పాఠశాల్లో రక్తపు మరకలు..
భయంతో పరుగులు పెట్టిన విద్యార్థులు
గ్రంథాలయానికి విద్యార్థుల తరలింపు
తిరువళ్లూరు : ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు తరగతి గదిలో పగులగొట్టబడి ఉన్న మద్యం సీసాలు, రక్తపు మరకలను చూసి భయంతో పరుగులు పెట్టారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ కావాంగొలత్తూరు గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉంది. ఈ పాఠశాల్లో 90 మంది విద్యార్థులున్నారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా ధనం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం పాఠశాలకు యథావిధిగా విద్యార్థులు రాగా 9.10 గంటలకు పాఠశాల తాళాలను తెరిచారు. వెనుక ఉన్న కిటికీలను పగలగొట్టి ఉండడం చూసి ఉపాధ్యాయులు షాక్‌కు గురయ్యారు. దీంతో పాటు పాఠశాల తరగతి గదిలో రక్తపు మరకలు, పగిలిన మద్యం సీసాలు ఉండడంతో కడంబత్తూరు పోలీసులు, విద్యాశాఖ అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తరగతి గదిని పరిశీలించి కొన్ని ఆధారాలను సేకరించారు. విద్యార్థులు ఆందోళన చెందుతున్నట్టు గుర్తించిన ఉపాధ్యాయులు వారిని గ్రంథాలయ గదిలోకి పంపారు. తాళం వేసి ఉంచిన తరగతి గది కిటికీలను పగలగొట్టి ఎవరు లోనికి ప్రవేశించారన్న దానిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.