పెద్దాసుపత్రిలో దొంగలు!
► సెల్‌ఫోన్లు, బైక్‌లు, పర్సులు మాయం
► సీసీ కెమెరాలున్నా ఆగని చోరీలు
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వెళ్తున్నారా..? అయితే మీ వస్తువులు జాగ్రత్త. ఆసుపత్రిలో దొంగలు పడ్డారు. ఎప్పుడు ఏ వస్తువు మాయమవుతుందో చెప్పడం కష్టం. ఎందుకంటే రెండు నెలల కాలంలో 30కి పైగా చోరీలు జరిగాయి. వెలుగులోకి రానివి మరెన్నో..!
కర్నూలు(హాస్పిటల్): పెద్దాసుపత్రిలో 40కి పైగా విభాగాలు ఉన్నాయి. ప్రతిరోజూ 2వేలకు పైగానే ఓపీ రోగులు కర్నూలు, ప్రకాశం, కడప, అనంతపురం, మహబూబ్‌నగర్, రాయచూరు జిల్లాల నుంచి చికిత్సకోసం వస్తారు. నిత్యం 1200 మంది రోగులు ఇన్‌పేషంట్లుగా చికిత్స పొందుతుంటారు. ప్రతి రోగికి ఒకరిద్దరు వెంట ఉండటం సహజం. ఈ లెక్కన రోజూ ఆసుపత్రిలో రోగులు, వారి సహాయకులు కలిపి 5 వేలకు పైగా ఉంటారు. వీ రితో పాటు వైద్యులు, వైద్యవిద్యార్థులు, పారామెడికల్ సిబ్బంది, నర్సులు, నాలుగో తరగతి ఉద్యోగులు, కార్యాలయ ఉద్యోగులు వెయ్యి మందికి పైగా ఉంటారు. 100 ఎకరాల విస్తీర్ణంలోని ఈ ఆసుపత్రిలో కొన్నేళ్లుగా చోరీలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి రోజు ఎక్కడో ఒకచోట దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు.
2 నెలల్లో 30 దొంగతనాలు
ఆసుపత్రిలో రెండు నెలల కాలంలో 30కి పైగా దొంగతనాలు జరిగాయి. అధికంగా సెల్‌ఫోన్లు, పర్సులు, హ్యాండ్‌బ్యాగ్‌లు, మోటార్‌బైక్‌లు మాయం చేస్తున్నారు. కొందరు ఆటో విడిభాగాలను సైతం వదిలిపెట్టడం లేదు. ఈ చోరీలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అందులో కొన్ని ..
►మార్చి 3న ఎంఎం-1లో సెల్‌ఫోన్ చోరీ, అదేరోజు పేయింగ్‌బ్లాక్‌లో మరో సెల్‌ఫోన్ ఎత్తుకెళ్లారు.
► మార్చి 4న ఎంఎం-1 వార్డు బయట నిలిపి ఉన్న బైక్ చోరీ
► మార్చి 9న మెయిన్ గేట్ వద్ద సెల్‌ఫోన్
► మార్చి 16న ఆరోగ్యశ్రీ కార్యాలయం ఎదురుగా ఆటోలోని బ్యాటరీ చోరీ, అదేరోజు శుశ్రుతభవన్ వద్ద ఆటోలోని బ్యాటరీ ఎత్తుకెళ్లారు.
► మార్చి 26న ఎంఎస్-1 వద్ద బైక్ అపహరణ
► మార్చి 28న ఎంఎస్-1 వార్డులో సెల్‌ఫోన్ చోరీ
► ఏప్రిల్ 14న ఎంసీహెచ్ భవనం వద్ద సెల్‌ఫోన్ చోరీ, 15న క్యాజువాలిటీలో పర్సు, 27వ తేదీన అదే ప్రాంతంలో సెల్‌ఫోన్, 28వ తేదీన 24 గంటల ల్యాబ్‌లో సెల్‌ఫోన్ చోరీ అయ్యాయి.
► మే 14న గైనిక్ విభాగంలో సెల్‌ఫోన్ ఎత్తుకెళ్లారు.
సీసీ కెమెరాలున్నా ఆగని చోరీలు
ఆసుపత్రిలో అడుగడుగునా సీసీ కెమెరాలు 200లకు పైగా ఏర్పాటు చేశారు. ఆసుపత్రిలో రక్షణ వ్యవస్థ, చోరీలు అరికట్టేందుకు, అనుకోని సంఘటనలను గుర్తించేందుకు వీలుగా వీటిని ఏర్పాటు చేశారు. అయినా, దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. ఆసుపత్రిలో పనిచేసే కొందరు సిబ్బందే అత్యాశతో చేతివాటాన్ని ప్రదర్శిస్తుండగా మరికొందరు పనిగట్టుకుని ఆసుపత్రిలో తిరుగుతూ చోరీలకు పాల్పడుతున్నారు. క్యాజువాలిటీలో డ్యూటీ డాక్టర్ సెల్‌ఫోన్‌ను ఓ స్టాఫ్‌నర్సు తస్కరించిన వైనం బయటపడింది. మొదట బుకాయించిన ఆమె పోలీసులు తగిన ఆధారాలు చూపించడంతో కిక్కురుమనకుండా సెల్‌ఫోన్ అందజేయాల్సి వచ్చింది. అలాగే గైనిక్‌విభాగంలో జూనియర్ వైద్యుడొకరు మహిళా వైద్యవిద్యార్థినిపై దాడి చేసిన దృశ్యాలు కూడా సీసీ కెమెరాలో రికార్డవడంతో అవి పోలీసులకు సాక్ష్యంగా మారాయి. ఆసుపత్రిలో అపరిచిత వ్యక్తులు ఎక్కువగా తిరుగుతున్నా ఏ ఒక్కరూ గుర్తించలేని పరిస్థితి. ప్రతి ఒక్కరినీ రోగిగానే, వారి సహాయకులుగానే చూడాల్సి వస్తోందని వైద్యులు చెబుతున్నారు. కాగా చోరీ జరిగిన వెంటనే తమకు ఫిర్యాదు చేస్తే దొంగలను వెంటనే పట్టుకునేందుకు వీలుంటుందని పోలీసులు చెబుతున్నారు.