
చిత్తూరు ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని కొంగారెడ్డి పల్లిలో ఉన్న గాండ్లపల్లి మున్సిపల్ హైస్కూల్‌ను డీఈఓ పాండురంగస్వామి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ‘సాక్షి’ దినపత్రికలో సోమవారం ప్రచురితమైన ‘ఉపాధ్యాయులే.. పాఠం చెప్పరు’ వార్తపై ఆయన స్పందించి, పాఠశాలను తనిఖీ చేశారు. ఆ పాఠశాలలో మ్యాథ్స్ టీచర్ ఖాదర్‌బాషా తరగతి గదిలో సెల్‌ఫోన్‌తో ఆటలు ఆడుతుండడం గుర్తించి, తరగతి గదిలో సెల్‌ఫోన్‌తో ఆటలు అవసరమా.. అంటూ మండిపడ్డారు. అతనిపై చర్యలకు నివేదికలు సిద్ధం చేయమని చిత్తూరు మండలం ఎంఈఓ సెల్వరాజ్‌ను ఆదేశించారు. అలాగే పక్కరూంలో సమ్మేటీవ్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు సమాధానాలు చెప్పడానికి ప్రయత్నిస్తున్న మరో టీచర్‌ను మందలించారు. సమ్మేటివ్ పరీక్షలను పర్యవేక్షించకుండా ఆఫీసు రూంలో ఉన్న టీచర్ పరంజ్యోతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలను పర్యవేక్షించడం ఇలాగేనా అంటూ డీఈఓ హెచ్‌ఎంను ప్రశ్నించారు. పాఠశాలలో అన్ని తరగతి గదుల్లో జరుగుతున్న సమ్మేటివ్ –1 పరీక్షలను పరిశీలించారు. పరీక్షలు రాస్తున్న 8, 9 తరగతులను ఆబ్జెక్టివ్ పరీక్షా విధానంపై అడిగి తెలుసుకున్నారు.