ప్రస్తుతం దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు ఉక్కపోత, వేడి గాలులకు తల్లడిల్లిపోతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు తీవ్రమైన ఎండల కారణంగా అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ పరిస్థితులను గుర్తించిన ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వినూత్న ఆలోచనతో విద్యార్థులను పాఠశాలకు రప్పిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలోని ఒక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పిల్లలను పాఠశాలకు రప్పించడానికి ఒక ప్రత్యేకమైన విధానాన్ని ఆశ్రయిస్తున్నారు. పాఠశాలలోని తరగతి గదిని స్విమ్మింగ్ పూల్‌గా మార్చివేశారు. ఇది విజయవంతమయ్యింది. దీంతో చిన్నారులంతా పాఠశాలకు క్రమంతప్పక వస్తున్నారు. తరగతి గదిలోని స్విమ్మింగ్ పూల్‌లో చిన్నారులు సరదాగా ఆడుకుంటున్న వైనానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కన్నౌజ్ జిల్లాలోని మహసోనాపూర్‌లోని ప్రాథమిక పాఠశాలకు సంబంధించిన ఉందంతం. ఇక్కడ ఉష్ణోగ్రతలు 40 నుండి 42 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటున్నాయి. దీంతో ఎండ వేడిమి నుంచి తమ పిల్లలను రక్షించేందుకు తల్లిదండ్రులు వారిని పాఠశాలలకు పంపడం లేదు. దీంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పిల్లల హాజరు శాతాన్ని పెంచేందుకు తరగతి గదిలోనే స్విమ్మింగ్ పూల్‌ను ఏర్పాటు చేశారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వైభవ్ రాజ్‌పుత్ మీడియాతో మాట్లాడుతూ ‘పాఠశాలలోని ఒక తరగతి గదిని నీటితో నింపేసి, స్విమ్మింగ్ పూల్‌గా మార్చివేశాం. దీనిని చూసి పిల్లలు ముచ్చట పడ్డారు. ఆ స్విమ్మింగ్ ఫూల్‌లో ఆడుకోవడం మొదలు పెట్టారు. వారి ఆనందానికి అంతులేకుండా పోతోంది. ఆ నీటిలో ఈత కొడుతూ ఆడుకుంటున్నారు. ఇలా ఎంజాయ్ చేసేందుకు విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు వస్తున్నారు’ అని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో విద్యార్థులకు వేసవి సెలవులు మే 21 నుంచి జూన్ 30 వరకూ ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment