Markat
-
త్రీమంకీస్ - 58
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 58 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘నువ్వే.’’ ‘‘నా పేరు మర్కట్ అని చెప్పానే?’’ ‘‘నా ఫ్రెండ్ ‘ర్క’ని కొట్టేసింది’’ ఆమెతో వచ్చిన మూలిక నవ్వుతూ చెప్పింది. ‘ఎవరది’ అంటూ లోపల నించి అక్కడికి వచ్చిన కపీష్ వాళ్ళిద్దర్నీ చూసి ఆశ్చర్యపోలేదు. భయపడ్డాడు. లోపల నించి తన వెనకే వచ్చిన రుధిరని అడిగాడు - ‘‘వీళ్ళు మమ్మల్ని పోలీసులకి పట్టిస్తారేమో?’’ ‘‘ఆ పని ఎప్పటికీ చేయరు. నేను నిన్ను పట్టించానా?’’ ‘‘మన సంగతి వేరు. మనం మనం ప్రేమించుకుంటున్నాం.’’ ‘‘అలాగే వీళ్ళూ వీళ్ళూ ప్రేమించుకుంటున్నారు’’ రుధిర చెప్పింది. ‘‘కాబట్టి పట్టించం’’ డాక్టర్ మూలిక చెప్పింది. ‘‘నువ్వు ఇక్కడ ఉన్నావని మాటమాత్రంగానైనా చెప్పలేదే? మనింటికి పద’’ డాక్టర్ మూలిక వానర్ చేతిని పట్టుకుని లాగింది. వైతరణి కూడా మర్కట్ చేతిని పట్టుకుని లాగి చెప్పింది - ‘‘నువ్వు కూడా. నన్ను స్కర్ట్, టాప్లలో చూడాలని ఉందన్నావు కదా. చూద్దువు గాని.’’ ‘‘కాని మేం ముగ్గురం ఒకేచోట ఉండాల్సిన అవసరం ఉంది’’ వానర్ ఇబ్బందిగా కపీష్ వంక చూస్తూ చెప్పాడు. ‘‘చూడు మరి’’ డాక్టర్ మూలిక రుధిరతో ఫిర్యాదుగా చెప్పింది. ‘‘వెళ్ళండి. ఇది సింగిల్ బెడ్ రూం ఫ్లాట్ అని మీకూ తెలుసుగా? రాత్రి ఏం ఇబ్బంది పడ్డారో, ఏమిటో?’’ రుధిర చెప్పింది. ‘‘నువ్వేం మాట్లాడవే?’’ మర్కట్ కపీష్‌ని నిలదీశాడు. ‘‘మనం ముగ్గురం ఒకేచోట ఉండాల్సిన అవసరం నాకు పెద్దగా కనిపించడం లేదు. వాళ్ళని మీరు డిజప్పాయింట్ చేయడం మర్యాద కాదు’’ అతను చెప్పాడు. ‘‘ఓరి మిత్రద్రోహి!’’ వానర్ అరిచాడు. ‘‘ఫ్రెండ్షిప్ అంటే అలా ఉండాలి. సెల్ఫోన్లో ఒకరితో మరొకరు మాట్లాడుకోవచ్చు’’ రుధిర చెప్పింది. ‘‘రేపు సాయంత్రం మా ఇంట్లో కిట్టీ పార్టీ ఉంది. పిలవడానికి వచ్చాను’’ మూలిక చెప్పింది. ‘‘అలాగే వస్తాను’’ రుధిర ఒప్పుకుంది. వాళ్ళిద్దరూ రుధిరని పక్కకి తీసుకెళ్ళి ‘‘రాత్రి అతనితో అనుభవం ఎలా ఉంది?’’ అనడిగారు. ‘‘తేనె కలిపిన లోషన్‌తో అతను నాకు ఎంబామింగ్ చేసినట్లుగా అనిపించింది.’’ అంతా అక్కడే భోజనాలు చేశాక వెళ్ళబోయే ముందు మూలిక చెప్పింది - ‘‘కమాన్ వార్.’’ ‘‘నేనా?’’ వానర్ అడిగాడు. ‘‘అవును. ఇంక వీళ్ళింట్లో ఎందుకు? మనింటికి వెళ్దాం పద.’’ ‘‘కాని...’’ మర్కట్ ఏదో చెప్పబోయాడు. ‘‘నో కానీలు. నథింగ్. నువ్వు రావాల్సిందే. ఇంక తప్పించుకోలేవు’’ వైతరణి అతని చేతిని పట్టుకుని చెప్పింది. ‘‘రేపు మధ్యాహ్నం పన్నెండున్నరకి మేం ఓ చోటికి వెళ్ళే అవసరం ఉంది’’ కపీష్ చెప్పాడు. ‘‘అలాగే. భోజనం పెట్టి ఆ టైంకి పంపిస్తాం’’ మూలిక చెప్పింది. వాళ్ళిద్దరూ తాము ప్రేమించే ఇద్దరు మగాళ్ళ చేతులు పట్టుకుని లాక్కెళ్ళారు. వాళ్ళు చూడకుండా కపీష్ బొటన వేలుని, చూపుడు వేలిని ఒక దాంతో మరొకటి ముట్టుకుంటూ వాళ్ళని అప్పు అడగమని సైగ చేశాడు. 18 వైతరణి నడిపే స్కూటర్ ఆమె ఇంటి అపార్ట్మెంట్ పార్కింగ్‌లో ఆగాక వెనక కూర్చున్న మర్కట్ దిగాడు. ఇద్దరూ మెట్లెక్కి ఫస్ట్ ఫ్లోర్‌లోని ఆమె అపార్ట్మెంట్లోకి చేరుకున్నారు. ‘‘ఇదేమిటి? ‘బివేర్ ఆఫ్ మేన్’ అనే బోర్డు పెట్టారు. అంతా బివేర్ ఆఫ్ డాగ్ అనే బోర్డు పెడుతూంటారుగా?’’ దాన్ని చూసి మర్కట్ ఆశ్చర్యంగా అడిగాడు. ‘‘కుక్క కన్నా మనిషి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలనే సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వాలని ఈ బోర్డు పెట్టాను. సాక్షిలో ఇది న్యూస్ ఐటెంగా కూడా వచ్చింది. చూళ్ళేదా?’’ ‘‘చూశాను. గుర్తుంది. మోడీ ఎన్నికల ప్రచా రం హెడ్డింగ్ పక్కన వేశారు’’ ఆమెని సంతోషపెట్టడానికి అబద్ధం ఆడాడు. ‘‘ఈ రాత్రి వాతావరణ హెచ్చరిక విన్నావా?’’ ‘‘లేదే? చలిగా ఉంటుందా?’’ ‘‘చీకటిగా ఉంటుందిట. కాని నాకు లైట్లోనే ఇష్టం.’’ లోపల నించి కుక్క మొరుగు వినిపించి అడిగాడు - ‘‘మీ ఇంట్లోకి పొరపాటున కుక్క వెళ్ళినట్లుంది.’’ ‘‘ఫన్నీ! లేదు. అది మన కుక్కే.’’ ‘‘ఏమిటి? మీరు కుక్కని పెంచుతున్నారా?’’ ‘‘కుక్కల్ని. రెండు. ఓ ఆడ కుక్క, ఓ మగ కుక్క. తెల్లటి బొచ్చు కుక్కలు.’’ ‘‘నాకు కుక్కలంటే భయం.’’ ‘‘క్లింటన్, బుష్‌లు నిన్నేం చేయవు.’’ ‘‘అవి కుక్కల పేర్లా?’’ ‘‘అవును. ఇక నించి వాటిని కుక్కలు అనకు. నిన్ను మనిషి అంటే నీకు కోపం రాదూ? పేర్లతో పిలు. లేదా హి, షి అను. నాకు క్లింటన్ విమనైజింగ్ నచ్చక వాడి పేరు, బుష్ ఇరాక్ మీద దాడి చేయడం నచ్చక వాడి పేరు పెట్టాను. అఫ్కోర్స్. నేను దానికి బుష్ అనే మగ పేరు పెట్టానని, తను ఆడ కుక్కని ఆమెకి తెలీదు కదా? అందుకని అది ఏం అనుకోదు’’ వైతరణి చెప్పింది. తలుపు తీసి లోపలకి వెళ్ళగానే రెండు పమేరియన్ కుక్కలు పరిగెత్తుకుంటూ వచ్చి కొత్త వ్యక్తిని చూసి మొరగసాగాయి. ‘‘డోంట్. హి ఈజ్ యువర్ డేడ్. నో క్లింటన్ స్వీటీ. నో బుష్ డార్లింగ్...’’ -
త్రీమంకీస్ - 56
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 56 - మల్లాది వెంకటకృష్ణమూర్తి రుధిర టై మీదకి రావడం చూసి ముగ్గురూ మాట మార్చారు. ‘‘... ఎన్నైనా చెప్పు. పాత పాటలు చెత్త’’ మర్కట్ చెప్పాడు. ‘‘కాని స్లో అయినా కొన్ని అతను పాడినవి వినసొంపుగా ఉన్నాయి’’ వానర్ చెప్పాడు. ‘‘పీల్చుకోవడం అయిందా?’’ రుధిర అడిగింది. ‘‘ఆ. సరిపడా’’ కపీష్ చెప్పాడు. ‘‘ఐతే పదండి. పీజా వచ్చింది.’’ ‘‘అవును. వేడిగా తింటేనే బావుంటుంది’’ మర్కట్ చెప్పాడు. ‘‘పదండి. నేనందుకు ఎప్పుడూ సిద్ధమే’’ వానర్ చెప్పాడు. ముగ్గురూ కిందకి వెళ్తూ చూస్తే మొత్తం ఆరుగురు అమ్మాయిలు సెల్ఫోన్లో మాట్లాడుతూ కనిపించడంతో మర్కట్ చెప్పాడు. ‘‘మన రాష్ర్టంలో ప్రేమ అభివృద్ధి చెందుతోంది.’’ ‘‘ప్రేమ కన్నా సెల్‌ఫోన్ బిల్స్ అభివృద్ధి చెందుతున్నాయి’’ కపీష్ చెప్పాడు. ముందు జింజర్ బ్రడ్ని తిన్నాక కోక్ తాగుతూ వానర్ చెప్పాడు - ‘‘ఒన్ సర్కిల్ టు సర్కిల్ హాఫ్ సర్కిల్ ఏ. ఒన్ సర్కిల్ టు సర్కిల్ రెక్టాంగిల్ ఏ తాగుదామా?’’ వానర్ చెప్పాడు. ‘‘కోక్ రుచి కోక్దే. పెప్సీకి ఎక్కడ వస్తుంది?’’ మర్కట్ కూడా చెప్పాడు. ‘‘మీరు ఇప్పుడు ఏదో రైమ్‌ని పాడారు? ఏమిటది?’’ రుధిర అడిగింది. ‘‘ఒన్ సర్కిల్ టు సర్కిల్ హాఫ్ సర్కిల్ ఏ. ఒన్ సర్కిల్ టు సర్కిల్ రెక్టాంగిల్ అంటే కోక్ అని అర్థం. కోక్ స్పెల్లింగ్‌ని మేథ్స్ సింబల్స్‌తో చెప్పాడు’’ మర్కట్ వివరించాడు. రుధిర, ఆ ముగ్గురూ చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు. ఓ అత్తకి, అల్లుడికి ఆస్తి పంపకాల్లో తగాదా వస్తే తన అన్నయ్య ఆ వివాదం తీర్చి, ఇద్దర్నించీ చెరో ఐదు లక్షలు, ఎవరికి వాళ్ళకే న్యాయం చేస్తున్నట్లుగా నటిస్తూ ఎలా గుంజాడో లాంటి విషయాలు చెప్పింది రుధిర. ‘‘ఇది వినండి. దీన్ని నాకు నా ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ వాట్సాప్‌లో పంపాడు. కొన్ని సంవత్సరాలుగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఆఫీస్‌కి ఓ గాడిద వెళ్లి ఇంకా స్టుపిడ్‌గా తన పేరు ఉందా లేదా అని చెక్ చేస్తోంది. ఈ ఏడు అది లేకపోవడంతో కోపంగా అడిగింది. ‘ఈ ఏడు నా స్థానాన్ని ఎవరు అలంకరించారు?’ మీరు చెప్పండి. ఎవరు?’’ ‘‘రాహుల్ గాంధీ?’’ కపీష్ అడిగాడు. ‘‘కరెక్ట్. ఇది వినండి...’’ జోక్స్‌తో వాళ్ళకి టైమే తెలీకుండా పోయింది. ఆమెకి తెలీకుండా లేప్టాప్ని తెరవాలనుకుంటే రుధిర బాత్రూంకి కూడా వెళ్ళలేదు. ఎప్పట్లా తులసీరాం జైలుకి వచ్చి ములాఖత్ రిజిస్టర్లో సంతకం చేసి లోపలకి రాగానే అతని కోసం ఎదురు చూసే ఇద్దరు కానిస్టేబుల్స్ అతన్ని ప్రశ్నించారు. ‘‘కపీష్‌కి, నీకు మధ్య ఏమిటి సంబంధం? ఇంత పొద్దున్నే ఎందుకు వచ్చావు? అసలు రోజూ అతని దగ్గరకి ఎందుకు వస్తున్నావు?’’ ‘‘నేను అప్పు ఇచ్చేవాడు. అతను తీసుకునే వాడు. అదీ సంబంధం. నా దగ్గర పది వేలు అప్పు తీసుకున్నాడు. దాని వడ్డీ కోసం వస్తున్నాను. అతని డబ్బు మీ దగ్గర ఉందట. నాకు డబ్బిమ్మని మీకు చెప్పాడా? అతనేడి?’’ ‘‘అబద్ధం. అతను పారిపోవడానికి సహాయం చేయడానికి వచ్చావు.’’ ‘‘లేదే? అతను పారిపోయాడా?’’ ‘‘అవును. ఇవాళ తెల్లవారుఝామున పారిపోయాడు.’’ ‘‘ఐతే ఇక ఫర్వాలేదు. అతన్ని బయటే కలుసుకుని వడ్డీ వసూలు చేసుకుంటాను.’’ వెనక్కి తిరిగిన తులసీరాంని పట్టుకుని ఆపి ఓ కానిస్టేబుల్ చెప్పాడు - ‘‘నిన్ను అరెస్ట్ చేస్తున్నాం.’’ ‘‘దేనికి? అప్పు ఇవ్వడం నేరం కాదే?’’ ‘‘ఓ నేరస్థుడు జైలు నించి పారిపోవడానికి కుట్ర పన్నినందుకు.’’ ‘‘రామ రామ. ఎంత మాట? నాకేం తెలీదు.’’ ‘‘అది కోర్ట్ తేల్చాలి.’’ అతను ఎంత మొర పెట్టుకుంటున్నా వినకుండా ఫస్ట్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్ట్ ఇంటికి లాక్కెళ్ళారు. యమధర్మరాజు కేసు విని అడిగాడు - ‘‘నువ్వు నేరం చేశావా?’’ ‘‘లేదు మహాప్రభో. నేనే నేరం చేయలేదు. నా అప్పు తాలూకు వడ్డీ వసూలు చేసే ప్రయత్నం నేరమే అయితే అది నేను ఎప్పట్నించో చేస్తున్నాను.’’ ‘‘పధ్నాలుగు రోజులు’’ ఆయన చెప్పాడు. ‘‘ఇదన్యాయం సామే.’’ ‘‘ఈ దేశంలో న్యాయమే. ఇంగ్లీష్ కోర్ట్‌లో ఓ మనిషి అతను ఐరిష్ మేన్ అని ఋజువు కానంతవరకూ అమాయకుడిగా పరిగణించబడతాడు. అదే ఇండియన్ కోర్ట్‌లో ఓ మనిషి ఫలానా రాజకీయ నాయకుడి బావమరిది అని ఋజువు కానంతవరకూ అపరాధిగా పరిగణింపబడతాడు.’’ తులసీరాంని పోలీసులు తీసుకెళ్ళిపోయారు. యమధర్మరాజు సెల్‌ఫోన్ మోగింది. కొత్తగా ఆయన పెట్టుకున్న ‘ఏమి చెప్పుదును ఒరే. ఒరే. మనకు ఎదురే లేదిక హరే హరే. ఇంటి పోరు వదిలించుకుంటిరా...’ అనే పాట రింగ్ టోన్గా వినిపించింది. -
త్రీమంకీస్ - 47
