పీజీ సీటుకు.. బ్లడ్ డొనేషన్కు లింకు!
జైపూర్: పోస్ట్ గ్రాడ్యుయేషన్లో చేరడానికి కాలేజీ సీటు కావాలా.. అయితే మీరు ఇంతకు ముందు బ్లడ్ డొనేట్ చేసి ఉంటే బెటర్ అంటున్నారు రాజస్థాన్ విద్యాశాఖ అధికారులు. డిగ్రీ పూర్తయిన విద్యార్థులు పీజీలో చేరేటప్పుడు వారు బ్లడ్ డొనేట్ చేసినట్లు తగిన ఆధారాలు చూపిస్తే అదనంగా ఒక మార్కు కలుపుతామంటున్నారు. దీంతో అక్కడ డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఎప్పుడెప్పుడు బ్లడ్ డొనేట్ చేసి సర్టిఫికేట్ పొందాలా అని ఎదురుచూస్తున్నారట.
రాజస్థాన్ ఉన్నత విద్యాశాఖ మంత్రి కాళీ చరణ్ సరఫ్ ఇటీవల మాట్లాడుతూ.. వరుసగా మూడు సంవత్సరాల పాటు బ్లడ్ డొనేట్ చేసినట్లు సర్టిఫికేట్ కలిగి ఉన్న విద్యార్థులకు పీజీ అడ్మిషన్ సమయంలో అదనంగా ఒక బోనస్ మార్కును కలుపుతామని ప్రకటించారు. సమాజంలోని ముగ్గురు నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చిన విద్యార్థులకు కూడా 0.5 బోనస్ మార్కు, అలాగే తాము చదువుకున్న పుస్తకాలను బుక్ బ్యాంక్కు ఇచ్చిన వారికి సైతం 0.5 అదనపు మార్కులు పీజీ కాలేజీలో ప్రవేశం సమయంలో కలుపుతామని తెలిపారు. ఇది కొంత ఆశ్చర్యంగా ఉన్నా.. విద్యార్థులలో సామాజిక బాధ్యతను పెంచడానికి ఈ కార్యక్రమం కొంతైనా దోహదం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.