త్రీమంకీస్ - 40 | malladhi special story | Sakshi
Sakshi News home page

త్రీమంకీస్ - 40

Published Thu, Nov 27 2014 11:11 PM | Last Updated on Sat, Sep 2 2017 5:14 PM

త్రీమంకీస్ - 40

త్రీమంకీస్ - 40

 డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 40
 

 - మల్లాది వెంకటకృష్ణమూర్తి
 
 ‘‘నేనూ మీలా దురదృష్టవంతుడ్నే’’ పట్టయ్య చిన్నగా నిట్టూర్చి చెప్పాడు.
 ‘‘ఎలా పట్టుపడ్డారేమిటి?’’ మర్కట్ అడిగాడు.
 ‘‘చెప్తా. కూర్చోండి’’ పట్టయ్య ఓ మెట్టు మీద కూర్చుంటూ చెప్పాడు - ‘‘నేను కొన్ని ముఖ్యమైన రైళ్ళల్లో టికెట్లని మారు పేర్లతో బుక్ చేసి వాటిని ప్రీమియం ధరలకి స్టేషన్‌లో ప్రయాణీకులకి విక్రయిస్తూంటాను.’’
 ‘‘ఏదీ? సినిమా హాళ్ళల్లో బ్లాక్ టికెట్లలానా?’’
 ‘‘అవును. ఆ మధ్య ఓరోజు దీంట్లో భాగం ఉన్న రైల్వే క్లర్క్ పేర్లేం తట్టక ఏ నాగార్జున, అమలల పేర్లతో బుక్ చేసిన రెండు టికెట్లని నాకు ఇచ్చాడు. వాటిని ఓ జంటకి విక్రయించాను. రైలు కదులుతూండగా ఒకడు ఆ పెట్టె బయట అతికించిన లిస్ట్‌లోని ఆ పేర్లని చూశాడు. వెంటనే కాజీపేటలోని తన బంధుమిత్రులకి ఫలానా రైల్లో, ఫలానా బోగీలో, ఫలానా బెర్త్‌లో అక్కినేని నాగార్జున, అమలలు వస్తున్నారని ఫోన్ చేసి చెప్పాడు. ఒకరి నించి సమాచారం ఇంకొకరికి ఎలా పాకుతుందో అర్థం చేసుకోండి. ఆ బంధువులు ఇంకెవరో బంధుమిత్రులకి చెప్పారు. వాళ్ళు తమ బంధుమిత్రులకి చెప్పారు. ఇలా ఆ రైలు కాజీపేటకి చేరుకునే నాలుగున్నర గంటల్లోగా ఈ సమాచారం వరంగల్ అంతా పాకిపోయింది. సుమంత్, నాగచైతన్య, అఖిల్ పేర్లు కలపబడ్డాయి. చేతిలో దండలు, భోజనం, టిఫిన్ కేరియర్లతో తండోపతండాలుగా ప్రజలు వచ్చి తమ అభిమాన నటీనటుల్ని కలుసుకోడానికి రైల్వేప్లాట్‌ఫాం మీద గుమిగూడారు. అన్నిటికీ తగుదునమ్మా అంటూ వస్తారుగా. ఆయన గారు కూడా అక్కడికి చేరుకున్నారు.’’
 ‘‘ఎవరాయన?’’ వానర్ అడిగాడు.
 ‘‘ఇంకెవరు? స్థానిక ఎం ఎల్ ఏ అయుంటాడు’’ కపీష్ చెప్పాడు.
 ‘‘కరెక్ట్. రైలాగాక ఎంఎల్‌ఏ ఆ డబ్బాలోకి ఎక్కి అంతా వెతికినా వాళ్ళు కనపడితేనా? ఆ బెర్త్‌ల్లో, ఆ పేర్లతో ప్రయాణించే ఆ జంటని ప్రశ్నిస్తే అసలు రహస్యం బయటపడింది. తప్పు పేర్లతో ప్రయాణిస్తున్నందుకు వాళ్ళని దింపేశారు. కొందరు జాలిపడి వారికి భోజనం పెట్టారనుకోండి. దినపత్రికల్లో ఇది వార్తగా వచ్చింది. దాన్ని రైల్వే శాఖ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ చదివాడు. విజిలెన్స్ వారికి చెప్తే వారు వెంటనే మొత్తం కూపీ లాగారు. రెండు రోజుల తర్వాత నేను సికింద్రాబాద్ ఒన్ నంబర్ ప్లాట్‌ఫాం మీద, మళ్ళీ అదే రైలుకి బ్లాక్‌లో టికెట్లు అమ్ముతూంటే విజిలెన్స్ వారు అరెస్ట్ చేసి ఇక్కడికి పంపారు. వాళ్ళు మారువేషాల్లో ప్రయాణీకుల్లా నటించి నన్ను రెడ్ హేండెడ్‌గా పట్టుకున్నారు. ఉన్నది కాస్తా ఊడింది... సర్వ మంగళం పాడింది... దాంతో అయ్యయ్యో అయింది నా పని’’ ఆ పాటని పాడి పట్టయ్య చెప్పాడు.
 ‘‘అయ్యో!’’ మర్కట్ చెప్పాడు.
 ‘‘అయ్యో దేనికి? ఎంచక్కా పాత పాటలు పాడుకుంటూ గడుపుతున్నాను’’ పట్టయ్య చెప్పాడు.
 మిత్రులు ముగ్గురూ జాలిపడ్డారు.
 ‘‘ఈ రోజుల్లో మాకు ఆడుకోడానికి ఐ పేడ్, లేప్‌టేప్, బ్లూబెర్రీ, ఫేస్‌బుక్‌లు లాంటివి ఎన్నో ఉన్నాయి. మీ చిన్నప్పుడు ఏం ఉండేవి?’’ మర్కట్ అతని వయసుని గమనించి అడిగాడు.
 ‘‘మగవాళ్ళకి వీధి అరుగులు, ఆడవారికి వీధి పంపులు’’ పట్టయ్య నవ్వుతూ చెప్పాడు.
 ‘‘అతనెవరు?’’ దుర్యోధన్ వైపు చూపించి కపీష్ అడిగాడు.
 ఒకో ఖైదీని పరిచయం చేస్తూ పట్టయ్య చెప్పసాగాడు.
 ‘‘ఓ మనిషికి తుపాకీ ఇస్తే అతను ఓ బేంక్‌ని దోచుకోగలడు. అతనికి ఓ బేంక్‌ని ఇస్తే దేశాన్నే దోచుకోగలడు. ఆ సన్నపాటి ఖైదీ అలాంటి పని చేశాడు. ఆ పక్కతను చెక్ రాసి జైలుకి వచ్చాడు - బేంక్‌లో డబ్బున్నా తన అకౌంట్‌లో డబ్బు లేకుండా. ఇటువైపు అతనికి డబ్బంటే బాగా ఇష్టం. కాని డబ్బుకే అతనంటే ఇష్టం లేదు. దాంతో అది యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళ దగ్గరకి వెళ్ళి పోయి అతను జైలుకి వచ్చాడు. ఆ లావుపాటి వాడు చెయ్యనిదానికి శిక్షని అనుభవిస్తున్నాడు. కాల్చాక రివాల్వర్ మీద తన వేలిముద్రలని తుడవలేదు. ఈ పక్కన వాడు చేసిందానికి శిక్షని అనుభవిస్తున్నాడు. కాలే ఇంట్లోంచి ముగ్గుర్ని బయటకి లాక్కొచ్చినందుకు.’’
 ‘‘ఎవర్ని లాక్కొచ్చాడు?’’
 ‘‘అగ్నిమాపక సిబ్బందిని. అతని పక్కతనికి డబ్బాఖరులో అధిక నెల ఉండటంతో డబ్బు కోసం ఫోర్జరీ చేసి పట్టుబడ్డాడు.’’
 ‘‘దుర్యోధన్ గురించి కూడా చెప్పు.’’
 ‘‘వస్తున్నా. అతనో హంతకుడు.’’
 ‘‘ఎవర్ని చంపాడు?’’
 ‘‘ఇద్దరు ఆడవాళ్ళని అని అభియోగం. కాని తను చంపింది మాత్రం ఒకరినే అంటాడతను...’’
 పట్టయ్య చెప్పేది ముగ్గురూ ఆసక్తిగా వినసాగారు.
 ‘‘దుర్యోధన్ ఎందుకు జైల్లో ఉన్నాడంటే ముందుగా గోలచందర్, మాంచాలల గురించి చెప్పాలి.’’
 ‘‘గోలచందర్ అనే పేరు ఎవరైనా తమ పిల్లలకి పెడతారా?’’ కపీష్ అడ్డుపడ్డాడు.
 ‘‘పెట్టరు. పెట్టలేదు కూడా. కాని బాలచందర్‌ని స్కూల్లో చేర్పించినప్పుడు రిజిస్టర్‌లో అతని పేరుని రాసిన ఉద్యోగి తప్పుగా విని బాల బదులు గోలగా రాశాడు. అదే స్థిరపడిపోయింది. పైగా క్లాసులో బాగా అల్లరి చేసేవాడు. దాంతో గోలచందర్ పేరుని హెడ్‌మాస్టారు మార్చలేదు.’’
 ‘‘ఈ గోలచందర్, మాంచాలలు ఎవరు?’’ మర్కట్ అడిగాడు.
 
 గోలచందర్ దేనికి తన భార్యని చంపాలనుకున్నాడు?
 మళ్లీ  రేపు
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement