
ఆ బావా బామ్మర్దులు.. మహా ముదుర్లు!
♦ బయటి ప్రాంతాల్లో ఉంటూ మట్కా రాస్తున్న డాన్‌లు
♦ కంటికి కనిపించరు..సెల్‌ఫోన్ల ద్వారానే నిర్వహణ
♦ మట్కా రాయాలని బంధువులకు బెదిరింపులు
ప్రొద్దుటూరు క్రైం :
వారికి కేసులు కొత్త కాదు.. ఎక్కడ ఎలా మేనేజ్ చేయాలో బాగా తెలుసు.. అప్పటి ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ తీసుకున్న చర్యలతో కొ న్నేళ్ల నుంచి గుట్టు చప్పుడు కా కుండా నడుస్తున్న వారి మట్కా సామ్రాజ్యం కోటలు ఒక్కసారి గా బద్ధలయ్యాయి. ఆ రోజు నుంచి కొన్ని నెలల పాటు తా త్కాలిక విరామం ప్రకటించిన మట్కా డాన్‌లు ఇటీవల తిరిగి కార్యకలాపాలు ప్రారంభించారు. అయితే ఈ సారి నేరుగా రంగంలోకి దిగకుండా తమ అనుయాయుల ద్వారా దందా కొనసాగిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో వారికి నమ్మకమైన వ్యక్తులను నియమించుకొని మట్కా కంపెనీలు నిర్వహిస్తున్నారు.
రూ. వెయ్యి కంటే ఎక్కువ మొత్తాన్ని డాన్‌లే సెల్‌ఫోన్‌ల ద్వారా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పసిడిపురి ప్రొద్దుటూరులో మట్కా జూదం కనుమరుగైందని ఇటీవల పోలీసులు ప్రకటించారు. ఇదే విషయాన్ని వారు జిల్లా పోలీసు అధికారులకు కూడా తెలిపారు. సాదా సీదా నిర్వాహకులు మట్కా రాయడం మానుకున్నారేమో గానీ రాయలసీమ జిల్లాల వ్యాప్తంగా పేరొందిన డాన్‌లు మాత్రం దందాను కొనసాగిస్తున్నట్లు సమాచారం. వీరంతా చీటీలు రాయకుండా, సెల్‌ఫోన్ల ద్వారా మట్కా జూదాన్ని నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా వాట్సప్ గ్రూప్‌లను కూడా తయారు చేసుకున్నట్లు సమాచారం.
ఏళ్ల తరబడి మట్కా నిర్వహిస్తున్నా..
ప్రొద్దుటూరుకు చెందిన బావా బామ్మర్దులు ఏళ్ల తరబడి మట్కా కంపెనీ నిర్వహిస్తుండేవారు. ఇలాంటి సమయంలో కడప నుంచి వచ్చిన ప్రత్యేక పోలీసులు వారి మట్కా బండారాన్ని బయటపెట్టారు. కొన్ని నెలల క్రితం పట్టణంలో ఉంటున్న ప్రధాన నిర్వాహకుడి బామ్మర్ది ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు దొరికింది. అదే రోజు మరో ప్రాంతంలో ప్రధాన నిర్వాహకుడ్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 5–6 ఏళ్ల నుంచి మట్కా నిర్వహిస్తున్నా గతంలో ఎప్పుడూ వారిని పోలీసులు పట్టుకోలేదు. అప్పటి ఎస్పీ చొరవతో ఇద్దరిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి పెద్దఎత్తున నగదు స్వాధీనం చేసుకొని రిమాండుకు పంపించారు. 5–6 నెలల పాటు అజ్ఞాతంలో ఉన్న బావా బామ్మర్దులు ఇటీవల మళ్లీ బయటికి వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో ఉన్న బీటర్లతో మట్కా రాయిస్తే తమ పేర్లు బయటికి వచ్చే అవకాశం ఉన్నందున ఇటీవల కొత్త బీటర్లను తయారు చేసుకున్నట్లు సమాచారం.
రామేశ్వరం, మోడంపల్లె, పెన్నానగర్, నెహ్రూనగర్‌లలో 9 మంది బీటర్లను ఏర్పాటు చేసుకున్నారు. వారిలో నలుగురు మహిళలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రధాన నిర్వాహకుడు అతని బంధువులను మట్కా రాయాలని బెదిరింపులకు గురి చేస్తున్నట్లు తెలిసింది. అతనికి ప్రొద్దుటూరులోని బాలాజీనగర్, రామేశ్వరం, విజయనగరం వీధి, హైదరాబాద్, బెంగళూరులో సొంత ఇళ్లు ఉన్నాయి. ప్రొద్దుటూరు నుంచి రోజూ సుమారు రూ.10 లక్షల మేర మట్కా డబ్బు అతనికి చేరుతున్నట్లు తెలిసింది. అతను గోవా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొని రాయలసీమ వ్యాప్తంగా మట్కా జూదం నిర్వహిస్తున్నాడు. వైఎంఆర్ కాలనీకి చెందిన ఒక వ్యక్తి పట్టణంలో మట్కా బీటర్లను తయారు చేసి, బావా బామ్మర్దులకు సహకరిస్తుంటాడు. ఇందుకు గాను వారు ఇతనికి పెద్ద మొత్తంలో నజరానా కూడా ఇస్తుంటారు.
ఇక్కడ ఈ బావా బామ్మర్దులు
పట్టణానికి చెందిన మరో బావా బామ్మర్దుల జోడి ఇటీవల మట్కాను ముమ్మరం చేశారు. గతంలో ప్రొద్దుటూరులోని పోలీసులు వీరి కంపెనీపై అడపా దడపా దాడులు నిర్వహించి ఒకరిద్దరు బీటర్లను అరెస్ట్ చేసేవారు. ప్రధాన కంపెనీ నిర్వాహకుల జోలికి మాత్రం పోలీసులు వెళ్లేవారు కాదు. అయితే ఏడాది క్రితం మెరుపు దాడులు నిర్వహించి కంపెనీ యజమానులైన బావా బామ్మర్దులతో పాటు పెద్ద ఎత్తున బీటర్లను, సహాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పట్లో నగదు కూడా రూ.లక్షల్లో స్వాధీనం చేసుకున్నారు. వీరికి కోలుకోలేని దెబ్బ తగలడమే గాక మరోవైపు పోలీసుల దాడులు ముమ్మరం కావడంతో అప్పటి నుంచి మట్కా కంపెనీ మూసి వేశారు.
ఇప్పుడున్న ఎస్పీ అట్టాడ బాబూజీ కూడా మట్కా నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నారు. జూదాన్ని సమూలంగా నిర్మూలించేందుకు ‘పరివర్తన’ అనే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. అయినా ఇటీవల బావా బామ్మర్దులు మట్కా రాస్తున్నట్లు ఆ ప్రాంత ప్రజలు చెబుతున్నారు. సెల్‌ఫోన్ల ద్వారా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారని సమాచారం. వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో ప్రస్తుతం బావా బామ్మర్దులు విడిగా మట్కా జూదాన్ని నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.