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 47 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘వాళ్ళతో పాటా? అది ఏ సెల్నించో కూడా మనకి తెలీదుగా?’’ మర్కట్ ప్రశ్నించాడు. ‘‘దుర్యోధన్ దగ్గరకి పదండి.’’ ‘‘అమ్మో!’’ వానర్ చెప్పాడు. ‘‘ఆ భయం వాడికే ఉండాలి కాని పదండి.’’ ఓ చోట కూర్చుని ఉన్న దుర్యోధన్ దగ్గరకి ఆ ముగ్గురు మిత్రులు వెళ్ళారు. ‘‘నువ్వు మాత్రం మడుగు చేయక’’ మర్కట్ వానర్ని హెచ్చరించాడు. ‘‘సారీ! పరిస్థితిని బట్టి నా ప్రమేయం లేకుండా జరిగిపోయే దాని మీద మాట ఇవ్వలేను.’’ ‘‘ఏమిటి?’’ అతను వీళ్ళని చూసి అడిగాడు. ‘‘నీతో ఒంటరిగా మాట్లాడాలి’’ కపీష్ కోరాడు. ‘‘ఒంటరిగానా? నాతోనా? ఏం పని?’’ ‘‘అవును. నేను మాట్లాడేది వీళ్ళంతా వింటే నీకే నష్టం.’’ ‘‘దేని గురించి?’’ దుర్యోధన్ అనుమానంగా చూస్తూ అడిగాడు. ‘‘రేపు రాత్రి గురించి.’’ దుర్యోధన్ వాళ్ళ వంక సీరియస్‌గా చూసి ఎవరూ లేని వైపు నడిచాడు. ‘‘ఏమిటి రేపు రాత్రి?’’ గద్దించాడు. ‘‘నీ రహస్యం మొత్తం మాకు తెలుసు. మాకూ ఆ సొరంగం లోంచి పారిపోయే అవకాశం ఇేన్త సరే. లేదా మీరు బయటకి పోలేరు.’’ ‘‘కుదరదు’’ దుర్యోధన్ వెంటనే చెప్పాడు. ‘‘ఐతే గట్టిగా అరిచి ఆ సంగతి ఇప్పుడే అందరికీ చెప్తాం.’’ వెంటనే దుర్యోధన్ మొహం పాలిపోయింది. క్రోధంగా అడిగాడు - ‘‘అసలు నీకు ఏం తెలుసు?’’ ‘‘సరే. మాకు ఏం తెలుసో వానర్ చెప్తాడు. వానర్! నువ్వు మన ముగ్గురిలో బాగా బిగ్గరగా మాట్లాడగలవు కదా? ఇదిగో అంతా వినండి. దుర్యోధన్ అండ్ గేంగ్ రేపు రాత్రి సెల్‌లోని సొరంగంలోంచి తప్పించుకుంటున్నారు కాబట్టి వచ్చి వాళ్ళకి వీడ్కోలు చెప్పండి’ అని అరు.’’ ‘‘ఇదిగో వినండి...’’ వానర్ అరవగానే దుర్యోధన్ అతని నోటిని మూసి చెప్పాడు. ‘‘సరే. సరే. ఇప్పుడు అది బయట పడితే మేం నాలుగు నెలల నించి పడ్డ కష్టం వృథా అవుతుంది. నేను శనివారానికల్లా బయట ఉండాల్సిన అవసరం ఉంది.’’ ‘‘నువ్వు డబ్బు చెల్లించే జైల్ గార్డ్ మా సెల్ తలుపు తాళాలు కూడా తీేన ఏర్పాటు చెయ్యి. రాత్రంతా మేలుకుని చూస్తూంటాం. మాకు చెయ్యిస్తే సరిగ్గా మూడూ ముప్ఫై ఒకటి కల్లా సెల్ లోంచి అరిచి అందర్నీ లేపి చెప్తాం. మన బ్లాక్‌లోని ఏభై రెండు మంది ఖైదీలు వింటారు. పెద్ద గోల మొదలవుతుంది. మీరు సొరంగంలో ఉండగానే పట్టుకుంటారు. ఆ సమయంలో రోడ్ మీద రద్దీ ఉండదు. కాబట్టి బయటైనా మీరు దొరుకుతారు’’ కపీష్ చెప్పాడు. ‘‘దీనివల్ల మీకు కలిగే నష్టం ఏం లేదు కదా? లేదా మొదటికే మోసం’’ మర్కట్ చెప్పాడు. ‘‘ఇది బ్లాక్మెయిల్’’ దుర్యోధన్ ఎర్రబడ్డ మొహంతో చెప్పాడు. ‘‘అవును. మేం మంచివాళ్ళయితే అసలు జైల్లోకే వచ్చి ఉండేవాళ్ళ కాము’’ వానర్ చెప్పాడు. ‘‘సరేనా?’’ కపీష్ అడిగాడు. ‘‘సరే. కాని గుట్టుచప్పుడు కాకుండా రావాలి.’’ ‘‘అలాగే. లేదా తేలు తేలు అని అరుస్తాను. అందర్నీ లేపాక మీరు తప్పించుకున్నారని చెప్తాను’’ వానర్ చెప్పాడు. ‘‘ఒక వేళ అరిస్తే నేను జైల్లోనే ఉంటే నీ ప్రాణాలు పోతాయని తెలుసా?’’ ‘‘పోవు. నువ్వు మమ్మలేం చేయలేవు. నిన్ను హై సెక్యూరిటీ సెల్‌లోకి తరలిస్తారు. కాని జైల్లోని ఆ సెల్లో నీ ప్రాణాలే పోతాయని తెలుసా?’’ కపీష్ అడిగాడు. ‘‘ఎలా?’’ ‘‘నువ్వు తాగే కాఫీలో గాజు పొడి కలవచ్చు. నువ్వు తినే గారెలో బ్లేడు ముక్క కలవచ్చు. కిచెన్ మా చేతిలో ఉంది. చంపడానికి కేవలం ఒక్క దేహబలమే అవసరం లేదు. దుర్యోధన్. పశుబలం కన్నా బుద్ధిబలం గొప్పది. నల్లిలా నలిపేస్తా జాగ్రత్త’’ కపీష్ హూంకరించాడు. ‘‘సరే అన్నాగా? ఇది మీకెలా తెలిసింది?’’ ‘‘అనవసరంగా బాత్రూంలో, మెస్‌లో మాతో పెట్టుకున్నావు. అప్పటి నించి నిన్ను ఓ కంట కనిపెడుతున్నాం’’ వానర్ ధైర్యంగా చెప్పాడు. ‘‘నీ అనుచరులు మట్టి పోయడం చూశాం’’ మర్కట్ చెప్పాడు. అతను ఏం మాట్లాడకపోవడంతో కపీష్ చెప్పాడు - ‘‘ఐతే ఈ కథ విను. నువ్వు స్కూల్‌కి వెళ్ళి ఉంటే, దీన్ని చిన్నప్పుడు క్లాసులో విని ఉంటావు. ఓ కుందేలు, తాబేలు పరుగు పందెంలో పోటీ వేసుకున్నాయి. కుందేలు తాబేలు కన్నా ముందు పరిగెత్తింది. ఫినిష్ లైన్‌కి చేరే ముందు తాబేలు చాలా వెనకపడటంతో కుందేలు కాసేపు విశ్రాంతి తీసుకోవాలి అనుకుని ఓ చెట్టు కింద కూర్చుంది. అది మాగన్నుగా కునుకుతీసింది. మెళకువ వచ్చాక చూస్తే ఏముంది? తాబేలు ఫినిష్ లైన్‌ని దాటుతోంది. నీతి ఏమిటి? చేపట్టిన పనయ్యే దాకా విశ్రాంతి తీసుకోకూడదు. మీరు అలా సొరంగాన్ని తవ్వారు. కాని కథ పూర్తవలేదు బ్రదర్. విను. సరే. కుందేలు ఆలోచించి మళ్ళీ తాబేలుని పరుగు పందేనికి రమ్మంది. ఈసారి కుందేలు విశ్రాంతి తీసుకోకుండా ఫినిష్ లైన్‌కి చేరుకుని గెలిచింది. నీతి ఏమిటి? మళ్ళీ అదే. గమ్యం చేరేదాకా విశ్రమించకూడదు. ఇంకా కథ పూర్తి కాలేదు బ్రదర్. విను... (తమకి జైల్లో తారసపడ్డ ముగ్గురు భామల గురించి మిత్రులు ముగ్గురూ ఏం చెప్పుకున్నారు?) -
త్రీమంకీస్ - 40
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 40 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘నేనూ మీలా దురదృష్టవంతుడ్నే’’ పట్టయ్య చిన్నగా నిట్టూర్చి చెప్పాడు. ‘‘ఎలా పట్టుపడ్డారేమిటి?’’ మర్కట్ అడిగాడు. ‘‘చెప్తా. కూర్చోండి’’ పట్టయ్య ఓ మెట్టు మీద కూర్చుంటూ చెప్పాడు - ‘‘నేను కొన్ని ముఖ్యమైన రైళ్ళల్లో టికెట్లని మారు పేర్లతో బుక్ చేసి వాటిని ప్రీమియం ధరలకి స్టేషన్లో ప్రయాణీకులకి విక్రయిస్తూంటాను.’’ ‘‘ఏదీ? సినిమా హాళ్ళల్లో బ్లాక్ టికెట్లలానా?’’ ‘‘అవును. ఆ మధ్య ఓరోజు దీంట్లో భాగం ఉన్న రైల్వే క్లర్క్ పేర్లేం తట్టక ఏ నాగార్జున, అమలల పేర్లతో బుక్ చేసిన రెండు టికెట్లని నాకు ఇచ్చాడు. వాటిని ఓ జంటకి విక్రయించాను. రైలు కదులుతూండగా ఒకడు ఆ పెట్టె బయట అతికించిన లిస్ట్‌లోని ఆ పేర్లని చూశాడు. వెంటనే కాజీపేటలోని తన బంధుమిత్రులకి ఫలానా రైల్లో, ఫలానా బోగీలో, ఫలానా బెర్త్‌లో అక్కినేని నాగార్జున, అమలలు వస్తున్నారని ఫోన్ చేసి చెప్పాడు. ఒకరి నించి సమాచారం ఇంకొకరికి ఎలా పాకుతుందో అర్థం చేసుకోండి. ఆ బంధువులు ఇంకెవరో బంధుమిత్రులకి చెప్పారు. వాళ్ళు తమ బంధుమిత్రులకి చెప్పారు. ఇలా ఆ రైలు కాజీపేటకి చేరుకునే నాలుగున్నర గంటల్లోగా ఈ సమాచారం వరంగల్ అంతా పాకిపోయింది. సుమంత్, నాగచైతన్య, అఖిల్ పేర్లు కలపబడ్డాయి. చేతిలో దండలు, భోజనం, టిఫిన్ కేరియర్లతో తండోపతండాలుగా ప్రజలు వచ్చి తమ అభిమాన నటీనటుల్ని కలుసుకోడానికి రైల్వేప్లాట్‌ఫాం మీద గుమిగూడారు. అన్నిటికీ తగుదునమ్మా అంటూ వస్తారుగా. ఆయన గారు కూడా అక్కడికి చేరుకున్నారు.’’ ‘‘ఎవరాయన?’’ వానర్ అడిగాడు. ‘‘ఇంకెవరు? స్థానిక ఎం ఎల్ ఏ అయుంటాడు’’ కపీష్ చెప్పాడు. ‘‘కరెక్ట్. రైలాగాక ఎంఎల్ఏ ఆ డబ్బాలోకి ఎక్కి అంతా వెతికినా వాళ్ళు కనపడితేనా? ఆ బెర్త్‌ల్లో, ఆ పేర్లతో ప్రయాణించే ఆ జంటని ప్రశ్నిస్తే అసలు రహస్యం బయటపడింది. తప్పు పేర్లతో ప్రయాణిస్తున్నందుకు వాళ్ళని దింపేశారు. కొందరు జాలిపడి వారికి భోజనం పెట్టారనుకోండి. దినపత్రికల్లో ఇది వార్తగా వచ్చింది. దాన్ని రైల్వే శాఖ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ చదివాడు. విజిలెన్స్ వారికి చెప్తే వారు వెంటనే మొత్తం కూపీ లాగారు. రెండు రోజుల తర్వాత నేను సికింద్రాబాద్ ఒన్ నంబర్ ప్లాట్‌ఫాం మీద, మళ్ళీ అదే రైలుకి బ్లాక్‌లో టికెట్లు అమ్ముతూంటే విజిలెన్స్ వారు అరెస్ట్ చేసి ఇక్కడికి పంపారు. వాళ్ళు మారువేషాల్లో ప్రయాణీకుల్లా నటించి నన్ను రెడ్ హేండెడ్‌గా పట్టుకున్నారు. ఉన్నది కాస్తా ఊడింది... సర్వ మంగళం పాడింది... దాంతో అయ్యయ్యో అయింది నా పని’’ ఆ పాటని పాడి పట్టయ్య చెప్పాడు. ‘‘అయ్యో!’’ మర్కట్ చెప్పాడు. ‘‘అయ్యో దేనికి? ఎంచక్కా పాత పాటలు పాడుకుంటూ గడుపుతున్నాను’’ పట్టయ్య చెప్పాడు. మిత్రులు ముగ్గురూ జాలిపడ్డారు. ‘‘ఈ రోజుల్లో మాకు ఆడుకోడానికి ఐ పేడ్, లేప్టేప్, బ్లూబెర్రీ, ఫేస్‌బుక్‌లు లాంటివి ఎన్నో ఉన్నాయి. మీ చిన్నప్పుడు ఏం ఉండేవి?’’ మర్కట్ అతని వయసుని గమనించి అడిగాడు. ‘‘మగవాళ్ళకి వీధి అరుగులు, ఆడవారికి వీధి పంపులు’’ పట్టయ్య నవ్వుతూ చెప్పాడు. ‘‘అతనెవరు?’’ దుర్యోధన్ వైపు చూపించి కపీష్ అడిగాడు. ఒకో ఖైదీని పరిచయం చేస్తూ పట్టయ్య చెప్పసాగాడు. ‘‘ఓ మనిషికి తుపాకీ ఇస్తే అతను ఓ బేంక్‌ని దోచుకోగలడు. అతనికి ఓ బేంక్‌ని ఇస్తే దేశాన్నే దోచుకోగలడు. ఆ సన్నపాటి ఖైదీ అలాంటి పని చేశాడు. ఆ పక్కతను చెక్ రాసి జైలుకి వచ్చాడు - బేంక్‌లో డబ్బున్నా తన అకౌంట్లో డబ్బు లేకుండా. ఇటువైపు అతనికి డబ్బంటే బాగా ఇష్టం. కాని డబ్బుకే అతనంటే ఇష్టం లేదు. దాంతో అది యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళ దగ్గరకి వెళ్ళి పోయి అతను జైలుకి వచ్చాడు. ఆ లావుపాటి వాడు చెయ్యనిదానికి శిక్షని అనుభవిస్తున్నాడు. కాల్చాక రివాల్వర్ మీద తన వేలిముద్రలని తుడవలేదు. ఈ పక్కన వాడు చేసిందానికి శిక్షని అనుభవిస్తున్నాడు. కాలే ఇంట్లోంచి ముగ్గుర్ని బయటకి లాక్కొచ్చినందుకు.’’ ‘‘ఎవర్ని లాక్కొచ్చాడు?’’ ‘‘అగ్నిమాపక సిబ్బందిని. అతని పక్కతనికి డబ్బాఖరులో అధిక నెల ఉండటంతో డబ్బు కోసం ఫోర్జరీ చేసి పట్టుబడ్డాడు.’’ ‘‘దుర్యోధన్ గురించి కూడా చెప్పు.’’ ‘‘వస్తున్నా. అతనో హంతకుడు.’’ ‘‘ఎవర్ని చంపాడు?’’ ‘‘ఇద్దరు ఆడవాళ్ళని అని అభియోగం. కాని తను చంపింది మాత్రం ఒకరినే అంటాడతను...’’ పట్టయ్య చెప్పేది ముగ్గురూ ఆసక్తిగా వినసాగారు. ‘‘దుర్యోధన్ ఎందుకు జైల్లో ఉన్నాడంటే ముందుగా గోలచందర్, మాంచాలల గురించి చెప్పాలి.’’ ‘‘గోలచందర్ అనే పేరు ఎవరైనా తమ పిల్లలకి పెడతారా?’’ కపీష్ అడ్డుపడ్డాడు. ‘‘పెట్టరు. పెట్టలేదు కూడా. కాని బాలచందర్ని స్కూల్లో చేర్పించినప్పుడు రిజిస్టర్లో అతని పేరుని రాసిన ఉద్యోగి తప్పుగా విని బాల బదులు గోలగా రాశాడు. అదే స్థిరపడిపోయింది. పైగా క్లాసులో బాగా అల్లరి చేసేవాడు. దాంతో గోలచందర్ పేరుని హెడ్మాస్టారు మార్చలేదు.’’ ‘‘ఈ గోలచందర్, మాంచాలలు ఎవరు?’’ మర్కట్ అడిగాడు. గోలచందర్ దేనికి తన భార్యని చంపాలనుకున్నాడు? మళ్లీ రేపు