘‘ఫ్రెండ్‌షిప్ అంటే అలా ఉండాలి. సెల్‌ఫోన్‌లో ఒకరితో మరొకరు మాట్లాడుకోవచ్చు’’ రుధిర చెప్పింది.
 ‘‘రేపు సాయంత్రం మా ఇంట్లో కిట్టీ పార్టీ ఉంది. పిలవడానికి వచ్చాను’’ మూలిక చెప్పింది.
 ‘‘అలాగే  వస్తాను’’ రుధిర ఒప్పుకుంది.
 వాళ్ళిద్దరూ రుధిరని పక్కకి తీసుకెళ్ళి ‘‘రాత్రి అతనితో అనుభవం ఎలా ఉంది?’’ అనడిగారు.
 ‘‘తేనె కలిపిన లోషన్‌తో అతను నాకు ఎంబామింగ్ చేసినట్లుగా అనిపించింది.’’
 అంతా అక్కడే భోజనాలు చేశాక వెళ్ళబోయే ముందు మూలిక చెప్పింది - ‘‘కమాన్ వార్.’’
 ‘‘నేనా?’’ వానర్ అడిగాడు.
 ‘‘అవును. ఇంక వీళ్ళింట్లో ఎందుకు? మనింటికి వెళ్దాం పద.’’
 ‘‘కాని...’’ మర్కట్ ఏదో చెప్పబోయాడు.
 ‘‘నో కానీలు. నథింగ్. నువ్వు రావాల్సిందే. ఇంక తప్పించుకోలేవు’’ వైతరణి అతని చేతిని పట్టుకుని చెప్పింది.
 ‘‘రేపు మధ్యాహ్నం పన్నెండున్నరకి మేం ఓ చోటికి వెళ్ళే అవసరం ఉంది’’ కపీష్ చెప్పాడు.
 ‘‘అలాగే. భోజనం పెట్టి ఆ టైంకి పంపిస్తాం’’ మూలిక చెప్పింది.
 వాళ్ళిద్దరూ తాము ప్రేమించే ఇద్దరు మగాళ్ళ చేతులు పట్టుకుని లాక్కెళ్ళారు. వాళ్ళు చూడకుండా కపీష్ బొటన వేలుని, చూపుడు వేలిని ఒక దాంతో మరొకటి ముట్టుకుంటూ వాళ్ళని అప్పు అడగమని సైగ చేశాడు.
 18
 వైతరణి నడిపే స్కూటర్ ఆమె ఇంటి అపార్ట్‌మెంట్ పార్కింగ్‌లో ఆగాక వెనక కూర్చున్న మర్కట్ దిగాడు. ఇద్దరూ మెట్లెక్కి ఫస్ట్ ఫ్లోర్‌లోని ఆమె అపార్ట్‌మెంట్‌లోకి చేరుకున్నారు.
 ‘‘ఇదేమిటి? ‘బివేర్ ఆఫ్ మేన్’ అనే బోర్డు పెట్టారు. అంతా బివేర్ ఆఫ్ డాగ్ అనే బోర్డు పెడుతూంటారుగా?’’ దాన్ని చూసి మర్కట్ ఆశ్చర్యంగా అడిగాడు.
 ‘‘కుక్క కన్నా మనిషి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలనే సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వాలని ఈ బోర్డు పెట్టాను. సాక్షిలో ఇది న్యూస్ ఐటెంగా కూడా వచ్చింది. చూళ్ళేదా?’’
 ‘‘చూశాను. గుర్తుంది. మోడీ ఎన్నికల ప్రచా రం హెడ్డింగ్ పక్కన వేశారు’’ ఆమెని సంతోషపెట్టడానికి అబద్ధం ఆడాడు.
 ‘‘ఈ రాత్రి వాతావరణ హెచ్చరిక విన్నావా?’’
 ‘‘లేదే? చలిగా ఉంటుందా?’’
 ‘‘చీకటిగా ఉంటుందిట. కాని నాకు లైట్‌లోనే ఇష్టం.’’
 లోపల నించి కుక్క మొరుగు వినిపించి అడిగాడు - ‘‘మీ ఇంట్లోకి పొరపాటున కుక్క వెళ్ళినట్లుంది.’’
 ‘‘ఫన్నీ! లేదు. అది మన కుక్కే.’’
 ‘‘ఏమిటి? మీరు కుక్కని పెంచుతున్నారా?’’
 ‘‘కుక్కల్ని. రెండు. ఓ ఆడ కుక్క, ఓ మగ కుక్క. తెల్లటి బొచ్చు కుక్కలు.’’
 ‘‘నాకు కుక్కలంటే భయం.’’
 ‘‘క్లింటన్, బుష్‌లు నిన్నేం చేయవు.’’
 ‘‘అవి కుక్కల పేర్లా?’’
 ‘‘అవును. ఇక నించి వాటిని కుక్కలు అనకు. నిన్ను మనిషి అంటే నీకు కోపం రాదూ? పేర్లతో పిలు. లేదా హి, షి అను. నాకు క్లింటన్ విమనైజింగ్ నచ్చక వాడి పేరు, బుష్ ఇరాక్ మీద దాడి చేయడం నచ్చక వాడి పేరు పెట్టాను. అఫ్‌కోర్స్. నేను దానికి బుష్ అనే మగ పేరు పెట్టానని, తను ఆడ కుక్కని ఆమెకి తెలీదు కదా? అందుకని అది ఏం అనుకోదు’’ వైతరణి చెప్పింది.
 తలుపు తీసి లోపలకి వెళ్ళగానే రెండు పమేరియన్ కుక్కలు పరిగెత్తుకుంటూ వచ్చి కొత్త వ్యక్తిని చూసి మొరగసాగాయి.
 ‘‘డోంట్. హి ఈజ్ యువర్ డేడ్. నో క్లింటన్ స్వీటీ. నో బుష్ డార్లింగ్...’’
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement