త్రీమంకీస్ - 47 | malladi special story | Sakshi
Sakshi News home page

త్రీమంకీస్ - 47

Published Thu, Dec 4 2014 11:09 PM | Last Updated on Sat, Sep 2 2017 5:37 PM

త్రీమంకీస్ - 47

త్రీమంకీస్ - 47

డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 47
 
 - మల్లాది వెంకటకృష్ణమూర్తి
 
 ‘‘వాళ్ళతో పాటా? అది ఏ సెల్‌నించో కూడా మనకి తెలీదుగా?’’ మర్కట్ ప్రశ్నించాడు.
 ‘‘దుర్యోధన్ దగ్గరకి పదండి.’’
 ‘‘అమ్మో!’’ వానర్ చెప్పాడు.
 ‘‘ఆ భయం వాడికే ఉండాలి కాని పదండి.’’
 ఓ చోట కూర్చుని ఉన్న దుర్యోధన్ దగ్గరకి ఆ ముగ్గురు మిత్రులు వెళ్ళారు.
 ‘‘నువ్వు మాత్రం మడుగు చేయక’’ మర్కట్ వానర్‌ని హెచ్చరించాడు.
 ‘‘సారీ! పరిస్థితిని బట్టి నా ప్రమేయం లేకుండా జరిగిపోయే దాని మీద మాట ఇవ్వలేను.’’
 ‘‘ఏమిటి?’’ అతను వీళ్ళని చూసి అడిగాడు.
 ‘‘నీతో ఒంటరిగా మాట్లాడాలి’’ కపీష్ కోరాడు.
 ‘‘ఒంటరిగానా? నాతోనా? ఏం పని?’’
 ‘‘అవును. నేను మాట్లాడేది వీళ్ళంతా వింటే నీకే నష్టం.’’
 ‘‘దేని గురించి?’’ దుర్యోధన్ అనుమానంగా చూస్తూ అడిగాడు.
 ‘‘రేపు రాత్రి గురించి.’’
 దుర్యోధన్ వాళ్ళ వంక సీరియస్‌గా చూసి ఎవరూ లేని వైపు నడిచాడు.
 ‘‘ఏమిటి రేపు రాత్రి?’’ గద్దించాడు.
 ‘‘నీ రహస్యం మొత్తం మాకు తెలుసు. మాకూ ఆ సొరంగం లోంచి పారిపోయే అవకాశం ఇేన్త  సరే. లేదా మీరు బయటకి పోలేరు.’’
 ‘‘కుదరదు’’ దుర్యోధన్ వెంటనే చెప్పాడు.
 ‘‘ఐతే గట్టిగా అరిచి ఆ సంగతి ఇప్పుడే అందరికీ చెప్తాం.’’
 వెంటనే దుర్యోధన్ మొహం పాలిపోయింది. క్రోధంగా అడిగాడు - ‘‘అసలు నీకు ఏం తెలుసు?’’
 ‘‘సరే. మాకు ఏం తెలుసో వానర్ చెప్తాడు. వానర్! నువ్వు మన ముగ్గురిలో బాగా బిగ్గరగా మాట్లాడగలవు కదా? ఇదిగో అంతా వినండి. దుర్యోధన్ అండ్ గేంగ్ రేపు రాత్రి సెల్‌లోని సొరంగంలోంచి తప్పించుకుంటున్నారు కాబట్టి వచ్చి వాళ్ళకి వీడ్కోలు చెప్పండి’ అని అరు.’’
 ‘‘ఇదిగో వినండి...’’ వానర్ అరవగానే దుర్యోధన్ అతని నోటిని మూసి చెప్పాడు.
 ‘‘సరే. సరే. ఇప్పుడు అది బయట పడితే మేం నాలుగు నెలల నించి పడ్డ కష్టం వృథా అవుతుంది. నేను శనివారానికల్లా బయట ఉండాల్సిన అవసరం ఉంది.’’
 ‘‘నువ్వు డబ్బు చెల్లించే జైల్ గార్డ్ మా సెల్ తలుపు తాళాలు కూడా తీేన ఏర్పాటు చెయ్యి. రాత్రంతా మేలుకుని చూస్తూంటాం. మాకు చెయ్యిస్తే సరిగ్గా మూడూ ముప్ఫై ఒకటి కల్లా సెల్ లోంచి అరిచి అందర్నీ లేపి చెప్తాం. మన బ్లాక్‌లోని ఏభై రెండు మంది ఖైదీలు వింటారు. పెద్ద గోల మొదలవుతుంది. మీరు సొరంగంలో ఉండగానే పట్టుకుంటారు. ఆ సమయంలో రోడ్ మీద రద్దీ ఉండదు. కాబట్టి బయటైనా మీరు దొరుకుతారు’’ కపీష్ చెప్పాడు.
 ‘‘దీనివల్ల మీకు కలిగే నష్టం ఏం లేదు కదా? లేదా మొదటికే మోసం’’ మర్కట్ చెప్పాడు.
 ‘‘ఇది బ్లాక్‌మెయిల్’’ దుర్యోధన్ ఎర్రబడ్డ మొహంతో చెప్పాడు.
 ‘‘అవును. మేం మంచివాళ్ళయితే అసలు జైల్లోకే వచ్చి ఉండేవాళ్ళ కాము’’ వానర్ చెప్పాడు.
 ‘‘సరేనా?’’ కపీష్ అడిగాడు.
 ‘‘సరే. కాని గుట్టుచప్పుడు కాకుండా రావాలి.’’
 ‘‘అలాగే. లేదా తేలు తేలు అని అరుస్తాను. అందర్నీ లేపాక మీరు తప్పించుకున్నారని చెప్తాను’’ వానర్ చెప్పాడు.
 ‘‘ఒక వేళ అరిస్తే నేను జైల్లోనే ఉంటే నీ ప్రాణాలు పోతాయని తెలుసా?’’
 ‘‘పోవు. నువ్వు మమ్మలేం చేయలేవు. నిన్ను హై సెక్యూరిటీ సెల్‌లోకి తరలిస్తారు. కాని జైల్లోని ఆ సెల్‌లో నీ ప్రాణాలే పోతాయని తెలుసా?’’ కపీష్ అడిగాడు.
 ‘‘ఎలా?’’
 ‘‘నువ్వు తాగే కాఫీలో గాజు పొడి కలవచ్చు. నువ్వు తినే గారెలో బ్లేడు ముక్క కలవచ్చు. కిచెన్ మా చేతిలో ఉంది. చంపడానికి కేవలం ఒక్క దేహబలమే అవసరం లేదు. దుర్యోధన్. పశుబలం కన్నా బుద్ధిబలం గొప్పది. నల్లిలా నలిపేస్తా జాగ్రత్త’’ కపీష్ హూంకరించాడు.
 ‘‘సరే అన్నాగా? ఇది మీకెలా తెలిసింది?’’
 ‘‘అనవసరంగా బాత్‌రూంలో, మెస్‌లో మాతో పెట్టుకున్నావు. అప్పటి నించి నిన్ను ఓ కంట కనిపెడుతున్నాం’’ వానర్ ధైర్యంగా చెప్పాడు.
 ‘‘నీ అనుచరులు మట్టి పోయడం చూశాం’’ మర్కట్ చెప్పాడు.
 అతను ఏం మాట్లాడకపోవడంతో కపీష్ చెప్పాడు - ‘‘ఐతే ఈ కథ విను. నువ్వు స్కూల్‌కి వెళ్ళి ఉంటే, దీన్ని చిన్నప్పుడు క్లాసులో విని ఉంటావు. ఓ కుందేలు, తాబేలు పరుగు పందెంలో పోటీ వేసుకున్నాయి. కుందేలు తాబేలు కన్నా ముందు పరిగెత్తింది. ఫినిష్ లైన్‌కి చేరే ముందు తాబేలు చాలా వెనకపడటంతో కుందేలు కాసేపు విశ్రాంతి తీసుకోవాలి అనుకుని ఓ చెట్టు కింద కూర్చుంది. అది మాగన్నుగా కునుకుతీసింది. మెళకువ వచ్చాక చూస్తే ఏముంది? తాబేలు ఫినిష్ లైన్‌ని దాటుతోంది. నీతి ఏమిటి? చేపట్టిన పనయ్యే దాకా విశ్రాంతి తీసుకోకూడదు. మీరు అలా సొరంగాన్ని తవ్వారు. కాని కథ పూర్తవలేదు బ్రదర్. విను. సరే. కుందేలు ఆలోచించి మళ్ళీ తాబేలుని పరుగు పందేనికి రమ్మంది. ఈసారి కుందేలు విశ్రాంతి తీసుకోకుండా ఫినిష్ లైన్‌కి చేరుకుని గెలిచింది. నీతి ఏమిటి? మళ్ళీ అదే. గమ్యం చేరేదాకా విశ్రమించకూడదు.
 ఇంకా కథ పూర్తి కాలేదు బ్రదర్. విను...
 (తమకి జైల్లో తారసపడ్డ ముగ్గురు భామల గురించి  మిత్రులు ముగ్గురూ ఏం చెప్పుకున్నారు?)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement