
సెల్‌ఫోన్ గెలుచుకున్నారంటూ టోకరా!
♦ రూ.1500 చెల్లించి తీసుకున్న పార్సిల్‌లో నకిలీ వస్తువులు
♦- లబోదిబోమన్న బాధితుడు
యాలాల: ‘మీ ఫోన్ నెంబరుకు లక్కీడ్రాలో ఆండ్రాయిడ్ సెల్‌ఫోన్ వచ్చిందని గుర్తుతెలియని వ్యక్తులు ఓ కూలీకి టోకరా వేశారు. వీపీపీలో రూ. 1500 చెల్లించి పార్శిల్ తీసుకొని చూడగా అందులో నకిలీ వస్తువులు ఉండడంతో బాధితుడు లబోదిబోమన్నాడు. ఈ సంఘటన మండలంలోని దేవనూరు గ్రామంలో సోమవారం వెలుగు చూసింది. వివరాలు.. గ్రామానికి చెందిన ఆంజేయులు స్థానికంగా కూలీపనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆయనకు ఐదు రోజుల క్రితం 8143375757 నెంబరు నుంచి ఫోన్ కాల్ వచ్చింది.
‘మీరు ఉపయోగిస్తున్న ఫోన్ నెంబరు ద్వారా లక్కీడ్రాలో సామ్‌సంగ్ ఆండ్రాయిడ్ ఫోన్ గెలుచుకున్నారు.. మీ చిరునామా చెబితే పోస్టల్ ద్వారా సెల్‌ఫోన్ పంపిస్తాం’అని చెప్పారు. దీంతో సంబరపడిపోయిన ఆంజనేయులు తన చిరునామా చెప్పాడు. కాగా సోమవారం ఆంజనేయులు పేరిట తపాల కార్యాలయంలో శ్రీలక్ష ఎంటర్‌ప్రైజెస్, మంగళం క్వార్టర్స్, తిరుపతి పేరిట ఉన్న చిరునామాతో ఓ పార్శిల్ వచ్చింది. వీపీపీ ద్వారా వచ్చిన పార్సిల్‌ను ఆయన రూ.1500 చెల్లించి పోస్టుమాన్ నుంచి చెల్లించి తీసుకున్నాడు. వచ్చిన పార్సిల్‌ను తెరిచిచూడగా అందులో లక్ష్మీకృప ధన్‌యంత్ర పేరిట ఉన్న కవర్‌లో మెటల్ బొమ్మలు ఉన్నాయి. తను ఊహించిన సెల్‌ఫోన్ కాకుండా నకిలీ వస్తువులు కనిపించడంతో బాధితుడు లబోదిబోమన్నాడు. వెంటనే తేరుకొని తనకు వచ్చిన ఫోన్‌నంబర్‌కు తిరిగి కాల్ చేశాడు. అయితే పొరపాటున పార్సిల్ వచ్చిందని ఓమారు.. మళ్లీ సంప్రదిస్తే సెల్‌ఫోన్ తిరిగి డెలివరీ చేస్తామంటూ అక్కడి వారు చెప్పారని బాధితుడు తెలిపాడు.