విజయవాడ/ పెనమలూరు : కానూరులో శుక్రవారం కిడ్నాప్ కలకలం రేగింది. ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన ఆరేళ్ల చిన్నారి కిడ్నాప్‌కు గురైందని, కిడ్నాపర్లు విజయవాడకే తీసుకొచ్చారని తెలుసుకున్న నగరవాసులు ఉలిక్కిపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన దేవిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మల్లేశ్వరి దంపతులు ప్రభుత్వోద్యోగులు. వారి కుమార్తె సహస్ర (6). శ్రీనివాసరెడ్డికి రాజేష్‌రెడ్డి అనే సోదరుడు ఉన్నాడు. రాజేష్ రెడ్డి అల్లరి చిల్లరిగా తిరిగేవాడు. అతని ఆర్థిక అవసరాలకు శ్రీనివాసరెడ్డి డబ్బులు ఇవ్వకపోవడంతో పాటు ఆస్తిని కూడా పంచకపోవడంతో అన్న కుటుంబంపై కక్ష పెంచుకున్నాడు. తన జల్సాలకు డబ్బు అవసరం కావడంతో సోదరుని కుమార్తె సహస్రను కిడ్నాప్ చేసేందుకు పథకం పన్నాడు.
ఈ నేపథ్యంలో విజయవాడ మురళీనగర్‌లోని వెంకటరమణ ఎన్‌క్లేవ్‌లో ఒక ఫ్లాట్ గత నెల 20న అద్దెకు తీసుకుని తన స్నేహితుడితో కలిసి అక్కడ ఉన్నాడు. స్నేహితుడి సహాయంతో కనిగిరిలో తన సోదరుడి ఇంటి వద్ద ఆడుకుంటున్న సహస్రను కిడ్నాప్ చేశాడు. స్థానికులు గుర్తించకుండా హెల్మెట్ పెట్టుకున్నట్లు సమాచారం. కనిగిరి నుంచి సహస్రను విజయవాడకు తీసుకొచ్చిన రాజేష్‌రెడ్డి రూ.50 లక్షలు కావాలంటూ స్నేహితుడితో సోదరుడికి ఫోన్ చేయించాడు. దీంతో అప్రమత్తమైన కనిగిరి పోలీసులు ఫోన్ నంబర్, సెల్‌టవర్ల ఆధారంగా గురువారం రాత్రి విజయవాడకు వచ్చి వెంకట రమణ ఎన్‌క్లేవ్‌లో సోదాలు చేశారు. అయితే నిందితులు ఇక్కడ లేరని నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత నిందితుడి స్నేహితుడు వాడిన సెల్‌ఫోన్ ఆధారంగా కనిగిరిలో అరెస్టు చేసినట్లు తెలిసింది.